অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మూర్ఛలు

మూర్ఛలనేవి (తీవ్రంగా లేక ఉగ్రంగా కండరాలు తమ ప్రమేయం లేకుండా ముడుచుకుపోవడం, ఈడ్చుకు పోవడం) ఆకస్మిక జబ్బులో కానీ, మూర్ఛరోగం, అపస్మారకంలో కనబడుతాయి. రోగి శ్వాస ఆగిపోవడం ప్రమాదకరమైన పరిస్థితి. వెంటనే వైద్యులు సహాయం తీసుకోవాలి.

మూర్ఛ వ్యాధి

మూర్ఛ.. ఆ పేరు వింటూనే చాలామంది ఇది మనకే ఎందుకు వచ్చిందని బాధపడుతుంటారుగానీ నిజానికి మూర్ఛ అన్నది జాతి, మత, లింగ, వయో భేదాలేమీ లేకుండా ప్రపంచవ్యాప్తంగా కనబడుతున్న అతిపెద్ద నాడీసంబంధ సమస్య! స్త్రీపురుషులు ఇరువురిలోనూ సమానంగానే కనబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది మూర్ఛతో బాధ పడుతున్నారని అంచనా. కాకపోతే వీరిలో 80% మంది మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉంటున్నారు. మన దేశంలో కూడా మూర్ఛ బాధితులు దాదాపు 60 లక్షల వరకూ ఉన్నారు. ఈ సంఖ్యకు ప్రతి ఏటా మరో 60 వేల కొత్త కేసులు జత అవుతున్నాయని అంచనా. ఇంత పెద్ద సంఖ్యలో బాధితులున్నా ఇప్పటికీ మన దేశంలో మూర్ఛ బాధితుల పట్ల వివక్ష, రకరకాల అపోహలు, అనుమానాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. దీనివల్ల ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నాయి. నిజానికి ఈ వ్యాధి విషయంలో వారి ప్రమేయం ఏమీ లేదు. ఇదేమీ అంటువ్యాధి కాదు. ఈ వివక్షకు అర్థమూ లేదు. ఈ అపోహల నుంచి బయటపడి, మన సమాజం మూర్ఛ బాధితుల పట్ల సానుకూలంగా వ్యవహరించటం ముఖ్యం. దీనికి నేడు చక్కటి మందులు, ఉత్తమమైన చికిత్సలు ఉన్నాయి. వీటితో మూర్ఛ సమస్యను దాదాపుగా, పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవచ్చు కూడా!

మూర్ఛకు మూలం మెదడులో హఠాత్తుగా, అసహజంగా పెరిగిపోయే విద్యుత్‌ ప్రచోదనాలు! మన మెదడు నిండా నాడీకణాలు ఉంటాయి. వీటి మధ్య సమాచార ప్రసారమంతా కూడా విద్యుత్‌ ప్రచోదనాల రూపంలోనే జరుగుతుంటుంది. మెదడులో ఎక్కడైనా ఈ విద్యుత్‌ ఉన్నట్టుండి పెరిగిపోతే 'ఫిట్‌' వచ్చినట్టుగా అవుతుంది. ఇలా రెండుగానీ, అంతకన్నా ఎక్కువసార్లుగానీ ఫిట్స్‌ వస్తే దాన్ని 'మూర్ఛ వ్యాధి'(ఎపిలెప్సీ)గా పరిగణిస్తారు. ఈ విద్యుత్తు అస్తవ్యస్తం కావటమన్నది మెదడంతా జరిగి, ఫిట్స్‌ వస్తుంటే దాన్ని 'జనరలైజ్డ్‌ సీజర్‌' అంటారు. లేదూ ఈ విద్యుత్‌ తేడా మెదడులోని కొంత ప్రాంతంలోనే వస్తే 'ఫోకల్‌ సీజర్‌' అంటారు. మళ్లీ వీటిలో చాలా రకాలున్నాయి. వీటి గురించి తెలుసుకోవటం వల్ల సమస్యను మరింత బాగా అర్థం చేసుకోవచ్చు.

జనరలైజ్డ్‌ సీజర్స్‌

విద్యుత్‌ అస్తవ్యస్తం కావటంతో మెదడు మొత్తం ప్రభావితమై తలెత్తే 'జనరలైజ్డ్‌ సీజర్స్‌'లో ప్రధానంగా 4 రకాలున్నాయి.

1. జనరలైజ్డ్‌ టోనిక్‌ క్లోనిక్‌ సీజర్స్‌: ఈ రకం ఫిట్స్‌ వల్ల ఒంట్లోని కండరాలు, కదలికలన్నీ ప్రభావితమవుతాయి. వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఒళ్లు కర్రలా బిగుస్తుంది. పడిపోతారు. ఇక అక్కడి నుంచీ కండరాలు బిగుస్తూ, వదులవుతూ ఉండటం వల్ల 'జెర్క్‌'లతో కంపిస్తున్నట్టుగా, కాళ్లుచేతులు కొట్టుకుంటున్నట్టుగా కదులుతుంటారు. కొద్దిక్షణాల పాటు శ్వాస కూడా ఆగొచ్చు, శరీరం కొద్దిగా నీలంగా మారొచ్చు. ఒకటి రెండు నిమిషాల తర్వాత కొట్టుకోవటం (జెర్క్‌లు) కొంత నెమ్మదించి, ఆగిపోతుంది. తిరిగి శ్వాస సాధారణమవుతుంది. క్రమేపీ స్పృహ వచ్చేస్తుంది. చాలామందిలో కనిపించేదీ, తేలికగా గుర్తుపట్టటానికి వీలైనదిఈ రకం ఫిట్స్‌.

2. మయోక్లోనిక్‌ సీజర్స్‌: రోగి ప్రమేయం లేకుండానే కొద్దిసేపు కొట్టుకోవటం, కండరాలు జెర్క్‌లు వచ్చినట్టుగా కదలటం దీని ప్రత్యేకత. కొన్నిసార్లు శరీరం మొత్తం ఒక్కసారే కదలొచ్చు, లేదూ కొన్నిసార్లు కేవలం చేతులు, ముఖానికి మాత్రమే జెర్క్‌లు రావొచ్చు. ముఖ్యంగా పిల్లల్లో కనిపించే 'జువనైల్‌ మయోక్లోనిక్‌' రకం మూర్ఛలో ఈ తరహా జెర్కులు ప్రత్యేకంగా కనిపించే లక్షణం. ఈ రకం మూర్ఛ చాలా వరకూ 10-15 ఏళ్ల వయసులో ఆరంభమవుతుంది. చాలాసార్లు ఇది నిద్ర లేవగానే వస్తుంది, శరీరం మొత్తం చాలా వేగంగా కొట్టుకుంటూ కంపించిపోయినట్లుగా ఉంటుంది. దీన్ని గుర్తించటం ముఖ్యం. ఎందుకంటే ఈ రకం మూర్ఛలను నియంత్రించేందుకు ఇప్పుడు ప్రత్యేకమైన మందులున్నాయి. వీటితో మంచి ప్రయోజనం ఉంటుంది.

3. ఆబ్సెన్స్‌ సీజర్స్‌: పిల్లల్లో ఎక్కువగా కనిపించే రకం ఇది. కొద్దికొద్ది సేపు ఉన్నట్టుండి పిల్లలు ఎటో శూన్యంలోకి చూస్తున్నట్టుగా, అలా అచేతనంగా, స్థాణువులా ఉండిపోతారు. ఆ సమయంలో వాళ్లకు చుట్టూ ఏం జరుగుతోందన్నది కూడా తెలియదు. పిలిచినా పలకరు. ఇలా కొద్దిసెకండ్లు మాత్రమే ఉంటుంది. వీళ్లు ఉన్నట్టుండి ఇలా నిలిచిపోయి, మళ్లీ కొద్దిక్షణాల్లోనే మామూలైపోతుంటారు. ఇలా రోజులో ఎన్నోసార్లు రావచ్చు. ఈ రకం ఫిట్స్‌ వల్ల పిల్లవాడు- మాట్లాడుతున్నవాడు మాట్లాడుతున్నట్టే, వాక్యం మధ్యలోనే ఆగిపోవచ్చు. ఒక్కక్షణం అలా చూస్తుండిపోయి.. మళ్లీ మాటలు కొనసాగించొచ్చు. మధ్యలో కొద్దిక్షణాలు ఆగిన విషయం తనకు తెలియదు కూడా.

4. ఎటోనిక్‌ సీజర్స్‌, ఇన్‌ఫెంటైల్‌ స్పాజమ్స్‌: ఇవి పిల్లల్లో కనిపించే ప్రత్యేక రకం మూర్ఛలు. ఇన్‌ఫెంటైల్‌ స్పాజమ్స్‌ను మన ప్రాంతంలోఎక్కువగా 'చంటిబిడ్డ చేష్టలు' అంటుంటారు. ఇవి సాధారణంగా ఆరు నెలల వయసుకంటే ముందే మొదలవుతాయి, ఒక్కసారిగా వరస వరసగా వస్తుంటాయి. ఈ రకం ఫిట్‌ వచ్చినప్పుడు పిల్లలు ఉన్నట్టుండి వేగంగా మోకాళ్లను పొట్టవైపు గుంజుకుంటుంటారు, అదే సమయంలో రెండు చేతులూ కూడా పైకి లాక్కుంటారు. చూడటానికి బిడ్డ ఉన్నట్టుండి మనకు 'సలాం' చేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. అందుకే దీన్ని 'సలాం సీజర్స్‌' అనీ అంటారు. ఈ రకం ఫిట్స్‌ను చాలాసార్లు త్వరగా గుర్తించరు. కానీ దీన్ని సత్వరమే గుర్తించి, వెంటనే చికిత్స ఆరంభించకపోతే పిల్లల ఎదుగుదల కుటుంబడే ప్రమాదం ఉంటుంది, వీళ్లు బుద్ధిమాంద్యంలోకి కూడా జారిపోవచ్చు. అలాగే అటోనిక్‌ సీజర్స్‌ కూడా- చాలా వరకూ పిల్లల్లో కనిపించేవే. ఈ రకం ఫిట్స్‌ వచ్చినప్పుడు ఉన్నట్టుండి కండరాలు పటుత్వం, పట్టు కోల్పోతాయి. దీంతో ఉన్నట్టుండి తల వాల్చెయ్యటం, కొన్నిసార్లు నేల మీద పడిపోవటం కూడా జరుగుతుంటుంది. మొండిగా వేధించే ఈ మూర్ఛలను నియంత్రించటం కష్టం కూడా అవుతుంది.

ఫోకల్‌ సీజర్స్‌

విద్యుత్‌ ప్రచోదనాలు మెదడు మొత్తం కాకుండా ఏదో ఒక భాగంలో మాత్రమే అస్తవ్యస్తమవటం వల్ల తలెత్తే 'ఫోకల్‌ సీజర్స్‌'లో కూడా చాలా రకాలున్నాయి. ప్రధానంగా ఈ ఫిట్‌ వచ్చిన సమయంలో రోగి స్పందిస్తున్నాడా? లేదా? అన్నది కీలకం.

స్పందన, స్పృహ కోల్పోకుండా వచ్చే రకం ఫిట్స్‌లో- ఏదో ఒక శరీర భాగంలో జెర్క్‌లు వస్తుండటం, ఫిట్‌ రాకముందు రోగికి కొన్నికొన్ని ప్రత్యేక లక్షణాలు అనుభవంలోకి వస్తుండటం (ఆరా) మరో రకం. ఈ ప్రత్యేక లక్షణాలన్నవి ఫిట్‌ రావటానికి ముందు రోగికి మాత్రమే తెలుస్తాయి. ఉదాహరణకు ఇవెలా ఉంటాయంటే- శరీరంలోని కొన్ని భాగాల్లో తిమ్మిర్లుగా, ఏదో చీమలు పాకినట్లుగా అనిపించటం, స్పర్శలో తేడా అనిపించటం (సొమాటో సెన్సరీ ఆరా), లేదూ కళ్ల ముందు ఏదో కాంతులు కనిపించినట్లుగా, ఏదో కదులుతున్నట్టూ, వినిపిస్తున్నట్టూ భ్రాంతిగా అనిపించటం (విజువల్‌/ఆడిటరీ ఆరా), లేదూ పొట్టలో ఏదో తిరుగుతున్నట్టుగా బొడ్డుపై భాగం నుంచి ఒక తరంగంలా పైకి వస్తున్నట్టుగా, తేలిపోతున్నట్టుగా అనిపించటం, ఉమ్ములు, వికారంగా అనిపించటం, మూత్రానికి వెళ్లాల్సి వచ్చినట్టనిపించటం (అటానమిక్‌ ఆరా), లేదూ గతంలో ఎప్పుడో అచ్చం ఇలాంటి సందర్భమో, అనుభవమో ఎదురైనట్లుగా అనిపించటం, లేదా పరిచితమైన పరిసరాలే ఉన్నట్టుండి అపరిచితంగా అనిపించటం వంటి లక్షణాలు కనిపించొచ్చు.

ఇక స్పందనలు లేని ఫోకల్‌ రకం ఫిట్స్‌ వచ్చేవారిలో- ఫిట్‌ వచ్చినప్పుడు తాము ఏం చేస్తున్నామో వారికి తెలియదు. ఈ సమయంలో వాళ్లు ఎక్కడో పగటికలలోనో, వేరే లోకంలోనో ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ.. ఈ సమయంలో మనం చెప్పినా పట్టకుండా ఉండిపోతారు. కొందరు అలా చూస్తూ తాము వేసుకున్న బట్టలను పట్టుకుని నలుపుతుండటమో, పెదాలు కదపటమో, లేదంటే కాళ్లూ చేతులూ కదిలిస్తూ ఉండిపోవటమో చేస్తుంటారు. అకారణంగా లేచి, కొన్ని అడుగులేసి మళ్లీ కూర్చుంటుండొచ్చు. పరుగుపెట్టొచ్చు. పెద్దగా అరవొచ్చు. ఏదో తనలో తానే గొణుక్కోవచ్చు. ఈ రకం ఫిట్‌ ఒకటి రెండు నిమిషాలే ఉండిపోవచ్చుగానీ మనిషి మాత్రం కొంతసేపు చికాకుగా, ఏదో గందరగోళంలో ఉండిపోవచ్చు. ఫిట్‌ వచ్చిన విషయం వాళ్లకు తెలియదు కూడా. ముఖ్యమైన విషయమేమంటే చూసేవాళ్లు కూడా దీన్ని ఫిట్‌ అని అనుకోకపోవచ్చు. వాళ్లు కూడా గుర్తుపట్టలేరు. కానీ ఈ రకం ఫిట్స్‌ను సత్వరమే గుర్తుపట్టటం ముఖ్యం. ఇవి సాధారణంగా మనం వాడే మూర్ఛ మందులకు తగ్గవు. వీళ్లకు సర్జరీ చేస్తే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీళ్లను గుర్తుపట్టటం చాలా కీలకం.

చికిత్స ఏమిటి?

మూర్ఛ వ్యాధుల చికిత్సలో నిపుణులైన వైద్యులు.. అది ఏ రకానికి చెందినదో నిర్ధారించి, కచ్చితంగా దానికి సరిపోయే మందులను ఇస్తారు. రోగి పరిస్థితి, వయసు, ఇతర లక్షణాలు, రోగికి ఉన్న ఇతర సమస్యల వంటివన్నీ పరిగణనలోకి తీసుకుని మందులను సిఫార్సు చేస్తారు. మొత్తమ్మీద మూర్ఛ బాధితుల్లో 70% మందికి ఒక్క మందుతోనే మంచి ఫలితాలుంటాయి. లేకపోతే దాన్ని మార్చి మరో మందు ఇస్తారు. కొద్దిమందికి మాత్రం రెండుమూడు రకాల మందులు కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిరకాల మూర్ఛలు కొన్ని ప్రత్యేకమైన మందులకే లొంగుతాయి. మందులు ఎంతకాలం వాడాలన్నది మూర్ఛ ఏ రకం, దానికి కారణమేమిటి వంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కొందరికి మూర్ఛ మందులు జీవితాంతం వాడాల్సి రావచ్చు. 'ఈఈజీ' పరీక్షలో అన్నీ సాధ్శారణంగానే ఉండి, ఎమ్మారైలో ఎలాంటి లోపాలూ లేవని తేలిన రోగులకు చాలా వరకూ ఫిట్స్‌ నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. వీరికి దీర్ఘకాలం మళ్లీ రాకుండా చూడొచ్చు.

మందులకు లొంగకపోతే?

రెండు రకాల మందులను పద్ధతి ప్రకారం వాడినప్పటికీ ఫిట్స్‌ తగ్గకుండా వేధిస్తూనే ఉంటే దాన్ని 'డ్రగ్‌ రెసిస్టెంట్‌ ఎపిలెప్సీ' అంటారు. వీరికి సర్జరీతో ఉపయోగం ఉంటుందా? ప్రత్యేకమైన పథ్యాలతో (కీటోజెనిక్‌ డైట్‌) ఉపయోగం ఉంటుందా? లేక వేగస్‌ నాడిని ప్రేరేపించే పరికరాలను అమర్చటం వల్ల ప్రయోజనం ఉంటుందా? అన్నది వైద్యులు పరిశీలిస్తారు. కీటోజెనిక్‌ డైట్‌ అంటే- దీనిలో కొవ్వు ఎక్కువగా, మాంసకృత్తులు ఒక మోస్తరుగా, పిండిపదార్థాలు చాలా తక్కువగా ఉండేలా చూసే ఆహారం. పసిబిడ్డ చేష్టలకు, చిన్నపిల్లల్లో కనిపించే కొన్నిరకాల మూర్ఛలకు దీనితో ప్రయోజనం ఉంటున్నట్టు గుర్తించారు. ఇక 'వేగల్‌ నెర్వ్‌ స్టిమ్యులేషన్‌ (వీఎన్‌ఎల్‌)' ప్రక్రియలో సర్జరీ చేసి మెడ దగ్గర ఉండే వేగస్‌ నాడిని ప్రేరేపించేలా ఒక చిన్న పరికరాన్ని ఎదురొమ్ము పైభాగంలో అమరుస్తారు. మెదడు సర్జరీ చెయ్యటానికి వీల్లేని, మందులతో ఫిట్స్‌ నియంత్రించలేకపోతున్న వారికి ఈ ప్రక్రియతో మంచి ప్రయోజనం ఉంటుంది.

సర్జరీ: సాధారణంగా మూర్ఛ బాధితుల్లో మూడోవంతు మందికి మందులతో ఫిట్స్‌ అదుపులోకి రాకపోవచ్చు. అలాంటి వారికి సర్జరీతో ప్రయోజనం ఉంటుందేమో వైద్యులు పరిశీలిస్తారు. ఫిట్స్‌ తగ్గిపోయేలా చెయ్యటం ఈ సర్జరీ లక్ష్యం. దీనికి ముందు రకరకాల అత్యాధునిక పరీక్షలు చేసి.. మూర్ఛకు మూలమవుతున్న, విద్యుత్‌ ప్రచోదనాల అస్తవ్యస్తానికి కారణమవుతున్న మెదడు భాగమేదో కచ్చితంగా గుర్తించి, సర్జరీలో దాన్ని తొలగిస్తారు. ఈ సర్జరీతో దాదాపు 70% ఫిట్స్‌ తగ్గిపోతాయి. ఫోకల్‌ రకం మూర్ఛ ఉండి, మందులతో ప్రయోజనం లేనివారిలో 50 శాతం మందికి సర్జరీతో మంచి ఫలితాలుంటాయి. వీరికి ఫిట్స్‌ నుంచి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. మిగతా వారికి కూడా సర్జరీతో ఫిట్స్‌ తరచుదనం బాగా తగ్గుతుంది.

ఫిట్‌ వస్తే??

 • ఫిట్‌ వచ్చినప్పుడు చేతుల్లో, నోట్లో ఏమీ పెట్టొద్దు. చేతిలో తాళాలు, ఇనుప వస్తువుల వంటివి పెట్టటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ సమయంలో రోగికి సౌకర్యవంతంగా ఉండేలా చూడటం ముఖ్యం.
 • ఒకవేళ కాళ్లుచేతులు కొట్టుకుంటుంటే నిదానంగా, సురక్షితంగా పడుకోబెట్టి, తలకింద మెత్తటి దిండువంటివి పెట్టాలి. బట్టలు, ముఖ్యంగా మెడ దగ్గర బిగుతుగా లేకుండా వదులు చెయ్యాలి. పొలమారకుండా మెల్లగా పక్కకు తిప్పాలి. వాళ్లను బలవంతంగా పట్టుకోవటం వంటివేమీ చెయ్యొద్దు.
 • పూర్తి స్పృహ తప్పటం కాకుండా ఎంతోకొంత స్పందనలు ఉండే 'ఫోకల్‌' రకం ఫిట్స్‌ వచ్చినప్పుడు దగ్గరే ఉండి వారికి ఎటువంటి హానీ జరగకుండా చూడటం, ధైర్యం చెబుతూ పూర్తిగా మన లోకంలోకి వచ్చే వరకూ సపర్యలు చెయ్యటం ముఖ్యం.
 • ఇవి గమనించండి: ఫిట్‌ వచ్చిన సమయంలో రోగి కళ్లు తెరిచే ఉంటున్నారా? రెప్ప వేస్తున్నారా? పరిసరాల స్సృహ ఉందా? చప్పళించటం వంటి నోటి కదలికలేమైనా ఉన్నాయా? సోయి తప్పినట్టు, గందరగోళ పడుతున్నారా? మనం చెప్పిన మాట విని పాటించేలా ఉన్నారా? మెడ వాలుస్తుంటే ఎటు వైపు వాలుస్తున్నారు? కాళ్లు చేతులు కొట్టుకుంటున్నారా? ఎలా, ఏవైపు అవయవాలు కదిలిస్తున్నారు? కనుగుడ్డు వంకర పోతోందా? ఎటు పోతోంది? తదితర వివరాలన్నీ గుర్తించి వైద్యులకు చెప్పాలి.

మూర్ఛ ఎందుకొస్తుంది?

చాలామందిలో మూర్ఛ ఎందుకొస్తోందో కచ్చితంగా గుర్తించి నిర్ధరించటం కష్టం. కొద్దిమందిలో జన్యుపరమైన లోపాల వల్ల రావచ్చు. మూర్ఛ బాధితుల్లో ఓ 30-40% మందికి- మెదడు, మెదడు పొరల వాపు (మినింజైటిస్‌, ఎన్‌సెఫలైటిస్‌) తర్వాత, పక్షవాతం వచ్చిన తర్వాత, మెదడుకు బలమైన దెబ్బలు తగిలిన తర్వాత ఫిట్స్‌ వస్తుంటాయి. కొందరిలో మెదడులో కణితులు, నిర్మాణ లోపాల వల్ల ఫిట్స్‌ వస్తాయి. కలుషితాహారం తీసుకోవటం మూలంగా బద్దెపురుగు గుడ్లు మెదడులో చేరి, అక్కడ పెరుగుతుండటం వల్ల వచ్చే రకం మూర్ఛ మనదేశంలో ఎక్కువ. దీన్ని 'న్యూరో సిస్టిసర్కోసిస్‌' అంటారు. గుర్తిస్తే మందులతో తేలికగా తగ్గిపోయే రకం ఇది. ఇక మెదడులో కణితుల వల్ల వచ్చే కొన్ని రకాల మూర్ఛలు మందులతో తగ్గవు, వీటికి సర్జరీ తప్పనిసరి అవుతుంది.

గుర్తించేదెలా?

ఇప్పుడు చాలా రకాల పరీక్షలున్నాయిగానీ.. ముఖ్యంగా ఫిట్‌ వచ్చినప్పుడు రోగి ప్రవర్తన, పరిస్థితి ఎలా ఉంటోందన్నది చూసి వైద్యులకు వివరించటమే అత్యంత కీలకం. ఆ సమయంలో రోగి కదలికలు, స్పందనల వంటివన్నీ ఎలా ఉంటున్నాయో వైద్యులు చాలా వివరంగా అడిగి తెలుసుకుంటారు. వీటన్నింటి ఆధారంగా వచ్చింది మూర్ఛ ఫిట్‌ అవునా? కాదా? ఒకవేళ మూర్ఛే అయితే అదే రకానికి చెందినవన్నది గ్రహిస్తారు. అప్పుడు నిర్ధారణ కోసం అవసరమైన పరీక్షలు చేయిస్తారు. ముఖ్యంగా రోగి మెలకువగా ఉన్న సమయంలో చేసే 'ఈఈజీ' పరీక్ష అత్యంత కీలకమైనది. మూర్ఛ ఏ రకానికి చెందినదో దీనిలో కూడా గుర్తించటం కష్టమైతే నిద్ర పోతున్నప్పుడు, లేదా నిద్ర తక్కువ అయినప్పుడు చేసే 'ఈఈజీ' వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. దీనిలోనూ తేలకపోతే ఎక్కువసేపు చేసే 'వీడియో ఈఈజీ' అవసరమవుతుంది. దీనిలో ఫిట్‌ వచ్చిన సమయంలో రోగి పరిస్థితి ఎలా ఉంటోంది, అదే సమయంలో ఈఈజీలో ఎలాంటి అసాధారణ మార్పులు వస్తున్నాయన్నది కచ్చితంగా నమోదు అవుతుంది. దీనిలో ఫిట్‌ మెదడులోని ఏ భాగం నుంచి వస్తోంది, అదే రకం వంటివన్నీ తెలుస్తాయి. మూర్ఛ కాకుండా ఇతరత్రా కారణాలతో వచ్చే ఫిట్స్‌ను గుర్తించటానికి కూడా ఇది బాగా ఉపకరిస్తుంది. కొన్నిసార్లు మెదడు నిర్మాణంలో ఏవైనా లోపాలు తలెత్తుతున్నాయేమో గుర్తించటానికి సీటీ/ఎమ్మారై వంటి స్కానింగులు చెయ్యాల్సి ఉంటుంది. మందులతో లొంగకుండా ఫిట్స్‌ వేధిస్తుంటే 'హైరిజల్యూషన్‌ ఎమ్మారై' చేసి, సర్జరీతో ప్రయోజనం ఉంటుందేమో నిర్ధారించొచ్చు.

అంటువ్యాధి కాదు!

మూర్ఛ అనేది అంటువ్యాధి కానేకాదు. భూతప్రేతాల వల్ల వచ్చేది అంతకంటే కాదు. చాలామందిలో దీనికి కచ్చితమైన కారణమేమిటన్నది గుర్తించటం కష్టమే అయినా.. ప్రధానంగా ఇది మెదడులో విద్యుత్‌ ప్రచోదనాల్లో తలెత్తే మార్పుల వల్ల వచ్చే సమస్య. దీన్ని నియంత్రించేందుకు ఇప్పుడు ఎన్నో రకాల మందులున్నాయి.

చదువుకు ఇబ్బంది కాదు!

మూర్ఛ సమస్య ఉన్నవాళ్లు ఎంతోమంది తమకు ఇష్టమైన ఉన్నత చదువులు చదువుతూ, జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు కూడా. విఖ్యాత శాస్త్రవేత్త న్యూటన్‌, ఫ్రెంచ్‌ విజేత నెపోలియన్‌, విఖ్యాత గ్రీకు వీరుడు అలెగ్జాండర్‌ వంటివారందరికీ మూర్ఛ ఏ మాత్రం అవరోధం కాలేదని గుర్తించాలి. ఫిట్స్‌ మరీ ఎక్కువగా, మరీ తరచుగా వస్తున్నవాళ్లు మాత్రం వైద్యుల సిఫార్సుల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది.

వాహనాలు నడపటంలో జాగ్రత్త!

వాహనాలు నడుపుతున్నప్పుడు ఫిట్‌ వస్తే? అన్న భయం సహజమే. మందులు వాడుతున్నా ఫిట్స్‌ అదుపులో లేనివారు వాహనాలు నడపకూడదు. చికిత్సతో మంచి ఫలితం ఉండి ఫిట్స్‌ రాకుండా ఉన్నవాళ్లు, రాత్రిపూట మాత్రమే ఫిట్స్‌ వచ్చేవాళ్లు వాహనాలు నడపొచ్చు. ఈ విషయాన్ని వైద్యులతో చర్చించి, వారి సిఫార్సులు పాటించాలి.

పెళ్లిళ్లు, పిల్లలకు అవరోధమే కాదు!

మూర్ఛ సమస్య ఉన్నా స్త్రీలు చక్కగా పెళ్లి చేసుకుని, పిల్లలను కనొచ్చు. మూర్ఛ విషయం పెళ్లికి ముందే సరైన తీరులో చెప్పటం వల్ల తర్వాత ఇబ్బందికర వాతావరణం లేకుండా చూసుకోవచ్చు. ఫిట్స్‌కు మందులు తీసుకుంటున్న స్త్రీలు మాత్రం గర్భధారణకు ముందే వైద్యులతో చర్చించి అవసరమైన మార్పులు చేసుకోవటం, గర్భం-కాన్పు సమయంలో వైద్యుల పర్యవేక్షణలో ఉండటం అవసరం.

నిశ్చింతగా ఉద్యోగాలు చేసుకోవచ్చు!

మూర్ఛ సమస్య ఉన్నా ఉద్యోగాల్లో రాణించటానికి ఇదేమీ అవరోధం కాదు. వీరిని చక్కగా ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చు. పని సామర్థ్యం విషయంలో సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే వీళ్లేమాత్రం తక్కువ కాదని అధ్యయనాల్లో తేలింది. కాకపోతే ఫిట్స్‌ సరిగా నియంత్రణలో లేని వారు మాత్రం- ఎత్తు మీద పనిచెయ్యటం, హైవోల్టేజీ విద్యుత్‌ పనులు చెయ్యటం, నీళ్లు, మంటల వంటి వాటి దగ్గర పని చెయ్యటం ప్రమాదకరమని గుర్తించాలి.

ఈ సమయాల్లో జాగ్రత్త

ఫిట్స్‌ సమస్య ఉన్నవాళ్లు కొన్నింటికి దూరంగా ఉండటం మంచిది. అవి...

 • నిద్ర లేకపోవటం, విపరీతమైన అలసట..
 • కళ్ల ముందు పెద్దపెద్ద వెలుగులు, చీకట్లు చూడటం
 • రక్తంలో చక్కెర పడిపోవటం (హైపోగ్త్లెసీమియా)
 • జ్వరం, ఇతరత్రా జబ్బుల బారినపడటం
 • మద్యం, మాదకద్రవ్యాలు తీసుకోవటం
 • విపరీతమైన మానసిక ఒత్తిడి, చికాకులు
 • చాలా వేగంగా శ్వాస తీసుకోవటం

ఆధారము: ఈనాడు

లక్షణాలు

కండరాలు గట్టిగా బిగుసుకుపోయినట్టుగా వెంటనే చివుక్కున లాగుతున్నట్టు కదలికలు మొదలవుతాయి. (Jerking movements)

 • రోగి నాలుక కొరుక్కోవడం, శ్వాస ఆగిపోవడం జరుగవచ్చు.
 • మొఖము, పెదవులు నీలంగా మారవచ్చు
 • లాలాజలం అధికంగా కారడం, నోటినుంచి నురగ కారడం జరుగవచ్చు.

సహాయానికి చిట్కాలు

 • రోగి చుట్టూవున్న వస్తువులు అడ్డం తీసేసి తలక్రింద మొత్తలు తలగడ పెట్టాలి.
 • పళ్ళ మధ్యగానీ, నోటిలో గానీ ఏ వస్తువు పెట్టవద్దు.
 • రోగికి ఎటువంటి ద్రవ పదార్థాలు త్రాగడానికి ఇవ్వవద్దు.
 • రోగి శ్వాస తీసుకోవడం ఆగిపోతే, శ్వాసనాళం తెరుచుకుని వుందా పరీక్షలు వెంటనే చర్యలు తీసుకోవాలి.
 • ప్రశాంతంగా వుండండి, రోగిని సహాయం అంటే వరకూ సౌకర్యంగా వుంచండి.
 • చాలా వరకూ మూర్ఛల తరువాత సృహ తప్పడం లేదా మళ్ళీ మూర్ఛలు రావడం జరుగుతుంది. వీలయినంత త్వరగా రోగిని వైద్య సహాయానికి తీసుకు వెళ్ళండి

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate