హోమ్ / వార్తలు / భవిష్య నిధిపై 8.6 శాతం వడ్డీ!
పంచుకోండి

భవిష్య నిధిపై 8.6 శాతం వడ్డీ!

భవిష్య నిధిపై 8.6 శాతం వడ్డీ! గతేడాదితో పోలిస్తే 0.2 శాతం తక్కువ

గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులు భవిష్య నిధిపై తక్కువ వడ్డీ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) 2016-17లో ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌) జమలపై 8.6 శాతం వడ్డీ అందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. చిన్నతరహా పొదుపు పథకాల బాటలోనే ఈపీఎఫ్‌పై సైతం వడ్డీ రేటును కాస్త తగ్గించాలంటూ ఆర్థికశాఖ చేస్తున్న సూచనల మేరకే కార్మికశాఖ ఈ దిశగా సన్నద్ధమవుతున్నట్లు అధికారవర్గాల సమాచారం. 2015-16లో ఉద్యోగులు ఈపీఎఫ్‌ జమలపై 8.8 శాతం వడ్డీ పొందిన సంగతి గమనార్హం.

‘తాము నిర్వహిస్తున్న ఇతర చిన్న పొదుపు పథకాల తరహాలోనే ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును ఉంచాలంటూ ఆర్థికశాఖ కాస్త ఒత్తిడి చేస్తోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరానికి 8.6 శాతం వడ్డీ అందించేందుకు రెండు మంత్రిత్వశాఖల మధ్య విస్తృత ఏకాభిప్రాయం కుదిరింది’ అని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. సాధారణంగా ఆదాయ అంచనాల ప్రాతిపదికన ‘కేంద్ర దర్మకర్తల మండలి(సీబీటీ)’ వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకుంటుంది. సీబీటీ నిర్ణయించిన రేటుకు ఆర్థికశాఖ ఆమోదం తెలుపుతుంది. అనంతరం, చందాదారుల ఖాతాల్లో సంబంధిత సొమ్ము జమ అవుతుంది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీబీటీ ఇంకా ఆదాయ అంచనాలు వేయలేదని అధికారి వెల్లడించారు. ప్రభుత్వ సెక్యూరిటీలు, మార్కెట్‌లోని ఇతర పొదుపు సాధనాల ద్వారా కలుగుతున్న లబ్ధి క్షీణిస్తున్న నేపథ్యంలో.. ప్రజా భవిష్య నిధి వంటి చిన్నతరహా పొదుపు పథకాలకు ఇస్తున్న వడ్డీ రేటును 8.6కు తగ్గించాలని ఆర్థికశాఖ భావిస్తున్న సంగతి గమనార్హం.

ఆధారం : ఈనాడు

పైకి వెళ్ళుటకు