పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

జల శక్తి

జల శక్తి, ఆర్థిక వ్యవస్థలో విద్యుచ్ఛక్తి కీలక పాత్ర మరియు మన రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు గురించి ఇక్కడ వివరించడం జరిగింది

సాంప్రదాయ శక్తి వనరుల్లో జలవిద్యుత్‌ను మాత్రమే మళ్లీ వినియోగించవచ్చు. మనదేశ ఆర్థిక వ్యవస్థలో విద్యుచ్ఛక్తి కీలక పాత్ర పోషిస్తోంది. మన దేశంలో స్థాపిత తలసరి విద్యుత్ వినియోగం 0.84 మెగావాట్లు. ప్రపంచంలో కొన్ని దేశాల తలసరి విద్యుత్ వినియోగం మనదేశం కంటే ఎక్కువగా ఉంది. దేశ స్థూల జలవిద్యుత్ శక్తి సామర్థ్యం 1.5 లక్షల మెగావాట్ల వరకు ఉంది. 2011 ఆగస్టు 31 నాటికి మొత్తం స్థాపిత శక్తి సామర్థ్యంలో దీని వాటా 21.18% (38,706 మెగావాట్లు).  ప్రపంచంలో మన తలసరి శక్తి వినియోగం ఎనిమిదో వంతు మాత్రమే ఉంది.

ఉదా: జపాన్ - 0.90 మె.వా., జర్మనీ - 1.16 మె.వా., యు.ఎస్.ఎ. - 2.71 మె.వా

వివిధ రంగాల్లో విద్యుత్ వినియోగం

 • పారిశ్రామిక రంగం: 60% - 65%
 • వ్యవసాయ రంగం: 15% - 18%
 • గృహ వినియోగం: 10% - 15%
 • రవాణా, ఇతర రంగాలు - మిగిలిన శాతం.

2012 లోగా 78,000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2010-11 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ రంగానికి రూ.5130 కోట్లు కేటాయించారు. జాతీయ విద్యుత్ విధానం - 2005, విద్యుత్ సుంకాల విధానం - 2006కు అనుగుణంగా 'మెగా పవర్ పాలసీ'లో మార్పులు చేపట్టారు.

విద్యుత్ డిమాండ్‌కు కారణాలు

 • స్వాతంత్య్రానంతరం అన్ని రకాల పరిశ్రమలను (చిన్న, మధ్యతరహా, భారీ) స్థాపించడం.
 • దేశంలో వేగంగా పట్టణీకరణ చెందడం.
 • వ్యవసాయ రంగంలో విద్యుత్ మోటార్లు, పనిముట్లు, యంత్రాలను వినియోగించడం.
 • గ్రామీణ విద్యుదీకరణను వేగవంతం చేయడం.
 • రైల్వేలను విద్యుదీకరించడం.
 • గృహరంగంలో నానాటికీ పెరుగుతున్న విద్యుత్ వినియోగం.
 • విద్యుత్ ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం కంటే తక్కువ విద్యుత్ ఉత్పత్తి కావడం.
 • విద్యుత్ వినియోగంలో తగిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం.
 • విద్యుత్ ప్రసార నష్టం, దుర్వినియోగం.
 • ప్రభుత్వం విద్యుత్ సేవల వినియోగంలో సబ్సిడీలు ఇవ్వడం.
 • పై కారణాల వల్ల మన దేశంలో విద్యుత్ కొరత సుమారు 11.3% నుంచి 18.3% వరకు ఉంది.

విద్యుత్ కొరతను అధిగమించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు

 • 6వ, 7వ ప్రణాళికల్లో విద్యుత్ రంగానికి అధిక కేటాయింపులు చేశారు.
 • సహజవాయువు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఉదా: మన రాష్ట్రంలోని విజ్జేశ్వరం పవర్ ప్లాంట్.
 • 1975లో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ), నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్ఈసీ) ఏర్పాటు చేశారు. వీటి ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ప్లాంట్లను స్థాపించారు.
 • అన్ని ప్రాంతాల్లో విద్యుత్ ప్రసారాన్ని క్రమబద్ధీకరించడానికి 'నేషనల్ గ్రిడ్ కార్పొరేషన్‌'ను ఏర్పాటు చేశారు.
 • కొన్ని పరిశ్రమల్లో (చెరకు ఫ్యాక్టరీలు, నూనె మిల్లులు) సొంతంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ పద్ధతిని 'కో జనరేషన్' అంటారు.
 • చిన్న, మధ్యతరహా విద్యుత్ ప్లాంట్లను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేశారు.
 • పరిశ్రమల్లో విద్యుత్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి 'ఎనర్జీ ఆడిట్‌'ను ప్రవేశపెట్టారు.
 • విద్యుత్ వినియోగ స్థానంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించారు.
 • సబ్సిడీలను హేతుబద్ధం చేశారు.
 • విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం 'రాకేష్ మోహన్ కమిషన్‌' ను ఏర్పాటు చేశారు.
 • కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు రంగంలో విద్యుదుత్పాదనను ప్రోత్సహిస్తూ కొన్ని కంపెనీలకు 'కౌంటర్ గ్యారంటీ' ఇచ్చింది. ఈ చర్యల వల్ల చాలా రాష్ట్రాల్లో ప్రైవేట్ రంగంలో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు అయ్యాయి.
 • విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం ప్రస్తుతమున్న 69% నుంచి 72%కు పెంచడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
 • విద్యుత్ ప్రసార నష్టాన్ని 12% వరకూ తగ్గించడానికి చర్యలు చేపట్టారు.
 • విద్యుత్ యంత్రాలు, పరికరాల నాణ్యతను పెంచి విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా విద్యుత్ పరికరాలపై దిగుమతి సుంకం తగ్గించారు.
 • కేంద్రప్రభుత్వం విద్యుచ్ఛక్తి, ఇతర శక్తి వనరుల గురించి కొన్ని సంఘాలను, మండళ్లను ఏర్పాటు చేసింది. వాటిలో ముఖ్యమైనవి:
  • భారత శక్తి పర్యవేక్షణా సంఘం - 1965
  • ఇంధన విధాన సంఘం         - 1974
  • శక్తి విధాన సంఘం              - 1979
  • శక్తి సలహా మండళ్లు            -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు

 • మన రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు చేపట్టడానికి 'హితేన్ భయ్యా కమిటీ'ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలను తీసుకుంది. వాటిలో ముఖ్యమైనవి
 • ఎ.పి. విద్యుత్ మండలిని విభజించి దాని స్థానంలో ఏపీజెన్‌కో, ఏపీట్రాన్స్‌కోలను ఏర్పాటు చేశారు.
 • వ్యవసాయరంగంలో ఇస్తున్న విద్యుత్ సబ్సిడీలను హేతుబద్ధం చేశారు.
 • ఏటా విద్యుత్ ఛార్జీలను పునఃసమీక్షించడానికి 'ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్‌సీ)'ను ఏర్పాటు చేశారు.
 • రాష్ట్రంలో విద్యుత్ ప్రసార సామర్థ్యాన్ని పెంచడానికి వివిధ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటరీ కమిటీలను ఏర్పాటు చేసింది.
 • విద్యుత్ కొరతను నివారించడానికి 'కో జనరేషన్ పద్ధతిని ప్రోత్సహించింది.
 • ప్రైవేట్ రంగంలో విద్యుదుత్పాదనకు అనుమతి ఇచ్చింది.
 • కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సహకార సంఘాలను ఏర్పాటుచేసి, వాటి ఆధ్వర్యంలో విద్యుత్ ప్రచారాన్ని చేపడుతోంది.
 • అక్రమంగా విద్యుత్ వినియోగించుకునే వ్యక్తులను గుర్తించి, చట్టపరంగా శిక్షించడానికి పోలీస్ యంత్రాంగంతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది.
 • అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో సాంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.
 • విద్యుత్ వినియోగంపై ప్రజల్లో ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తోంది.
 • దేశాభివృద్థిని నిర్దేశించే విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలి. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, విద్యావంతులు, నిపుణులు, అన్ని వర్గాల ప్రజలు దీన్ని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించాలి.
 • దేశంలో గ్రిడ్ అనుసంధానమైన విద్యుత్ సామర్థ్యం ప్రస్తుతం 147 గిగా వాట్లు. దేశ అవసరారాలను తీర్చాలంటే 2030 నాటికి ఇది 460 గిగా వాట్లకు చేరాలని నిపుణుల అంచనా. గత పదేళ్లలో విద్యుత్ సరఫరా - డిమాండ్‌లో అంతరం 8 - 10% మేర ఉంది.

సమస్యలు

 • భూకంపాలకు తట్టుకుని విద్యుత్ ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర లేదు.
 • కొత్త ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యలు ఎదురవుతున్నాయి.
 • అణు, థర్మల్ విద్యుత్ రంగాల్లో మాదిరిగా జలవిద్యుత్‌లో పెట్టుబడులు పెట్టడం లేదు.
 • వర్షాభావ పరిస్థితుల్లో జలవిద్యుత్ ఉత్పత్తి కష్టంతో కూడుకున్న పని.
 • కొత్త జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ, సాంస్కృతిక, పునరావాస సమస్యలు ఎదురవుతున్నాయి.

పరిష్కారాలు

 • బహుశార్థ సాధక ప్రాజెక్టులను (జలవిద్యుత్) నిర్మించడం వైపు దృష్టి సారించాలి.
 • పరిమిత జలవనరుల దృష్ట్యా నదీ జలాలను సముద్రంలో కలవనీయకుండా వాటిని శక్తి ఉత్పాదనకు వినియోగించాలి.
 • భూసేకరణ సమస్యలు తలెత్తకుండా పునరావాస చర్యలు కల్పించి, కొత్త ప్రాజెక్టులు నిర్మించాలి.
 • కొత్త విద్యుదుత్పత్తి ప్లాంట్లను ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మించాలి.

ఆధారము: ఈనాడు ప్రతిభ

3.05283018868
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు