హోమ్ / శక్తి వనరులు / ఇంధన వనరులు / అందరికీ సుస్థిర ఇంధనం... సమస్యలు.. సవాళ్లు..
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

అందరికీ సుస్థిర ఇంధనం... సమస్యలు.. సవాళ్లు..

భవిష్యత్తరాల అవకాశాలను తగ్గించకుండా ఇప్పటి ఇంధన అవసరాలను తీర్చుకోవడమే 'సుస్థిర ఇంధన వినియోగం'.

సమస్యలు సవాళ్లు

భవిష్యత్తరాల అవకాశాలను తగ్గించకుండా ఇప్పటి ఇంధన అవసరాలను తీర్చుకోవడమే 'సుస్థిర ఇంధన వినియోగం'. ఆధునిక ఇంధన సేవలను అందరికీ అందించాలనే ప్రధాన లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి 'అందరికీ సుస్థిర ఇంధన అందుబాటు' అన్న నినాదంతో 2012ను 'అంతర్జాతీయ సంవత్సరం'గా 2010-డిసెంబర్‌లో నిర్ణయించింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో సుస్థిరాభివృద్ధికి, శతాబ్ధి అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఆధునిక ఇంధన (శక్తి) సేవల అందుబాటు అవసరాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇంధన సరఫరాలో ఇమిడి వున్న సమస్యలపై అన్ని దేశాల దృష్టిని మరల్చేందుకు, ఆధునిక ఇంధన సేవలు అందరికీ అందించేందుకు తోడ్పడాలని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి 'బాన్‌కీ మూన్‌' ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో.. సుస్థిర ఇంధన సేవలను అందరికీ అందించడం లోని సమస్యలను, సవాళ్లను సంక్షిప్తంగా తెలుపుతూ... మీ ముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞాన వీచిక'.

ఆధునిక జీవితం, అభివృద్ధి ఇంధన వినియోగంతో ముడిపడి ఉంది. భూగర్భంలో దొరికే బొగ్గు, ముడి చమురు ఇప్పుడు ప్రధానంగా ప్రపంచ ఇంధన అవసరాలను తీరుస్తున్నాయి. ఇవి తరిగిపోయే వనరులు. ఈ నిల్వలను విచక్షణా రహితంగా వాడటంతో వాతావరణ, పర్యావరణ కాలుష్య సమస్యలు ముందుకు వస్తున్నాయి. వీటి అదుపులేని వినియోగాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తరాలకు ఇంధన అందుబాటు తగ్గి, వారి జీవితాలు అస్థిరమవుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి ఇంధన వినియోగాన్ని క్రమంగా 'తరిగిపోయే వనరుల' నుండి 'తరగని, పునరుద్ధరించగల ఇంధన వనరుల' వినియోగం వైపు మళ్లించాలి. ఈ వనరుల్లో జల విద్యుత్‌, జీవ ఇంధనాలు, పవన విద్యుత్‌, సౌరశక్తి

లక్ష్యాలు

 • పేదలతో సహా అందరికీ ఆధునిక ఇంధన సేవలు అందేలా కార్యక్రమాల్ని నిర్వహించడం.
 • 2015 నాటికి ఇంధన సామర్థ్య పెరుగుదలను రెట్టింపు చేయడం.
 • 2030 నాటికి ప్రపంచ ఇంధన వనరుల వినియోగంలో పునరుపయోగించ గల వాటి వినియోగాన్ని రెట్టింపు చేయడం.

వినియోగం

పునరుపయోగించగల ఇంధన వనరుల వినియో గంతోబాటు వీటి వినియోగ సామర్థ్య పెంపు కూడా దీనిలో ముఖ్యమైన భాగం. భవిష్యత్తరాల అవకాశాలను దెబ్బతీయకుండా, ముఖ్యంగా అధిక ఇంధనం అవసరమయ్యే ఉత్పత్తులు, సేవలు వివక్ష లేకుండా అందరికీ అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. సుస్థిర ఇంధన వినియోగంలో ఇది మరో భాగం.

ఎంతోకాలంగా జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. దీనివల్ల వస్తున్న పర్యావరణ సమస్యలు నామమాత్రం. అయితే, వీటి నిర్మాణంలో పెద్దఎత్తున భూమి ముంపుకు గురకావాల్సి వస్తుంది. నిర్వాసితులు అవుతున్నారు. నిర్మాణదశలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదల కూడా ఒక సమస్యే. అప్పుడప్పుడు వచ్చే భారీ వరదలు కూడా మరొక సమస్య. కానీ, ఒక మేర తరచుగా వచ్చే వరదల దుష్ప్రభావాల నివారణకు ఈ ప్రాజెక్టులు దోహదపడుతున్నాయి. మన దేశంలో నిర్మించబడ్డ బహుళ ప్రయోజనాలుగల సాగునీరు, జల విద్యుత్‌ ప్రాజెక్టులు దీనికి మంచి ఉదాహరణ. పరిమితికి మించిన వరదలు నష్టాల్ని కలిగిస్తున్నాయి.

భూగర్భ వేడి వినియోగంతో విద్యుదుత్పాదన అవకాశాలు అమెరికా, ఇండోనేషియా, తూర్పు ఆఫ్రికా, ఫిలిప్పైన్స్‌లాంటి దేశాల్లో భాగానే ఉన్నప్పటికీ మన దేశంలో ఈ వనరులకి అంత ప్రాధాన్యత లేదు.

బొగ్గుకు బదులుగా జీవశేష, వ్యర్థ పదార్థాల (మున్సిపల్‌ వ్యర్థాల) తో తయారుచేసే బ్రికేట్స్‌నే (ఇటుకల్లాంటివి) ఇంధనంగా వినియోగిస్తున్నారు. మనలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వీటికి ప్రాధాన్యత ఎంతో ఉంది. బొగ్గుతో పోల్చినప్పుడు ఇవి 70 % సామర్థ్యం కలిగి ఉన్నాయి.

సౌరశక్తి వేడి సాంకేతికాలు

సూర్యరశ్మి ద్వారా భూమికి చేరే వేడిని సేకరించే సాంకేతికం ఇది. మన దేశంలో దీనిని విరివిగా వినియోగించగలుగు తున్నాం. సోలార్‌కుక్కర్లు, సోలార్‌ వాటర్‌ హీటర్లు దీనికి ఉదాహరణ. దీని వినియోగాన్ని పెంచేందుకు అపార అవకాశాలు ఉన్నాయి.

విద్యుత్‌ వినియోగం

1980, 90 దశకాల నుండి సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే 'ఫొటో ఓల్టెక్‌ సెల్స్‌' విరివిగా అందుబాటులోకి వచ్చాయి. పరిశోధనల వల్ల వీటి ఖర్చు తగ్గుతూ వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఉత్తర అమెరికాలో అతిపెద్ద సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ (15 మె.వా) పనిచేస్తుంది.

పరిశుభ్రమైన వంట స్టవ్‌

అసంపూర్తిగా ఇంధనం మండడం గృహ స్థాయిలో ఆరోగ్య, వాతావరణ సమస్యలను, ఇతర ఇబ్బందుల్ని పెంచుతుంది. పరిశుభ్రమైన పొయ్యి సామాజికపరంగా పేదల అవసరాల్ని తీర్చేలా ఉండాలి.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పిడకలు, పంటల శేష పదార్థాలు, పచ్చికట్టెను సాంప్రదాయ వంట చెరకుగా వాడుతున్నారు. ఈ పద్ధతిలో పొగబారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. దీన్ని అధిగమించడానికి అత్యంత పరిశుభ్రమైన, ఆధునిక గ్యాస్‌ పొయ్యిలు, విద్యుత్‌పొయ్యిలు, సోలార్‌ కుక్కర్‌ వంటి వాటిని అందుబాటులోకి తేవాలి. వీటిమధ్య కిరోసిన్‌ పొయ్యిలు గ్రామీణ వంటచెరుకుతో పోల్చినప్పుడు సమర్థవంత మైనవి. కాలుష్య కారక వాయువుల విడుదలను 90% తగ్గించేస్తాయి. ఇంధన శక్తి వినియోగ సామర్థ్యం 50-70% మధ్య ఉంటుంది. ఎల్‌పిజి గ్యాస్‌ కన్నా కిరోసిన్‌ తక్కువ సామర్థ్యం కలది. కానీ, సాంప్రదాయ వంట చెరకుతో పోల్చినపుడు సమర్థవంతమైంది.

సోలార్‌ కుక్కర్‌లు సూర్యరశ్మి ఉన్నప్పుడే పనిచేస్తాయి. సూర్యరశ్మిలేని సమయాల్లో ప్రత్యామ్నాయ పొయ్యిలను వాడాలి. ఈ నేపథ్యంలో పేదలందరికీ సమర్ధవంతమైన పొయ్యి, చౌకైన ఆధునిక వంట ఇంధనం (గ్యాస్‌), సోలార్‌కుక్కర్‌ తదితరాలు అందుబాటులోకి రావాలి.

పునరుద్ధరించగల సాంకేతికాలు

ఇవి తరిగిపోతున్న భూగర్భ ఇంధన వనరుల (బొగ్గు, ముడిచమురు) పై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. భూగోళ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి తోడ్పడతాయి. ఈ వనరుల మూలం సౌరశక్తి. ఈ సాంకేతికాలను స్థూలంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:

 • మొదటితరం: పారిశ్రామిక విప్లవం ద్వారా ఈ సాంకేతికాలు 19వ శతాబ్ధం నుండి అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ సాంకేతికాలే వినియోగించగల శక్తిని అందించడంలో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. వీటిలో జల విద్యుత్‌, జీవ వృక్ష, వ్యర్థాల్ని కాల్చడం, భూగర్భ వేడిని వినియోగించడం తదితరాలు ఉన్నాయి.
 • రెండోతరం: ఇందులో సౌరశక్తితో వేడి చేయడం లేదా చల్లార్చడం, పవన శక్తి వినియోగం, జీవ ఇంధన వినియోగం, సౌరశక్తిని విద్యుత్తుగా మార్చే ప్రక్రియలు (ఫొటో ఓల్టిక్‌ సెల్స్‌). ఇవన్నీ 1980 దశకంలో విరివిగా వాడకంలోకి వచ్చాయి. 1973-79లో ప్రపంచ ఇంధన సరఫరాలో వచ్చిన సంక్షోభం వల్ల ఈ సాంకేతికాల అభివృద్ధి కోసం పరిశోధనలు, వినియోగం కోసం, పెద్దఎత్తున నిధులు కేటాయించబడ్డాయి. తద్వారా వీటి వినియోగం క్రమంగా పెరుగుతోంది.
 • మూడోతరం: ఇవి అభివృద్ధి దశలోనే ఉన్నాయి. ఆధునిక జీవ ఇంధన వినియోగ పద్ధతులు, జీవ శుద్ధి పరిశ్రమల సాంకేతికాలు, ముఖ్యంగా సౌరశక్తి వినియోగ పద్ధతులు, భూగర్భ ఉష్ణ వినియోగ పద్ధతులు, సముద్ర అలల శక్తి వినియోగం తదితరాలు ఈ కోవ కిందకే వస్తున్నాయి.

వీటిలో మొదటి రెండుతరాల సాంకేతికాలు ఇప్పటికే వాణిజ్యస్థాయిలో వినియోగించ బడుతున్నాయి. మార్కెట్లో కూడా ఉన్నాయి. కానీ మూడోతరం సాంకేతికాలు చురుకైన పరిశోధన, అభివృద్ధి స్థాయిలోనే కొనసాగుతున్నాయి. మొదటితరం సాంకేతికాలు ఆర్థిక సామర్థ్యం రూపంలో రెండోతరం సాంకేతికాలతో పోటీపడుతున్నాయి.

ముఖ్య కార్యక్రమాలు

 • యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని అబూదాబీలో జనవరి 16-18 మధ్య ప్రపంచ భవిష్యత్తు ఇంధన అవసరాలపై జరగనున్న కాన్ఫరెన్స్‌లో అంతర్జాతీయ సుస్థిర ఇంధన సేవలు అందరికీ అందించే వార్షిక కార్యక్రమం ప్రారంభం.
 • ఫిబ్రవరి 15న న్యూఢిల్లీలో ఆసియా ప్రాంత కార్యక్రమాలు ప్రారంభం.
 • జూన్‌ 6-4 మధ్య బ్రెజిల్‌లోని 'రియో డీ జనరో'లో సుస్థిరాభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్‌ నిర్వాహణ.
 • సెప్టెంబర్‌ 18-21 మధ్య అందరికీ సుస్థిర ఇంధన అందుబాటు కార్యక్రమాలపై జనరల్‌ అసెంబ్లీలో ప్రత్యేక నివేదిక.
 • విధానాలే కీలకం

  అంతిమంగా వివిధ రకాల ఇంధనాల వినియోగం, వినియో గించే పద్ధతి, సామర్థ్యం ప్రభుత్వ విధానాల మీద ఆధారపడి ఉంటుంది. వ్యూహాత్మక జోక్యంతో సుస్థిర ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ అందరికీ నాణ్యమైన ఇంధనాన్ని అందించవచ్చు. ముఖ్యంగా వేగంగా అభివృద్ధిపర్చిన ప్రజా రవాణా సౌకర్యాన్ని కాలుష్యరహిత ఇంధనతో నిర్వహిస్తూ, వినియోగాన్ని తగ్గించవచ్చు. కానీ, మన దేశంలో వ్యక్తిగత రవాణా సౌకర్యాలకు వూహించలేని స్థాయిలో ప్రాధాన్యత పెరుగుతుంది. ఫలితంగా ముడి చమురు, బొగ్గు దిగుమతులు పెరుగుతున్నాయి. ప్రత్యామ్నాయంగా, జీవ ఇంధనాల వాడకాన్ని, సౌరశక్తి వినియోగాన్ని గరిష్ఠ స్థాయికి పెంచి ఇంధన అవస రాల్ని తగ్గించవచ్చు. పేదలందరికీ సమర్ధవంతమైన పొయ్యిల్ని, ఆరోగ్యకర ఇంధనాన్ని భరించగలిగే ధరకు అందించి, వారి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ, పర్యావరణ కాలుష్యాన్ని కనీసస్థాయికి తగ్గించవచ్చు.

  వ్యవసాయోత్పత్తి ప్రధానంగా స్థానిక స్వభావంగలది. సుదూర మార్కెట్‌ అవసరాలని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న ఉత్పత్తి విధానం ఇంధన అవసరాలను పెంచుతోంది. స్థానిక అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని, సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో ఉత్పత్తి ఇంధన అవసరాలను ఏమేర తగ్గించగలవో అని తెలుసుకోడానికి క్యూబా అనుభవాలు ఆదర్శవంతంగా మనముందున్నాయి. ఈ సమాచారాన్ని గతంలో ఇచ్చాం. ఈ విషయంలో చైనా అనుభవాలు కూడా ఎంతో తోడ్పడతాయి. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలలో కొత్త సాంకే తికాల వినియోగానికి, ముఖ్యంగా వీటి దిగుమతులకు ప్రోత్సాహం ఇస్తుంది. వ్యవసాయ రంగంలో కొత్తగా వస్తున్న సాంకేతికాల్లో ఎక్కువ భాగం అధిక ఇంధన వినియోగం మీద ఆధారపడుతున్నాయి. పర్యావరణ సమస్యలు పెంచేవిగా ఉన్నాయి. ఈ సాంకేతికాలన్నీ సాంప్రదాయ, సుస్థిర సేద్య పద్ధతులకు బదులుగా వస్తున్నాయి. తక్కువ ఇంధన వినియోగం మీద ఆధారపడి, పర్యావరణపరంగా సురక్షితమైన సమగ్ర పోషక యాజమాన్యం, సస్యరక్షణ వంటి పద్ధతుల మీద కాకుండా అశాస్త్రీయ అధిక ఎరువులు, సస్యరక్షణ మందుల వాడకం మీద ఆధారపడుతున్నాయి. దీనికి బదులుగా కొత్త సాంకేతికాల ఇంధన అవసరాలను అంచనా వేసి, స్థానిక అవకాశాలతో పోల్చిన తర్వాతనే అనుమతివ్వాలి. తద్వారా ఇంధన వినియోగాన్ని కనీస స్థాయికి తగ్గించవచ్చు. ఇవేవీ ప్రభుత్వానికి తెలియదని కాదు. కానీ, ఈ దృష్టితో ఆలోచించి, నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇప్పుడైనా సరైన నిర్ణయాన్ని తీసుకుంటుందని ఆశిద్దాం.

  మీకు తెలుసా?

 • మన దేశ ఇంధన అవసరాల్లో 52% బొగ్గు తీరుస్తుంది.
 • ఇప్పుడు 17 అణు విద్యుత్‌ కర్మాగారాలు 4.2% మేర విద్యుత్‌ అవసరాల్ని తీరుస్తున్నాయి. వచ్చే 20 సంవత్సరాల్లో ఈ కర్మాగారాలు 9% విద్యుత్‌ అవసరాలను తీర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది.
 • పవనవిద్యుత్‌ మొత్తం అవసరాల్లో 1.6% మేర తీరుస్తుంది. ఋతు పవనాల కదలికలపై వీటి ప్రభావాల్ని అధ్యయనం చేయాల్సి ఉంది.
 • రవాణా ఇంధన అవసరాల్లో 80% పెట్రోలియం ఉత్పత్తులు తీరుస్తున్నాయి. దీనిలో 25-30% దేశంలోనే ఉత్పత్తి అవుతుండగా, మిగతా అవసరాల్ని దిగుమతులతో తీర్చుకోవాల్సి వస్తుంది.
 • సౌర విద్యుత్‌ తయారీకి అవసరమైన సూర్యరశ్మి మన దేశంలో అపారం. ఉచితం. సూర్యరశ్మిని విద్యుత్‌గా మార్చేందుకు అవసరమైన సాంకేతికాల వినియోగానికి ప్రారంభంలోనే అధిక పెట్టుబడి కావాలి. కానీ, ప్రారంభమైన తర్వాత విద్యుదుత్పత్తి ఖర్చులు అతి స్వల్పం.
 • థార్‌ ఎడారిలోని 35 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని సౌర విద్యుదుత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది.
 • ఆహార ఉత్పత్తితో జీవ ఇంధన ఉత్పత్తి పోటీపడుతుంది. జీవ ఇంధన ఉత్పత్తివల్ల ఆహారధాన్యాల ధరలు 6-7% పెరుగుతాయని అంచనా.
 • పెట్రోల్‌లో 20% మేర ఇథనాల్‌ను కలిపి, వచ్చిన మిశ్రమాన్ని ఇంజన్‌లో ఏమార్పు లేకుండా వాడవచ్చు. మనదేశంలో ఇలా 10 % కలిపి వాడుతున్నాం.
 • 2011-12 లో మన పెట్రోల్‌ వాడకం 12.85 మి.టన్నులు. 2016-17కి ఇది 16.4 మి.టన్నులకు పెరుగుతుంది. దీనిలో జీవ ఇంధనాన్ని 10% కలపడానికి 2011-12లో 1.29 మి.టన్నులు, 2016-17లో 1.64 మి.టన్నుల అవసరం.
 • డీజిల్‌ ఇంజన్‌లో ఏమార్పూ లేకుండా 20% వరకూ బయో డీజిల్‌ను కలిపిన మిశ్రమాన్ని వాడొచ్చు.
 • 2010-11 నాటికి మన డీజిల్‌ వాడకం 66.91 మి.టన్నులు ఉంటుంది. 2016-17 నాటికి ఇది 83.58 మి.టన్నులకు పెరుగు తుంది. దీనిలో 10 % బయో డీజిల్‌ కలపడానికి 2011-12లో 6.69 మి.టన్నులు, 2016-17 నాటికి 8.36 మి.టన్నుల బయో డీజిల్‌ అవసరం.
 • జట్రోపా, గానుగ నూనెలను నేరుగా డీజిల్‌ ఇంజన్లలో ఇంధనంగా వాడొచ్చు.
 • గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను 9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

  ఆధారము: ఇండియన్ సైన్స్ టీచర్.బ్లాగ్ స్పాట్.ఇన్

  2.98780487805
  మీ సూచనను పోస్ట్ చేయండి

  (ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

  Enter the word
  నావిగేషన్
  పైకి వెళ్ళుటకు