హోమ్ / వార్తలు / తెలంగాణలో హెలికాప్టర్ల తయారీ పరిశ్రమ
పంచుకోండి

తెలంగాణలో హెలికాప్టర్ల తయారీ పరిశ్రమ

రూ.2500 కోట్ల పెట్టుబడి.. 4500 మందికి ఉపాధి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో హెలికాప్టర్ల తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ వైమానిక సంస్థ ఎయిర్‌బస్‌ ఆసక్తిని కనబరిచింది. రూ.2500 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. యేటా వంద నేవీ, యుటిలిటీ హెలికాప్టర్ల తయారీ సామర్థ్యం గల పరిశ్రమ కోసం 40 ఎకరాల భూమిని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఇవ్వాలని కోరింది. గత నెల ముంబయిలో జరిగిన ‘భారత్‌లో తయారీ’ ప్రదర్శన సమయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులను కలిసి తమ పరిశ్రమ గురించి ఎయిర్‌బస్‌ సంస్థ ప్రతినిధులు చర్చించారు. అధికారుల సూచనల ప్రకారం తాజాగా వారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలిసి తమ ప్రతిపాదనలను అందజేశారు. నేవీ హెలికాప్టర్ల కోసం భారత్‌లో భారీ గిరాకీ ఉందని, వాటిని ఇక్కడే తయారు చేసేందుకు తెలంగాణను ఎంచుకున్నామని వెల్లడించారు. టాటా లేదా మహీంద్రతో కలిసి ఈ పరిశ్రమను ప్రారంభించేందుకు యోచిస్తున్నామని ఎయిర్‌బస్‌ ప్రతినిధులు తెలిపారు. తమ పరిశ్రమ ద్వారా 4500 మందికి ఉపాధి లభిస్తుందని ఎయిర్‌బస్‌ తెలిపింది. దీంతో పాటు హెలికాప్టర్ల విడిభాగాలు, పరికరాల ఉత్పత్తికి 30 అనుబంధ పరిశ్రమలు వచ్చే వీలుంది. వీటి ద్వారా వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. హెలికాప్టర్ల నిర్వహణ, మరమ్మతు, కార్యకలాపాల (ఎంఆర్వో) కేంద్రం ఏర్పాటవుతుంది.

ఆధారము: ఈనాడు

పైకి వెళ్ళుటకు