హోమ్ / ఆరోగ్యం / స్త్రీ ఆరోగ్యం / కిశోర బాలికలు - పోషణ
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

కిశోర బాలికలు - పోషణ

కిశోర లేక కౌమార దశలో పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. పెద్దయ్యాక ఉండే బరువులో 50%, ఎత్తులో 20% ఇప్పుడే పెరుగుతారు.

కిశోర బాలికలు - పోషణ

కిశోర లేక కౌమార దశలో పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. పెద్దయ్యాక ఉండే బరువులో  50%, ఎత్తులో 20% ఇప్పుడే పెరుగుతారు. జీవితంలోని అన్ని దశల్లో కంటే ఈ దశలో చలాకీగా ఆడుతూ, పాడుతూ, పరుగులు తీస్తూ, గంతులు వేస్తూ చురుకుగా ఉంటారు. కనుక పోషక పదార్థాల అవసరం కూడా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండడానికి అవసరమయ్యే పోషక పదార్థాలు మనం తినే  ఆహారం ద్వారా  వస్తాయి. కాబట్టి అన్ని పోషక పదార్థాలు కలిగిన ఆహారం తీసుకోవాలి.

ప్రధానం గా పోషక పదార్థాలు  శరీరంలో మూడు  ముఖ్య విధులు నిర్వహిస్తాయి .

 1. శక్తినివ్వడం
 2. పెరుగుదలనివ్వడం
 3. రక్షణనివ్వడం

కాబట్టి ఏ ఏ రకమైన ఆహార పదార్ధం  ఏ విధిని నిర్వహిస్తుందో తెలుసుకోవడం చాలా  ముఖ్యం.

విధి

శక్తినివ్వడం

పెరుగుదలనివ్వడం

రక్షణనివ్వడం

ఆహార పదార్థాలు

ధాన్యాలు , చిరు ధాన్యాలు, నూనెలు, నెయ్యి , పంచదార, బెల్లం

పప్పులు, పాలు, మాంసం

ఆకుకూరలు , కూరగాయలు, పండ్లు .

పోషక పదార్థాలు

పిండి పదార్థాలు, క్రొవ్వులు .

మాంస కృత్తులు

ఖనిజ  లవణములు , విటమినులు.

శరీరానికి  అవసరమైన  మొత్తం  శక్తి పిండి పదార్థాల  నుండి  60-70% వరకు, మాంస కృత్తుల  నుండి  15% వరకు, మిగిలిన 10% క్రొవ్వు పదార్థాల నుండి వస్తుంది . శరీరానికి కావలసిన పోషకాలు  పై  మూడు   వర్గాల ఆహార పదార్థాలను సమ పాళ్ళలో తీసుకున్నపుడే లభ్యమవుతాయి. దీనినే సమతుల ఆహారం అంటారు.

కౌమార దశ ఆడ పిల్లల సమతుల ఆహార నమూనా పట్టిక

ఆహర పదార్థం

వయస్సు

10-12

13-15

16-18

ధాన్యాలు

300 గ్రా

400 గ్రా

350 గ్రా

పప్పు ధాన్యాలు

60 గ్రా

70 గ్రా

150 గ్రా

ఆకుకూరలు

100 గ్రా

100 గ్రా

150 గ్రా

దుంపలు

75 గ్రా

150 గ్రా

150 గ్రా

పండ్లు

50 గ్రా

30 గ్రా

30 గ్రా

పాలు

250 మీ.లి

250 గ్రా

40 గ్రా

పంచదార , బెల్లం

50 గ్రా

40 గ్రా

40 గ్రా

పల్లీలు

30 గ్రా

40 గ్రా

30 గ్రా

ముఖ్యమైన  పోషక పదార్థాలు - విధులు

పోషక పదార్థాలు

విధులు

పిండి పదార్థాలు

 • శరీరానికి కావలసిన శక్తి 70-80% వరకు పిండి పదార్థాల ద్వారా  లభ్యమవుతుంది .

మాంస కృత్తులు

 • కొత్త కణాలను తయారు చేయటానికి, కృశించిన కణాలను తిరిగి తయారు చేయడానికి,  ఎంజైములు, హార్మోనులు స్రవించడానికి ఇంకా ఇతర రక్షణకు తోడ్పడే పదార్థాల తయారికి మాంస కృత్తులు కావాలి.
 • కండరాలు, రక్తం వంటి శరీర ద్రవాల నిర్మాణానికి కూడా మాంసకృత్తులు కావాలి.

క్రొవ్వు పదార్థాలు

 • శరీరానికి కావలసిన శక్తి 10-15% వరకు నూనెల  నుండి లభ్యమవుతుంది.
 • కొన్ని విటమినులకు క్రొవ్వులలో  కరిగే స్వభావం వుంటుంది. అటువంటి  క్రొవ్వులో  కరిగే విటమినులు శోషణకు ,రవాణాకు  ఉపయోగపడతాయి.
 • ముఖ్యమైన అవయవాలకు  రక్షణ ఉంచటమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
 • అవసరమైన ఫాటియాసిడ్లను సరఫరా చేస్తాయి.

ఖనిజ లవణములు

 • రక్తానికి  ఎరుపు రంగు, ఎముకలు  పెరుగుదలకు, కండరాల సంకోచానికి, నరాలు ఉద్దేపనం చెందడానికి, శ్వాసక్రియ వంటి ముఖ్యమైన జీవక్రియలకు  చాలా అవసరం.

ఇనుము

 • కణాలకు  ఆక్సిజన్ అందజేసే హిమోగ్లోబిన్ తయారు చేసేందుకు  ఉపయోగపడుతుంది.
 • ఆక్సీకరణ  చర్యలకు ముఖ్యమైనది.
 • కండరాలలోని  మయోగ్లోబిన్ తయారికి ఉపయోగపడుతుంది.

కాల్షియం

 • ఎముకలు, దంతాల నిర్మాణానికి, రక్తం గడ్డ కట్టడానికి, కండరాలు, నరాలు సాధారణంగా ప్రతిస్పందించడానికి, గుండె కండరాల సంకోచానికి, వ్యాకోచానికి ఉపయోగ పడుతుంది.

అయోడిన్

 • థైరాయిడ్ గ్రంధి స్రవించే థైరాక్సిన్ హార్మోనులో అయోడిన్ ఒక ముఖ్య భాగం. ఈ గ్రంధి సక్రమంగా పనిచేసేందుకు అయోడిన్ చాల అవసరం. పిల్లలు సరిగ్గా పెరగడానికి ,వారి శారీరక మానసిక అభివృద్ధికి ఈ థైరాయిడ్ గ్రంధి అవసరం.
 • థైరాక్సిన్ అనే హార్మోన్ మన శరీరం ప్రాణ వాయువును ఉపయోగించుకునే రేటును నిర్ణయించుతుంది.

విటమిన్లు

విధులు

విటమిను ఎ

 • కళ్ళు, చర్మం, మ్యుకస్, (శ్లేష్మము) పొర ఆరోగ్యంగా ఉండేందుకు, తక్కువ వెలుతురులో చూచే శక్తిని కలిగి ఉండేందుకు, అంటు రోగాల నుండి  రక్షణకు చాల ముఖ్యమైనది.
 • చర్మం మృదువుగా ఉండడానికి ఉపయోగపడుతుంది.

విటమిను బి

 • పోషక పదార్థాలు శరీరం లో శోషణ చెందిన తరువాత ,శరీరం వాటిని ఉపయోగించుకోవటానికి బి విటమిన్ చాలా అవసరం.
 • శరీరంలోని ముఖ్య అవయవాలైన గుండె, మెదడు, నరాలు, కళ్ళు, జీర్ణావయవాలు ఆరోగ్యం గా పనిచేసెందుకు బి విటమిను చాలా అవసరం.
 • రక్తం లోని ఎర్ర రక్త కణాల తయారికి ఫోలిక్ యాసిడ్  ,విటమిన్ బి12 చాలా అవసరం.

విటమిను సి

 • దంతాలు ,చిగుళ్ళు, రక్తనాళాల సంరక్షణకు , గాయాలు , పుండ్లు త్వరగా మానటానికి, అంటువ్యాధుల నుండి రక్షణకు విటమిన్ సి అవసరం .

విటమిను డి

 • ఎముకల నిర్మాణానికి, కాల్షియం అనే ఖనిజ లవణం శోషణకు, దానిని ఉపయోగించుకోవటానికి ఉపయోగ పడుతుంది.
 • ఫాస్పరస్ ను గ్రహించి నిలువ చేయుటకు ఉపయోగపడుతుంది.

విటమిను ఇ

 • అండాశయం విధి నిర్వాహణకు ,చర్మం మృదువుగా ఉండటానికి ఉపయోగపడుతుంది .

విటమిను కె

 • రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది

కార్బోహైడ్రేట్లు, తగినన్ని కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నీ అందించే ఆహారం తీసుకోవడంవల్ల యుక్త వయసులో ఎదుగుదల, దృఢమైన శరీరం, రోగ నిరోధక శక్తి చక్కగా ఉంటాయి. ఎముకల బలానికి క్యాల్షియం రక్తహీనత రాకుండా ఐరన్ కాపాడుతుంది. కాబట్టి వీరి భోజనంలో అన్నంతో పాటు పప్పు, ఆకు కూరలు, కూరగాయలు, గుడ్లు, మితంగా మాంసాహారం, పాలు, పెరుగు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. పరిమితంగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. బయట జంక్ఫుడ్స్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఈ తిండివల్ల అధిక బరువు, దానితో పాటు రుతుక్రమంలో తేడాలు వస్తాయి. కొంతమంది ఆడపిల్లలు సన్నగా నాజూగ్గా కనబడాలని, తిండి తినడం చాలా తగ్గించేస్తుంటారు. దీనివల్ల శరీరంలో ప్రతి అవయవం బలహీనంగా తయారవుతాయి. యోగ, మెడిటేషన్ వంటివి చేయటం వల్ల వీరిలో శారీరక, మానసిక వృద్ధి కలుగుతుంది. ఫలితంగా ఆత్మవిశ్వాసం పెరిగి, పాజిటివ్ ధృక్పథంతో ముందుకు వెళతారు.

కిశోర బాలికలు- రక్త హీనత

కౌమార దశలో సాధారణంగా వచ్చే పౌష్టిక లోపవ్యాధి రక్త హీనత. దీనిని హీమోగ్లోబిను తక్కువగా ఉండడాన్ని బట్టి గుర్తిస్తారు. మన శరీరానికి ఇనుము అత్యంత అవసరమైన ధాతువు. రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ తయారికి ఇనుము వినియోగమవుతుంది. హిమోగ్లోబిన్ మనం పీల్చే గాలిలోని ప్రాణవాయువును ఉపిరి తిత్తుల నుండి శరీరం లోకి ప్రతి కణానికి చేర వేస్తుంది. శరీరం లోని ఏ భాగం పని చేయాలన్నా ఆక్సిజన్ చాల అవసరం.

పురుషులకు ఉండవలసిన నార్మల్ హిమోగ్లోబిన్ స్థాయి 14.4-16.5 గ్రాముల శాతం.

స్త్రీలకు ఉండవలసిన నార్మల్ హిమోగ్లోబిన్ స్థాయి 12.5-14.5 గ్రాముల శాతం

రక్త హీనతకు కారణాలు

 1. పౌష్టికాహార లోపం
 2. కొంకి పురుగులు జీర్ణ వ్యవస్థలో వుండడం
 3. దీర్ఘకాలిక విరేచనాల వలన ఆహారంలోని పౌష్టికాలు సరిగ్గా శరీరంలో చేరకపోవడం .
 4. తరచుగా మలేరియా రావటం వలన ఎర్రరక్త కణాలు విచ్చిన్నమవడం .
 5. కౌమార బాలికలు నాజుకుగా, సన్నగా ఉండటం ఫాషన్ గా భావిస్తూ లావైపోతానేమో అనే భయంతో సరిపడా తినకపోవడం.
 6. రుతు స్రావం ఎక్కువగా అవడం.

రక్త హీనత లక్షణాలు

 1. మందగొడిగా ఉండడం.

 2. పాలిపోయి ఉండడం.

 3. త్వరగా నీరసపడి,అలసిపోవడం.
 4. దేనిమీదా శ్రద్ధ, ఆసక్తి లేకపోవడం.
 5. కొద్ది శ్రమకే ఉపిరి అందనట్లవడం.
 6. గుండె వేగంగా కొట్టుకోవడం.
 7. చికాకుగా ఉండడం.

 8. మానసిక అస్థిరత.
 9. ఎప్పుడూ నిద్రపోవడం.

 10. ఆకలి మందగించడం.
 11. తలపోటు.
 12. ఏ పని చెయ్యలేకపోవడం.
 13. కళ్ళు, నోరు, నాలుక పాలిపోయి ఉండడం.
 14. గోళ్ళు పాలిపోవడం, సొట్టలు పడడం.

తీవ్ర రక్త హీనత లక్షణాలు

 1. ఆయాసం.
 2. అలసట.
 3. జుట్టు రాలిపోవడం.

 4. కాళ్ళు, చేతులు, ముఖం వాయడం.

పై లక్షణాలతో పాటు రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని రక్త పరీక్ష ద్వా రా తెలుసుకొని రక్త హీనత ఉన్నదీ, లేనిదీ నిర్ధారణ చేయవచ్చు .

రక్త హీనతను నివారించటం

 • సమతుల ఆహారం తినాలి.

 • ఇనుము ఎక్కువగా ఉన్న మునగ కాయలు , చిలగడ దుంప, గుమ్మడి, బెల్లం, లివరు, మాసం, గుడ్డు, ఖర్జూరం, బొప్పాయి, తృణ ధాన్యాలు, మాంస కృత్తులు ఎక్కువగా ఉండే పప్పులు మొదలైన వాటిని తినాలి.

 • పరిశుభ్రత పాటించాలి, మల విసర్జన తరువాత, ప్రతిసారి ఆహారాన్ని తినే ముందు సబ్బు తోను, నీటి తోనూ చేతులని కడుక్కుంటే జీర్ణ వ్యవస్థలో కొంకి పురుగులు చేరవు.

ముఖ్యంగా ఇంట్లో మరుగు దొడ్డి సౌకర్యం లేక బహిరంగ ప్రదేశంలో మలవిసర్జన చేయవలసిన పరిస్థితి వున్నపుడు కొంకి పురుగులు పాదాలకు అంటుకుని జీర్ణ వ్యవస్థ లోకి చేరతాయి. తప్పకుండా చెప్పులు వేసుకొని వెళ్ళాలి. ఎప్పటికప్పుడు గోళ్ళను కత్తిరించుకోవడం ద్వార గోళ్ళ క్రింద మట్టి, కొంకి పురుగుల గ్రుడ్లు చేరి ఆహారంతో కలిసి కడుపులోకి వెళ్లడాన్ని నివారించవచ్చు.

కిశోర వయస్సులో లోప పోషణ- స్వయం కృతాపరాధం

మొదటి అపరాధం

కొందరు అమ్మాయిలు తమ శరీరం లో అధిక క్రొవ్వులు ఉన్నట్లుగా తప్పు అంచనాలు వేసుకుని, తమ శరీర సౌష్టవం అందంగా వుండడానికి ఉన్న శరీరాకృతిని సవరించుకోవడానికి నియమాలతో భోజనాన్ని మానెయ్యడం లేదా తగ్గించడం చేస్తుంటారు. తిన్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా విరోచనాలు కలిగించే మందులను వాడి బయటికి పంపే ప్రయత్నం చేస్తారు. దీనినే అనేరోక్సియా నేర్వోసా అంటారు.

రెండవ అపరాధం

తాము చాలా బరువెక్కుతున్నట్లుగా భావించుకుంటారు. అధిక ఆకలి వలన తీసుకున్న ఆహారాన్ని వాంతి చేసుకోవడం లేదా విరోచనం చేసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవాలని చేస్తుంటారు. దీనిని బులీమియా నెర్వోసా అంటాం.

ఇందువలన శరీర సహజ పోషకాహార స్థితి దెబ్బతిని వివిధ రకాల పోషణ లోపాలు ప్రారంభమౌతాయి. అందులో ముఖ్యమైనవి,

 1. రక్త హీనత
 2. ఎముక బోలుతనం
 3. విటమినుల లోపాలు

లక్షణాలు

 1. మోచేతులపై చర్మం గజ్జి గా ఉండడం .
 2. దంత సమస్యలు

 3. నీరసం
 4. ఋతుచక్రం క్రమం తప్పడం.
 5. తక్కువగా తినడం , తిన్నవెంటనే వ్యాయామం చేయటం .
 6. కౌమార దశ త్వరగా పూర్తి కావడం.
 7. శరీర బరువు ఉండవలసిన బరువు కంటే చాల తక్కువగా ఉండటం.
 8. తమకుతాముఅధికబరువు , ఊబకాయస్తులుగా ఊహించుకోవడం
 9. అసాధారణం గా బరువు తగ్గడం.
 10. శరీర బరువును గురించి ఎక్కువగా ఆలోచించడం .
 11. ఆత్మనూన్యతా భావం .
 12. కాళ్ళు చేతులు సన్నగా పుల్లల్లాగా ఉండటం.
 13. తల వెంట్రుకలు ఎరుపు రంగులో ఉండటం, చేతులు, కాళ్ళు మరియు గడ్డంపై సన్నని పల్చని ఎరుపు రంగు వెంట్రుకలు ఉండటం.

 14. త్వరగా అలసిపోవడం.
 15. ఉద్వేగాలు మారుతూ ఉండడం.

ఇలాంటి సమస్యలతో బాధ పడుతున్న కిశోర బాలికలకు వైద్యపరమైన ,ఆహారపరమైన సూచనలివ్వడమే మంచి చికిత్స. పై లోపాలను గుర్తించిన వెంటనే నిపుణులను సంప్రదించడం మరచిపోకండి.

ఇతర సమస్యలు

అధికంగా తినటం

ఆకలిగా లేక పొయినప్పటికీ అధికంగా ఆహారాన్ని భుజించడం, అందువలన ఉత్పన్నమయ్యే అధికబరువు (లేదా) ఊబకాయాన్ని తగ్గించుటానికి అధికంగా వ్యాయామం చేయడం వంటివి చేస్తారు. దీనివలన మధుమేహం, రక్తపోటు, ఎముకలు గుల్లబారటం మొదలైన ప్రధాన సమస్యలు ఉత్పన్నమౌతాయి.

ఎముకలు గుల్లబారుట

అతిగా వ్యాయామము చేయటము ,అధికమైన పిచు పదార్థాలు ,అతి తక్కువ నూనెలు మరియు పాలు తీసుకోవటం. వలన శరీరం లోని ఈ స్ట్రోజెను హార్మోను తక్కువ అవుతుంది. దీనివలన, అసంబద్దమైన ఋతు చక్రం కలుగుతుంది, ఎముకలలోని కాల్షియం తగ్గి గుల్లబారుతాయి.

ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోం

బహిష్టుమొదలయ్యే 6-7 రోజుల ముందు శరీరబరువుపెరుగుట, కడుపు ఉబ్బరంగా ఉండటం, రొమ్ములోనొప్పి, మలబద్దకం, కాళ్ళు, చేతులువాపు,తలనొప్పి,చిరాకు, ఆత్మానూన్యతాభావం, అలసట, ఏకాగ్రతలోపం, అతిగాఆకలి, తీపి (లేదా) ఉప్పుతోకూడిన ఆహారము పట్ల మక్కువ మొదలగులక్షణాలు కల్గిఉండడం.

3.10714285714
సుమన్ Oct 08, 2018 07:26 PM

అసలు కిషోర్ బలకుల వయసు ఎంత

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు