హోమ్ / శక్తి వనరులు / ఇంధన వనరులు / చీకటి దారిలో 'సౌరకాంతులు'
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

చీకటి దారిలో 'సౌరకాంతులు'

సౌరశక్తికి పెద్దపీట వేయాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా... దేశాన్ని కమ్మేయడానికి కారుచీకట్లు సిద్ధంగా ఉన్నాయి.

సౌరశక్తికి పెద్దపీట వేయాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా... దేశాన్ని కమ్మేయడానికి కారుచీకట్లు సిద్ధంగా ఉన్నాయి. దేవుడున్నాడనేవారు ఉన్నారు. లేడనేవారూ ఉన్నారు. సూర్యదేవుడి విషయంలో మాత్రం - భిన్నాభిప్రాయాల్లేవు. భేదాభిప్రాయాల్లేవు. అతడున్నాడు. కనిపిస్తున్నాడు. కరుణిస్తున్నాడు. వెలుగుల వరాలిస్తున్నాడు. కిరణాల భరణాలు మంజూరు చేస్తున్నాడు. ప్రపంచాన్నంతా పహరాకాస్తున్నాడు. అంకితభావంలో భానుదేవుడికి వందకు వందమార్కులు! సౌరశక్తిని ఉపయోగించుకోవడంలో...మనిషి చిత్తశుద్ధికి మాత్రం ఎప్పుడూ చెత్త మార్కులే. ఎంత మూర్ఖత్వం కాకపోతే, కళ్లముందు అమృతభాండం ఉంటే...వూటచెలమల వెంట ఉరుకులు పెడతాడా! అక్షయపాత్రను కాలదన్ని, అంతర్జాతీయ వీధుల్లో అడుక్కుతింటాడా! ధగధగల కోహినూర్‌ వజ్రాన్ని వద్దని, మిణుగురుల మీద మనసు పారేసుకుంటాడా!

నిన్నమొన్నటి గ్రిడ్‌ వైఫల్యం అక్షరాలా మానవతప్పిదమే. ఆ రెండు రోజులూ ఇరవై ఒక్క రాష్ట్రాల్లోని అరవైకోట్లమంది నరకాన్ని చవిచూశారు. తినడానికి పదిరొట్టెలు ఉన్నప్పుడు, తినవలసినవారు పాతికమంది అయినప్పుడు... బలవంతుడిదే భోజ్యం! అదే జరిగిందక్కడ. విద్యుత్‌ అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉత్పత్తిలో మాత్రం తేడాలేదు. దీంతో హర్యానా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌...చేతివాటం ప్రదర్శించాయి. వాటాను మించి లాక్కున్నాయి. ఇంకేముంది, సరఫరా వ్యవస్థ స్తంభించిపోయింది. బుద్ధిబలం చూపాల్సిన చోట, కండబలం ప్రదర్శిస్తే ఇలానే ఉంటుంది. నిజమే, సమస్య తీవ్రమైందే. విద్యుత్‌ సంక్షోభం కారణంగా...కరెంటు కోతలు ఎక్కువవుతున్నాయి. సకాలంలో నీరందక పంటలెండిపోతున్నాయి. రైతు కుదేలైపోతున్నాడు. కోతలతో పారిశ్రామికరంగం వణికిపోతోంది. చిన్నాచితకా ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. కార్మికులకు చేతినిండా పనుల్లేని పరిస్థితి. ఇంట్లోనూ కోతలే. దీపం వెలగదు. టీవీ మూగబోతుంది. లిఫ్టు ఆగిపోతుంది. గీజర్‌ పనిచేయదు. కరెంటు కష్టాలతో మొత్తంగా జనజీవనమే అతలాకుతలమైపోతోంది. ప్రజలకు పాలన వ్యవస్థ మీద నమ్మకం పోతోంది. కరెంటు ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత, వూడితే ఎంత...అన్నంత ఆగ్రహం. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? చేసేదేముంది... తూరుపు తిరిగి దండంపెట్టాలి. ఎదురుగా...

తొలిపొద్దు సూర్యుడు!

సకల సమస్యలకూ పరిష్కారం. సర్వసంక్షోభాలకూ నివారణోపాయం. కోరినంత ఇంధనం. కొలవలేనంత శక్తిసంపన్నం! ఆంగ్లంలో సోలార్‌ ఎనర్జీ, అచ్చమైన సౌరశక్తి. ఒక్క గంటలో భూమిని తాకే సూర్యరశ్మి చాలు- ఏడాదిపాటూ ప్రపంచానికంతా ఇంధన సమస్యలుండవు. సంవత్సర కాలంలో వెలువడే సూర్యకిరణాలు - సమస్త భూమండలంలోని శిలాజ ఇంధనాలూ అణుశక్తితో సరిసమానం. మనింటి విద్యుద్దీపాల్లోకి... మనూరి వీధిదీపాల్లోకి, కార్ఖానాల కరెంటు తీగల్లోకి...సూర్యశక్తిని ఆవాహనం చేద్దాం రండి!

ఓం మిత్రాయ నమః

సూర్యుడికి మిత్రుడని పేరు. ఆపద సమయంలో ఆదుకోవడంలో స్నేహితుడే ముందుంటాడు. అరబ్‌దేశాలు అలిగితే చమురు సరఫరా బందైపోతుంది. వరుణుడి ఉద్ధృతి తగ్గితే జలవిద్యుత్‌ ఆగిపోతుంది. బొగ్గునిల్వలు నిండుకుంటే థర్మల్‌ పవర్‌ మొరాయిస్తుంది. ప్రమాద తీవ్రతల కారణంగా అణువిద్యుత్‌ గురించి ధైర్యంగా ఆలోచించలేకపోతున్నాం. పవన విద్యుత్‌ ప్రభావమూ అంతంతమాత్రమే. ఈ పరిస్థితుల్లో... ఆదిత్యుడే ఆధారం. మనది ఉష్ణదేశం. ఎండలకు కొదవే లేదు. మబ్బులు కమ్మినా, ఉరుములు ఉరిమినా ఆ కాసేపే. దాగుడుమూతలాటలో గెలిచిన కుర్రాడిలా... మరునిమిషమే సూర్యుడు ప్రత్యక్షమైపోతాడు. ఆ అనంతశక్తి శాశ్వతం. ఎవరూ ఆపలేరు. ఎవరూ ఆటంకాలు సృష్టించలేరు. ఎవరూ సరఫరా తగ్గించలేరు. ఇంత నమ్మకమైన, ఇంత సుస్థిరమైన, ఇంత నిరంతరాయమైన శక్తివనరు మరొకటి కనిపించదు. ఇక, టెక్నాలజీలో అయితే గందరగోళమే లేదు. అత్యంత సరళమైన ప్రక్రియ. సిలికాన్‌ పదార్థంతో చేసిన సోలార్‌సెల్‌ మీద ప్రసరించిన సూర్యకిరణాలు ఫొటో ఎలక్ట్రిక్‌ పద్ధతిలో విద్యుచ్ఛక్తిగా మారిపోతాయి. ఆ శక్తిని ఇంటికి వాడుకుంటామా, ఆఫీసుకు వాడుకుంటామా, ఫ్యాక్టరీకి వాడుకుంటామా...అన్నది మనిష్టం. పదేళ్ల తర్వాత పరిస్థితి ఏమిటి, పాతికేళ్ల తర్వాత పరిస్థితి ఏమిటి, జనాభా నూటపాతికకోట్లు అయితే, నూటయాభైకోట్లు దాటితే.. తరహా సందేహాలే అక్కర్లేదు. ఏ పరిస్థితుల్లో అయినా...సోలార్‌ అండ ఉండితీరుతుంది.

మూడుచేపల కథలో...ప్రాప్తకాలజ్ఞుడిలా సమస్య ముంచుకొస్తున్నప్పుడే మనం పరిష్కారాల గురించి ఆలోచిస్తాం. సౌరశక్తి విషయంలోనూ అదే జరిగింది. చార్లెస్‌ ఫ్రిట్స్‌ అనే నిపుణుడు 1880లో తొలి సౌరకణాన్ని తయారు చేశాడు. కొత్తకొత్త పెట్రోలియం వనరులు లభించడం, బొగ్గునిల్వలు దండిగా ఉండటం...తదితర కారణాల వల్ల ఆ ప్రత్యామ్నాయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. 1973లో చమురు సంక్షోభం చేతిచమురు వదలగొట్టింది. ఆతర్వాత ఆరేళ్లకి విద్యుత్‌ సంక్షోభం షాకుల మీద షాకులిచ్చింది. అప్పుడు కానీ బుద్ధిరాలేదు, మరోదారి అనివార్యమని అర్థంకాలేదు. ఆ దశాబ్దంలో సోలార్‌ ప్రాజెక్టులు వూపందుకున్నాయి. ఆ వైభోగమూ మూణ్నాళ్ల ముచ్చటే. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్‌ ధరలు పడిపోవడంతో...మళ్లీ పాతపద్ధతే. గత దశాబ్దాల్లో సంభవించిన పరిణామాలు సౌరశక్తికి సాటీపోటీ లేదని నిరూపించాయి. ప్రధానంగా, చమురు లభ్యత తగ్గింది. గిరాకీ పెరిగింది. భూతాపం అధికమైంది. సంప్రదాయ వనరుల మీదున్న భ్రమలన్నీ తొలగిపోయాయి. పర్యావరణ ఉద్యమకారుల ప్రభావమూ కొంత పనిచేసింది. ఫలితంగా, ప్రభుత్వాలు సోలార్‌ ఎనర్జీపై దృష్టిసారించక తప్పలేదు. పదేళ్లుగా...ఏడాదికి నలభైశాతం చొప్పున సౌరవిద్యుత్‌ ఉత్పత్తి పెరుగుతోంది. మార్కెట్‌ విస్తరించడంతో... ఫొటో వోల్టాయిక్‌ మాడ్యూళ్ల ధరలు అరవైశాతం దాకా పడిపోయాయి. రానున్నరోజుల్లో మరింత తగ్గవచ్చని భావిస్తున్నారు. 'సౌరశక్తి ధనికులకే పరిమితం అన్న అపోహ తొలగిపోతోంది. ఇంకో రెండుమూడేళ్లలో సంప్రదాయ విద్యుత్‌ వనరులతో పోటీపడబోతోంది' అంటారు ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ కంపెనీ 'సన్‌టెక్‌పవర్‌' అధినేత షిచెన్‌గ్రాంగ్‌. అంతర్జాతీయ ఇంధన సంస్థ కూడా ఈ అభిప్రాయాన్ని బలపరుస్తోంది...'రానున్న కాలంలో ప్రపంచ విద్యుత్‌ అవసరాల్లో చాలా భాగం సౌరశక్తి ద్వారానే తీరబోతోంది' అన్నది తాజా నివేదిక సారాంశం.

అంతర్జాతీయ వెలుగులు.

ఇంధన భద్రత...
కర్బన ఉద్గారాల తగ్గింపు..
- రెండూ అంతర్జాతీయ ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యలే. రెండింటికీ సౌరశక్తిలో పరిష్కారం ఉంది. అమెరికా, జపాన్‌, చైనా వంటి దేశాలు సౌరశక్తి ప్రాధాన్యాన్ని ఎప్పుడో గుర్తించాయి. ఇజ్రాయిల్‌, సౌదీ అరేబియా కూడా ఆవైపుగా అడుగులేస్తున్నాయి. దాదాపు వంద దేశాలు తమకంటూ ఓ సౌర విధానాన్ని రూపొందించుకున్నాయి. పశ్చిమ యూరప్‌ దేశాలు సోలార్‌ ఎనర్జీకి రాయితీలిచ్చి ప్రోత్సహిస్తూ, సంప్రదాయ ఇంధన పరిశ్రమపై పన్నుల మోత మోగిస్తున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన జపాన్‌, చైనా బొగ్గు వినియోగం మీద నియంత్రణ పెట్టాయి. జర్మనీ ఏడు అణువిద్యుత్‌ రియాక్టర్లను మూసేసింది. ఆమేరకు సౌరశక్తిపై దృష్టిసారించింది. ఇప్పటికే 12.1 గిగావాట్ల సామర్థ్యాన్ని సాధించింది. ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటున్న అమెరికా కూడా... సౌరవిద్యుత్‌ ఉత్పత్తిదారులకు రాయితీలు ఇస్తోంది. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రచారం చేస్తోంది. కాలిఫోర్నియాలో రూపుదిద్దుకుంటున్న మొజావి సోలార్‌ పార్క్‌ ప్రపంచంలోనే అతిపెద్దది. దీని సామర్థ్యం... 553 మెగావాట్లు.

మరి, మనం

భారత్‌కు సంబంధించినంత వరకూ బొగ్గు (52.9 శాతం), పెట్రోలియం (29.6 శాతం), సహజ వాయువులు (10.6 శాతం)...ప్రధాన శక్తివనరులు. అందులో 30 శాతం బొగ్గునూ 73 శాతం చమురునూ 20 శాతం సహజ వాయువులనూ దిగుమతి చేసుకుంటున్నాం. జనాభా పెరగడం, వినియోగం అధికం కావడం...తదితర కారణాల వల్ల దిగుమతి పెరుగుతోందే కాని, తగ్గడం లేదు. అంటే..ఇప్పటికీ మనం పరాన్నజీవులమే! ఎవరో ఇవ్వాలి, మనం ఖర్చుచేయాలి? ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా గందరగోళమే! చమురు ధర బ్యారెల్‌కు 10 డాలర్లు పెరిగితే, మన జీడీపీలో వృద్ధి 0.2 తగ్గుతుంది. కరెంట్‌ అకౌంట్‌ లోటు 4 శాతం పెరుగుతుంది. విదేశీ ద్రవ్య నిల్వలు పడిపోతాయి. ఎంత ఘోరం! ఎంత పరాధీనం! వీటన్నిటివల్లా మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద ఒత్తిడి పెరుగుతుంది. దినదినగండం లాంటి పరిస్థితుల్లో ... మౌలిక వనరుల అభివృద్ధి గురించీ సంక్షేమ కార్యక్రమాల గురించీ ఎలా ఆలోచించగలం? తరాలనాటి థర్మల్‌ప్లాంట్లు...వాతావరణానికి మసిపూస్తున్నాయి. భారత్‌ 199.87 గిగావాట్ల సామర్థ్యంతో విద్యుత్‌ ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉన్నా..తలసరి వినియోగంలో మాత్రం ఏ మూలనో! ఇప్పటికీ 30 కోట్లమంది ప్రజలకు కరెంటు అందుబాటులో లేదు. అందుబాటులో ఉన్నవారికి కూడా అందుతున్నది అంతంతే! ఎప్పుడూ కోతలే. ప్రపంచ తలసరి విద్యుత్‌ వినియోగం - 2600 కిలోవాట్‌ గంటలైతే, యూరప్‌ దేశాల్లో అది 6200 కిలోవాట్‌ గంటలు. మనం మాత్రం 288 దగ్గరే (ఇది పట్టణాల సంగతి. గ్రామాల్లో అయితే..96 కిలోవాట్‌ గంటలే) కొట్టుమిట్టాడుతున్నాం. ఆకాస్త విద్యుత్‌ అందించడానికి కూడా అల్లాడిపోతున్నాం. పొలాలు ఎండిపోతున్నాయి. ఫ్యాక్టరీలు మూతబడుతున్నాయి. ప్రజల జీవితాలు చీకట్లో మగ్గిపోతున్నాయి. ఓటర్లకు జవాబు చెప్పుకోలేక... ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల మొహం కూడా చూడటం లేదు. ఓరకంగా ప్రజలకు పాలన వ్యవస్థ మీదే నమ్మకం పోతోంది. ఏ ప్రజాస్వామ్య దేశానికైనా ఇదంత శుభపరిణామం కాదు. వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించాలి, దీర్ఘకాలిక లక్ష్యంతో ఇంధన విధానాన్ని రూపొందించుకోవాలి. అక్షయమైన, సురక్షితమైన 'సోలార్‌ ఎనర్జీ'కి పెద్దపీట వేయాలి.

భానుదేవుడి కటాక్ష వీక్షణాలకు కొదవే లేదు. ఏడాదికి మూడువందల రోజులు ఎండలే. అందులో పదిశాతం వాడుకున్నా..అది ఎనభై లక్షల మెగావాట్ల శక్తితో సమానం. కానీ మనం వినియోగించుకుంటున్న సౌరశక్తి అందులో ఒక్క శాతం కూడా లేదు. నిజానికి, చాలా దేశాలకు సౌరశక్తి ప్రాధాన్యం తెలియనైనా తెలియని రోజుల్లోనే...మూడు దశాబ్దాల క్రితమే సంప్రదాయేతర ఇంధనవనరుల మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసుకున్నాం. చొరవ తగ్గడం, దిశానిర్దేశం లేకపోవడం, పాలకుల నిర్లక్ష్యం...తదితర కారణాల వల్ల సౌరశక్తి రంగంలో చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించలేకపోయాం. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా... ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు ఎంతోకొంత క్రియాశీలంగానే వ్యవహరిస్తున్నాయి. 2009లో ప్రకటించిన జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ సౌరవిధానం...సోలార్‌పవర్‌కు సంబంధించి రాజ్యాంగం లాంటిది. 2022 నాటికి 22 వేల మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. అదే జరిగితే, మన విద్యుత్‌ అవసరాల్లో ఏడుశాతం దాకా సౌరశక్తి ద్వారానే తీరుతుంది. కర్బన ఉద్గారాల్లో 2.6 శాతం తగ్గుదల కనిపిస్తుంది. బొగ్గు దిగుమతుల్ని తగ్గించుకోవడం ద్వారా వందల కోట్లు ఆదా చేసుకోగలం.

సవాళ్లుంటేనేం...

మార్పు కష్టమే. అసాధ్యం మాత్రం కాదు. అందులోనూ మూసధోరణికి అలవాటుపడిన పాలకులనూ అధికారులనూ దారి మళ్లించడం అంటే, ఓ యజ్ఞమే - వెలుతురు యజ్ఞం. సౌరశక్తి ఖరీదైన వ్యవహారమన్నది ప్రధాన ఆరోపణ. నిజమే, కానీ ఇదంతా గతం. సంప్రదాయ ఇంధన వనరుల లభ్యత బాగా పడిపోతోంది. వాటి ధరలు కూడా పైపైకి ఎగబాకుతున్నాయి. అదే సమయంలో... గిరాకీ పెరగడం, టెక్నాలజీలో ముందడుగు- తదితర కారణాల వల్ల సౌరశక్తి ఉత్పత్తి వ్యయం తగ్గుతోంది. రెండింటి ఖర్చూ దాదాపుగా సరిసమానం అయ్యే రోజు దగ్గర్లోనే ఉంది. పెట్రోల్‌, డీజిల్‌, కిరోసిన్‌ల మీద ఇస్తున్న సబ్సిడీని ఎత్తేసి...ఆ మేరకు సోలార్‌ ఎనర్జీని ప్రోత్సహించగలిగితే తిరుగే ఉండదు. సౌరపరికరాల కొనుగోలుకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదన్నది మరో విమర్శ. ఇందులో కొంత నిజం ఉంది. చాలామంది బ్యాంకు అధికారులకు సౌరశక్తి ప్రాధాన్యం తెలియదు. వాటి విలువా తెలియదు. గృహరుణాలకు ఉన్నట్టే...సౌరశక్తి రంగానికీ ఓ ప్రత్యేక విభాగం ఉంటే సమస్యలు తలెత్తవు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో సౌరపరికరాలకు మరమ్మతులు చేయడానికి తగిన వ్యవస్థంటూ లేదు. నిపుణుల కొరత బాగా వేధిస్తోంది. గృహ అవసరాలకు ఉపయోగించే సౌర పరికరాల రిపేరుకు డిగ్రీలూ డిప్లొమాలూ అవసరం లేదు. ఏదైనా స్వచ్ఛంద సంస్థ పూనుకుని...గ్రామీణ యువతకు శిక్షణ ఇప్పించవచ్చు. రాజస్థాన్‌లోని 'బేర్‌ఫుట్‌ కాలేజీ' ఈతరహా కార్యక్రమం ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది. సౌరవిద్యుత్‌ను ఒక చోటి నుంచి మరో చోటికి తరలించడం కష్టమైన పని. పంపిణీ వృథా అధికం. నిజానికి, ఒక్క రాజస్థాన్‌ ఎడారి చాలు. దేశానికి అవసరమైన విద్యుత్‌ మొత్తం, సౌరమార్గంలో తయారు చేసుకోవచ్చు. సమస్యంతా సరఫరాలోనే. ఈ పరిమితినీ త్వరలోనే అధిగమిస్తామంటున్నారు శాస్త్రవేత్తలు.

'గ్రిడ్‌' వైఫల్యం కారణంగా దాదాపు సగం భారతదేశం కటిక చీకట్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో.. మధ్యప్రదేశ్‌లోని మీర్వాడాలో దీపాలు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, నీటిపంపులు పనిచేస్తున్నాయి. అంతా సౌరశక్తి మహిమ! ఆ వూళ్లో 14 కిలోవాట్ల సౌరవిద్యుత్‌ కేంద్రం ఉంది. సన్‌ఎడిసన్‌ అనే అమెరికన్‌ సంస్థ ప్రయోగాత్మకంగా ఇక్కడా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందుకైన ఖర్చు దాదాపు యాభైలక్షలు. గ్రామస్థుల సౌరవిద్యుత్‌ బిల్లు నెలకు 75 రూపాయల లోపు. 'కోతల' కరెంటుతో పోలిస్తే తక్కువే.
మీర్వాడా... సౌర'శక్తి'కి తార్కాణం.
దేశానికంతా 'వెలుగుల' పాఠం.

సౌరదీపాలు

విద్యుత్‌ సౌకర్యంలేని మారుమూల ప్రాంతాలకు సౌరశక్తి ప్లాంట్లే శరణ్యం. ఇవి చాలా చవకైనవి. మెరుగైనవి కూడా. పట్టణ వినియోగంలో నలభైశాతాన్ని ఆక్రమించిన వీధిదీపాల విషయంలోనూ సౌరశక్తే సరైన ప్రత్యామ్నాయం.

సోలార్‌ స్టౌ

ఇప్పటికీ ఎనిమిది కోట్లమంది భారతీయులు కట్టెలు, వ్యవసాయ వ్యర్థాలు, పేడ వంటచెరుకుగా వాడుతున్నారు. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. ఏటా 3 నుంచి 4 లక్షల మంది మరణిస్తున్నారు. చర్మవ్యాధులూ నేత్ర సమస్యలూ బాధిస్తున్నాయి. సోలార్‌ పొయ్యితో గ్రామీణ మహిళల కష్టాలు తీర్చవచ్చు.

పంపులు

రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ విద్యుత్‌పై ఎనభైశాతం దాకా సబ్సిడీ ఇస్తున్నాయి. ఇంత ఖర్చుపెట్టినా.. సుఖంలేదు. కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయి. వేళాపాళాలేని సరఫరా వల్ల రైతు విషకీటకాల బారినపడుతున్నాడు. విద్యుత్‌ నాణ్యతా అంతంతమాత్రమే. సోలార్‌ పంపుతో రైతు కష్టాలు తీరతాయి.

వాటర్‌ హీటర్లు

ఇళ్లలో, హోటళ్లలో, ఆసుపత్రుల్లో, ఫ్యాక్టరీల్లో నీటిని వేడిచేసుకోడానికి అనువైనవి. ఇంధన పొదుపులో వీటిదే ప్రధాన పాత్ర. ఇజ్రాయిల్‌లో తొంభైశాతం నివాసాలకు సోలార్‌ హీటర్లు ఉన్నాయి. అన్ని సర్కారీ భవనాలకూ వీటినే బిగించాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది కానీ, ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు.

డ్రయర్లు

సోలార్‌ డ్రయర్లు వ్యవసాయ రంగానికో వరం. ఇవి చాలా సమర్థంగా పనిచేస్తాయి. వ్యవసాయ ఉత్పత్తుల రంగు, రుచి కాస్త కూడా మారవు. బయటి వాతావరణంతో సంబంధం ఉండదు కాబట్టి, దుమ్మూధూళీ పడదు. పక్షులూ కీటకాల బెడద ఉండదు. పంట ఎండబెట్టడానికి ప్రత్యేక స్థలం అంటూ అవసరం లేదు. పాలీహౌస్‌ సోలార్‌ డ్రయర్లను సీజన్‌ అయిపోయాక, హైబ్రీడ్‌ నారు పెంచుకోడానికీ వాడుకోవచ్చు. నిరుద్యోగులకు మంచి ఉపాధి.

ఆరోగ్యరంగం

కరెంటు లేని గ్రామాల్లో, ఉన్నా కరెంటుకోతల పరిస్థితుల్లో...ఏ వైద్యుడూ పూర్తిస్థాయిలో ఆరోగ్య సేవలు అందించలేడు. చిన్నచిన్న శస్త్రచికిత్సలు చేయడానికి కూడా వెలుతురు లేని పరిస్థితి. పరికరాల్ని స్టెరిలైజ్‌ చేయడమూ కుదరదు. గ్రామీణ వైద్యానికి సౌర విద్యుత్‌ను అనుసంధానించడం వల్ల ఇలాంటి సమస్యలు చాలావరకూ పరిష్కారం అవుతాయి.

ఎయిర్‌ కండిషనర్లు

పెద్దపెద్ద కంపెనీల్లో, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఎయిర్‌ కండిషనర్ల వినియోగం భారీ స్థాయిలో ఉంటుంది. ఆ మేరకు కరెంటు ఖర్చులూ ఉంటాయి. విద్యుత్‌ భారాన్ని తగ్గించడానికి గుజరాత్‌కు చెందిన దీపక్‌గాధియా సోలార్‌ ఏసీ ప్లాంట్‌ను రూపొందించారు. మునిసేవ ఆశ్రమ్‌లోని 120 పడకల క్యాన్సర్‌ ఆసుపత్రిలోని ఏసీలన్నీ ఆ సౌరశక్తితోనే నడుస్తాయి. అర్క టెక్నాలజీస్‌ తదితర సంస్థలు గృహ వినియోగానికి కూడా ఏసీలను అందిస్తున్నాయి.

ఇన్వర్టర్లు

కరెంటు కోతల సమయాల్లో సోలార్‌ ఇన్వర్టర్లపై ఆధారపడవచ్చు. వీటికి ప్రభుత్వం నలభైశాతం సబ్సిడీ ఇస్తోంది. యాభైశాతం దాకా రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకొస్తున్నాయి. మిగిలిన పదిశాతం భరిస్తే చాలు. ధరలు...సామర్థ్యాన్ని బట్టి 27 వేల నుంచి 56 వేల దాకా ఉన్నాయి.

టెలికాం టవర్లు

భారత్‌లో దాదాపు 73 కోట్లమంది సెల్‌ఫోన్లు వాడుతున్నారు. ఫలితంగా, 3.1 లక్షల టవర్లకు విద్యుత్‌ సరఫరా చేయాల్సి వస్తోంది. దీనికితోడు, ఏటా 200 కోట్ల లీటర్ల డీజిల్‌ ఖర్చు అవుతుంది. అంటే... 52.6 లక్షల టన్నుల కార్బన్‌-డై-ఆక్సైడ్‌ను చేజేతులా వాతావరణంలో కలిపేస్తున్నాం. టవర్ల నిర్వహణకు సౌరశక్తిని ఉపయోగిస్తే ఎలాంటి సమస్యా ఉండదు. వీటి కొనుగోలుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది.

శెభాష్‌..గుజరాత్‌!

దేశంలో ఉత్పత్తి అవుతున్న సౌర విద్యుత్‌లో మూడింట రెండోవంతు గుజరాత్‌ నుంచే వస్తోంది. విద్యుత్‌ రంగంలో మిగులు సాధిస్తున్నా..అంతటితో సంతృప్తి చెందకుండా సంప్రదాయేతర ఇంధన వనరుల్ని మరింతగా ప్రోత్సహిస్తోంది నరేంద్రమోడీ సర్కారు. ఈ కార్యక్రమానికి ఏటా 2వేల కోట్లు ఖర్చు చేస్తోంది. 'రాష్ట్ర సంక్షేమం కోసం ఈ మాత్రం ముందుజాగ్రత్త ఉండాల్సిందే' అంటారు మోడీ. సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టు కాలువలపై సోలార్‌ ప్యానళ్లతో విద్యుత్‌ ఉత్పత్తి చేయడం.. వినూత్నమైన ఆలోచన. దీనివల్ల ఏటా 1.6 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. అంతేకాదు, 90 లక్షల లీటర్ల నీరు ఆవిరైపోకుండా కాపాడుకోవచ్చు. మొత్తం వ్యయం 17.71 కోట్లు. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను చుట్టుపక్కల గ్రామాలకు అందిస్తారు. దీనివల్ల... సరఫరా నష్టాలనూ తగ్గించవచ్చు. చరంకా ప్రాంతంలో ప్రారంభమైన సోలార్‌ పార్కులో...పవన విద్యుత్‌నూ ఉత్పత్తిచేస్తున్నారు. ఇక్కడ అనుసరిస్తున్న 'హైబ్రీడ్‌' పద్ధతి వల్ల స్థలం వృథా కాకుండా ఉంటుంది.

ఆధారము: అల్ ఇన్ వన్ వివేగా.బ్లాగ్ స్పాట్.ఇన్

2.9756097561
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు