హోమ్ / ఆరోగ్యం / పథకాలు / ఎన్‌టీఆర్‌ వైద్య పరీక్ష పథకం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఎన్‌టీఆర్‌ వైద్య పరీక్ష పథకం

పైసా చెల్లించకుండానే ఆధార్‌ కార్డుతో అన్నిరకాల పరీక్షలు

వైద్యుల ఫీజులు, మందుల ధరలకంటే రోగ నిర్థారణ పరీక్షలకే వేలల్లో ఖర్చవుతున్న ఈ రోజుల్లో.. పల్లె ప్రాంతాల రోగులకు ఇకపై ఉపశమనం కలగనుంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా ఎన్‌టీఆర్‌ వైద్య పరీక్ష పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఖరీదైన వ్యాధి నిర్ధారణ పరీక్షలను సైతం ఉచితంగా చేసేందుకు మెడ్‌ఆల్‌ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ప్రకారం 79 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), మూడు ఏరియా ఆసుపత్రుల్లో మెడ్‌వెల్‌ సంస్థ అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన రోగ నిర్ధారణ పరీక్షల పరికరాలను ఇప్పటికే ఏర్పాటు చేయడంతోపాటు, సుశిక్షితులైన సిబ్బందిని నియమించింది. అనారోగ్యంతో బాధపడేవారు వైద్యం, వ్యాధి నిర్ధారణకు పట్టణాల్లోని ప్రైవేటు డయోగ్నస్టిక్‌ సెంటర్లలో వేలాది రూపాయలు ఖర్చు చేయనవసరం లేకుండా, స్థానికంగానే ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల సిఫార్సుల మేరకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవచ్చు.

పైసా చెల్లించకుండానే ఆధార్‌ కార్డుతో అన్నిరకాల పరీక్షలు

ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేసేందుకు ఒప్పందం చేసుకున్న మెడ్‌ఆల్‌ సంస్థ పశ్చిమగోదావరి జిల్లాలో ఆచంట, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, నల్లజర్ల, దెందులూరు, భీమడోలు, ద్వారకా తిరుమల పీహెచ్‌సీలు, సీహెచ్‌‌సీలలో రెండు రోజులుగా ప్రయోగాత్మకంగా వైద్య పరీక్షలను ప్రారంభించింది. పూర్తిస్థాయిలో సోమవారం నుంచి అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలను ప్రారంభిస్తోంది. ఇందుకు గోల్డ్‌ స్టాండర్డ్‌ (నార్కాడ్‌ ప్రమాణాలు)తో కూడిన ఆటోమేటిక్‌ ఎనలైజర్లను అన్ని ఆసుపత్రులకు అనుబంధంగా ల్యాబ్‌లలో ఏర్పాటుచేసింది. ఒక్కో ఎనలైజర్‌ గంటకు 72 మంది పేషెంట్లకు సంబంధించి వ్యాధి నిర్ధారణ పరీక్షలను చేయగలిగే సామర్ధ్యం కలిగి ఉన్నాయి.

 

ఆసుపత్రికి వచ్చే రోగిని పరీక్షించి వైద్యుడు వ్యాధి నిర్ధారణ కోసం రాసే ప్రిస్కిప్షన్‌ ఆధారంగా శాంపిల్‌ను టెక్నీషియన్‌ సేకరించి మెడ్‌ ఆల్‌ ల్యాబ్‌లకు తరలిస్తారు. థైరాయిడ్‌, బయాస్పి వంటి జటిలమైన పరీక్షలకు ఫలితాల నివేదిక సహజంగానే ఒకటి రెండు రోజుల వ్యవధి తీసుకుంటుంది. ఇలా వ్యాధి నిర్ధారణ పరీక్షల నివేదిక వచ్చిన వెంటనే దానిని సంబంధిత ఆసుపత్రి వైద్యునికి ఇస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆసుపత్రికి వచ్చే పేషెంట్‌ తన వెంట ఆధార్‌కార్డు తెచ్చుకుంటే చాలు. వైద్య పరీక్షల కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేకుండానే అన్ని సేవలు(రోగ నిర్ధారణ, వైద్యం, మందులు) ఒకే చోట లభించేలా ఎన్‌టిఆర్‌ వైద్య పరీక్ష పథకం ద్వారా పొందవచ్చు.
వ్యాధి నిర్ధారణ ఇలా..

ఈ పథకంలో ఖరీదైన వ్యాధి నిర్ధారణ పరీక్షల బాధ్యతలను మెడ్‌ఆల్‌ సంస్థ చూసు కుంటుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో మొత్తం 19 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనుండగా, వీటిలో ఏడు పరీక్షలను మెడ్‌ఆల్‌ సంస్థ, 12 పరీక్షలను పీహెచ్‌సీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ చేస్తారు. సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచసీ)లో 40 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలను మెడ్‌ఆల్‌ సంస్థ చేస్తుంది. దీనికిగాను అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో పేషెంట్ల నుంచి సేకరించే నమూనాలను పరీక్షించేందుకు జిల్లా అంతటా కవరయ్యేలా చింతల పూడి, పాలకొల్లు, భీమవరం, తణుకు, ఏలూరు, బుట్టాయిగూడెంలలో పూర్తిస్థాయి ల్యాబ్‌లను మెడ్‌ఆల్‌ ఏర్పాటు చేసింది. నిర్దేశిత వ్యాధి నిర్ధారణ పరీక్షలను చేసినందుకుగాను పేషెంట్‌కు రూ.235 చొప్పున మెడ్‌ఆల్‌ సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తుంది. హెమటాలజీ, సీరియా లజీ, బయోకెమిస్ట్రీ, ఇమ్యునాసయ్‌, క్లినికల్‌ పెతాలజీ, మైక్రో బయాలజీ, యూరిన్‌ ఎనాలసిస్‌, పెతాలజీ, కార్డియాలజీ, రేడియాలజీ విభాగాల్లో మొత్తం 64 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఎక్స్‌రేలు ఉచితంగా చేయించుకోవచ్చు.
పేషెంట్‌కు సగటున రూ.2,500 పరీక్షలు

ఎ.వి.రమణారావు, జోనల్‌ మేనేజర్‌ (ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు), మెడ్‌ఆల్‌ సంస్థ రూ. వేలల్లో వసూలు చేసే హెచ్‌ఐవీ, బోన్‌మ్యారో ఏస్సిరేషన్‌, ప్లేట్‌లెట్‌కౌంట్‌, ర్యూమటాయిడ్‌, కాల్షియం వంటి టెస్టులతోపాటు బ్లడ్‌షుగర్‌, మలేరియా, హిమోగ్లోబిన్‌ వంటి పరీక్షలు ఉచితంగా చేస్తాం. ఉచిత పరీక్షల వల్ల ఒక్కో పేషెంట్‌ సగటున రూ.1500 నుంచి రూ.2,500 వరకు ప్రయోజనం పొందే వీలుంది.

ఆధారము: ఆంధ్రజ్యోతి

3.02380952381
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు