অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

స్త్రీలలో మధుమేహం

ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమిటి ఉన్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము. ఇప్పుడు స్త్రీలలో మధుమేహం గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం! క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.


ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని సమాజాల్లో, అన్ని జాతుల్లోనూ కూడా స్త్రీలో మధుమేహం తక్కువనే గట్టి నమ్మకం ఉండేది. మన దేశంలో కూడా మధుమేహ బాధితులపై జరిగిన చాలా సర్వేల్లో ప్రతి ముగ్గురు పురుషులకు ఒక స్త్రీ (3:1) ఉంటున్నట్టు గుర్తించేవారు. కానీ గత 20, 30 ఏళ్లలో ఈ నమ్మకాలు పూర్తిగా పటాపంచలు అయిపోయాయి. మొట్టమొదటగా సూరినామ్‌, గయానా వంటి దక్షిణ అమెరికా దేశాల్లో భారతీయ సంతతికి చెందిన స్త్రీలలో మధుమేహం ఎక్కువగా ఉంటోందని గుర్తించారు. అయితే దీన్ని మన దేశంలోని స్త్రీలకు ఎంత వరకూ అన్వయించవచ్చన్న సందేహాలు ఉండేవి. కానీ క్రమేపీ మలేషియా, ఫిజీ వంటి దేశాల్లో జరిగిన అధ్యయనాల్లో కూడా భారత సంతతి స్త్రీలలోనే ఎక్కువగా కనబడుతోందని గుర్తించారు. ఎందుకిలా అన్నదానిపై చాలా చర్చలు జరిగాయి. భారతీయ సంతతి స్త్రీలు బరువు ఎక్కువగా, లావుగా ఉండటం ఒక కారణమన్న వాదన ఉంది. ముఖ్యంగా ఎత్తుకు తగ్గ బరువు కంటే ఎక్కువ ఉండటం, అలాగే తుంటి-నడుము నిష్పత్తి కూడా వీరిలో ఎక్కువగా ఉండటం ఒక సమస్య. పురుషుల కంటే స్త్రీలు లావు, బరువు పెరగటానికి కారణమేమిటో కచ్చితంగా చెప్పలేంగానీ హార్మోన్ల పాత్ర, ఆహారంలో కొవ్వుల పాత్ర కీలకమని భావించాల్సి ఉంటుంది. కారణమేదైనా మన దేశంలో కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్న సర్వేల్లో- పురుషుల్లో మధుమేహం ఏ స్థాయిలో ఉంటోందో స్త్రీలలోనూ అంతే ఉంటోందని స్పష్టంగా వెల్లడవుతోంది. కొన్నిప్రాంతాల్లో అయితే స్త్రీలలో కొంత శాతం ఎక్కువగా ఉంటోందని కూడా గుర్తిస్తున్నారు. వైద్యం విషయంలో స్త్రీలు తోసేసుకు తిరుగుతుండటం, కొంత తాత్సారం చెయ్యటం, ఆరోగ్య స్పృహ, శ్రద్ధ కొరవడటం తదితర కారణాల వల్ల మధుమేహం కారణంగా స్త్రీలలో దుష్ప్రభావాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ మధుమేహ ఫెడరేషన్‌ వంటి అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా ఇప్పుడు స్త్రీలలో వచ్చే మధుమేహాన్ని ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. లక్షణాలు, చికిత్సల విషయంలో వీరికంటూ ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టంగా పేర్కొంటున్నాయి.

చిన్నవయసులోనే మధుమేహం బారినపడే ఆడపిల్లలకు సహజంగానే యుక్తవయసులో, గర్భధారణ సమయంలో చాలా ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వీరిలో తలెత్తే అవకాశం ఉన్న సమస్యలు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. గర్భనిరోధక పద్ధతుల విషయంలో కూడా వీరిని కొంత ప్రత్యేకంగా గుర్తించక తప్పదు. ఇవి కాకుండా మధ్యవయసులో కూడా మధుమేహం కారణంగా స్త్రీలలో కొన్ని రకాల సమస్యలు ప్రత్యేకంగా కనబడుతుంటాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి రుతుక్రమం అస్తవ్యస్తం కావటం, తరచూ తెల్లబట్ట, ఎటువంటి లక్షణాలూ లేకుండానే ప్రమాదాలు తెచ్చిపెట్టే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు.. ఇవన్నీ కీలకమైనవే. అరుదుగా కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వీరిలో ఎక్కువ. అందుకే వీటి గురించి స్త్రీలంతా అవగాహన పెంచుకోవటం చాలా అవసరం.

పురుషుల కంటే స్త్రీలలో ఐదేళ్ల ముందే మధుమేహం వస్తున్నట్టు గుర్తించారు. జీవితంలో త్వరగా మధుమేహం బారినపడటం, ఎక్కువగా దుష్ప్రభావాలకు గురవుతుండటం, వాటిలో కూడా మెదడు సంబంధ సమస్యలు ఎక్కువగా కనబడుతుండటం.. స్త్రీల విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశాలు.

తెల్లబట్ట
మధుమేహ స్త్రీలలో చాలా తరచుగా, ఎక్కువగా కనబడే సమస్య.. జననాంగ ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు. వీరిని క్యాండిడియాసిస్‌ అనే సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. దీని ప్రధాన లక్షణాలు- దురద, తెల్లమైల. తెలుపు పెరుగులా, తరకలు తరకలుగా కనబడుతుంది. దుర్వాసన. పొత్తికడుపులో నొప్పి, నడుంనొప్పి కూడా ఉంటాయి. వైద్యులు స్పెక్యులమ్‌తో పరీక్షించి 'క్యాండిడియాసిస్‌'ను తేలికగానే గుర్తుపడతారు. అవసరమైతే ఇతరత్రా పరీక్షలు చేయిస్తారు. నిజానికి చాలామందిలో క్యాండిడియా ఇన్‌ఫెక్షన్‌తోనే మధుమేహం బయటపడుతుండటం గమనార్హం. దీనికి యాంటీఫంగల్‌ మాత్రలు, అవసరమైతే జననాంగంలో అమర్చే మాత్రలు ఇస్తారు. కొన్నిసార్లు ఇది మందులకు లొంగదు. ఇది మధుమేహుల్లో మరీ ఎక్కువ. వీరికి మరింత సమర్థవంతమైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇతరత్రా సమస్యలకు యాంటీబయోటిక్స్‌ వాడుతున్న వారిలో క్యాండిడియాసిస్‌ వచ్చే అవకాశం ఎక్కువ. కొందరికి క్యాండిడియాసిస్‌ తరచుగా వస్తుంటుంది. వీరికి కల్చర్‌ పరీక్ష చేసి. ఫంగస్‌ ఎక్కడెక్కడ పెరుగుతోంది? ఏ మందుకు లొంగుతుంది? వంటివి తెలుసుకుని, దాన్నిబట్టి మందులను ఇస్తారు.

క్యాన్సర్‌ కార్పస్‌ సిండ్రోమ్‌
30-60 ఏళ్ల వారిలో. వూబకాయం - మధుమేహం - అధికరక్తపోటు - జన్యుపరమైన అంశాలు - రక్తసంబంధీకుల్లో క్యాన్సర్లు - ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ స్థాయులు ఎక్కువగా ఉండటం. ఇవన్నీ క్రమంగా పెరుగుతుంటాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే చివరికి గర్భాశయ క్యాన్సర్‌, అండాశయ క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌, కాలేయ క్యాన్సర్‌ వంటి వాటికి దారితీయొచ్చు. ఈ నాలుగు క్యాన్సర్లు ఈస్ట్రోజెన్‌తో సంబంధం ఉన్నవేనని గుర్తించటం అవసరం. యుక్తవయసులో అండాశయాల్లో నీటితిత్తులు ఎక్కువగా ఉండే పీసీవోడీ. మధ్యవయసులో నెలమధ్యలో ఎరుపు కనబడుతుండే డీయూబీ.. 40ల్లో గర్భాశయంలో ఫైబ్రాయిడ్‌ కణితులు, ఎండోమెట్రియాసిస్‌.. 60ల్లో ఎండోమెట్రియోసిస్‌ క్యాన్సర్‌.. ఇవన్నీ ఒక చట్రంలా వస్తుండే సమస్యలు. వీటన్నింటినీ వేరుగా చూడలేం. కాబట్టి 30-60 ఏళ్ల మధుమేహ స్త్రీలు మధుమేహ పరీక్షలతో పాటు ఏటా పాప్‌స్మియర్‌, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, మామోగ్రఫీ కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. బరువును నియంత్రించుకోగలిగితే తీవ్ర సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

ఒంటి మీద ఫంగస్‌ ఇన్ఫెక్షన్లు
ఒంట్లో తేమ ఎక్కువగా ఉన్న వారికి ఫంగల్‌ ఇన్ఫెక్షన్ల సమస్య చాలా ఎక్కువ. గ్లూకోజు ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇంకా ఇతరత్రా సమస్యలు కూడా చాలా ఉంటాయి. దీనివల్ల వీరిలో అన్ని రకాల ఫంగల్‌ ఇన్ఫెక్షన్లూ ఎక్కువ. మ్యుకర్‌మైకోసిస్‌ వంటి ఇన్ఫెక్షన్త్లెతే కేవలం మధుమేహుల్లోనే కనబడతాయి. కాబట్టి ఒంటి మీద తేమ ఎక్కువగా లేకుండా కాలి వేళ్ల మధ్యలో, చంకల్లో, గజ్జల్లో ఎక్కడైనా, చీర ముడతల్లో గానీ తేమ లేకుండా చూసే డస్టింగ్‌ పౌడర్‌ వేసుకోవటం అవసరం. క్లోట్రైమజోల్‌, నిస్టాటిన్‌, కీటొకొనజోల్‌, ఫ్లూకొనజోల్‌ వంటి యాంటీఫంగల్‌ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఏదో ఒకటి రెండు రోజుల చికిత్సలతో తగ్గేవి కావు. దీర్ఘకాలిక చికిత్స తీసుకోవటం తప్పనిసరి.
మధుమేహం తెచ్చిపెట్టే నానా దుష్ప్రభావాలూ దరి జేరకూడదనుకుంటే.. వాటి బెడద మనకు వద్దనుకుంటే.. మనం చెయ్యగలిగింది ఒక్కటే! దాన్ని కచ్చితంగా అదుపులో ఉంచుకోవటం! జీవితం అదుపు తప్పకుండా.. అటూఇటూ బెసిగిపోకుండా.. ఎన్నడూ నిర్లక్ష్యం వహించకుండా.. ఎక్కడా తేలికగా తీసుకోకుండా.. మధుమేహాన్ని కచ్చితంగా, ఇంకా చెప్పాలంటే కఠినంగా నియంత్రణలో ఉంచుకోవటం ఒక్కటే సరైన మార్గం.

పక్షవాతాలెక్కువ!

మన దేశంలో నిర్వహించిన సర్వేల్లో మధుమేహ పురుషుల్లో కంటే మధుమేహ స్త్రీలలో పక్షవాతం సమస్యలు అధికమని వెల్లడైంది. కారణాలేమిటో కచ్చితంగా చెప్పలేకపోయినా- మధుమేహ పురుషుల్లో గుండె జబ్బులు ఎక్కువగానూ, స్త్రీలలో మెదడుకు సంబంధించిన పక్షవాతం తరహా సమస్యలు ఎక్కువగానూ కనబడుతున్నాయి.
ఏ బాధలూ లేని మూత్ర ఇన్‌ఫెక్షన్లు

మహిళలు మధుమేహం
మధుమేహుల్లో పైకి ఎలాంటి బాధలూ లేకుండానే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఉండే అవకాశం చాలా ఎక్కువ. సాధారణ స్త్రీలలో ఈ ఇన్ఫెక్షన్లు 10% ఉంటే.. మధుమేహుల్లో 30% వరకూ కనబడతాయి. దీన్నే 'ఎసింప్టమాటిక్‌ బ్యాక్ట్రీయూరియా/పయూరియా' అంటారు. సాధారణంగా స్త్రీలలో మూత్రంలో చీముకణాలు 10 వరకూ ఉన్నా అది సహజమేనన్నట్లు వదిలేస్తారు. అలాగే స్త్రీల బ్యాక్టీరియా ఎక్కువగా కనిపించినా వైద్యులు కొంత వరకూ ఫర్వాలేదు, సహజమేనని వదిలేస్తారు. ఎటువంటి లక్షణాలూ లేవు కాబట్టి దీన్ని వదిలెయ్యటం ఒక అలవాటుగా వస్తోంది. అయితే దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యటానికి లేదని, దీనికి కచ్చితంగా చికిత్స చెయ్యటం అవసరమని అధ్యయనాలన్నీ చెబుతున్నాయి. సాధారణంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఉంటే- చలితో కూడిన జ్వరం, మూత్రంలో మంట, తరచుగా వెళ్లాల్సి రావటం, పొత్తికడుపు వెనక భాగంలో నొప్పి వంటి లక్షణాలుంటాయి. కానీ మధుమేహ స్త్రీలలో ఇవేవీ ఉండకపోవచ్చు. మధుమేహుల్లో నాడీమండల సమస్యల వల్ల (అటనామిక్‌ న్యూరోపతి) ఇటువంటి రక్షణ స్పందనలు కరవు అవుతాయి. కాబట్టి మధుమేహులకు మూత్రపరీక్షలో చీముకణాలు ఏ మాత్రం ఉన్నా కూడా తప్పనిసరిగా చికిత్స చెయ్యాలి. ముఖ్యంగా- ఇవి కల్చర్‌ పరీక్షల్లో బయటపడకపోవచ్చు. కాబట్టి ఎటువంటి అనుమానం వచ్చినా సాధారణ మూత్రపరీక్షే కీలకం.

* మధుమేహం అదుపులో పెట్టుకోవటంతో పాటు సాధారణ అవసరాల కంటే ఒకటిరెండు లీటర్ల నీరు ఎక్కువగా తాగాలి. కొందరికి సోడాసిట్రా/సిట్రాల్కా వంటి టానిక్కుల ద్వారా మూత్రంలో క్షార స్వభావం పెంచేందుకు ప్రయత్నిస్తారు. దీనివల్ల మూత్రంలో ఆమ్లతత్వం తగ్గి.. బ్యాక్టీరియా పెరుగుదల నిరోధమవుతుంది. మధుమేహులు వైద్యుల సలహా మేరకు దీన్ని వాడుకోవాలి. మూత్రాశయం గోడల్లో ఉండిపోయే ఇన్ఫెక్షన్లు కొద్దిరోజుల్లో పోయేవి కావు. అందుకోసం ఈ జాగ్రత్తలన్నీ దీర్ఘకాలం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది.

* ఎటువంటి లక్షణాలూ లేకుండా కేవలం మూత్రంలో చీముకణాల వంటివే కనబడుతుంటే దీర్ఘకాలం మధుమేహాన్ని నియంత్రించుకోవటం ద్వారా తగ్గించుకోవచ్చు. కానీ ఒకసారి లక్షణాలు కనబడితే మాత్రం.. అంటే చలితో జ్వరం, పొత్తికడుపులో నొప్పుల వంటి సమస్యలు తలెత్తుతుంటే- కచ్చితంగా శక్తిమంతమైన యాంటీబయాటిక్స్‌, అవసరమైతే ఇంజక్షన్ల రూపంలో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమంటే- ఈ ఇన్ఫెక్షన్‌ వల్ల రక్తంలో గ్లూకోజు పెరుగుతుంటుంది, మరోవైపు గ్లూకోజు పెరిగిన కొద్దీ ఇన్ఫెక్షన్లూ పెరుగుతుంటాయి. కాబట్టి.. ఈ రెంటికీ ఏకకాలంలో కచ్చితమైన చికిత్స ఇవ్వటం అవసరం. ఇలా కచ్చితమైన చికిత్స తీసుకోకపోతే ఇన్ఫెక్షన్లు రక్తంలోకి చేరిపోయి తలెత్తే తీవ్రమైన 'సెప్టిసీమియా' సమస్య స్త్రీలలో ఎక్కువగా కనబడుతోంది. ఇది చాలా ప్రమాదకరమైన సమస్య. కాబట్టి మూత్రంలో ఇన్ఫెక్షన్లను.. లక్షణాలు ఉన్నా, లేకున్నా కూడా కచ్చితంగా చికిత్స తీసుకోవటం అవసరమని అంతా గుర్తించాలి. పైగా మూత్ర వ్యవస్థలో కింది నుంచి ఇన్ఫెక్షన్లు క్రమేపీ పైకి పాకి.. (రెట్రోగ్రేడ్‌ ఇన్ఫెక్షన్‌) కారణంగా కిడ్నీలు దెబ్బతినిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యటానికి లేదు.

* మధుమేహ స్త్రీలలో మూత్రం ఆపుకోలేని సమస్య రెండున్నర రెట్లు ఎక్కువ. మధుమేహం కారణంగా సంభవించే కండర క్షీణత, వాటి పనితీరు మందగించటం దీనికి కారణం కావచ్చని భావిస్తున్నారు.

పొత్తికడుపులో నొప్పి
మలమధుమేహ స్త్రీలలో కనిపించే మరో ముఖ్యమైన సమస్య 'పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌'. ఇందులో పొత్తికడుపులో ఎక్కడైనా ఇన్‌ఫెక్షన్‌ ఉండొచ్చు. ఇది గర్భసంచీ నుంచి, అండాశయాల నుంచి లోపలికి ఎక్కడికైనా వ్యాపించొచ్చు. సాధారణంగా కాన్పులు, సిజేరియన్లు, ట్యూబెక్టమీ, తరచుగా అబార్షన్ల వంటి చరిత్ర ఉన్నవారిలో ఆయా సమయాల్లో బ్యాక్టీరియా లోపలికి వెళ్లిపోయి లోపల నిద్రాణంగా ఉండిపోవచ్చు. రోగనిరోధక శక్తి బలంగా ఉన్నంత వరకూ ఇవేమీ ఇబ్బంది పెట్టకపోవచ్చు. కానీ ఏదైనా కారణాన రోగనిరోధకశక్తి బలహీనపడితే ఇక తరచుగా ఇన్‌ఫెక్షన్ల దాడి ఆరంభమవుతుంది. ఇలాంటి ఇన్‌ఫెక్షన్లు ఉన్న వారు ముందు తెలుపు అవుతుందని, పొత్తికడుపులో నొప్పి అనీ వైద్యులను సంప్రదిస్తుంటారు. ఇది చూడటానికి చిన్న సమస్యే కావొచ్చు గానీ కొన్నిసార్లు తీవ్ర సమస్యగానూ మారొచ్చు. ఎందుకంటే ఫలోపియన్‌ ట్యూబు, అండాశయం కలిసేచోట ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడితే చీముగడ్డలా ఏర్పడే అవకాశం ఉంటుంది. దాన్ని తొలగించకపోతే హఠాత్తుగా పగిలి తీవ్ర ప్రమాదం ముంచుకురావొచ్చు. కొందరిలో ఇన్ఫెక్షన్‌ రక్తంలో చేరిపోయి 'సెప్టిసీమియా'కూ దారితీయొచ్చు. కొందరికి కేవలం గర్భసంచీలోనే పొరల్లో స్వల్పంగా ఇన్‌ఫెక్షన్‌ ఉంటే నెలసరి అస్తవ్యస్తం అవుతుంది. దీంతో అక్కడ స్రావాలు చేరిపోయి ఫలోపియన్‌ ట్యూబ్‌ మూసుకుపోవచ్చు. దీన్ని హైడ్రోసాల్సింగ్స్‌ అంటారు. దీంతో తర్వాతి సంతానం కలగటంలో ఇబ్బందులు తలెత్తొచ్చు. తెలుపు కావటం, నడుం నొప్పి, పొత్తి కడుపు నొప్పి, సంభోగంలో నొప్పి, నెలసరి అస్తవ్యస్తం కావటం, రుతుస్రావం ఎక్కువగా అయిపోతుండటం వంటి లక్షణాలు కనబడతాయి. వీరిలో ఇన్‌ఫెక్షన్‌ ఎక్కడుందో గుర్తించి- ఒక కోర్సు యాంటీబయోటిక్‌ మందులు ఇస్తే చాలావరకూ తగ్గుతుంది. ముఖ్యంగా మెట్రోనిడజోల్‌, ట్రినిడజోల్‌ వంటివి తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే యాంటీబయోటిక్‌ ఇంజెక్షన్లూ ఇస్తారు. ఒకవేళ తగ్గకపోతే మరోసారి యాంటీబయోటిక్‌ మందులు ఇస్తారు. ఏడాదికో, రెండేళ్లకో మళ్లీ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటే మందులు వాడాల్సి ఉంటుంది. ఇలా తరచుగా ఇన్‌ఫెక్షన్లు రావటం వల్ల కాన్సర్ల ముప్పూ పెరుగుతుంది. కాబట్టి ఏటా పాప్‌స్మియర్‌ వంటి పరీక్షలు చేయించుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.
మొత్తానికి మధుమేహుల్లో ఈ పొత్తికడుపులో ఇన్ఫెక్షన్లు, పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌ పూర్తిగా నయం కావటం కష్టం. చాలాకాలం లోపలే ఉండిపోయి, మళ్లీ మళ్లీ వస్తుండొచ్చు. కాబట్టి వీటన్నింటికీ పూర్తి విరుగుడు ఏమంటే- రక్తంలో గ్లూకోజును కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటం! దాంతో ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ఇతరత్రా సమస్యలూ దరిజేరవు.

గర్భధారణ సమయంలో
మధుమేహం ఉన్న గర్భిణులు అసలు గర్భధారణ ప్రయత్నాలకు ముందే కచ్చితంగా వైద్యులను సంప్రదించి, రక్తంలో చక్కెర మోతాదులను కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటంతో పాటు జాగ్రత్తలన్నీ తీసుకుని అప్పుడు గర్భధారణకు ప్రయత్నించటం అవసరం. ఇక మధుమేహ స్త్రీలు గర్భం ధరించినపుడు తొలి మూడు నెలల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తరచుగా వస్తుంటాయి. వీరిలో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా ఎక్కువే. ముఖ్యంగా క్యాండిడియాసిస్‌ అధికం. చాలామంది తెలుపు అవుతోందని వైద్యులను సంప్రదిస్తుంటారు. వైద్యులు పరీక్షిస్తే యోని మార్గంలో పెరుగు తరకల మాదిరిగా తెలుపు కనబడుతుంది. అలాగే మధుమేహ గర్భిణుల్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లూ తరచుగా వస్తుంటాయి. ముఖ్యంగా వీరిలో మూత్రంలో మంట వంటి లక్షణాలేవీ లేకుండా కూడా ఇన్ఫెక్షన్లు ఉండొచ్చు. ఇన్ఫెక్షన్లు ఉన్నవారిలో అబార్షన్లు, నెలలు నిండక ముందే కాన్పుల వంటి ముప్పులూ ఎక్కువే. కాబట్టి మధుమేహ గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి.

గర్భనిరోధకాల్లో తేడా
అందరిలా మధుమేహ స్త్రీలకు అన్ని రకాల గర్భనిరోధక సాధనాలూ పనికిరాకపోవచ్చు. నిజానికి బిడ్డకూ, బిడ్డకూ మధ్య గర్భనిరోధకంగా లూప్‌/కాపర్‌ టీ మంచి సాధనం. కానీ మధుమేహ స్త్రీలకు వీటిని అమర్చటం కుదరదు. వీటిని అమర్చినప్పుడు వీరిలో క్రమంగా ఇన్ఫెక్షన్లు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ల మూలంగా వీరిలో అబార్షన్ల ముప్పూ ఎక్కువే. కాబట్టి వీరికి మాత్రలు శ్రేయస్కరం. అయితే సాధారణ గర్భనిరోధ మాత్రలు వాడుతున్నప్పుడు పాలు తగ్గిపోతాయి. కాబట్టి వీరికి పాలు తగ్గకుండా, గర్భనిరోధానికి పనికి వచ్చేలా- ఒకే హార్మోను ఉండే మాత్రలు ఇస్తారు. వీటిని మర్చిపోకుండా క్రమం తప్పకుండా వేసుకోవాల్సిందే. ఈ మాత్రలతో కొందరిలో నెల మధ్యలో రక్తస్రావం (డీయూబీ- డిస్‌ఫంక్షన్‌ యూటరీన్‌ బ్లీడింగ్‌) కావచ్చు. దీన్ని తప్పనిసరిగా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.

సిజేరియన్లూ ఎక్కువే!
మధుమేహ గర్భిణులకు సిజేరియన్‌ చెయ్యాల్సి వచ్చే అవకాశమూ ఎక్కువే. మామూలు స్త్రీలలో సిజేరియన్‌ అవసరం 30% మందికి ఉంటే.. వీరిలో 60% వరకూ ఉంటుంది. పైగా వీరికి ఇన్‌ఫెక్షన్‌ ముప్పు ఎక్కువ కావటం వల్ల కోత త్వరగా మానదు. లోపల అక్కడక్కడ చీము గూడు కట్టుకొని జ్వరం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. కొన్నిసార్లు వీరిలో మాయ కూడా పూర్తిగా బయటకు రాదు. కాబట్టి కాన్పు అయ్యాక మూడు నెలల తర్వాత తప్పకుండా స్కానింగ్‌ చేసి పరీక్షించాల్సి ఉంటుంది.

నెలసరి అస్తవ్యస్తం
పిల్లలు పుట్టిన తర్వాత నెలసరి సరిగా రావటం లేదని చాలామంది డాక్టర్లను సంప్రదిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం పొట్ట దగ్గర కొవ్వు పేరుకోవటం. ఈ కొవ్వు నుంచి విడుదలయ్యే ఈస్ట్రియల్‌ (ఈ3) అనే ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ నెలసరిని అస్తవ్యస్తం చేస్తుంది. ఇది మధుమేహుల్లో ఎక్కువ. రుతుస్రావం ఎక్కువ అవుతుండటం, గడ్డలు గడ్డలుగా పడుతుండటం వంటివి కనబడతాయి. దీంతో రక్తహీనత వస్తుంది. చాలామంది దీన్ని పట్టించుకోరు. సమయానికి చికిత్స తీసుకుంటే సమస్య ముదరకుండా చూసుకోవచ్చని గుర్తించాలి.

  • Dr.P.V. రావు, Prof.HOD-diabetology NIMS hyd, & Dr.V.Janaki Prof.Gyaenecology, Nilofer hos. Hyd.

మధుమేహము లో నరాల సంబంధ వ్యాధులు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము. ఇప్పుడు మధుమేహము లో నరాల సంబంధ వ్యాధులు-గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం! క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.

డయాబెటిస్‌ ఉన్నవారిలో సర్వసాధారణంగా కనిపించే కాంప్లికేషన్‌ నరాలు డామేజి కావటం్. దీనిని న్యురోపతి (Neuropathy) అంటారు. రక్తంలో గ్లూకోజు అత్యధి కస్థారుులో ఎక్కువకాలంపాటు ఉన్నపడు రకరకాల విధాలుగా ఆ వ్యక్తి శరీరంలో నరాలు డామేజ్‌ కావటం మెుదలెడతారుు. డయాబెటిస్‌ మూలంగా వచ్చే నరాల డామేజి బాధాకరమే అరుునా చాలా సందర్భాలలో అది తీవ్రస్థాయికి చేరుకోదు.

న్యురోపతిలో రెండురకాలు ఉంటాయి:

1. కాళ్ళకు, చేతులకు వచ్చే పెరిఫెరల్‌ న్యూరోపతి (pheriperal Neuropathy) కూడా ఉంటుంది.

2. జీర్ణయంత్రాంగానికి, మూత్ర విసర్జన యంత్రాంగా నికీ, రక్తనాళాలకూ వచ్చే అటోనామిక్‌ న్యురోపతి (autonomicNeuropathy).

రక్తంలోని గ్లూకోజును నిరంతరంగా ఎప్పటికపడు అదుపులో ఉంచుకోవటం ద్వారా అటోనామిక్‌ న్యురోపతి (autonomicNeuropathy) రాకుండా చూసుకోవచ్చు.

జీర్ణయంత్రాంగానికి సంబంధించిన న్యూరోపతి:

దీని లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి.

  • తేన్పులు,
  • మలబద్ధకం,
  • గుండెల్లో మంట (acidity),
  • తెమలటం,
  • వాంతులు,
  • అన్నం తినగానే కడుపు ఉబ్బరంగా అనిపించటం

చికిత్స

ఒకేసారి కడుపునిండా కాకుండా కొద్దికొద్దిగా నాలుగ యిదు సార్లు తినటం, డాక్టరు పర్యవేక్షణలో మందుల వాడకం.

రక్తనాళాలకు సంబంధించిన న్యురోపతి:
దీని లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి.

  • గభాల్న లేచినపడు కళ్ళు బెైర్లు కమ్మటం.
  • గుండె వేగంగా కొట్టుకోవటం.
  • స్పృహ తప్పబోతున్నట్లు అనిపించటం.
  • లోబీపి(low BP).

చికిత్స కూర్చున్న లేక పడుకున్న పొజిషన్‌ నుంచి గభాల్న ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా లేచి నిలబడటం, డాక్టరు పర్యవేక్షణలో మందులు.

పురుషాంగానికి సంబం దించిన న్యురోపతి:

పురుషాంగానికి వెళ్లే నరాలు దెబ్బతినటం వల్ల వచ్చే లక్షణాలు ఈ కిందివిధంగా ఉంటాయి : అంగస్తంభన జరగకపో వటం, లేక స్తంభించిన అంగం ఎక్కువసేపు నిలవక పోవటం. దీనిని 'ED'అంటారు.స్కలన సమస్యలు. స్కలనం పొడి ('Dry') గా ఉండటం లేక అతి తక్కువ స్కలనం జరగటం.

గమనిక : అంగస్తంభన సమస్యలు డయాబెటిస్‌ మూలంగానే కాకుండా ఇంకా ఇతర కారణాలవల్ల కూడా రావచ్చు. ఉదాహరణకు మందుల సైడ్గ ఎఫెక్ట్‌ కారణంగా, లోబీపి కారణంగా, డిప్రెషన్‌లో ఉన్నపడు, స్ట్రెస్‌ లేక ఏదెైనా ఆందోళన కారణంగా, భార్యాభర్తల మధ్య బెడిసికొట్టిన సంబంధాల కారణంగా, మొదలెైనవి...ఇన్ని కారణాలు ఉంటాయి కాబట్టి నేరుగా డయాబెటిస్‌ కారణంగానే అని అనుకో కుండా డాక్టరు చేత నిర్ధారణ చేయించు కోవటం అవసరం.

చికిత్స

కౌన్సెలింగ్‌,
మందుల వాడకం,

స్ర్తీ జననేంద్రియాలకు సంబంధించిన న్యూరోపతి:

స్ర్తీ జననేంద్రియాలకు వెళ్ళే నరాలు దెబ్బతినటం వల్ల ఈ కింది లక్షణాలు చోటుచేసుకుంటాయి. యోని పొడిగా ఉండటం.

సంయోగంలో ‘భావప్రాప్తి’ సరిగా కలగకపోవటం లేక అసలు భావప్రాప్తే కలగకపోవట.

చికిత్స

  • కౌన్సిలింగ్‌
  • ఈస్ట్రోజన్‌ తెరపి
  • తడికోసం యోనికి రాసుకునే క్రీములు, లూబ్రికెంట్‌లు (ఔఠఛటజీఛ్చ్టిట)

మూత్ర విసర్జన యంత్రాంగా నికి చెందిన న్యురోపతి :

మ్త్రూయంత్రాంగ వ్యవస్థకు చెందిన నరాలు దెబ్బతినటం వల్ల వచ్చే లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి :

  • ఒక్కసారిగా మ్త్రూవిసర్జన చేయలేకపోవటం (మూత్రాశయాన్ని - ఒకేసారి ఖాళీ చేయలేకపోవటం)
  • కడుపు ఉబ్బరం
  • మూత్రాన్ని ఆపుకోలేకపోవటం (అర్జెన్సీ)
  • రాత్రులు మాటిమాటికీ మ్త్రూవిసర్జనకు వెళ్ళటం.

చికిత్స
డాక్టరు పర్యవేక్షణలో మందులవాడకం, అవసరమయితే సర్జరీ
మూలము - డాక్టర్‌ సి.ఎల్‌. వెంకట్రావు, హైదరాబాద్‌.

ఆధారము: వైద్య రత్నాకరం.బ్లాగ్ స్పాట్.ఇన్

 

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/12/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate