অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

విద్యుత్తు వృధాను నివారించడం మన కర్తవ్యం.

విద్యుత్తు వృధాను నివారించడం మన కర్తవ్యం.

లక్ష్యం

 1. విద్యుత్ శక్తిని సంరక్షించాల్సిన అవసరం గురించి అవగాహన పొందుదాం.
 2. విద్యుత్ శక్తిని విచక్షణా రహితంగా ఉపయోగించకూడదనే సృహ కలిగి ఉందాం.

నేపథ్యం

విద్యుత్తు ఒక సౌకర్యవంతమైన శక్తివనరు. విద్యుత్తును మనం థర్మల్ విద్యుత్ కేంద్రాలలో అణుశక్తి కేంద్రాలలో, జల విద్యుత్ కేంద్రాలలో ఉత్పత్తి చేసుకుంటున్నాము. విద్యుత్ తక్కువగా లభ్యమయ్యే శక్తివనరు. అయితే చాలా వరకు మనం విద్యుత్‌ను వృధా ఖర్చుచేస్తున్నాం. విద్యుత్ ను పొదుపుగా వాడితే డబ్బును ఆదా చేయడమే కాకుండా విద్యుత్ నిలువలను పెంచవచ్చు. సరియైన ప్రణాళిక, అవగాహనతో మనం పాఠశాలలో, గృహాలలో విద్యుత్ ను  పొదుపుగా వాడుకొనేలా చూసుకోవచ్చు.

పద్ధతి

 1. పాఠశాల విరామ సమయాలలో, పాఠశాల సమయం తరువాత అన్ని తరగతి గదులలో ఫ్యాన్లు, ట్యూబులైట్లు ఆర్పివేసి ఉన్నాయో లేదో పరిశీలించండి.
 2. ఖాళీగా ఉన్న తరగతి గదులలో పనిచేయుచున్న ఫ్యాన్లు, బల్బులను గమనించి వాటిని ఆర్పివేయండి.
 3. మీ గృహాలలో వృథాగా విద్యుత్ ను వినియోగిస్తున్న సందర్భాలను గుర్తించి విద్యుతు వృధా అరికట్టుటకు తగిన చర్యలు చేపట్టండి.
 4. ప్రస్తుతం మార్కెట్లో విద్యుత్‌ను ఆదా చేసే పరికరాలేవో కనుగొనండి. ఉదా: (సి.ఎఫ్.ఎల్).

ముగింపు

విద్యుత్ ఎంతో విలువైనది. మన ఇంటిలో లేదా పాఠశాలలో ఏ ఏ గదిలో ఎంత కరెంటు ఖర్చవుతోందో లెక్కిద్దాం. ఎక్కువగా కరెంటు ఖర్చయ్యే గది ఏది? ఎందుకు? కారణాలు గమనిద్దాం. ఫ్యాన్ ఆపివేయడం, ఎ.సి. బదులు ప్యాన్ వాడడం వంటి పొదుపు మార్గాలు పాటిద్దాం. గదిలోనుండి బయటకు వెళ్ళేటపుడు మన బాధ్యతగా

స్విచ్ లను ఆపివేద్దాం.

గృహోపకరణాలు,విద్యుత్ శక్తి వినియోగంలో శక్తిని పొదుపుచేయుటకు చిట్కాలు

మన దేశంలో గృహావసరాల నిమిత్తం దాదాపు 80% శక్తిని వినియోగిస్తున్నాం. చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించగడం ద్వారా ఈ శక్తిలో పెద్ద మొత్తాన్నే పొదుపు చేయడానికి సులువైన, ఆచరణాత్మక ఉపాయాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. పలుమార్లు వీటిని చదవటమే కాకుండా ఆచరించడం ద్వారా డబ్బులు, శక్తిని పొదుపు చేసిన వాళ్ళమవటమే కాకుండా సహజ వనరులను సద్వినియోగం చేసినవాళ్ళమవుతాం.

ముందుగా ఏ విద్యుదుపకరణం ఎంత విద్యుత్ ను వినియోగిస్తుందో తెలుసుకోవటం మనకెంతో ఉపయోగపడుతుంది. అవసరం మేరకే గృహోపకరణాలను ఉపయోగించటం కరెంటు బిల్లు తగ్గటానికి దోహదం

చేస్తుంది.

శక్తిని ఆదా చేయడానికి ఉపయోగకరమైన చిట్కాలు

కింది సూచించిన సులువైన చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా ఎంతో శక్తిని ఆదాచేయవచ్చు.

వెలుతురు(లైట్లు)

 • ఉపయోగం లేనపుడు బల్బులను వెంటనే ఆపివేయాలి
 • కిటికీలను తెరిచి ఉంచటం, లేత రంగుల కర్జెన్లను ఉపయోగించడం ద్వారా పగటి కాంతి ప్రతిభావంతంగా పరావర్తనం చెందించి గదిలో వెలుతురును పెంచుతాయి.
 • బల్బులు, ట్యూబ్లైట్లపైన దుమ్మును చేరకుండా దులుపుతూ ఉండటం ద్వారా వెలుగును పెంచవచ్చు.
 • అవసరం ఉన్నచోటనే బల్బులు వెలగాలి కాని గది మొత్తం లేదా ఇల్లంతా బల్బులు వేయడం మానుకోవాలి.
 • మామూలు ఇన్కాండిసెంట్ బల్బుల కన్న కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు 4 రెట్ల శక్తిని ప్రభావవంతంగా వినియోగిసూ అదే వెలుగునివ్వగలుగుతాయి.
 • సాంప్రదాయక రాగి చోక్లకు బదులుగా విద్యుత్ చౌక్‌లను ఉపయోగించటం మంచిది.

ఫ్యాన్లు:

• సాంప్రదాయక రెగ్యులేటర్ల స్థానంలో విద్యుత్ రెగ్యులేటర్లను వాడటం మంచిది.

• సీలింగ్ ఫ్యాన్లకన్నా ఎత్తులో ఎగ్జాస్ట్ ఫ్యాన్లనుంచాలి.

విద్యుత్ ఇస్త్రీ:

 • ఆటోమేటిక్ గా వేడిని సర్దుబాటు చేసుకొనే విద్యుత్ ఇస్త్రీ పెట్టెలనే కొనుక్కోవాలి.
 • సరయిన స్థానంలో రెగ్యులేటర్‌ను ఉంచి ఇస్త్రీచేయడానికి ఉపయోగించాలి.
 • ఇస్త్రీ చేసేటప్పుడు బట్టలపై ఎక్కువగా నీటిని చల్లవదు.
 • తడిబట్టలను ఇస్త్రీ చేయరాదు.

మిక్సీలు

 • మిక్సీలు గ్రెండర్లు పొడిగా ఉండే వాటిని మెదపడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. తడి పదార్దాలను తక్కువ సమయం తీసుకుంటాయి. కాబట్టి పొడులు చేయడం తగ్గించుకోవాలి.

మైక్రోవేవ్స్ ఓవెన్స్

 • ఇవి సాంప్రదాయక విద్యుత్ లేదా గ్యాస్ స్టవ్ కన్నా 50% తక్కువ శక్తిని వినియోగిస్తాయి.
 • ఎక్కువ మొత్తంలో ఆహారపదార్థాలను బేక్ చేయడానికి పూనుకోవద్దు.
 • బ్రెడ్ వంటి పదార్థాలను చేసేటప్పుడు ముందుగానే ఓవెన్ ను ప్రీహీట్ చేయనవసరం ఉండదు.
 • ఓవెన్లో పెట్టిన ఆహారపదార్థాలు అయ్యాయో లేదో తెలుసుకోవడానికి లేదా ఎంత వరకు వచ్చాయో చూడడానికి మాటిమాటికి ఓవెన్ తలుపు తెరచి చూడకూడదు.అలా తెరచిన ప్రతిసారీ 25 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. తిరిగి మళ్ళీ వేడెక్కడానికి విద్యుత్ ఖర్చవుతుంది.

విద్యుత్ పొయ్యి

 • ఆహారపదార్థాలు వండడానికి నిర్దేశించిన సమయానికంటే కొన్ని నిమిషాల ముందే విద్యుత్ స్టవ్ ను  ఆపేయాలి.
 • సమతలమైన అడుగును కలిగిన వంటపాత్రలను ఉపయోగించాలి. ఎందుకంటే అవి విద్యుత్ కాయిల్ పూర్తిగా కప్పబడి ఉంటే విద్యుత్ సద్వినియోగమై వంట త్వరగా పూర్తవుతుంది.

గ్యాస్ స్టవ్

 • గ్యాస్ స్టవ్ పై వంటచేసేటప్పుడు మంట మద్యస్థంగా ఉండేటట్లు చూసుకోవటం ద్వారా ఎల్.పి.జి.ను సద్వినియోగం చేసుకోవచ్చు.
 • గ్యాస్ స్టవ్ మంట నీలి రంగులో ఉంటే ఇంధనాన్ని చక్కగా వినియోగిస్తున్నట్లు లెక్క.
 • పసుపురంగు మంట వస్తుంటే అవి బర్నర్ శుభ్రం చేయడానికి సూచికగా భావించవచ్చు.
 • వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్లను ఉపయోగించి వంట చేయటం మంచిది.
 • ఏవేని ఆహార పదార్థాలు ఉదా: పాలు, కూరగాయలు మొదలైనవి ఫ్రిజ్ నుండి తీసిన వెంటనే కాకుండా సాధారణ గది ఉష్ణోగ్రతకు చేరిన తరువాత మాత్రమే వండటానికి ఉపయోగించాలి.

సోలార్ వాటర్ హీటర్

 • విద్యుత్ వాటర్ హీటర్ బదులుగా సోలార్ వాటర్ హీటర్‌ను ఉపయోగించటం ఉత్తమం.

విద్యుత్ ఉపకరణాలు

 • టి.వి. ఆడియో సిస్టమ్, కంప్యూటర్ వంటివి ఉపయోగించినపుడు స్విచ్ ఆఫ్ చేసి ఉంచాలి. ఆన్‌లోనే ఉంటే ఒక్కో పరికరం 10 వాట్ల శక్తిని నష్టపరుస్తుంది.

కంప్యూటర్లు:

 • ఉపయోగించనపుడు ఇంట్లో, ఆఫీస్ లో  కంప్యూటర్లను ఆఫ్ చేయడం మంచిది. ఎందుకంటే 24 గంటలు పనిచేసే ఒక కంప్యూటర్, ఫ్రిజ్ కన్నాఎక్కువ శక్తిని వినియోగిస్తుంది.
 • ఒకవేళ కంప్యూటర్ ఆన్ లోనే ఉండాల్సిన అవసరముంటే, మానిటర్ అయినా ఆఫ్ చేయాలి. ఎందుకంటే సిస్టమ్ వినియోగించే శక్తిలో సగానికన్నా ఎక్కువ మానిటర్ ఉపయోగిస్తుంది.
 • కంప్యూటర్ ఉపయోగించినప్పుడు స్లీప్ మోడ్‌లో ఉండేలా సెట్టింగ్ చేయడం ద్వారా దాదాపు 40% శక్తిని ఆదా చేయవచ్చు.
 • ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు, డిజిటల్ కెమెరాల బ్యాటరీ చార్జ్‌లు ప్లగ్‌తో ఉన్నప్పుడు శక్తిని వినియోగిస్తూ ఉంటాయి కాబట్టి వాటిని ప్లగ్నుండి తీసివేయడం, విద్యుత్ అనవసర వినియోగాన్ని తగ్గంచటమే అవుతుంది.

స్క్రీన్  సేవర్లు కంప్యూటర్ ను రక్షిస్తాయి కాని విద్యుత్‌ను కాదు.

ఫ్రీజ్‌లు:

 • క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం వల్ల మాన్యువల్‌గా డీప్రాస్ట్ చేయవలసిన ఫ్రిజ్‌లు, ఫ్రీజర్లు, ఫ్రిజ్‌లోని మోటర్ సరిగ్గా పనిచేయుటకు శక్తిని పెంచుతుంటాయి.
 • ఫ్రిజ్ కు  అది ఉన్న గోడకు మధ్య గాలి ఆడేలా కొంత స్థానాన్ని ఉంచాలి.
 • రిఫ్రిజిరేటర్ లేదా ఫ్రీజర్ చాలా చల్లగా ఉండకూడదు.
 • ఫ్రిజ్ డోర్ సరిగ్గా పట్టిందో, లేదో సరిచూసుకోవాలి. డోర్ గాలి వెళ్ళకుండా ఉండేలా చూడాలి.
 • ద్రవరూపంలో ఉండే ఆహారపదార్థాలను సరిగ్గా మూతలుపెట్టి ఉంచాలి. ఎందుకంటే కప్పిఉంచని ఆహార పదార్థాలు తేమను విడుదల చేస్తాయి. కాబట్టి కంప్రెసర్ ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది.
 • ఫ్రిజ్ డోర్లను తరచు తీసూ ఉంటారు. అలా చేయకూడదు.
 • ఫ్రిజ్ డోర్‌ను అవసరం లేకున్నా తెరచి ఉంచటం వలన, దానిలోని చల్లని గాలి బయటికి వెళ్ళిపోతుంది.
 • వేడిగా లేదా వెచ్చిగానున్న ఆహారపదార్థాలను నేరుగా ప్రిజ్‌లో పెట్టకూడదు.

ఎయిర్ కండిషనర్లు:

 • గది ఉష్ణోగ్రతను బట్టి దానికై అదే నియంత్రించుకొనే పరికరాలను మాత్రమే కొనాలి.
 • తక్కువ చల్లదనం స్థితిలో ఉండేలా రెగ్యులేటర్లను ఉంచాలి.
 • ఎ.సి.తోబాటు, సీలింగ్ ఫ్యాన్ కూడా వేసి ఉంచండి. అందువల్ల గది మొత్తం తొందరగా చల్లబడుతుంది.
 • తలుపులు, కిటికీల గుండా చల్లదనం బయటికి పోకుండా మూసి ఉంచాలి.
 • గోడకు, ఎయిర్ కండీషనర్ కు మధ్య ఖాళీ ఉండేలా చూడాలి.
 • ఇంటి, మిద్దెపై మొక్కలు పెంచడం వల్ల ఎ.సి. పై పడే అదనపు భారాన్ని తగ్గిస్తుంది. కిటికీలకు సన్ ఫిలిం  అంటించటం లేదా కిటికీలకు తెరలు అమర్చడం చేయాలి.
 • ఇంటి బయట, లోపల ఉష్ణోగ్రతలో వ్యత్యాసం ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. అంటే ఇంటి చుటూ చెట్లు, మొక్కల్ని పెంచాలి.
 • ఎ.సి. మిషన్‌లోని ధర్మాస్తాట్ను నార్మల్ దగ్గర ఉంచి, ఎ.సి.ని పనిచేయనివ్వాలి. లేకపోతే ఎక్కువ కరెంట్ ఖర్చవుతుంది.
 • ఎ.సి. కి దగ్గరగా లైట్లు, టి.వి. మొదలైనవి లేకుండా చూడాలి. ధర్మోస్టాట్ట్ ఈ వేడిని గ్రహించి అవసరం లేకున్నా ఎక్కువగా ఎ.సి.ని పనిచేయిస్తుంది.
 • కిటికీలో అమర్చిన ఎ.సి. మిషన్ మీద ఎండ తగలకుండా ఉండేలా నీడనిచ్చే చెట్లను పెంచండి. అయితే గాలి ధారాళంగా తగిలేలా చూడాలి.
 1. విద్యుత్ వృధా అయ్యే వివిధ సందర్భాల పరిశీలనల ఆధారంగా నివేదిక రాయండి. .
 2. మీ పాఠశాలలో, గృహాలలో విద్యుత్‌ను పొదుపు చేసే ప్రణాళికలను రూపొందించండి.

తదుపరి చర్యలు:

 1. మీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునితో లేదా ఉపాధ్యాయులతో చర్చించి విద్యుత్ పొదుపు చర్యలను అమలు పరచండి.
 2. మీ పాఠశాలలో విద్యుత్ వృధాపై తోటి విద్యార్థులలో చర్చించి విద్యుత్ పొదుపుచేయడంపై మీ పాఠశాల ప్రార్ధనా సమావేశంలో ఉపన్యసించండి.
 3. మీ ఇంట్లో, పాఠశాలలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించే విధానాల జాబితాను రూపొందించండి.

ఆధారము: http://apscert.gov.in/© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate