অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వసకొమ్ము ద్వార ఆయుర్వేద గృహ చికిత్సలు

వసకొమ్ము ద్వార ఆయుర్వేద గృహ చికిత్సలు

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి

వస ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం అకోరస్ కెలామస్ (Acorus calamus). ఇది అకోరేసి (Acoraceae) కుటుంబానికి చెందినది. పూర్వం మనదేశంలో అన్ని పల్లెసీమలలో పుట్టిన ప్రతి బిడ్డకు పురిట్లోనే వస కొమ్మును చనుబాలతో అరగదీసి పట్టేవారు. ఇప్పటికీ ఈ సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతునేయున్నది. దీని వలన గొంతులోని కఫం పోవడమే గాక ఉత్తరోత్తరా మాటలు స్పస్టంగా రావడానికి ఉపకరిస్తుందని భావిస్తారు.

ప్రాంతీయ నామములు

ఇంగ్లీషు స్వీట్ ఫ్లాగ్
సంస్కృతం వచ, ఉగ్రగంధ, షడ్గ్రంధ
హిందీ గుడ్ బచ్
కన్నడం బజేగిడా
మళయాళం బవంబు
పార్శి అగరేతుర్కీ
ల్యాటిన్ అకోరస్ కలమస్

ఉపయోగపడే భాగం

వస దుంప (రైజోమ్).--వసకొమ్ముతో తయారయ్యే ఔషధాలు--వచాది ఘృతం, వచాది చూర్ణం, సారస్వత చూర్ణం.

ఆధునిక ప్రయోగ ఫలితాలు

  • నర్వైన్ టానిక్ (నరాలను శక్తివంతం చేస్తుంది)
  • హైపోటెన్సివ్ (రక్తపోటును తగ్గిస్తుంది)
  • ట్రాంక్విలైజర్ (నిద్రకు సహాయపడుతుంది)
  • అనాల్జెసిక్ (నొప్పినితగ్గిస్తుంది)
  • స్పాస్మోలైటిక్ (కడుపునొప్పి, బహిష్టునొప్పి వంటి అంతర్గత నొప్పులను తగ్గిస్తుంది)
  • యాంటీ కన్వల్సెంట్ (మూర్ఛలను నియంత్రిస్తుంది)
  • యాంటీ కెటారల్ (కఫాన్ని పలుచన చేసితగ్గిస్తుంది)
  • యాంటీడయేరల్ (అతిసారాన్ని ఆపుతుంది)
  • యాంటిడిసెంటిరిక్ (జిగట విరేచనాలను తగ్గిస్తుంది)

ఆయుర్వేద గృహ చికిత్సలు

అతిసారం (నీళ్ల విరేచనాలు)

వస కొమ్ములు, తుంగముస్తల గడ్డలు, పసుపు, శొంఠి కొమ్ములు కచ్చాపచ్చాగా దంచి నీళ్లకు కలిపి మరిగించి కషాయం కాచి తీసుకోవాలి. (చరక సంహిత చికిత్సాస్థానం,అష్టాంగ హృదయం, అష్టాంగ సంగ్రహం చికిత్సాస్థానం)

మూర్ఛలు (ఎపిలెప్సీ)

బ్రాహ్మీ రసం, వస కొమ్ము, చెంగల్వకోష్టు వేరు, శంఖపుష్పి (వేరు, ఆకులు)లను పాత నెయ్యికి కలిపి ఘృతపాకం విధానంలో ఘృతం తయారుచేసి వాడితే ఉన్మాదం, మూర్ఛలు తదితర రుగ్మతలు తగ్గుతాయి. (చరకసంహిత చికిత్సా స్థానం),

వసకొమ్ము పొడిని తేనెతో కలిపి తీసుకుంటే మూర్ఛలు తగ్గుతాయి. దీనితోపాటు వెల్లుల్లి వేసి తయారుచేసిన నువ్వుల నూనెను అనుపానంగా తీసుకుంటే మంచిది. ఈ చికిత్సాకాలంలో పాలను ఆహారంగా తీసుకోవాలి. మూర్ఛవ్యాధి ఎంత మొండిదైనా, దీర్ఘకాలంనుంచి వేధిస్తున్నా దీనితో ఫలితం కనిపిస్తుంది. (చరక సంహిత చికిత్సాస్థానం, వృందమాధవ, వంగసేన సంహిత అపస్మార అధికరణం, సిద్ధ్భేషజమణిమాల)

శరీరపు వాపు

వసకొమ్ముల పొడిని ఆవనూనెతో కలిపి బాహ్యంగా ప్రయోగిస్తే శరీరపు వాపు తగ్గుతుంది.

ఎసిడిటీ (ఆమ్లపిత్తం)

వస చూర్ణాన్ని తేనె, బెల్లంతో కలిపి తీసుకుంటే ఆమ్లపిత్తంలో హితకరంగా ఉంటుంది.ఎసిడిటి తగ్గుతుంది,

చర్మవ్యాధులు

వసకొమ్ములు, చెంగల్వకోష్టు వేరు, విడంగాలను మెత్తగా నూరి, నీళ్లు కలిపి ముద్దచేసి బాహ్యంగా ప్రయోగిస్తే చర్మవ్యాధుల్లో హితకరంగా ఉంటుంది.

మొటిమలు

వసకొమ్ముల గంధం, లొద్దుగచెక్క గంధం, ధనియాల పొడిని కలిపి ముఖంమీద ప్రయోగిస్తే యవ్వనంలో వచ్చే మొటిమలు తగ్గుతాయి.

తలనొప్పి (అర్ధశిరోవేదన)

పచ్చి వస కొమ్మును దంచి, రసం పిండి పిప్పళ్లు పొడిని గాని ఇప్ప పువ్వుల రసాన్ని గాని కలిపి తేనె కూడా చేర్చి ముక్కులో నస్యం రూపంలో బిందువులుగా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ముఖ్యంగా సూర్యావర్తం, అర్ధావభేదం వంటి తలనొప్పుల్లో ఇది అమితమైన ఫలితాన్ని చూపిస్తుంది.

జుట్టు ఊడటం

వసకొమ్ము, దేవదారు వేరు పట్ట లేదా గురవింద గింజలను ముద్దగా నూరి జుట్టు ఊడినచోట లేపనం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. దీనికి ముందు సిరావ్యధనం ద్వారా రక్తమోక్షణం చేయాల్సి ఉంటుంది.

గాయాలు, అభిఘాతాలు, దుష్టవ్రణాలు

వస కొమ్ము వేసి కాచిన నీళ్లతో వ్రణాన్ని కడిగి శుభ్రంచేస్తే త్వరితగతిన మానుతుంది.

పసిపిల్లల్లో కళ్లు అతుక్కుపోవటం

వసకొమ్ము పొడిని తేనెతో కలిపి గాని లేదా మదనఫలాన్ని ఇప్ప పువ్వులతో కలిపి ముద్దగా నూరి గాని పిల్లలకు నాకించి వాంతిని కలిగిస్తే కళ్లు పుసులుకట్టి అతుక్కుపోవటం తగ్గుతుంది.

వసకొమ్ములను వేసి ఘృతపాక విధానంలో నెయ్యిని తయారుచేసి, వందసార్లు ఆవర్తం చేసి దీర్ఘకాలంపాటు వాడితే శరీరం వజ్ర సమానంగా తయారవుతుంది. వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

మంచి జ్ఞాపకశక్తి, చక్కని కంఠస్వరంకోసం

వసకొమ్ములను పాలలోవేసి మరిగించి కనీసం ఒక నెలపాటు తీసుకుంటే మంచి జ్ఞాపకశక్తి, కోకిల లాంటి కంఠస్వరం, మంచి శరీర కాంతి సిద్ధిస్తాయి. సూక్ష్మజీవులు దాడి చేయకుండా ఉంటాయి. వస కొమ్ములను ఆవునెయ్యికి కలిపి ఘృతపాక విధానంలో నెయ్యిని తయారుచేసి కూడా వాడుకోవచ్చు.

కడుపునొప్పి

వస కొమ్ములు, సౌవర్చల లవణం, ఇంగువ, చెంగల్వకోష్టు వేరు, అతి విష వేరు, కరక్కాయలు, కొడిశపాల గింజలు వీటిని కలిపి తీసుకుంటే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.

అర్శమొలలు :

వసకొమ్ములను, సోంపు గింజలను కలిపి నూరి ముద్దగాచేసి అర్శమొలల మీద ప్రయోగించాలి. దీనికి ముందు నువ్వుల నూనెను వేడిచేసి బాహ్యంగా ప్రయోగిస్తే ఉపశమనంగా ఉంటుంది

ఈ టాపిక్ అందించిన వారు : డా. చిరుమామిళ్ల మురళీమనోహర్

ఆధారం : ఆంధ్రభూమి© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate