హోమ్ / వార్తలు / రైల్వే బీమాకు భారీ స్పందన
పంచుకోండి

రైల్వే బీమాకు భారీ స్పందన

రైల్వే బీమాకు భారీ స్పందన

రైలు ప్రయాణికుల ప్రయోజనాల దృష్ట్యా రైల్వేశాఖ ప్రవేశపెట్టిన సరికొత్త బీమా పథకానికి అపూర్వ స్పందన లభించింది. కేవలం 92 పైసల చెల్లింపుతో రూ.10 లక్షల బీమా పొందే ఈ పథకాన్ని.. ప్రవేశపెట్టిన రెండు నెలల్లోనే 2కోట్ల మంది ప్రయాణికులు వినియోగించుకున్నారు. రైలు ప్రయాణ టికెట్‌ ధరకు అదనంగా 92 పైసలు చెల్లించిన వారికి కల్పించే ఈ బీమా సదుపాయాన్ని ఈ ఏడాది సెప్టెంబరులో ప్రారంభించారు. అక్టోబరు 31వ తేదీ వరకు దీనిని 2కోట్ల 7లక్షల 63 వేల మంది ప్రయాణికులు వినియోగించుకున్నట్లు రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో 5.5 లక్షల మంది టికెట్‌ బుక్‌ చేసుకుంటుండగా.. వారిలో 3.5 లక్షల మంది బీమా కోసం డబ్బు చెల్లిస్తున్నారు. రైల్వేశాఖ ఈ పథకాన్ని ఐఆర్‌సీటీసీ భాగస్వామ్యంతో అమలు చేస్తోంది.
కేవలం ఐఆర్‌సీటీసీ వైబ్‌సైట్‌ నుంచి బుక్‌ చేసే టికెట్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ బీమాను వినియోగించుకున్న ప్రయాణికులు.. ప్రయాణ సమయంలో ప్రమాదం బారిన పడి మృతి చెందితే వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున బీమా కంపెనీ చెల్లిస్తుంది. అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు, క్షతగాత్రులైతే రూ.2 లక్షలు, మెడికల్‌ బిల్లులు తదితర వాటికి చెల్లిస్తారు. కేవలం ప్రమాదాలకే కాకుండా రైలుపై ఉగ్రవాద దాడులు జరిగినా, దొంగతనం, కాల్పులు, దారిమళ్లింపు వంటి ఘటనలు చోటుచేసుకున్నా.. బీమా వర్తిస్తుంది. కాగా ప్రయాణికుల కోసం రైల్వేశాఖ బీమాతోపాటు పలు సౌకర్యాలను కల్పిస్తోందని ఆ శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు తెలిపారు.

ఆధారం : ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు