অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆకుకూరలతో కలిగే మేలు

  • ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి.
  • భారతదేశంలో అనేక రకాల ఆకుకూరలు వినియోగంలో ఉన్నాయి. వీటిలో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, మునగాకులు, పుదీన తదితరాలు ప్రముఖమైనవి.
  • ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఇనుముధాతువు కలిగి ఉంటాయి. శరీరంలో ఇనుములోపం కారణంగా అనీమియా వ్యాధికి గురవుతారు. గర్భవతులు, బాలింతలు(పాలిచ్చే తల్లులు), పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు.
  • ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు.
  • ఆకుకూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి.
  • విటమిన్-ఎ లోపం కారణంగా భారతదేశంలో ప్రతీ యేటా ఐదేళ్ళ లోపు వయస్సు పిల్లలు సుమారు 30 వేల మంది కంటిచూపును కోల్పోతున్నారు. ఆకుకూరలద్వారా లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎ గా మారి అంధత్వం రాకుండా చేస్తుంది.
  • విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంటచేసేటపుడు ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే, వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది. దీన్ని నివారించటానికీ అకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో కొన్ని రకాల బి- కాంప్లెక్స్ విటమిన్లు కూడాఉంటాయి.

సాధారణంగా వినియోగించే ఆకుకూరల్లో ఉండే పోషక విలువలు

(ప్రతి 100 గ్రాములకు)
పోషకాలు పుదీన తోటకూర పాలకూర మునగ కొత్తిమీర గోంగూర
కాలరీలు
48
45
26
92
44
56
మాంసకృత్తులు.(గ్రా)
4.8
4.0
2.0
6.7
3.3
1.7
కాల్షియం (మి.గ్రా)
200
397
73
440
184
1720
ఇనుము(మి.గ్రా)
15.6
25.5
10.9
7.0
18.5
2.28
కెరోటిన్(మై.గ్రా)
1620
5520
5580
6780
6918
2898
థైమిన్(మి.గ్రా)
0.05
0.03
0.03
0.06
0.05
0.07
రిబోఫ్లేవిన్(మి.గ్రా)
0.26
0.30
0.26
0.06
0.06
0.39
విటమిన్ సి (మి.గ్రా)
27.0
99
28
220
135
20.2
  1. ఆకుకూరలు పిల్లలకు విరేచనాలు కలిగిస్తాయనేది కొందరి అపోహ. ఈ కారణంగా చాలామంది తల్లులు తమ పిల్లలను ఆకుకూరల నుంచి దూరం చేస్తారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది. నేల, నీరు ద్వార ఆకుకూరలను సూక్ష్మక్రిములు (బాక్టీరియా), కీటకాలు కలుషితం చేస్తాయి. వీటిని శుభ్రం చేయకుండా వినియోగిస్తే విరేచనాలు కలుగుతాయి. కనుక వినియోగించడానికి ముందు ఆకుకూరలను శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఆ తర్వాత వినియోగించినట్లయితే ఎలాంటి రుగ్మతలు రాకుండా నివారించవచ్చు.
  2. వండిన ఆకుకూరలను శిశువులకు తినిపించే ముందు వాటిలో పీచు పదార్ధం లేకుండా జాగ్రత్తపడాలి. ఆకుకూరలను వండిన తర్వాత వాటిని గుజ్జుగా చేసి వడపోయడం ద్వారా పీచు పదార్ధాన్ని తొలగించవచ్చు. మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలోకానీ ఎక్కువసేపుగాని వండితే ఆకుకూరల్లోని పోషకాలు నశిస్తాయి. వండిన తర్వాత మిగిలే నీటిని పారేయరాదు. ఆహారం వండుతున్నప్పుడు గిన్నెపై మూత ఉంచండి. ఆకుకూరలను ఎండలో ఎండబెట్టరాదు. అలాచేస్తే అందులోని కెరోటిన్ అనే పోషకం నశిస్తుంది. ఆకుకూరలను నూనెలో వేపుడు చేయరాదు.
  3. ఆకు కూరల్లో పోషక పదార్ధాలను వాటి ధరను బట్టి  నిర్ణయించరాదు. చాల చౌకగా లభిస్తాయి కనుక వాటిని వాడటానికి కొందరు భేషజం ప్రదర్శిస్తారు. ధర తక్కువే అయినప్పటికి ఆకుకూరలు పోషకాల పరంగా అత్యంత శ్రేష్టమైనవి. అందరికి అవసరమైనవి.
  4. ఆకుకూరల పెంపకాన్ని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి. తద్వారా ఇవి ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి.పెరటి తోట,ఇంటి డాబా పైన,పాఠశాలలోని తోట,ఆవరణ లాంటి ప్రదేశాలు ఆకుకూరల పెంపకానికి అనువైనవి. మునగ చెట్టు,అవిసె చెట్టు లాంటి వాటిని ఇంటి పెరట్లో నాటి పెంచినట్లయితే, వాటినుంచి  ఆకులను సేకరించడం సులువుగా ఉంటుంది.

మధుమేహ వ్యాధి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగల మెంతులు (షుగర్ వ్యాధి)

మధుమేహం (షుగర్ వ్యాధి), గుండె జబ్బులు మనలో చాలామందిలో సాధారణంగా కనిపించే వ్యాధులు. శరీరంలో కొలెస్ట్రాల్ గాని, రక్తంలో షుగర్ గాని అతిగా పెరగడం వల్ల వచ్చే ఈ వ్యాధులు ఇతర రుగ్మతలకు కూడా దారితీస్తాయి. ఈ వ్యాధులు ఉన్నవారు మెంతులను తింటే ఉపశమనం పొందుతారని జాతీయ పోషకాహార సంస్థ (హైదరాబాద్) చేసిన ఒక పరిశోదనలో తేలింది. ఈ వ్యాధి గ్రస్తులకు ఇచ్చే మందులు,చికిత్సతో పాటు మెంతులు కూడా ఇస్తే రోగికి మరింత ఆసరా ఉంటుంది. మెంతులను ఎంత మోతాదులో, ఏరూపంలో ఇవ్వాలి, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈకింది విధంగా ఉన్నాయి.

  1. భారతీయ వంటకాల్లో అతి సాధారణంగా వాడే మెంతులు కిరాణా షాపుల్లో లభిస్తాయి.
  2. మెంతుల్లో పీచు (ఫైబర్) పదార్ధం అతి ఎక్కువగా అంటే 50 శాతం వరకు ఉంటుంది. ఈ కారణంగా ఇది రక్తం,మూత్రంలోని గ్లూకోజ్ ను తగ్గిస్తుంది. కొలెస్టరాల్ అతిగాపెరిగిన కారణంగా గుండె జబ్బులకు గురయ్యే వారిలో ఈ కొలెస్ట్రాల్ స్థాయిని మెంతులు గణనీయంగా తగ్గిస్తాయి. మెంతులను ధాన్యం రూపంలో అయినా లేదా వంటకాల్లో ఉపయోగించినా ఈ ఫలితాలు అందిస్తాయి.
  3. అయితే మెంతి కూర (ఆకుకూరల్లో ఒకటి) లో మాత్రం ఈ లక్షణాలు ఉండవు. కేవలం మెంతులు మాత్రమే పైన పేర్కొన్న ఆరోగ్య ఫలితాలను ఇస్తాయని గమనించాలి.
  4. మెంతులను ఏమోతాదులో ఉపయోగించాలనేది మధుమేహం వ్యాధి తీవ్రతను బట్టి ఉంటుంది. అలాగే శరీరంలో కొలెస్టరాల్ స్థాయిని బట్టి మోతాదును నిర్ణయిస్తారు.సాధారణంగా 25 గ్రా నుంచి 50 గ్రా మధ్య ఈ మోతాదు ఉంటుంది.
  5. ప్రారంభంలో మెంతులను రోజుకు 25 గ్రాముల చొప్పున తీసుకోవాలి. వీటిని రెండు భాగాలుగా చేసి అంటే 12.5 గ్రాముల చొప్పున (రెండు టీ స్పూన్లు) రెండు సార్లు తీసుకోవాలి. మద్యాహ్న భోజనం,రాత్రి భోజనం తో పాటు వీటిని ఆరగించాలి.
  6. మెంతులను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి గాని, లేదా పౌడర్ గా చేసి మంచినీళ్ళు లేదా మజ్జిగలో కలుపుకొని గాని భోజనానికి పావు గంట ముందు సేవించాలి.
  7. సహజంగా రుచి చేదుగా ఉండే మెంతుల్లో ఆ చేదు రుచిని నిర్మూలించే ప్రక్రియ ప్రస్తుత మార్కెట్లోకి ఇంకా అందుబాటులోకి రాలేదు.
  8. నానబెట్టిన మెంతులను గుజ్జుగా చేసిగాని పౌడరుగా చేసిగాని వివిధ రకాల వంటకాల్లో చేర్చి వాడుకోవచ్చు. ఉదాహరణకు రొట్టెలు,పెరుగు,దోశ,ఇడ్లి,ఉప్మా, వివిధ రకాల కూరలు తదితర వంటకాల్లో చేర్చినట్లయితే మెంతుల చేదును కొంతవరకు తగ్గించవచ్చు. వంటకాలను తమతమ అభిరుచికి అనుగుణంగా పుల్లగా లేదా ఉప్పుగా తయారు చేసుకోవచ్చు.
  9. రక్తంలో,మూత్రంలో షుగర్ లెవెల్ అతిగా ఉన్నంత కాలం మెంతులను తీసుకుంటూనే ఉండాలి.
  10. మెంతులను తీసుకోవడంతోపాటు రోజూ క్రమం తప్పకుండా నడవటం లాంటి వ్యాయామం చేయటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే శరీర బరువు తగ్గటం వల్ల ఇన్సులిన్ చక్కగా పనిచేస్తుంది. అందుకే శరీరంలొ క్రొవ్వును చేర్చే పంచదార పదార్ధాలను తీసుకోకుండా నియంత్రించాలి.
  11. మెంతులను వినియోగిస్తున్న కొత్తలో కొందరికి విరేచనాలు కావడం లేదా కడుపు ఉబ్బరంగా ఉండటం జరుగుతుంది.
  12. మధుమేహం వచ్చిన వారు వ్యాధికి తీసుకుంటున్న ఔషధాలను కొనసాగిస్తూనే మరింత ఉపశమనానికి మెంతులను వాడాలి. మెంతుల వాడకం ద్వారా ఔషధాల అవసరాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. అయితే ఏమేరకు ఔషధాలను తగ్గించాలి, ఎంత మోతాదు ఇవ్వాలనేది మీవ్యాధి పరిస్థితిని బట్టి కేవలం మీ వైద్యుడు మాత్రమే నిర్ణయిస్తాడు. మధుమేహ వ్యాధి తీవ్రమైనప్పుడు తక్షణమే వైధ్య సహాయం పొందాలి.

ఆధారము : జాతీయ పోషకాహార సంస్థ, హైదరాబాదు - 500007.

ప్రపంచ శాఖాహార దినోత్సవం

సంస్కృతిలో అంతర్భాగం ఆహారం. ప్రజలు తమ సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉంటారు. ఎవరి ఆహార సంస్కృతి వాళ్లకుగొప్ప. కాబట్టి, ఫలానా ఆహారం మంచిది, ఫలానా ఆహారం చెడ్డది అన్న చర్చ అర్థంలేనిది. అయితే, వాతావరణంలో వస్తున్నమార్పు ప్రపంచాన్ని అమితంగా వేడెక్కిస్తున్న నేపథ్యంలో ఆహారాన్ని పర్యావరణ దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది. శాకాహారము వల్ల కలిగే ప్రయోజనాల్నిఅందరకు తెలియజేయడమే దీని ముఖ్యవుద్దేశముగా కలదు. మన తీసుకునే ఆహారము వలనే మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవచ్చును.అనే ఉద్దేశంతో 1977 లో వరల్డ్ వెజిటేరియన్‌ డే గా ప్రకటించారు. శాకాహారము యొక్క ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయటం కోసం ఏర్పాటు అయ్యింది. పౌష్టికాహారము విషయం లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది . శాఖము, ఆహారము అనేరెండు పదముల కలయిక. శాఖము అంటే చెట్టు. చెట్టు, మొక్కల నుండి వచ్చే ఆహారము అని అర్ధము. పుట్టిన ప్రతి జీవికి జీవించడానికి అవసరమైనది ఆహారం. ఇది శాఖాహారము, మంసాహారము అనేది ఆజీవి పుట్టుక, అలవాట్లు, పరిసరాలపైన ఆధారపడి ఉంటుంది.

1977 లో నార్త్ అమెరికన్‌ సొసైటి " వరల్డ్ వెజిటేరియన్‌ డే " ను వార్షిక వేడుకగా ప్రకటించగా , 1978 లో ఇంటర్నేషనల్ వెజిటేరియన్‌ యూనియన్‌ ఆమోదాన్ని తెలిపింది. అక్టోబర్ ఒకటో తేదీన అధికారికంగా ఈ వేడుక జరుపుకోవాలని ప్రకటించినది. సులువుగా జీర్ణమయ్యే ఆహారము బార్లి లాంటివి అనేకము ఉన్నాయి . గోధుమతో పోల్చితే బార్లి శరీరములో పేరుకు పోయిన నీటిని బయటికి పంపిస్తుంది. ఆకుకూరలు , కాయకూరలు, గింజలు, పప్పులు ఆరోగ్యానికు ఎంతో మంచిది. మాంసాహారమువల్ల ఎన్నో జీర్ణకోస వ్యాధులకు కారణమవుతుంది. శాకాహారము జీర్ణకోశవ్యాధులను నయము చేస్తుంది. అమెరికాలో ఈ మధ్య ‘సోమవారం మాంసం తినడం మానండి!’ పేరిట ఉద్యమం ప్రారంభమైంది. తద్వారా 15 శాతం మాంసం వినియోగం తగ్గుతుందని అంటున్నారు. ‘సమతుల శాకాహారం అన్ని వయసులవారికి, గర్భవతులకు, బాలింతలకు, క్రీడాకారులకు నూటికి నూరుపాళ్లూ పుష్టికరమైన ఆహారం.’ అని అమెరికన్ డైట్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న భూభాగంలో 30 శాతాన్ని పశువుల పెంపకానికి వినియోగిస్తున్నారు. మాంసాహార వినియోగం 2050 నాటికి రెట్టింపయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ హెచ్చరిస్తోంది. మాంసకృత్తులను అందించడంలో శాకాహారమే అనేక విధాలుగా మేలని ఆహార నిపుణులు చెబుతున్నారు. మాంసకృత్తులను అందించే ఆహారపదార్థాలలో ఏవి మెరుగైనవో చూస్తే ఆరు విధాలుగా శాకాహారమే మేలని తేలిందని ప్రపంచ బ్యాంక్‌కు సీనియర్ పర్యావరణ సలహాదారుగా పనిచేసిన రాబర్ట్ గుడ్‌లాండ్ అంటున్నారు.

  1. ఖర్చులన్నీ కలిపి చూసినా గిట్టుబాటు కావడం.
  2. ట్రాన్స్ ఫ్యాట్స్, హార్మోన్లు, యాంటీబయాటిక్స్, నైట్రేట్లు, నైట్రోసమైన్స్, సోడియం ప్రిజర్వేటివ్స్ వంటి హానికారకాలు తక్కువగా ఉండటం లేదా అసలు లేకుండా ఉండటం.
  3. మాంసకృత్తులతోపాటు పీచు వంటి ఆరోగ్యదాయక పదార్థాలు ఉండటం.
  4. రోజువారీగా వినియోగించే ఆహారంలో అవసరమయ్యే అమినో యాసిడ్లన్నీ ఉండటం.
  5. తక్కువ భూమిని ఉపయోగించి ఎక్కువ మాంసకృత్తులను ఉత్పత్తి చేయడం.
  6. పోషకాల సాంద్రత కలిగి ఉండటం. కూరగాయలు అత్యధిక పోషకాల సాంద్రత కలిగి ఉంటాయి. అవసరమైన అమినో యాసిడ్లు పంటల ద్వారా మాత్రమే లభిస్తాయి.

ఎకరం పొలంలో పశువులను పెంచి ఉత్పత్తి చేసే మాంసకృత్తులకన్నా. వివిధ పంటలసాగు ద్వారా అంతకు ఐదురెట్లు మాంసకృత్తులను ఉత్పత్తి చేయవచ్చు. సోయాచిక్కుళ్లలో మాంసకృత్తులు మరింత అధికంగా ఉంటాయి. రకరకాల పంటల ద్వారా వివిధ అమినో యాసిడ్లు శాకాహారులకు అందుబాటులోకి వస్తాయి. పొట్టుతీయని ధాన్యాల పొడులు, చిరుధాన్యాలు, ముడి బియ్యం ద్వారా కేలరీలు, ఖనిజాలు, విటమిన్లు, పీచుపదార్థం పుష్కలంగా లభ్యమవుతాయి. పప్పుధాన్యాల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉండడమేకాక అనారోగ్యకరమైన కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. రసాయనిక వ్యవసాయం వల్ల బి12 వంటి అనేక విటమిన్లు, సూక్ష్మపోషకాలు వ్యవసాయోత్పత్తుల్లో కొరవడుతున్నాయి. పంటలను సారవంతమైన భూముల్లో పర్యావరణానికి హానిచేయని పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తుల్లో సకల పోషకాలూ పుష్కలంగా లభిస్తాయి. మాంసకృత్తులకు శాకాహారంపై ఆధారపడటం పెరిగితే రానున్న కాలంలో వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడానికి వీలుకలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. తవుడు తీసిన తెల్ల బియ్యానికి స్వస్తిచెప్పి. పీచుపదార్థంతో పాటు, సకల పోషకాలు పుష్కలంగా ఉండే చిరుధాన్యాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి ఎదురే ఉండదు. అందువల్ల శాఖాహారాన్నిమాత్రమే స్వీకరించటం అన్నివిదాలా అందరికి మంచిది. పర్యావరణానికి మంచిది అని తెలుస్తోంది.

ఆధారము: లహరి బ్లాగ్

ఆకుకూరలు

ఆకుకూరలు కొన్ని ప్రత్యేకతలు కలిగిన ఆహార పదార్థం. ఆనుదిన ఆహారంలో దాదాపు 20% వరకు వీటిని తీసుకుంటే మంచిది. వీటివలన అపారమైన లాభాలున్నాయి.

  1. ఆకుకూరల్లో మిగిలిన కూరగాయలతో పొలిస్తే విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. విటమిన్ కె రక్తం గడ్డకట్టటానికి తొడ్పడే పొషకపదార్థం. ఆంతే కాకుండా గుండె రక్తనాళాల జబ్బులు, ఎముకలు గుల్లబారటం, రక్తనాళాల్లో, మూత్రపిండాలలో రాళ్ళు వంటి వాటిని నియంత్రించకలిగే శక్తి దీనికి ఉంటుంది.
  2. కొలెస్ట్రాలును తగ్గించే గుణం ఉంది. లివర్ లో కొలెస్ట్రాలును వినియోగించుకొని బైల్ యాసిడ్ ను తయారుచేస్తుంది. ఇది కొవ్వు జీర్ణ ప్రక్రియలో తొడ్పడుతుంది. ఆయితే ఆకుకూరల్లో ఉండే పీచుతో బైలు యాసిడ్ కల్సినపుడు అది విసర్జించబడుతుంది. ఆందుచేత లివర్ మరలా మరలా, బైలు యాసిడ్ ను తయారు చేసుకోవలసి వస్తుంది. ఈ విధంగా కొలెస్ట్రాల్ ఎక్కువగా వాడబడుతుంది.
  3. ఆకుకూరలు కంటిచూపును పరిరక్షిస్తాయి. ఆకుకూరల్లో విటమిన్ ఎ కెరొటినాయిడ్, క్సైంతిన్ రూపంలో ఉంటుంది. ఇవి అత్యంత కాంతివంతంగా వచ్చే వెలుతురును కూడా నియంత్రించగలిగే శక్తిని కలిగి ఉంటాయి. కనుక కంటిచూపు పరిరక్షించబడుతుంది.
  4. శరీరానికి కావలసిన ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆకుకూరల్లో బి విటమినులు, ముఖ్యంగా బి5 (పాంటోథెనిచ్ యాసిడ్) ఉంటాయి. ఇవి పిండి పదార్థాలను గ్లూకోజ్ రూపంలోకి మారుస్తాయి. అందుచేత శరీరానికి శక్తినిచ్చే ఇంధనంగా ఇది పనిచేస్తుంది. అంతేకాక బి విటమినులకు నీటిలో కరిగే గుణం ఉంటుంది కనుక, ఇవి శరీరంలో నిల్వచేయబడవు. అందుకే ఆకుకూరలు ప్రతిదినం తీసుకోవాలి.
  5. ఎముకల ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో కాల్షియం అనే ఖనిజలవణం అధికంగా ఉంటుంది. ప్రతిరోజు ముఖ్యంగా 31-35 సంవత్సరాల వయస్సు మహిళలు 1000 మి.గ్రా. కాల్షియం తీసుకోవాలి. ప్రతిరోజు ఆకుకూరలు తీసుకుంటే కొంతవరకు సిఫార్సు చేయబడ్డ పరిమాణాన్ని పొందవచ్చు.
  6. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన పెద్దపేగు క్యాన్సర్ను నివారించకలుగుతాయి.

ఎక్కువగా దొరికే ఆకుకూరలు, వాటి పొషక విలువలు:

పాలకూర, గొంగూర, తోటకూర, మెంతికూర, బచ్చలికూర, చుక్కకూర, మునగాకు, సొయ్యకూర, గంగవల్లి కూర, క్యాబేజి, కాలిఫ్లవర్, పొన్నగంటి కూర, కోత్తిమీర, కరివేపాకు, పుదీన.

పేరు

పోషక విలువ

గోంగూర

విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కావున కంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ.

పాలకూర

విటమిన్ ఎ, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందువలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకల సాంద్రతకు ఉపయోగపడుతుంది

బచ్చలి కూర

విటమిన్ ఎ, సి మరియు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. అందువలన రక్తకణాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. రక్తహీనతను నివారిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పొన్నగంటి

విటమిన్ ఎ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని క్రిములని నాశనం చేస్తుంది. ఎముకల బలాన్ని పెంచుతుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది.

చుక్కకూర

విటమిన్ ఎ మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది అందువల్ల గుండె ఆరోగ్యానికి మంచిది

తోటకూర

యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కణాల ఆరోగ్యానికి ఉపయోగకరం. కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల రక్తహీనతను నివారిస్తుంది ఎముకలకు బలాన్నిస్తుంది

మెంతికూర

పీచుపదార్దం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మధుమేహులకు, అధికబరువుకు, గుండె ఆరోగ్యానికి మంచిది. ఇందులొ సెలీనియం ఎక్కువగా ఉండడం వల్ల కాలేయ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

సొయ్యకూర

ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తకణాలు ఎర్పడడానికి ఉపయోగపడుతుంది విటమిన్ ఎ,సి ఎక్కువ ఉండడం వలన రోగనిరోధకశక్తి పెరుగుతుంది జీర్ణశక్తిని పెంచుతుంది.

మునగాకు

అన్ని ఆకుకూరలలో కన్నా దీనిలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి, ఐరన్, కాపర్ కూడా ఎక్కువగా ఉండడం వలన రక్తహీనతను నివారిస్తుంది, ఎముకలకు బలాన్నిస్తుంది.

కోత్తిమీర

యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యవంతమైన కణాల కోసం ఉపయోగపడుతుంది. వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.

కరివేపాకు

బయోటిన్ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు సమ్రక్షణకు మంచిది.అరుగుదల శక్తిని పెంచుతుంది.

పుదీన

యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది చలువ కనుక వేసవి కాలంలో దీన్ని తీసుకోవడం వలన శరీరంలో వేడిని తగ్గిస్తుంది.

గంగవల్లి

ఒమేగ-3 ఫాటీ యాసిడ్ ఎక్కువగా ఉండటం వలన గుండె జబ్బులను దరికి రానివ్వదు. మాంసాహారం తీసుకొనని వారు దీన్ని తినడం వలన గుండె జబ్బులను తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా యాంటి ఆక్సిడెంట్లు ఉండడం వలన ముఖం పై ముడతలు తగ్గుతాయి. పొటాషియం ఎక్కువగా ఉండడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది.

క్యాబేజి

గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వలన మధుమేహులకు మంచిది. ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. కొలైన్ ఎక్కువ ఉండడం వల్ల నరాల బలహీనతలను నివారిస్తుంది.

కాలీ ఫ్లవర్

కాల్షియం ఎక్కువగా ఉంటుంది అందువలన ఎముకలకు, పంటి ఆరోగ్యానికి ఉపకరిస్తుంది.

ఆకుకూరలు వండడం:
ముందుగా కడిగి తరువాత కోయాలి. కోసాక నీళ్ళలో వేస్తే వాటిలొ ఉండే నీటిలో కరిగే బి విటమిన్లు వృధా అయిపోతాయి.

తక్కువ నూనేతొ వండాలి. నూనెలో కరిగే కె విటమిన్ ఉండడం వలన ఎక్కువ నూనె వాడితే అది వృధా అయిపోతుంది.

నీళ్ళు పోయకుండానే , వాటిలో ఊరే నీళ్ళతో ఉడికించాలి.

ఆకుకూరలను పప్పుతో కలిపి వండటం వలన పోషకపదార్థాల సమతుల్యత లభిస్తుంది.

రెండు మూడు రకాల ఆకుకూరలు కలిపి వండటం వలన అన్నిరకాల ఖనిజలవణాలు విటమినులు పొందవచ్చు.

రోగాల బారి నుండి శరీరానికి రోగనిరోధక శక్తినిచ్చే ఖనిజ లవణాలు విటమిన్లు ఉంటాయి  కాబట్టి వీటిని రక్షిత ఆహార పదార్థాలు అంటారు.

ఆధారము: విజ్ఞాన సాధిత.కం

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate