অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

స్థూల ఖనిజ లవణాలు

స్థూల ఖనిజ లవణాలు

ఖనిజ లవణాలు మన శరీరంలో జీవక్రియలను, కణాల మరియు కణజాల సంరక్షణకు, ఇంకా మన ఆరోగ్యానికి దోహదం చేసే ఇతర కార్యకలాపాలను పరిరక్షించే సూక్ష్మపోషకాలు. ఇవి చిన్న మోతాదులో అవసరమైనప్పటికి వాటి ప్రాముఖ్యత చాలా ఎక్కువ.

స్థూల ఖనిజలవణాలు

అంటే  కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, క్లోరిన్, సల్ఫర్, పొటాషియం, సోడియంలు. ఇవి మన శరీరంలో 0.05% ఉంటాయి.

సూక్ష్మఖనిజలవణాలు

మన శరీరంలో 0.05% కంటే తక్కువగా ఉండే ఖనిజలవణాలను సూక్ష్మఖనిజలవణాలు అని అంటారు. వీటినే "ట్రేస్ ఎలిమెంట్స్" అని కూడా అంటారు. ఐరన్, అయొడిన్, జింక్, కాపర్, ఫ్లోరిన్, సెలీనియం, క్రోమియం, మాంగనీస్, కోబాల్ట్ మరియు మాలిబ్డినం లను సూక్ష్మఖనిజలవణాలు అని అంటారు.

కాల్షియం

 

కాల్షియం మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన ముఖ్య ఖనిజం. మన శరీరంలో కాల్షియం అత్యధిక శాతంలో ఉంటుంది. 99% ఎముకలలో, 1% సుతిమెత్తని కండరాలలో ఉంటుంది. వీటి పనితీరు సక్రమంగా ఉండాలంటే కాల్షియం బాగా అవసరం.

స్థూలంగా చెప్పాలంటే కాల్షియం మన శరీరంలో ఈ క్రింది కార్యకలాపాలకు అవసరం.

 • ఎముకలు మరియు దంతాలు ఏర్పడడానికి
 • ఎముకల ఆరోగ్యానికి
 • రక్తం గడ్డ కట్టించడానికి
 • రక్తకణాల ఆరోగ్యానికి
 • గుండె సక్రమంగా పనిచేయడానికి
 • నరాలను ఉత్తేజపరచడానికి

కాల్షియం లోపం లక్షణాలు

 • కండారాల నొప్పులు, కొంగర్లు
 • దంతాల క్షీణత
 • ఎముకల బలహీనత
 • బిరుసుగూళ్ళు
 • పొడిబారిన చర్మము
 • మూత్రపిండాలలో రాళ్ళు
 • బహిష్టు సమయంలో అస్వస్థతలు
 • గర్భవిచ్చిత్తి
 • బోలు ఎముకలు

విశదంగా తెలుసుకోవాలంటే...

ఎముకలు ఏర్పడడానికి: మన శరీరంలోని ఎముకలలో కాల్షియం, ఫాస్ఫేట్, మెగ్నీషియం అనే ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలు ఏర్పడడానికి మరియు అవి బలంగా ఉండడానికి చాలా అవసరం. మన శరీరంలో సుమారు 1 కిలోకి పైగా కాల్షియం ఉంటుంది. ఇది ఫాస్ఫేట్ అనే ఇంకొక ఖనిజంతో చేరి "హైడ్రాక్సి ఎపిటేట్" గా మారి మన ఎముకలలో భాగంగా ఉంటుంది. ఎముకలలోని ఖనిజాలలో 39.9% కాల్షియం ఉంటుంది. కొల్లాజిన్ సమాహారంలో ఉంటుంది.
దంతాలు ఏర్పడడానికి: దంతాలపై ఉండే ఎనామిల్ మరియు డెంటైన్ లలో "హైడ్రాక్సి ఎపిటేట్" ఉంటుంది. ఇది కెరాటిన్ అనే ప్రోటీన్ భాగంలో ఉంటుంది. శరీరంలోని మెత్తటి కణజాలాలను కాల్షియం సంపర్కించి వాటిని ధృఢంగా చేస్తాయి. దీనిని కాల్సిఫికేషన్ అంటారు. ఇది తల్లి గర్భంలో శిశువు 20 వారాల వయస్సు ఉన్నప్పుడు మొదలై బిడ్డకు 6 నెలల వయస్సు వచ్చేటపుడు పూర్తవుతుంది. శాశ్వత దంతాల కాల్సిఫికేషన్ బిడ్డకు 3 నెలల వయస్సు ఉన్నప్పుడు ప్రారంభమై 3 సంవత్సరాల వయస్సున్నప్పుడు పూర్తవుతాయి.
బోలు ఎముకల వ్యాధి నివారణకు: మన శరీరానికి కాల్షియం సక్రమంగా అందనప్పుడు, ఎముకలలో, మెత్తని కండరాలలో నిల్వ ఉన్న కాల్షియం ను వాడుకుంటుంది. అందువల్ల ఎముకలు సాంద్రత కోల్పోయి, బలహీనంగా మారుతాయి. సులువుగా విరిగిపోతాయి కూడా. దీనినే బోలు ఎముకల వ్యాధి అంటాము. అది ఎక్కువగా మధ్య వయస్సు వారికి మరియు ముసలి వాళ్ళకు చూస్తాము. స్త్రీలలో అధికంగా కనిపిస్తుంది.
శరీర ఎదుగుదలకు: కాల్షియం మన శరీరంలో ఎక్కువ పరిమాణంలో అవసరం ఉంటుంది. శరీరంలో ప్రతి కణం ఆరోగ్యంగా పనిచేయాలంటే కాల్షియం తప్పనిసరి.  రక్తంలో కంటే కణాలలో కాల్షియం తక్కువ పరిమాణంలో ఉంటుంది. హర్మోనుల ప్రేరణ వంటి రసాయన చర్యల వలన కణాలలోనికి కాల్షియం గ్రహించబడుతుంది. రసాయన చర్యలకు స్పందించే గుణం కాల్షియంకు ఉండటంవలన శరీరంలో కొన్ని కీలక విధులను నిర్వహిస్తుంది- ఇన్సులిన్ ప్రక్రియలో, నాడీకణాలనుండి సంకేతాలను అవయవాలకు అందించడంలో, కండర వ్యాకోచ,సంకోచాలను నిర్వర్తించడంలో, అండంతో కలవడానికి వీర్యకణం కదలికను వేగవంతం చేయడంలో కాల్షియం అవసరం ఎంతో ఉంది.
రక్తం గడ్డకట్టడానికి: మనకు ఏదైనా గాయమైనపుడు త్రాంబోప్లాస్టిన్ అనే ఎంజైము గాయపడిన కణజాలాల నుండి స్రవించబడుతుంది. ఇది ప్రోత్రాంబిన్ అనే ప్రోటీన్ ను త్రాంబిన్ గా మారుస్తుంది. ఈ పరివర్తన జరగాలంటే కాల్షియం అత్యంత అవసరం. ఇలా ఏర్పడిన త్రాంబిన్ "పైబ్రినోజన్" అనే ప్రోటీన్ ను పైబ్రిన్ గా మారుస్తుంది. ఈ ఫైబ్రిన్ రక్తం గడ్డకట్టడానికి కావలసిన ఫైబ్రస్ సమూహాన్ని ఏర్పరుస్తుంది. అందువల్ల రక్తం ఎక్కువగా పోకుండా కాపాడుతుంది.
హైపోకాల్షిమియా: మన శరీరంలో కాల్షియం అతి తక్కువ ఉండటం వలన ఈ స్థితి సంభవించవచ్చు. ఆహారంలో కాల్షియం తక్కువ పరిమాణంలో తీసుకోవడం వలన శరీరంలో కూడా తక్కువౌతుంది. ఇది ఎక్కువగా పారాథైరాయిడ్ హార్మోనును తొలగించినప్పుడు వస్తుంది.  మాల్  అప్సరిటీవ్  సిండ్రోం అనే వ్యాధి ఉన్నప్పుడు కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. దీని వల్ల ఎముకల సాంద్రత కోల్పోయి బలహీనంగా మారుతాయి. కండరాలు పటుత్వం కోల్పోయి స్పర్శ తెలియకపోవడం జరుగుతుంది. కండరాలలో, ఎముకలలో నొప్పి కల్గుతుంది.
అధిక రక్తపోటు: మన ఆహారంలో కాల్షియం తక్కువగా ఉన్నట్లైతే అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. మన ఆహారంలో కాల్షియం, విటమిన్ D సమృద్ధిగా తీసుకున్నట్లైతే కొలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. ఒకవేళ కొలాన్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అధిక మోతాదులో కాల్షియం ఇచ్చినట్లయితే కణాల ఉత్తేజాన్ని ఆపి నివారణకు తోడ్పడుతుంది.
హైపర్ కాల్షిమియా: ఈ సమస్య ఎక్కువగా చంటిబిడ్డలలో చూస్తుంటాము. ఇది వీరిలో ఎక్కువ మోతాదులో విటమిన్ D తీసుకోవడం వల్ల వస్తుంది. పారాథైరాయిడ్ ఎక్కువగా స్రవించబడినప్పుడు కూడా వస్తుంది. వాంతులు, వికారం, ఆకలి తగ్గిపోవడం, మలబద్ధకం, కడుపులో నొప్పి వంటి లక్షణాలు చూడొచ్చు.కొన్ని సార్లు మూత్రపిండాలలో రాళ్ళు, కండరాల బలహీనతను కూడా చూడొచ్చు.

కాల్షియం సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు

మి.గ్రా./100 గ్రా

ఎండ్రికిచ్చ (కాయ) చిన్నది

1606

చామదుంప ఆకులు

1546

నువ్వులు

1450

కొవ్వు తీసిన పాలు

1370

పాల పొడి

950

మునగాకులు

440

బర్రె పాలు

210

చీజ్

790

అవిసె ఆకులు

1130

 

కాల్షియం సహజంగా శాకాహారం, మాంసాహారాలలో ఉంటుంది. ఆకుకూరలు, పాలు, చిరుధాన్యాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.
ఆకుకూరలలో  తోటకూర, మునగాకు,  చిరుధాన్యాలలో రాగి, కూరగాయలలో రాజ్ కీరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.

ఫాస్పరస్ఫాస్పరస్ అనే ఖనిజం మన శరీరంలో 400-700 గ్రాముల వరకు నిల్వ ఉంటుంది. ఇది ఫాస్ఫేట్ రూపంలో ఉంటుంది. మన దంతాలలో, ఎముకలలో, కణజాలల్లో ఉంటుంది. ఎముకల్లో, దంతాల్లో, కాల్షియం ఫాస్ఫేట్ గాను, సుతిమెత్తని కణజాలల్లో సోడియం మరియు పొటాషియం ఫాస్ఫేట్ గాను ఉంటుంది.

 

ఉపయోగాలు

 • ఎముకలు మరియు దంతాలు ఏర్పడ్డానికి
 • కణాలు ముఖ్యంగా మెదడులోని కణాలలోని పొరలైన ఫాస్పోలిపిడ్స్ లెసితిన్ మరియు సిఫాలిన్ ఏర్పడ్డానికి ఇది ముఖ్యం.
 • ఇది న్యుక్లిక్ యాసిడ్స్ అయిన డి.ఎన్.ఎ. మరియు ఆర్.ఎన్.ఎ. లలో అంతర్భాగం.
 • కొవ్వు పదార్థాల జీవక్రియకు ,రవాణాకు అత్యంత అవసరం.
 • పిండి పదార్థాలు, కొవ్వు, మాంసకృత్తుల  జీవక్రియలకు అవసరమైన ఎంజైము కార్బాక్సిలేసులలో ఇది అంతర్భాగం.
 • పిండిపదార్థాల జీర్ణక్రియకు ఇనార్గానిక్ ఫాస్పరస్ ఆవశ్యకం.

ఫాస్పరస్ లోపం లక్షణాలు

 • ఆకలి లేకపోవడం
 • నీర్సంగా అనిపిచడం
 • కండారల బలహీనత
 • ఎముకలలో నొప్పి
 • అంటువ్యాధులకు త్వరగా లోనుకావడం
 • గుచ్చినట్లుగా, తిమ్మిరిగా, స్పర్శలేనట్లుగా అనిపించడం.
 • కండారాల సమన్వయం లేకపోవడం.

మాములుగా ఫాస్పరస్ మానవ రక్త సీరంలో (రక్తంలో ఉండే పదార్థం. రక్తం గడ్డకట్టినపుడు పలుచని స్వచ్చంగా ఉండే ద్రవ పదార్థం) పెద్దవారిలో 100 మి.లీ రక్తంలో 2.5-40 మి.గ్రా, పిల్లలలో 5.0-6.0 మి.గ్రా ఉండాలి ఫాస్పరస్ సరైన మోతాదులో తీసుకోకపోవడం వల్ల రికెట్స్ మరియు ఆస్టియోమలేసియా అనే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.  రికెట్స్ అనే వ్యాధి సోకినప్పుడు ఫాస్ఫరస్ 100 మి.లీ.కు 3 మి.గ్రా. తగ్గుతుంది.

రికెట్స్

ఈ సమస్య మనం చిన్నపిల్లలలో చూస్తాము. ఆహారంలో కాల్షియం, విటమిన్ ఫాస్ఫరస్ లు లోపించినపుడు మన శరీరానికి సరిపడా అవసరమయ్యే కాల్షియం, విటమిన్, ఫాస్ఫరస్ లు అందవు.అప్పుడు ఎముకలు సాంద్రత కోల్పోయి, అసాధారణ కాల్సిఫికేషన్ కు లోనౌతాయి.అందువల్ల ఎముకలు విరిగిపోవడం, మెత్తబడడం, అసాధారణ రూపం పొందటం అంటే వంకరగా తిరగడం లాంటివి జరుగుతాయి. పిల్లలలో ఇది ఎముకలలోని ఎపిఫైసల్ ప్లేట్ మూసుకుపోకముందే కాల్సిఫికేషన్ జరుగుతుంది.ఇదే సమస్య పెద్దవారిలో కనిపించినట్లైతే దానిని ఆస్టియోమలేషియా అంటాము. కాని వీరిలో ఎపిప్లేట్ మూసుకున్నాక  ఈ సమస్య కనిపిస్తుంది. సరైన మోతాదులలో ఫాస్ఫరస్ తీసుకోవడం మంచిది.

సిఫారసు చేయబడ్డ మోతాదు

వయస్సు

ఒక రోజు మోతాదు (మి.గ్రా.లలో)

పిల్లలు
0-6  నెలలు

7-12 నెలలు

1-3 సం.

7-9 సం.

10-12 సం.


250-300

350-400

600

700

700

యుక్తవయస్కులు
అబ్బాయిలు

అమ్మాయిలు


800

800

గర్భిణులు

1200

పాలిచ్చే తల్లులు

1200

ఫాస్ఫరస్ సమృద్దిగా దొరికే ఆహార పదార్థాలు


ఆహారపదార్థం

100 గ్రాములలో లభ్యమయ్యే పరిమాణం(గ్రాములలో)

పప్పుదినుసులు, చిరుధాన్యాలు, నూనెగింజలు, ధాన్యాలు

0.2-0.65

ఎండు చాపలు

1.2-1.3

పాల పొడి

0.76-0.82

కొవ్వు తీసిన పాలపొడి

1.0-1.1

మాంసం, గ్రుడ్డు, చేపలు

0.31-0.41

పాలు

0.009-0.11

మెగ్నీషియం

 

మెగ్నీషియం మానవ శరీరంలో సుమారు 25 గ్రా ఉంటుందని అంచనా. అందులో 50% ఎముకలలో, 50% సున్నితమైన కణజాలల్లోను ఉంటుంది.

ఉపయోగాలు

 • ఇది అనేక జీవక్రియ ఎంజైములలో అంతర్భాగం.
 • ఎముకలను పటిష్టం చేస్తుంది.
 • అల్కలిన్ ఫాస్ఫేట్ అనే ఎంజైముకు ఉత్ప్రేరణ కల్గిస్తుంది.
 • శరీరంలో అన్ని కణాలలో ముఖ్య ఖనిజం.
 • మానవ శరీరంలో జరిగే అన్ని జీవక్రియలను ఉత్తేజపరుస్తుంది.

మన శరీరంలో ఈ మెగ్నీషియం లోపిస్తే అనేక సమస్యలను ఎదుర్కొంటాము.

 • మానసిక ఒత్తిడికి లోనవ్వడం,
 • ఎముకలు మరియు కండరాల బలహీనత,
 • సిరలలో 100 మి.లీ.రక్తంలో 1 మి.గ్రా. కంటే తక్కువ ఉన్నట్లయితే మూర్చపోవడం, ఫిట్స్ కి గురయ్యే ప్రమాదం ఉంది.

మెగ్నీషియం లభించే ఆహారపదార్థాలు

 

మెగ్నీషియం  ఎక్కువగా పప్పుదినుసులు, బాదం, జీడిపప్పు, ఆవాలు మొదలైన నునెగింజలలో ఎక్కువగా ఉంటుంది.

తృణధాన్యాలు, చిరుధాన్యాలలో కూడా ఇది పుష్కలంగా ఉంటుంది. పాలు, గుడ్డు, చేపలు, కాయగూరలలో కూడా లభిస్తుంది.

సిఫారసు చేయబడ్డ మోతాదు

వయస్సు

ఒక రోజు మోతాదు (మి.గ్రా.లలో)

చంటి బిడ్డలు

30-45

పిల్లలు

50-100

కౌమారులు

120-153

స్త్రీలు

310

పురుషులు

340

గర్భిణులు

310

పాలిచ్చే తల్లులు

310

సోడియం

 

సోడియం అనే ఖనిజ లవణం మన శరీరంలో 100 గ్రాముల వరకు ఉంటుంది.ఇందులో 50% కణాలలోని వెలుపలి కణద్రవ్యంలో ఉంటుంది. మిగిలిన  50% కణజాలాల్లో మరియు ఎముకలలో ఉంటుంది. ఇది మన శరీరంలోని క్లోరిన్, బైకార్బోనేట్, ఫాస్ఫేట్, లాక్టేట్ మరియు పోపియోనేట్లతో సంపర్కించబడి ఉంటుంది.

ఉపయోగాలు

 • శరీరంలో ఆమ్ల-క్షార పరిమాణం యొక్క సమతుల్యతను పరిరక్షిస్తుంది.
 • కణంలోని ప్లాస్మా మరియు ద్రవాల మధ్య ద్రవాభిసరణ పీడన చర్య జరిపి, శరీరం ద్రవాలను అధికంగా కోల్పోకుండా కాపాడుతుంది.
 • చిన్న ప్రేగులలో మోనోశాకరైడ్ పిండిపదార్థాలు మరియు ఆమైనో ఆమ్లాల శోషణకు అవసరం.
 • గుండె కదలికలు మొదలవ్వడానికి మరియు సరైన క్రమంలో కొట్టుకోవడానికి సోడియం అవసరం.

ఇన్ని ఉపయోగాలున్న సోడియం ను మన శరీరానికి ఆహారం ద్వారా సరిగ్గా అందించకపోతే మనం చాలా దుష్పరిమాణాలను చూడవలసి వస్తుంది.

1.హైపర్ నేట్రీమియా: రక్తంలో సోడియం శాతం తగ్గినప్పుడు ఈ స్థితిని మనం గమనించవచ్చు.

హైపర్ నేట్రీమియా లక్షణాలు

1. అతి నిర్జలీకరణ

 

2.రక్త పరిమాణం తగ్గిపోవడం

3.రక్త పోటు తగ్గిపోవడం

4.రక్త ప్రసరణ వైఫల్యం

హైపర్ నేట్రీమియాకు కారణాలు

 • అతిసారం, అధిక వాంతుల  వలన జీర్ణాశయ ద్రవాలను శరీరం కోల్పోయినప్పుడు ,
 • దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారిలో సోడియం యొక్క శోషణ మూత్రపిండ గొట్టాలలో సరిగ్గా లేనప్పుడు,
 • అదివృక్క గ్రంథి పనితీరులో లోపం ఉన్నప్పుడు.

సాధారణంగా మన రక్త సీరంలో సోడియం 136-145 మి.గ్రా./లీ.గా ఉంటుంది.

పొటాషియం

 

మన శరీరంలో పొటాషియం వెలుపలి కణజాల ద్రవంలో అంతర్భాగం. మన శరీరంలో సుమారు 250 గ్రా.ల పొటాషియం ఉంటుంది.

ఎర్ర రక్తకణాలలో మరియు ఇతర కణాలలో 90% ఉంటుంది.ఇంకా 10% వెలుపలి కణజాల ద్రవంలో ఉంటుంది.

ఉపయోగాలు

 • ఆమ్ల-క్షార సమతుల్యాన్ని కణాలలో పరిరక్షిస్తుంది.
 • కణాలలో అతిముఖ్యమైన కాటాయాన్
 • మాంసకృత్తులు పెరగడానికి పొటాషియం అత్యంత ప్రాముఖ్యం. ప్రతీ 6-25 కణజాల మాంసకృత్తుల ఉత్పత్తికి 117 మి.గ్రా.ల పొటాషియం అవసరం.
 • గ్లైకోజ్ ఉత్పత్తిని పొటాషియం ప్రేరేపిస్తుంది.
 • కండరాల సంకోచానికి పొటాషియం చాలా అవసరం.

సామాన్యంగా మనలో 3.8-5.0 మి.ఈక్వలెంట్స్/లీ.ల పొటాషియం ఉంటుంది. ఒకవేళ దీనికంటే తక్కువ పొటాషియం మన శరీరంలో ఉన్నట్లైతే మనం హైపోకెలిమియా అనే ఆరోగ్య సమస్యనకు గురౌతాము.

హైపోకెలీమియా లక్షణాలు

 • కండరాల బలహీనత,
 • పక్షవాతం,
 • నరాల బలహీనత
 • గుండె వేగంగా కొట్టుకోవడం,
 • గుండె ధమనులకు మరియు మూత్రపిండాలకు గాయాలవ్వడం,
 • గుండె కండరాలు బలహీనపడటం.

హైపర్ కెలీమియా లక్షణాలు

ఒకవేళ పొటాషియం మన శరీరంలో ఎక్కువైనపుడు  ఈ స్థితిని చూస్తాము.

దీని లక్షణాలు

 • కండరాలు మరియు నరాల ఒత్తిడికి లోనవ్వడం,
 • గుండె వేగం తగ్గిపోవడం,గుండె చప్పుడు మందగించడం,
 • గుండె స్తంభించడం,
 • బలహీనత,
 • మానసిక రుగ్మతలకు గురికావడం,
 • స్పర్శను కోల్పోవడం,
 • మూతృపిండాలు పని చేయకపోవడం,
 • తీవ్ర నిర్జలీకరణకు గురికావడం

ఆధారం:
కుమారి ఐ. ప్రసన్న, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్.2012/010.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate