ఆరోగ్యమే మహాభాగ్యం అనేది నానుడి. ఏ వయస్సు వారైనా ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ఆరోగ్యం అంటే కేవలం రోగాల బారిన పడకుండా ఉండడమే కాదు సామాజిక, మానసిక, శారీరక, సాంస్కృతిక ఇత్యాది విషయాలలో పరిపక్వత సాధించాల్సి ఉంది. అప్పుడే అది సంపూర్ణ ఆరోగ్యం సంపాదించినట్లవుతుంది. ఇంత ముఖ్యమైన ఆరోగ్యాన్ని మనం సాధించాలంటే పౌష్ఠికాహారం తప్పనిసరి. వ్యక్తిగత పరిశుభ్రత, సురక్షితాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
మన దేశంలో సుమారు 50% వరకు పోషకలోపాలతో బాధపడుతున్న విషయం వాస్తవం. సరిపడినంత ఆహారం లేకపోవడం ఒక కారణమైతే, ఆహారం తీసుకున్నప్పటికీ అందులో పోషకాలు లోపించడం మరో కారణం. మనం తీసుకునే ఆహారంలో పోషకాలున్నప్పటికీ ఎంపిక విషయంలో కాని, వండే పద్ధతిలో కాని, తినే విధానంలో కాని మనం చేసే పొరపాట్ల వలన చాలా వరకు పోషకాలను నష్టపోతుంటాము. అంటే ఆరోగ్యాన్ని కోల్పోతున్నామని అర్థం. అలాంటి పొరపాట్లను తెలుసుకుంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. పైగా అనారోగ్యం వలన కలిగే నష్టాలను కూడా మనం నివారించుకోవచ్చు.
ఆహారపదార్థాల ఎంపికలో
మనం ఆహారపదార్థాలు ఎంచుకున్నప్పుడు తాజాగా, స్వచ్ఛమైనవి ఎంచుకోవాలి. కుళ్ళినవి, తక్కువ ధరలో కల్తీలతో కూడిన నాసిరకం వస్తువులను ఎంచుకోకూడదు.
చాలమంది వారానికి సరిపడా కూరగాయలు కొంటుంటారు. వారు సమతులాహారాన్ని దృష్టిలో పెట్టుకుని కొంటే మంచిది. అంటే ఆకుకూరలు, కూరగాయలు, దుంపలు, పండ్లు, మొదలైన అన్నిరకాలు కొంటే మంచిది.
కొందరు పప్పులు, ధాన్యాలు సంవత్సరానికి సరిపడా నిలవచేసుకుంటారు. ఇది మంచి పద్దతే. ఆహారభద్రతకు ఇదికూడా ఒక మంచి మార్గం. కాని నిల్వచేసినపుడు పురుగు పట్టకుండా తగు జాగ్రత్తలు తిసుకోకపోతే ఆర్థికపరంగానే కాకుండా, పోషణాపరంగాకూడా నష్టమే.
కూరగాయలను తీసుకురాగానే వండుకోవాలి. నిల్వ ఉంచాలనుకుంటే ఫ్రిజ్ లో గాని, చల్లటి ప్రదేశంలో గాని పెట్టాలి. ప్లాస్టిక్ సంచులలో పెట్టి గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం వల్ల చాలా పోషకాలను నష్టపోతాము.
వండుకునేప్పుడు
బియ్యాన్ని ఎక్కువసేపు కొంతమంది అదేపనిగా కడుగుతుంటారు. అది అంత మంచిది కాదు. దీనివల్ల పోషకాలు లోపిస్తాయి.
గ్యాసు, ప్రెజరు కుక్కరు వాడుకలోకి వచ్చాక గంజి వంచి అన్నం వండే పద్దతి కొంతవరకు తగ్గింది; ఇంకా అలాగే వండేవారు తెలుసుకోవలసింది ఏమిటంటే అలా చెయ్యడం వల్ల అందులో ఉండే పోషకాలను చాలావరకు నష్టపోతామని..
కూరగాయలను చాలా మంది ముక్కలుగా చేసిన తర్వాత కడుగుతుంటారు ముఖ్యంగా ఆకుకూరలను. దీని వల్ల నీటిలో కరిగే గుణం ఉన్న విటమిన్లను, ఖనిజాలను కోల్పోతాము. అందుకే కూరగాయలను ముందుగానే కడిగి, తర్వాత కోసుకోవాలి.
సాధారణంగా అందరు వేపుళ్ళను బాగా ఇష్టపడతారు. ఇలా చెయ్యడం వల్ల పోషకాలు కోల్పోవడమే కాదు శరీరంలో కొవ్వు మోతాదు పెరిగిపోతుంది. ఊబకాయం, క్యాన్సర్, హృదయ సంబంధ రోగాలు ఎక్కువౌతాయి. కాబట్టి వేపుళ్ళను తరచఉగా తినడం మంచిది కాదు.
కూరగాయల తొక్కల కిందనే విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కూరగాయల తొక్కలు తీసుకునేటప్పుడు వీలైనంత పల్చగా తీయాలి. దోసకాయ, సొరకాయ వంటి కూరగాయల తొక్కలు శుభ్రంగా ఉంటే తొక్క తియ్యకపోవడమే మంచిది.
కూరగాయలను అతి పెద్ద ముక్కలుగా కాని అతి చిన్నగా కాని కోస్తారు లేదా వివిధ రకాలుగా ఇష్టం వచ్చిన తీరులో కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా కోస్తారు. ఇలా చేయడం వల్ల ఉడికే సమయంలో తేడాల వల్ల పోషక నష్టం జరుగుతుంది.
కోసిన కూరగాయ ముక్కలను ఎక్కువసేపు నానబెట్టడం వల్ల పోషకాలను కోల్పోతాము. కాబట్టి కడిగిన తర్వాత కోసుకోవడం మంచిది. ఒక వేళ నానబెట్టటం అనివార్యమైతే తక్కువ నీటిలో నానబెట్టి, ఆ నీటిని వండుకోవడానికి వాడుకోవడం మంచిది.
ఆకుకూరలను ఎక్కువ నీటిలో ఉడికించి వాటిని పారవేస్తారు. అలా చెయ్యడం వల్ల పోషకాలను కోల్పోతాము. అందువల్ల తక్కువ నీటిలోనే వండుకొని మిగిలిన నీటిని సూప్ ల రూపంలో తీసుకోవచ్చు.
వేయించడం, కాల్చడం, బేకింగ్ లాంటి వివిధ వంట పద్ధతులను పాటిస్తాము. వేయించడం వల్ల ఆహారం రుచిగా ఉన్నప్పటికీ ‘ఎ’, ‘డి’ , ‘ఇ’, ‘కె’ విటమిన్ల నష్టం ఎక్కువగా ఉంటుంది.
రోస్టింగ్ అయితే ఆహారపదార్థాలను ముందుగా కొద్దిగా వేయించుకొని, తర్వాత ఉడకబెట్టడం వల్ల ఆహారపదార్థాలు త్వరగా తేలికగా జీర్ణం అవుతాయి.
మూత లేకుండా వండడం వల్ల కొంతవరకు పోషకనష్టం జరుగుతుంది. అందువల్ల కూరగాయలను ప్రెషర్ కుక్కర్ లో మూత పెట్టి వండుకోవడం వల్ల పోషకనష్టాన్ని నివారించవచ్చు.
నిల్వచేయడం
వండిన పదార్థాలను వెంటనే తినకుండా ఫ్రిజ్ లో పెట్టి మళ్ళీ, మళ్ళీ వేడిచేయడం చేస్తారు. అలా చేయడం వల్ల విటమిన్లు నశిస్తాయి.
కొన్ని ఆహారపదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి నిల్వ చేసాక తినడానికి బయటకు తీసినప్పుడు వెంటనే వేడిచేసి తింటుంటారు. దీనివల్ల సూక్ష్మజీవులు రెట్టింపయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా చల్లని పదార్థాన్ని గది ఉష్ణోగ్రత వద్దకు తెచ్చిన తర్వాత వేడి చేసి తినాలి.
మరలా మరలా వేడిచేసిన దానిని ఫ్రిజ్ లో పెట్టడం, మరలా వేడిచేయడం లాంటివి చెయ్యడం వల్ల సూక్ష్మజీవుల ప్రక్రియ పెరిగిపోయి, ఆరోగ్యానికి నష్టం కలిగిస్తాయి.
ఆహారపదార్థాలను నిల్వ చేసేటప్పుడు మూత ఉన్న పాత్రలలో చేయాలి. గాలికి ఆహారపదార్థాలను మూతలేకుండా వదిలేయడం వల్ల దుమ్ము, ధూళి, ఈగల, దోమల ఇత్యాది వాటి వల్ల ఎన్నో రోగాలను కొని తెచ్చుకుంటాము.
చాలామంది కాలాలకు తగ్గట్టు లభించే పండ్లను, కూరగాయలను, ఆహారపదార్థాలను కొని నిల్వ చేయకుండా దొరకని కాలంలో లేని పదార్థాల కొరకు ఎక్కువ ఖర్చు చేస్తారు. అలా చేయడం వల్ల ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఏయే కాలాలలో లభించే పదార్థాలను ఆయా కాలాలలో వాడుకోవాలి. ఎక్కువ మోతాదులో కొని వాటిని భద్రపరచుకోవాలి.
పిల్లలు ఎక్కువగా చిరుతిండ్లను బయట తినడానికి ఇష్టపడతారు. వాటి వల్ల అనేక నష్టాలకు గురవుతున్నారు. కాబట్టి పిల్లలకు ఇంట్లోనే వారికి ఇష్టమైన విధంగా పండ్లతో టాఫీలు, సలాడ్లు, జ్యూసులు మొదలైనవి చేసి వారికి ఇవ్వడం వల్ల పండ్లలో ఉండే పోషకాలు లభిస్తాయి.
ఆధారం:
కుమారి ఐ. ప్రసన్న, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2012/010.
సమీక్ష: డాక్టర్. ఎస్.సుచరితా దేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆహారం & పోషణ విభాగం.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020