పాము అనగానే అందరికీ భయం. పాము కాటు వేసిందంటే ప్రాణం పోయినట్టే అన్నది అపోహ. అసలు పాముల గురించి సరైన సమాచారం లేకపోవడమే ఈ అపోహలకు, అపనమ్మకాలకు కారణం.
పాముల్లో చాలా రకాలున్నాయి. పాము లెన్ని రకాలుగా ఉన్నా ప్రధానంగా రెండే జాతులుగా వాటిని విభజించాలి. విషం ఉన్న పాములు, విషం లేని పాములు. నిజానికి విష సర్పాలకన్నా విషం లేని, ప్రమాదం కలిగించని పాములే ఎక్కువ. అయితే పాముకాటు గురించి అశ్రద్ధ చేయకుండా తక్షణమే సమీప ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకోవడం మంచిది. విష సర్పం కరిచినా రకరకాల కారణాలతో ఆలస్యం చేసి కొందరు ప్రాణాలు కోల్పోతుంటే- విషం లేని పాము కరిచినా కంగారుతో, భయంతో మరికొందరు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు.
పాము మనకు శత్రువు కాదు. తన ఆత్మ రక్షణ కోసం, విధి లేని పరిస్ధితుల్లో మాత్రమే కాటు వేస్తుంది. పాము బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం, ఒక వేళ పాము కరిస్తే తక్షణమే సమీప ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకోవడం. ఈ సందేశం ప్రతి ఒక్కరు గుర్తించుకుందాం.
పాములుంటాయి.....జాగ్రత్త
- ధాన్యపు గాదెలు, గడ్డి వాములు మొదలైనవి ఉండేచోట ఎలుకలు తిరుగుతుంటాయి. తడిగా ఉండే చోట కప్పలు చేరుతాయి. వాటిని తినడానికి పాములు వస్తాయి. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి
- దుంగలు, కట్టెలు కదిలించినపుడు జాగ్రత్తగా ఉండండి. వాటి మధ్యలో పాములు, తేళ్ళు ఉండే ప్రమాదముంది. కొన్ని ప్రాంతాలలో పిడకలు దొంతరలుగా పేర్చి ఉంటారు. వాటి మధ్య కూడా విష జంతువులుండచ్చు
- చేల గట్లమ్మట నడిచే సమయంలో కర్ర చప్పుడు చేస్తూ నడవడం మంచిది. కిర్రుచెప్పులు, కర్ర చప్పుళ్లతో పాముకాటు ప్రమాదం తగ్గుతుంది
- ముఖ్యంగా రాత్రిపూట మోటారు వేయడానికో, నీరు పెట్టడానికో వెళ్ళేటపుడు విధిగా ఉపయోగించండి. ఒక్కోసారి మోటారు షెడ్ లో, స్టార్టర్ దగ్గర గూడులాంటి ప్రదేశాల్లో పాములు నక్కి ఉండొచ్చు
పాములన్నీ విషసర్పాలు కావు
- పాముల్లో చాలావాటికి విషం ఉండదు. త్రాచు, కట్లపాము వంటి 15 శాతం ప్రమాదకరమైన సర్పజాతులతోనే ప్రమాదముంటుంది
- అన్ని పాముకాట్లు ప్రమాదకరమైనవి కాకపోవచ్చు. సాధారణంగా 50 శాతం పాముకాట్లు విషం లేని, ప్రమాదంలేని మామూలు గాయాలే(Dry Bites). సాధారణచికిత్స తీసుకుంటే ఈ గాయాలు నయమవుతాయి
- పాము విషం కన్నా చాలామంది షాక్ తోనే ప్రాణంమీదకి తెచ్చుకుంటారు. ఇంట్లోని వారు, ఇరుగుపొరుగు ధైర్యం చెప్పడానికి బదులు ఏడుపులు ప్రారంభిస్తే వీరు భయాం దోళనలకు గురై పరిస్ధితి ప్రమాదకరంగా తయారవుతుంది
పాము కరవగానే
- భయాందోళనలకు గురికావద్దు. దాని వల్ల రక్త ప్రసరణ పెరిగి విషం త్వరగా వ్యాపించే ప్రమాదముంది. బంధు మిత్రులు రోగికి ధైర్యం చెప్పాలి
- ప్రక్కనున్నవారు ఆ పాము విషసర్పమా కాదో గుర్తించే ప్ర.యత్నం చేయండి. దానివల్ల చికిత్స మరింత ఖచ్చితంగా అందచేయవచ్చు
- నాటు వైద్యం, మంత్రతంత్రాలు అని ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత తొందరగా దగ్గరలోని ఆసుపత్రికి రోగిని తీసుకువెళ్ళండి. ఆటో, అంబులెన్స్, స్కూటర్ కనీసం మంచం సాయంతో నైనా ఆసుపత్రికి తరలించండి. రోగిని నడిపించవద్దు
- అన్ని గ్రామాలకు ఇపుడు 108 ఉచిత అంబులెన్స్ సౌకర్యం ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి
- పాము కాటు వేయగానే కొందరు ఆ గాయాన్ని మరింత కోస్తే రక్తంతోపాటు విషయం వచ్చేస్తుందని కత్తితో, బ్లేడుతో గాటు పెడతారు. అలా చేయవద్దు. ఒక్కోసారి పాము కాటు కన్నా ఈ గాయం ప్రమాదకరంగా మారవచ్చు. శాస్త్రీయమైన చికిత్స సాధ్యమైనంత త్వరగా అందించడమే ఉత్తమం.
- మరికొందరు సినిమా హీరోలా పాము కరచినా ప్రదేశంలో గాటుపెట్టి నోటితో విషం పీల్చేస్తామంటారు. పాము కాటు వేయగానే విషం రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు, గుండెకు చేరుకుంటుంది. కాబట్టి దీనివల్ల ప్రయోజనం ఉండదు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాము కాటుకు ఉచిత చికిత్స లభిస్తుంది. వైద్యునికి రోగి గురించిన సమాచారాన్ని ముందే అందజేస్తే త్వరగా మెరుగైన చికిత్స అందే వీలుంది.
విష సర్పం కాటు - లక్షణాలు
విష సర్పాలు వేర్వేరుగా ఉన్నట్టే, వాటి కాటు వల్ల బాధితుల్లో కనిపించే లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. కాటు సమయంలో బాధితుడి శరీరంలోకి ఎక్కిన విషం పరిణామం బట్టి కూడా ప్రమాదం స్ధాయి ఉంటుంది. సాధారణ త్రాచు విష ప్రభావం కొంత వ్యవధి తీసుకుంటుంది. నల్లత్రాచు (కింగ్ కోబ్రా) విషం ప్రభావం చాలా త్వరగా కనిపించి ప్రాణాంతకంగా ఉంటుంది. కట్లపాము కాటు బాధ ఒకరకమైతే, రక్తపింజర విష లక్షణాలు మరో రకంగా ఉంటాయి.
- సాధారణంగా విష సర్పం కాటులో ఈ లక్షణాలు కనిపించవచ్చు
- కాటు ప్రదేశంలో పాము కోరల గాయం స్పష్టంగా కనిపించి, నొప్పి తీవ్రంగా ఉంటుంది
- నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ, తిమ్మిరిగా అనిపిస్తుంది
- పాక్షిక పక్షవాతం కారణంగా నాలుక మందమైనట్టు, గొంతు కండరాలు బిగుసుకున్నట్టు గొంతులో ఏదీ దిగని పరిస్ధితి తలెత్తవచ్చు. చొంగకారవచ్చు
- కళ్ళు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు
బాధితునికి సాధ్యమైనంత త్వరగా చికిత్స అందించకపోతే పరిస్ధితి విషమించవచ్చు. తక్షణ ఆధునిక చికిత్స వల్ల
- విషం విరుగుడు ఇంజక్షన్ (సూది మందు) రూపంలో త్వరగా పని చేస్తుంది
- బాధితునికి ఆందోళన, షాక్ కారణంగా తలెత్తే ఇతర సమస్యలు సమర్ధంగా నివారించవచ్చు
- సెలైన్ రూపంలో శక్తిని ఇస్తూ, చికిత్సను మరింత మెరుగ్గా అందించవచ్చు
- పాము కాటు గాయానికి తగు చికిత్స చేయడం ద్వారా ఇతర ఇబ్బందులు లేకుండా చేయవచ్చు
- చికిత్స ఆలస్యం వల్ల ఏదైనా ప్రమాదం జరిగిన మెడికో లీగల్ కేసుగా అధికారికంగా నమోదై ఆపద్బాంధు పధకం క్రింద పేదలకు పరిహారం లభించవచ్చు.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు