ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే వివిధ పోస్టుల భర్తీలో స్థానిక, స్థానికేతర రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్–371డీ తో పాటు తత్సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి నిర్ణయాలుంటాయని కమిషన్ కార్యదర్శి వైవీఎస్టీ సాయి తెలిపారు. ఏపీపీఎస్సీ నిర్వహించే వివిధ పోస్టుల భర్తీలో స్థానిక, స్థానికేతర అంశంపై అభ్యర్థులనుంచి వ్యక్తమవుతున్న సందేహాలపై ఆయన స్పందిస్తూ పలు అంశాలను ‘సాక్షి’కి వివరించారు. మౌలికంగా ఆర్టికల్–371డీతో పాటు 1975లో ప్రభుత్వం ఇచ్చిన జీఓ నంబర్–674, ఇతర జీఓల ఆధారంగా స్థానికతను గుర్తిస్తుంటారని చెప్పారు. కనీస విద్యార్హతలు నిర్ణయించని పోస్టులకు నివాసం ఆధారంగా, విద్యార్హతలు నిర్ణయించిన పోస్టులకు ఆయా అభ్యర్థులు చదివిన ప్రాంతంతో పాటు, కొన్ని సమయాల్లో నివాసం ఆధారంగా స్థానికతను నిర్ణయిస్తారని వివరించారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అంతరాయం లేకుండా ఒకే ప్రాంతంలో చదివి ఉంటే ఆ ప్రాంతానికి లోకల్ అవుతారని స్పష్టంచేశారు.
ఆధారం: సాక్షి