కాలినగాయాలు, బొబ్బల మూలంగా చాలా భాధాకరమైన పరిణామాలు కలుగుతాయి. అవి మచ్చలు, అంగవైకల్యము, మానసిక గాయం మొదలగునవి. ఈ ప్రభావాలన్నీ చాలా కాలం ఉండిపోతాయి. కాబట్టి సత్వర సరియైన జాగరుకత/ జాగ్రత్త తో చేసే చికిత్స ఎంతో అవసరం.
శరీరం కొన్ని వేడి వస్తువులకు లేదా బలమైన రసాయనాలకు దగ్గరగా వచ్చినప్పుడు కాలినగాయాలవుతాయి.
తరచూ కాలిన గాయాలవడానికి కారణాలు
- వంట పాత్రలు, కేకులు తయారు చేసే ఓవెన్ అరలు, కుక్కర్ల చేతి పిడి
- ఆధునికమైన కరెంట్ పరికరాలు ఉదా : ఇస్త్రీ పెట్టెలు, టీ కాచుకునే పాత్రలు మొదలగునవి.
- ప్రమాదకరంగా గ్యాసుల మంట, కరెంట్ వైర్లు తగిలి, కాలుతున్న ఇనుప తడికెలు
- ప్రమాదకరంగా బట్టలకు అంటుకున్న మంటలు
- బ్లీచ్ / తెలుపు లేక చలవ చేయు బట్టల పొడి, పలుచ చేయని దుర్వాయువులను పొగొట్టే ద్రవాలు
- తీవ్రమైన సూర్యరశ్మి మరియు గాలి
- తాళ్ళ రాపిడి
చాలా వరకు కాలిన గాయాలు ఇంటిలోనే జరుగుతాయి. అందువల్ల వీటికి ఇంటిలోనే చికిత్స చేయాలి. అందునా ఇవి వంట ఇంటిలోనే ఎక్కువగా జరుగుతాయి. వీటిని వంట గదిలోనే అత్యవసర చికిత్స అందించవచ్చు. కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇన్ని ప్రమాదాలు జరుగవలసిన అవసరం లేదనే నొక్కి చెప్పాలి.
సాధారణంగా ఈ ప్రమాదాలు ముసలి వారికి, పసి పిల్లలు ముఖ్యంగా ప్రాకే పిల్లల, అంగవైకల్యం వున్న వారిలో ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంటుంది. పసి పిల్లలో, ముసలి వారిలో కలిగే కాలిన గాయాలను తీవ్రంగా పరిగణించాలి.
కాలిన గాయాలయినపుడు కొన్ని చేయగూడని పనులు
కాలిన గాయాలు శరీరానికి ఏ విధమైన హాని కలిగిస్తాయో చెప్పే ముందు, వైద్య నిపుణుల సాయం అందేలోపు కాలిన గాయాలకు చేయగూడని పనులు కొన్ని క్రింద ఉదాహరించబడ్డాయి.
- కాలిన గాయాం మీద వెన్న, పిండి, వంటసోడా వంటవి అస్సలు పెట్టరాదు/పెట్టకూడదు
- విలేపనము (మలాము), నూనెలు, క్రిమి కీటక నాశిని వంట ద్రవాలు
- కాలిన గాయాల వల్ల వచ్చిన బొబ్బలను గ్రుచ్చకూడదు, లేదా పగుల గొట్ట కూడదు.
- గాయాలను అవసరానికి మించి ముట్టుకొనరాదు.
- కాలిన బట్టలు శరీరానికి అంటుకుపోయి వున్నట్టైతే వాటిని బలవంతంగా తాకరాదు.
ఈ రోజులలో బట్టలు కృత్రిమ నారతో నేసిన/చేసిన బట్టలవే కాబట్టి మంటలకు అవి పూర్తిగా కరిగిపోయి శరీరానికి అంటుకొనిపోతాయి. వీటిని బలవంతంగా లాగడానికి ప్రయత్నిస్తే వాటితో పాటు చర్మం కూడా వూడి వస్తుంది. దీని మూలాన అనవసరంగా క్రిములు శరీరంలోనికి చేరే అవకాశం వుంటుంది. ఎటూ అవి పూర్తిగా కాలినాయి కాబట్టి సూక్ష్మక్రిములు చనిపోయి వుంటాయి. అందుకని అలానే వదిలివేయడంమంచిది.
సాధారణ చికిత్స
కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో తప్పించి కాలిన గాయాలన్నీంటికీ ఒకే విధమైన చికిత్స వుంటుంది. చాలా వరకూ ఏవో చిన్న కాలిన గాయాలు తప్పితే మిగిలినవన్నీ ప్రమాదకరమైనవే. చాలా నొప్పి, బాధ కొన్ని సందర్భాలలో ఘతము/ షాక్ ను కలిగిస్తాయి.
చాలా వరకూ ఈ ప్రమాదాలు అత్యవసర పరిస్థితులు ఉదాహరణకు ఇళ్ళు కాలిపోతున్నప్పుడు, రోడ్డు ప్రమాదాలలో, పెట్రోలు కారడం మూలంగా కలుగుతాయి. కాబట్టి అత్యవసర పరిస్థితిలో వున్న రోగిని ప్రశాంతంగా వుంచాలి. ధైర్యం చెప్తూ చికిత్స ప్రారంభించాలి. ఎందుకంటే జరిగిన ప్రమాదం వల్ల రోగి ముందుగానే భయంతో, ఘాతములో వుంటాడు. రోగితో మృదువుగా ప్రవర్తిస్తూ త్వరిత గతిన చికిత్స ప్రారంభిస్తూ, పద్ధతి ప్రకారం ఏది ముందు, ఏది వెనక చేయాలో చేస్తూ పోవాలి.
ఒక్కసారి చర్మం, కణజాలం కాలిన తరువాత శరీరంలో నుంచి ద్రవాలు చాలా వరకూ నష్టపోతాయి. గాయపడిన కణజాలం వేడిని పట్టి వుంచుతుంది. దీని మూలంగా కణజాలం మరింత దెబ్బతింటుంది. కాబట్టి చికిత్సలో ముఖ్యమైన భాగం ఈ వేడిని తగ్గించడం. ప్రాధమిక చికిత్సలో ఈ ఉష్ణోగ్రతను తగ్గించడం.
తీసుకోవలసిన జాగ్రత్తలు
- కాలిన గాయాలయిన శరీర భాగాన్ని వెంటనే చల్లటి నీళ్ళలో ముంచాలి. బకీట్ నీళ్ళలో గానీ, బట్టలుతికే టబ్బులో గానీ వంట ఇంటి సింకులో కానీ, కనీసం పంపు క్రింద నీళ్ళలో గానీ కాలిన భాగాన్ని వుంచాలి.
- ఈ విధంగా కనీసం కాలిన భాగాన్ని పదిహేను నిమిషాలు లేక నొప్పి తగ్గే వరకూ వుంచాలి.
- ఒక వేళ కాలిన భాగాన్ని నీళ్ళలో ముంచడం కష్టమయితే (ముఖము) శుభ్రమైన గుడ్డను చల్లని నీటిలో ముంచి కాలిన భాగం పై అద్దాలి. ప్రతిసారి అద్దే ముందు చల్లని నీటిలో ముంచాలి. గాయం మీద రుద్దకూడదు ఈ విధంగా చేయడం మూలంగా కణజాలం నుంచి కొంత వేడి గుంజేయడం జరిగి తద్వారా గాయం ఎర్ర బడడం, నొప్పి. బొబ్బలు రావడం నివారించవచ్చును.
- చేతికి వున్న వుంగరాలు, గాజులు, బూట్లు బిగుతుగా వున్న బట్టలు ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా తీసివేయాలి. ఎందుకంటే తరువాత కలిగే వాపు మూలాన తీయడం కష్టం కావచ్చును.
- చిన్న చిన్న ఉపరితలంలో వున్న గాయాలను పొడిగా, శుభ్రంగా వున్న బట్టతో అద్దాలి. ఆ తరువాత పట్టీలు కప్పాలి.పెద్ద గాయాలు, లోతుగా అయిన గాయాలు నీటిలో నుంచి బయటకు తీసిన తరువాత తేలికగా శుభ్రంగా ఈ మధ్యనే ఉతికిన పీచులు లేని బట్టతో కప్పాలి. (శుభ్రంగా వున్న దిండుగలేబు కాలిన గాయాలు వున్న కాళ్ళకు తొడగడానికి అనువుగా వుంటుంది.)
- వైద్యుడు లేదా ఆంబులెన్స్ కు కబురు చేయాలి.
- ఏదైనా కాలిన గాయం తపాలా బిళ్ళ కన్నా (2.21/2 సెం.మీ) పెద్దదిగా వున్నప్పుడు మీరు చల్లని నీళ్ళతో చికిత్స చేసిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
- కాలిన గాయాలు పెద్దవిగా వున్నప్పుడు రోగిని ఆసుపత్రికి తరలించేటప్పుడు ఒక తువ్వాలులో ఐసు వేసి దానిని గాయంపై ఎక్కువ వొత్తిడి లేకుండా ఉంచాలి.
- కాలిన గాయాల కణజాలాన్ని క్రిమి సంపర్కం నుంచి కాపాడలేక పోతే సూక్ష్మ జీవులు గాయాల పై వృద్ధి చెందుతాయి. ఈ విధంగా గాయాలను కప్పడం మూలాన రోగి ఆదుర్దా తగ్గుతుంది. ఎందుకంటే వారికి గాయాలు కనపడవు కాబట్టి బల్ల మీద కప్పే గుడ్డలు (నైలాను కాకూడదు) శరీరాన్ని కప్పడానికి బాగా పనిచేస్తాయి. గాయాలపై కట్టే బట్ట తేలికగా ఎక్కువ ఒత్తిడి లేకుండా కప్పాలి.
- వైద్యుడు లేక ఆంబులెన్స్ వచ్చే వరకూ రోగికి ధైర్యం చెప్తూ ప్రశాంతంగా ఉండేలా చూడాలి. పసి పిల్లలైతే ఎత్తుకుని వూపాలి. అదే సమయంలో కాలిన గాయాలకు ఒత్తిడి కలగకుండా చూసుకోవాలి.
ప్రత్యేకమైన చికిత్స అవసరమైన పరిస్థితులు
- బట్టలు ఇంకా మండుతున్నట్టైతే చల్లని నీరు మంటలపై వేసి మంటలు ఆర్పాలి లేదా రోగిని దుప్పటితో కప్పి ( దుప్పటి లేకపోతే కోటు లేదా పెద్ద గుడ్డ ముక్కతో నైనా సరే) గాలి తగలకుండా చూడాలి. కంబళి కూడా పని చేస్తుంది దుప్పటి మీ ముందు భాగంలో వుండే విధంగా నిలబడాలి దీని వల్ల మంటలు మీకు అంటుకోకుండా వుంటాయి.
- మంటలలో కాలుతున్న రోగి భయంతో ఒక గదిలో నుంచి మరొక గదిలోనికి పరిగెత్తుతూ వుండవచ్చు. అటువంటప్పుడు అన్ని చోట్ల మంటలు అంటుకునే ప్రమాదం వుంటుంది. మంటల వేడికి తట్టుకోలేక బయటకు పరిగెత్తుతారు. బయట గాలికి మంటలు ఇంకా ఎక్కువయే అవకాశం వుంటుంది. అందువలన రోగిని కదలకుండా వుండమని ప్రోత్సహించాలి.
- మంటలు ఆర్పిన తరువాత పైన తెలియ చేసిన విధంగా చికిత్స ప్రారంభించాలి.
ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు