విష ప్రభావం వల్ల చాలా మంది అస్వస్థులవడం, కొందరు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. గాలి ద్వారా, నీటి ద్వారా ఏ రూపంలోనైనా విష ప్రభావం ప్రమాదకరమే. కాబట్టి తక్షణమే చికిత్స అవసరం. రైతులు సస్యరక్షణ మందులు వాడినపుడు తగు జాగ్రత్తలు పాటించాలి. పారిశ్రామిక వ్యర్ధాలు, విష వాయువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆహార కల్తీ, విషాహారం పట్ల కూడా రైతులు సస్యరక్షణ మందులు వాడినపుడు తగు జాగ్రత్తలు పాటించాలి. పారిశ్రామిక వ్యర్ధాలు, విష వాయువుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆహార కల్తీ, విషాహారం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కల్తీ కల్లు, సారాయి మరీ ప్రమాదకరం కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.
విషసంబంధ సమస్యలు
- రైతులు క్రిమి సంహారక మందులు పిచికారీ చేసినపుడు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం,ఘాటైన విషవాయువు పీల్చు కోవడం వలన లేదా శరీరంపై గాయాలుండి ఆ మందు శరీరంలోకి ప్రవేశించడం వల్ల ప్రమాదం జరగవచ్చు
- ఇంట్లో వాడే టాయిలెట్ క్లీనర్ లు కూడా ప్రమాదకరమైనవే. ముఖ్యంగా పిల్లలకు ఇవి అందకుండా జాగ్రత్త పడాలి
- గన్నేరు కాయలు వంటివి, కొన్ని రకాల పసర్లు విషపూరితమైనవి. గ్రామీణులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి
- కల్తీ సారాయి, కల్తీ కల్లు అత్యంత ప్రమాదకరమైనవి. ఒక్కోసారి పేద ప్రజలు గుంపుగా వీటి విషానికి బలయిపోయే ప్రమాదముంది
- కల్లు, సారాయి మామూలుగానే ఆరోగ్యానికి హానికరం. కల్తీ కల్లు, సారాయి వల్ల చాలా మంది ఒకేసారి ప్రాణాలు కోల్పోతుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి
- రైతులు ఎండ్రిన్, మలాధియన్ వంటి పురుగు మందులు స్ప్రే చేసేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గాలి కెదురుగా పిచికారి చేసే సమయాల్లో కంట్లోకి, నోట్లోకి పడకుండా జాగ్రత్త వహించాలి. మందు కలిపేటపుడు చేతికి తొడుగు వేసుకోవాలి.
- ఖాళీ డబ్బాలు, సీసాలు ఆరుబయట పాడవేయకుండా గొయ్యలో వేసి మట్టి కప్పడం మంచిది. సగం మిగిలిన పురుగు మందు ఇంట్లో దాచినపుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి
- పిల్లల పరీక్షా ఫలితాలు, గృహ కలహాలు, ఆవేశకావేశాల్లో, మరీ అప్రమత్తంగా ఉండాలి
- చాలాకాలం నిల్వ ఉంచిన, పాచిపట్టిన, కుళ్ళిపోయిన ఆహార పదార్ధాలు విషాహారంగా పరిగణించాలి. పెద్దల కన్నా పిల్లలకు ఇవి మరీ ఎక్కువ హాని కలిగిస్తాయి.
విషం ఏ రూపంలో తీసుకున్నా...
- ఈ ప్రాధమిక చికిత్స చేసి తక్షణమే ఆసుపత్రికి చేర్చాలి.
- శరీరం పై విషాన్ని కడగడం, విషంతో తడిసిన బట్టలు మార్చడం, రోగికి ధైర్యం చెప్పడం, నడిపించడం వంటివి కాకుండా విశ్రాంతిగా పడుకోబెట్టి హాస్పిటల్ కు తరలించండి.
- 108, 104 అత్యవసర వైద్యసేవలు ఉపయోగించుకోవాలి.
విష పదార్థాలు అనేవి ఘనరూపంలో గానీ, వాయు రూపంలో గానీ వుండవచ్చును. ఇవి అధిక మోతాదులో తీసుకొనడం మూలాన శరీరానికి హాని కలగడమే కాకుండా ప్రాణ హాని కూడా జరుగవచ్చును. ఇవి శరీరంలోనికి మూడు మార్గాల ద్వారా ప్రవేశించవచ్చును.
- ఊపిరి తిత్తుల ద్వారా
- చర్మం గుండా
- నోటి ద్వారా
ఊపిరి తిత్తుల ద్వారా
ఊపిరి తిత్తుల ద్వారా శరీరంలోనికి ప్రవేశించిన విష పదార్థాలను శ్వాస పరిక్షలతో గుర్తించడం జరుగుతుంది. ఈ విష పదార్థాలు శరీరంలోనికి నోటి ద్వారా కానీ, చర్మం గుండా గానీ చేరి వుండవచ్చును. విష పదార్థాలు ఉద్దేశపూర్వకంగా కానీ, ప్రమాదవశాత్తుగా తీసుకొని వుండవచ్చును. చాలా వరకూ విష ప్రయోగాలు ప్రమాదవశాత్తూ జరుగుతూ వుంటాయి. ఇలా జరగకుండా ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకొనడం ఎంతైనా ముఖ్యము.
ముఖ్యంగా కొన్ని నివారించ గలిగిన అంశాలు
- ఏవైనా మాత్రలు గానీ, మందులుగానీ చిన్న పిల్లలకు అందే విధంగా బల్లల పైన వదిలి వేయకూడదు. అవి వారికి అందని విధంగా ఏదైనా అలమారాలలో ( తలుపులు మూయగలిగినవి) వుంచాలి.
- ఏ మందులుగానీ చాలా కాలం వరకూ నిలవ వుంచరాదు. అవి క్షీణించితూ పోతాయి. తగు మోతాదులో వాడిన తరువాత మందులు మిగిలిన పక్షంలో అవి మందుల షాపులో వాపసు ఇచ్చేసే ప్రయత్నం చేయండి లేదా మరుగు దొడ్లు ప్రవహించే నీళ్ళతో కనుమరుగయ్యే వరకూ నీళ్ళు పొసేయాలి.
- ఏ మందులైనా చీకట్లో వేసుకొకూడదు. మందులు వేసుకునే ముందు లేదా ఎవరికైనా మందులిచ్చే ముందు వాటిమీద పట్టీ తప్పక చదవాలి.
- చలవ పానీయాలు సీసాలలో వేరే మందులు పోసి వుంచరాదు. చిన్న పిల్లలు తెలియక అవి పానీయాలను కొని తాగే ప్రమాదముంటుంది.
- ఇంటి శుభ్రత కొసం వాడే ద్రవాల సీసాలను వంటగదిలో పసి పిల్లలకు అందుబాటులో వుంచరాదు. మరుగు దొడ్లు శుభ్ర పరచే ద్రవాలు, బ్లీచింగ్ పొడితో కలిపినప్పుడు విషవాయువులు వెలువడతాయి. ఇదీ చిన్న పిల్లలు పీల్చినప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.
- విష ప్రయోగం చికిత్సలో భాగంగా అతి త్వరలో వాంతి చేయించడానికి ప్రయత్నించవద్దు. ఎక్కువ మోతాదులో ఉప్పు నీరు త్రాగించవద్దు.
- విష ప్రయోగం జరిగిన వ్యక్తికి నోటిద్వారా తీసుకొనడానికి ఏమీ ఇవ్వకూడదు. ముఖ్యంగా రోగి అపస్మారక/స్పృహలేని స్థితిలో వున్నప్పుడు నోటిద్వారా ఏ ద్రవాలు ఇవ్వరాదు. అవి ఊపిరితిత్తులలో చేరే అవకాశం ఉంటుంది.
- రోగి అపస్మారకంగా వున్నప్పుడు/స్పృహకోల్పొయినప్పుడు నోటిలో బలవంతంగా ఏదీ కుక్కడానికి ప్రయత్నం చేయవద్దు.
- పెట్రోలియం ఉత్పత్తులు తీసుకున్న రోగి వాంతి చేసే వరకూ ఎదురు చూడవద్దు. రోగిని వెంటనే తలను గుండె కంటే క్రిందగా వుండే విధంగా పడుకొ బెట్టాలి.( బల్లకు తల వెనక్కు వాల్చాలి.)
- మధుపానం తీసుకునే వారు ఎట్టి పరిస్థితులలో నిద్ర మాత్రలు వేసుకొరాదు. రెండూ కలిస్తే రోగి అపస్మారక స్థితిలోకి వేళ్ళే అవకాశాలు ఎక్కువగా వుంటాయి.
సాధారణ విష పదార్థాలు
దిన చర్యలో మనకు కనబడే సాధారణ విషపదార్థాలు
- కొన్ని రకాల కాయలు మరియు గింజలు
- శిలీంధ్రాలు, కప్ప విసర్జనాలు
- కుళ్ళిపోతున్న ఆహార పదార్థాలు
- బలమైన రసాయన పదార్థాలు: పెట్రోలు సంబంధ పదార్థాలు, పారోఫిన్, కలుపు మొక్కలను చంపే రసాయనాలు, రసాయన ఎరువులు.
- మందులు : ఆస్ప్రిన్, నిద్ర మాత్రలు, మత్తు కలిగించే మందులు, ఇనుము మాత్రలు.
- జంతువులను పట్టుటకు పెట్టె ఎర లేదా ఎర పెట్టు ఎలుక, చుంచెలుకలను చంపడానికి పెట్టె విష పదార్థాలు
- మధుపానం
- ఆకు పచ్చని ఆలుగడ్డలు ( చాలా మందికి ఇవి ఎంత విష పూరితమైనవో అవగాహన వుండదు. ఇవి కడుపులో కుట్టు నొప్పి కలిగించి వాంతులు, విరేచనాలకు దారి తీసి చివరకు రోగి సృహ కొల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.)
సాధారణంగా ఇచ్చే చికిత్స
అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగి తెలివితో ఉండవచ్చు లేక సృహ కొల్పోయే ఉండవచ్చును. రోగి తెలివితో ఉంటే మనం ఇచ్చే చికిత్సలో కొంత వరకూ సహకరిస్తాడు.
- రోగి సృహలో ఉన్నప్పుడు అతనికి విష పదార్థం ఎంత మోతాదులో మింగినదీ, ఏ విషం మింగినదీ, తెలుసుకోవాలి.
- రోగి పరిసరాలలో ఏవైనా మాత్రలు, ఖాళీ సీసాలు, డబ్బాలు ఉన్నట్టయితే వాటిని జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించాలి. ఇవి రోగి తీసుకున్న విష పదార్థాన్ని గుర్తించడానికి సహాయ పడతాయి.
- అత్యవసర స్థితిలో ఉన్న రోగి నోటిని ముందు పరీక్షించాలి. నోరు కాలి వున్నట్టయితే, రోగి సృహలో ఉండి తీసుకోగలిగితే వీలైనంత ఎక్కువగా పాలు లేదా నీరు ఇవ్వాలి. దీని మూలంగా విషం యొక్క సాంద్రత తగ్గించబడుతుంది.
- రోగి వాంతి చేసుకున్న ట్టయితే వాంతిని ఒక గిన్నెలోగానీ, ఖాళీ కవరులో గానీ పట్టాలి. దీనిని పరీక్షకు ప్రయోగశాలకు పంపవలసి వుంటుంది. దీనితో రోగి తీసుకున్న విష పదార్థం తెలిసే అవకాశం వుంటుంది.
- అత్యవసర పరిస్థిలో ఉన్న రోగి వీలైనంత త్వరలో ఆసుపత్రికి తరలించాలి. రోగి మీ చికిత్సలో వుండగా సృహ కోల్పోయిన యెడల
- ముందుగా శ్వాస ఆడుతున్నదా లేదా పరిశీలించండి. శ్వాస ఆగిపోయినట్టనిపిస్తే నోటితో కృత్రిమ శ్వాస అందించడానికి ప్రయత్నించండి. ఒక వేళ రోగి నోరు, పెదవులు కాలిపోయి వున్నట్టయితే నోటితో శ్వాస అందించడం వీలు పడదు. కృత్రిమ ప్రాణ వాయువు అందించవలసి వుంటుంది.
- రోగి శ్వాస తీసుకుంటున్నట్టయితే రోగిని కోలుకునే స్థితిలో కాళ్ళుపైకి, తల క్రిందకు వుండేటట్లు పడుకోబెట్టాలి. రోగి పిల్ల వాడైతే మీ కాళ్ళమీద తల మీ తొడల మీదుగా క్రిందకు వేళాడేటట్టుగా పడుకో బెట్టుకోవాలి.
- రోగి శ్వాస తీసుకుంటున్నదీ లేనిదీ గమనిస్తూ వుండాలి. చాలా విష ప్రయోగాలలో శ్వాస నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా వుంటాయి.
- రోగిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేర్చాలి.
- రోగిని వాతావరణ వేడి నుంచి కాపాడుతూ చల్లగా వుంచడానికి ప్రయత్నించాలి. నుదుటపై ఐసు నీళ్ళతో తడిపిన గుడ్డ వేయాలి. మెడ వెనుక చల్లని నీటిలో ముంచిన స్పాంజి పెట్టాలి. శరీరం తడి బట్టతో తుడుస్తూ వుండాలి.
- రోగి తీసుకొనగలిగితే చల్లని పానీయాలు తాగించాలి (పాలు లేదా నీరు)
- రోగికి చేతులు, కాళ్ళు వంకరలు తిరుగుతాయా? మూర్ఛలు వస్తాయా గమనించాలి.
- రోగి సృహ కోల్పోయినట్టయితే, శ్వాస ఆడుతున్నదా లేదా గమనించి కాళ్ళు పైకి తల కొద్దిగా క్రిందకు వుండేలా పడుకో బెట్టుకోవాలి.
- చికిత్స గురించి సమాచారం అందుబాటులో ఉండి ఉండవచ్చు. చికిత్స చేస్తున్న వైద్యులు దీనిని గమనించుకోవాలి.
చర్మం ద్వారా ప్రవేశించే విష పదార్థాలు
నేటి రోజుల్లో చాలా పురుగుల మందులు, ముఖ్యంగా మొక్కల పెంపకంలో వాడేవి, రైతులు ఉపయోగించే వాటిలో చాలా శక్తి వంతమైన రసాయనాలు కలిసి వున్నాయి. ఇవి చర్మం పై పడినప్పుడు, చర్మం ద్వారా శరీరంలోనికి ప్రవేశించి తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి.
గుర్తించే మార్గాలు
- పురుగుల మందు జల్లిన సమాచారం లేక పురుగుల మందుతో కల్తీ జరిగిన సందర్భం
- రోగిలో వణుకుడు, కండరాలు తటాలున సంకొచించడం, మూర్ఛ
- రోగి క్రమేపి సృహ కోల్పోతాడు.
తీసుకోవలసిన జాగ్రత్తలు
- కలుషితమైన శరీర భాగాన్ని చల్లని నీటితో శుభ్రంగా కడిగి వేయాలి.
- కలుషితమైనబట్టలను జాగ్రత్తగా, మీ శరీరానికి కానీ, రోగి మీ శరీరానికి గానీ అంటకుండా తీసి వేయాలి.
- రోగికి ధైర్యం చెప్పాలి. పడుకో బెట్టి ప్రశాంతంగా ఉండేలా చూడాలి. కదలకుండా వుండాలి
- వీలైనంత త్వరలో ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేయాలి.
- రోగిని చల్లగా వుంచే ప్రయత్నం చేయాలి. నుదుట పై చల్లని గుడ్డ, మెడ క్రింద చల్లని నీటిలో ముంచిన స్పాంజి వుంచాలి. శరీరాన్ని చల్లటి బట్టతో కప్పాలి.
- రోగిని వీలైనంత ఎక్కువగా చల్లని పానీయాలు (పాలు, నీరు, మజ్జిగ) తీసుకొమ్మని ప్రోత్సహించాలి.
- రోగిలో మూర్ఛగానీ, కండరాల ఈడ్పులుగానీ మొదలవుతాయోమో గమనించుకోవాలి.
- రోగి సృహ కోల్పోయినట్టయితే కొలుకునే స్థితిలో పడుకొపెట్టాలి. శ్వాస ఆడుతున్నదా లేదా పరిశీలిస్తూ వుండాలి.
- రోగి పరిసరాలలో చికిత్స సమాచారం వుండి వుండవచ్చు. చికిత్స అందస్తున్న వైద్యులు ఇది గమనించుకోవాలి.
ఆధారము: వైద్య ఆరోగ్యశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.