పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

నీటి పారిశుధ్యం

నీటి పారిశుధ్యం

ఉపోద్ఘాతం

నీరు ప్రాణాధారం. మనిషి, మొక్కలు, జంతువులు ఇలా ప్రాణం కలిగిన ప్రతీ జీవికి నీరు కావాలి. నీరు త్రాగడానికే కాకుండా పంటలు పండించడానికి, గృహ అవసరాలకు వివిధ పరిశ్రమలలో అనేక పనులకు అత్యవసరం.
మనం ఉపయోగించే నీరు సురక్షితంగా లేకపోవటం వలన ఎన్నో అనర్థాలు కలుగుతాయి. కలుషిత మైన నీటిని త్రాగడం వలన కలరా, నీళ్ళ విరోచనాలు, వాంతులు, టైఫాయిడ్, నులిపురుగులు, ఫ్లోరోసిస్, కామెర్లు వంటి అనేక ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయి. నీటివనరుల వద్ద మురుగు నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే దోమలు, ఈగలు వంటి కీటకాలు నీటి ఉపరితలం పై గ్రుడ్లు పెట్టి వాటి సంఖ్య అధికమవుతుంది. ఈగల వలన కలరా, వాంతులు, టై ఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి, దోమకాటు వలన మలేరియా, డెంగ్యూ, మరియు ఫైలేరియా బోదకాలు వంటి వ్యాదులుకలుగుతాయి. అందువలన నీరు కాలుష్యం కాకుండా స్వచ్చం గా మరియు సురక్షితం గా ఉండేటట్లు చూసుకోవాలి.

ఆరోగ్యంలో నీటి ప్రాధాన్యత

 • మన శరీరానికి ఆహారం తో పాటు మంచినీరు కూడా ఎంతో అవసరం. నీటిలో ఎటువంటి పోషక పదార్థాలు లేనప్పటికీ జీర్ణ క్రియను మెరుగు పరచడం లో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
 • మన శరీరం లో ఎన్నో పనులను చక్కబెట్టే రక్తం లో 83% వరకు నీరు ఉంటుంది.
 • శరీరం లోని వ్యర్థ పదార్థాలను మూత్రరూపంలో విసర్జించడం లో నీరు ఎంతగానో దోహదపడుతుంది.
 • మనం త్రాగే నీరు శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉంచడంలోనూ ఎంతగానో ఉపకరిస్తుంది. శరీరానికి అవసరమైనంత నీటిని తీసుకోవడం వలన శరీరం లోని జీవక్రియలు మెరుగుపడి శరీరం ఆరోగ్య వంతం గా ఉంటుంది.
 • సాధారణంగా ప్రతి ఒక్కరు కనీసం 2 నుండి 3 లీటర్లు నీటిని తీసుకోవాలి. నీటిని తగినంత పరిమాణం లో తీసుకోకపోవడం వలన మలబద్ధకం, మూత్ర పిండాలలో రాళ్ళు వంటి, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.
 • ఇంత ప్రాధాన్యం ఉన్న నీరు కలుషితం అయితే, అది త్రాగిన వారికి ఎన్నో రకాల వ్యాధులను కలుగజేస్తుంది.

సురక్షితమైన నీరు

నీరు రుచి, రంగు మరియు వాసన లేకుండా, స్వచ్చం గా ఉండి త్రాగినప్పుడు, స్నానం చేసినప్పుడు, వంట చేసినప్పుడు, ఇతర ఏఅవసరాలకు వాడినప్పుడు ఎటువంటి హాని కలుగ చేయకుంటే దాన్ని సురక్షిత మైన నీరు అంటాము.

నీటి కాలుష్యం

కొన్ని సమయాల్లో సహజంగానూ, చాలా సందర్భాలలో మానవుడు నిర్వహించే వివిధ పనుల వల్ల, నీటి వనరులైన బావులు, సరసులు, నదులు, సముద్రాలు, భూగర్భ జలం కలుషితo అవ్వడాన్ని నీటి కాలుష్యం అనవచ్చు. దీనివలన నీటి భౌతిక ,రసాయనిక ధర్మాలలోనూ రంగు, రుచి, వాసనలలోనూ మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు నీటిని సాధారణ ఉపయోగానికి పనికిరాకుండా చేయడమే కాకుండా జీవులకు హాని కలిగిస్తాయి.

నీరు ఎలా కాలుష్యం అవుతుంది

 • సెప్టిక్ ట్యాంక్ మరియు మూత్ర శాలల పైపులు లీక్ అవటం వలన.
 • నీటి వనరు దగ్గరలో మరుగుదొడ్డి, మురికి కాలువ, గొడ్ల సావిడి ఉండటం, బట్టలు ఉతకడం, కలుషితమైన నీరు, బావుల్లోకి, నీటి ఊటలలోకి చేరుట వలన.
 • మురికిగా ఉన్న ప్రాంతాలలో నీరు సేకరించడం వలన
 • పరిశ్రమలలోని రసాయన వ్యర్థాలు భూ గర్భజలంలోకి చొచ్చుక పోవటం వలన
 • వరదల వలన నీటి వనరులలో చెత్త , చెదారం చేరడం వలన
 • నీరు నిల్వ చేసే తొట్లు, పంపులు, బకెట్లు ఇంకా ఇతర పాత్రలపై మూతలు లేకుండా ఉండటం వలన
 • నీటి వనరుల వద్ద అంటే బోరు, బావి వీధి పంపుల వద్ద బట్టలు ఉతకటం, గిన్నెలు కడగటం, స్నానం చేయడం వంటి పనులు చేయడం వలన
 • మంచి నీటి సరఫరా చేసే గొట్టాల ఉపరితలం పై నీటి గుంటలు ఎక్కువకాలం నీరు నిల్వ ఉండటం వలన
 • నీటి మూలాధారం వద్ద చెడిపోయిన పదార్థాలను మరియు పనికి రాని వ్యర్థాలను పడవేయటం వలన, బహిరంగ మల, మూత్ర విసర్జనల వలన
 • వీటి వలన మన కంటికి కనబడని హానికరమైన క్రిములెన్నో నీటిలో చేరుతాయి .

మీ గ్రామంలో నీరు సురక్షితంగా ఉంచుకోవాలంటే

 • ట్యాంకులలో చేరిన చెత్త చెదారాన్ని ముందుగా ఏరి పారవేయాలి .
 • నీరు నిలువ చేసే ట్యాంకులను తప్పనిసరిగా మూతలు ఉండేటట్లు చూసుకోవాలి .
 • ట్యాంకులలో నీటిని ముందుగా ఖాళి చేసి శుభ్రంగా కడిగించాలి.
 • మూడు నేలలకోకసారైన ట్యాంకులను శుభ్రపరచుకోవాలి .
 • ట్యాంకు గోడలను బ్లీచింగ్ పౌడర్ తో అద్దాలి .
 • క్లోరినేషన్ చేయాలి.

త్రాగే నీటిని క్లోరినేట్ చేయడం వలన నీటి ద్వారా వ్యాపించే కలరా ,నీళ్ళవిరేచనాలు ,కామెర్లు ,పోలియో , వంటి అంటువ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. త్రాగే నీటిని శుద్ధి చేయడానికి క్లోరినేషన్ ఉత్తమమైన పద్ధతి. త్రాగే నీటిలో క్లోరిన్ కలపడం వలన హానికరమైన బాక్టీరియాను నశింప చేయవచ్చు .కానీ కొన్ని రకాలైన వైరసులపై మరియు స్పోర్ లపై అధిక మోతాదులో కలిపితే తప్ప, ముఖ్యంగా పోలియో మరియు కామెర్లు వంటి వ్యాధులను కలిగించేవి వాటిపై క్లోరిన్ యొక్క ప్రభావం వుండదు.

క్లోరినేషన్ చేయడానికి సూచనలు

 • క్లోరినేషన్ చేయవలసిన త్రాగు నీరు బురద నీరు కాకుండా తేటగా వుండాలి.
 • త్రాగే నీటి యొక్క క్లోరిన్ డిమాండ్ అంచనా వేయాలి .
 • కాంటాక్టు పీరియడ్ (క్లోరినేషన్ చర్య సమయం )ఒక గంట వుండాలి. అంటే క్లోరిన్ కలిపిన నీటిని ఒక గంట తర్వాతనే వాడాలి .
 • రేసిడ్యువల్ క్లోరిన్ (మిగులు క్లోరిన్ )కనీసం 0.5 మిల్లి గ్రా. /లీటర్ వుండాలి .

క్లోరినేషన్ చేసే పద్ధతి

క్లోరినేట్ చేయవలసిన నీటి ట్యాంకులలో కలపవలసిన బ్లీచింగ్ పౌడర్ మొత్తాన్ని ఒక బకెట్ లో తీసుకుని పలుచని పేస్టుగా తయారు చేసి, బకేట్టులో మూడు వంతుల నీరుపోసి బాగా కలపాలి. పది నిమిషాల తర్వాత ఆ బకెట్టులోని తేట నీరు వేరొక బకేట్టులోకి మార్చి మిగిలిన దానిని పారబోయాలి. లేనిచో ట్యాంకులలోని నీరు కఠినంగా మారుతుంది.నీటి ట్యాంకులలో తేట నీరు ( క్లోరిన్ ద్రావణం) గల బకేట్టు ట్యాంకు మధ్యలో ఉంచి బాగా కలిసేంతవరకు బకేట్టును పైకి కిందకి కలపాలి. బాగా కలపడం వలన క్లోరిన్ ద్రావణం ట్యాంకులోకి నీటిలో పూర్తిగా కలిసిపోతుంది. ఒక గంట తరువాత ఆ నీటిని త్రాగడానికి ఉపయోగించుకోవచ్చు.

త్రాగు నీరు ఇంట్లో సురక్షితం చేసుకొనే పద్దతులు

 • నీటిని ఫిల్టర్ ద్వారా వడగట్టటం
 • బిందె నీటిలో లేదా 20 లీటర్ల నీటిలో 0.5 గ్రాముల క్లోరిన్ బిళ్ళ వేయటం
 • 1000 లీటర్ల నీటిలో 2.5 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ కలపడం
 • నీరు మడ్డిగా , బురదగా ఉన్నట్లయితే అందులో పటిక వేసి కలిపిరెండు గంటల పాటు కదలకుండా ఉంచి మలినాలు అడుగున చేరుకున్న పిదప వడగట్టి కాయడం. పటిక కలిపినా కూడా సాధ్యం కాకపోతే క్లోరిన్ బిళ్ళను కలపాలి. అదే విధంగా మునగ గింజలను కూడా నీటిలో వేయడం వలన నీటిలోని మట్టి అడుగుకు చేరుతుంది.పై నీటిని తేర్చి వాడుకోవచ్చు.
 • చేతులను ముందుగా శుభ్రంగా కడుక్కోని, తరువాత పరిశుభ్రంగా ఉన్న బట్టతో నీటిని వడపోయాలి.
 • నీటిని శుద్ధి చేయడంలో మరిగించడం ఒక మంచి పద్ధతి. ఈ పద్ధతి వలన నీటిలో ఉన్న వ్యాధికారకమయ్యే సూక్ష్మజీవులు చనిపోతాయి.

ఫ్లోరిన్ తీసివేయడం

నీటిలో ఫ్లోరిన్ అనే లవణ శాతం అధికంగా ఉంటే అది ఎముకలను,దంతాలను బలహీనపరిచే ఫ్లోరిసిస్ అనే వ్యాధికి దారి తీస్తుంది. అందువలన యాక్టివేటెడ్ అల్యూమినా ఫిల్టరును ఉపయోగించి నీటిలో నుండి ఎక్కువ ఫ్లోరైడును తొలగించవచ్చు.యాక్టివేటెడ్ అల్యూమినా అనే రసాయనం నీటిలో ఎక్కువ ఉన్న ఫ్లోరైడును తొలగించి నీటిని త్రాగడానికి,వాడుకోవడానికి సురక్షితంగా తయారు చేస్తుంది.


త్రాగే నీటి పట్ల అప్రమత్తత అవసరమైన సందర్భాలు
నీటి సేకరణలో అపరిశుభ్రమైన చేతుల వలన నీరు కలుషితం అవుతుంది.కాబట్టి పంపు లేదా బోరు నుండి నీరు పట్టుకొనేటప్పుడు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరియు నీటిలో చేతులను ముంచకుండా చూసుకోవాలి.

నీటిని తీసుకురావటంలో నీటిని తీసుకువచ్చేటప్పుడు పాత్రలకు మూత పెట్టి తీసుకురావాలి.

నిలువ చేయటంలో నీటిని నిలువ ఉంచే పాత్రలను చాలా శుభ్రంగా ఉంచాలి. నీటిని నిల్వ ఉంచే పాత్రలను నీటిని నింపే ముందు బాగా కడగాలి.ఏ పాత్రలో నీటిని నిల్వ ఉంచుతామో దానిని నీటిని కనీసం పది నిమిషాల వరకు వేడి చేయాలి. నీటిని పిల్లలకు అందుబాటులో లేకుండా త్రాగే నీటి పాత్రను ఎత్తులో ఉంచాలి. మూతను తప్పని సరిగా పెట్టాలి.

శుభ్రంగా వాడటం పాత్రలో చేతులు ముంచకుండా డోంగా లేదా చెంబుతో తీసుకొనే అలవాటు చేసుకోవాలి .లేదంటే కుళాయి ఉండే పాత్రలలో నిలువ చేసుకోవడం మంచిది.


ఆధారం: డాక్టర్.ఎస్.భాగ్యలక్ష్మి,అసిస్టెంట్ ప్రొఫెసర్
కుమారి. ఎ. సౌజన్య, విద్యార్ధి ఐ.డి.నెం.హెచ్.హెచ్.2010/078.

 

2.98924731183
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు