హోమ్ / శక్తి వనరులు / ఇంధన వనరులు / సౌరశక్తితో రాష్ట్రం సుభిక్షం!
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సౌరశక్తితో రాష్ట్రం సుభిక్షం!

రాష్ట్రంలో విద్యుత్‌ కొరతతో పారిశ్రామిక, వ్యవసాయ, గృహ వినియోగ అవసరాలకు తీవ్ర అవాంతరం ఏర్పడుతోంది.

కనీ వినీ ఎరుగని విద్యుత్‌ కొరత
సౌర విద్యుత్‌తో సమస్య పరిష్కారం 
ప్రపంచ దేశాల్లో పరిశోధనలు
ఇంటింటికీ ఉత్పత్తి చెయ్యచ్చు
అవసరమైనంత వాడుకోవచ్చు
మిగిలినది అమ్ముకోవచ్చు 
పరికరాలు సమకూర్చడం ప్రభుత్వ బాధ్యతే
కాలుష్యం సమస్య దూరం.

సౌర విద్యుత్‌తో సమస్య పరిష్కారం

రాష్ట్రంలో విద్యుత్‌ కొరతతో పారిశ్రామిక, వ్యవసాయ, గృహ వినియోగ అవసరాలకు తీవ్ర అవాంతరం ఏర్పడుతోంది. విద్యుత్‌కు ఏర్పడిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడం వల్ల కుటుంబాలనుంచి పరిశ్రమల వరకూ ఊహించని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పరిశ్రమలు 60 శాతం విద్యుత్‌ కోతను భరిస్తున్నాయి. విద్యుత్‌ కోతల వల్ల చిన్న పరిశ్రమలు మూతపడుతుండగా, పెద్ద పరిశ్రమల్లో ఉత్పత్తి కార్యక్రమాలకు భారీ స్థాయిలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో కరెంటు కోతల గురించి చెప్పనక్కర లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామాలు చీకట్లో మగ్గిపోతున్నాయి. పట్టణ, నగర ప్రాంతాలలో తీవ్రస్థాయి విద్యుత్‌ కోతలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మీద డిమాండ్‌- సరఫరా మధ్య తీవ్ర అంతరం ఏర్పడడం వల్ల కరెంటు కోతలు తప్పడం లేదు.

కె.జి. బేసిన్‌

కె.జి. బేసిన్‌ నుంచి గ్యాస్‌ సరఫరా నిలచిపోవడం, రుతుపవనాలు విఫలం కావడం, జలాశయాల్లో నీటి మట్టం తగ్గడం వంటివి విద్యుత్‌ కొరతకు కారణాలుగా ప్రభుత్వం చెబుతోంది. విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, నీరు, గ్యాస్‌, రవాణా వసతులు వంటివాటికి తగు గ్రాంట్లను ప్రభుత్వ ఉత్పత్తి కంపెనీలకు కేటాయించకుండా- ప్రైవేట్‌ కంపెనీలకు అందించడం వల్ల, కార్పొరేట్‌ కంపెనీలను ప్రోత్సిహంచడం వల్ల కరెంటు కోత ఏర్పడుతోందని మాత్రం ప్రభుత్వం చెప్పదు. ఎందుకంటే, ప్రభుత్వ విధానాలే పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌ కంపెనీలకు ప్రోత్సాహకరంగా మేలు చేస్తున్నాయి. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు.

ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో గనుల కుంభకోణం, ఖమ్మం జిల్లా బయ్యారంలో లక్ష 20 వేల ఎకరాల గనుల లీజును ప్రైవేట్‌ వ్యక్తికి కట్టబెట్టడం, కెజి బేసిన్‌ గ్యాస్‌ను రిలయెన్స్‌ అంబానీ మన రాష్ట్రానికి ఇవ్వకుండా గుజరాత్‌, మహారాష్టల్రకు సరఫరా చేయడం వంటి పలు ఉదంతాలు మన రాష్ట్ర విద్యుత్‌ కొరతకు ప్రధాన కారణాలుగా మారాయి. మన బొగ్గు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి అవుతుండగా, మనం బొగ్గును ఇతర ప్రాంతాలనుంచి దిగుమతి చేసుకోవలసి వస్తోంది. వీటన్నింటికీ కారణం కార్పొరేట్‌ సంస్థలను ప్రోత్సహించడానికి, ప్రభుత్వ రంగ సంస్థలను దెబ్బ తీయడానికి, తద్వారా కోట్లాది రూపాయల ముడుపులు చేతులు మారడానికేనని ఇన్ని సంవత్సరాలలో ప్రజలకు అర్ధమైంది.

ప్రజల అవసరాల డిమాండ్‌ను తట్టుకునేందుకు 1200 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. ఇంకోవైపు సర్‌ చార్జీలు, ఇంధనపు సర్దుబాటు చార్జీల పేరుతో పెంచిన కరెంట్‌ చార్జీలతో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, సంస్థలనుంచి తీవ్ర ఉద్యమాలను ప్రజాగ్రహాన్ని ప్రభుత్వం చవి చూడవలసి వస్తోంది. ఇటువంటి పరిస్థితిలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులవైపు ఆలోచించడం కర్తవ్యంగా ఉన్నది. అణు, పవన, సౌర విద్యుత్‌, అలల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి ప్రస్తుతం ప్రపంచంలో ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి. వీటన్నింటిలో సౌర విద్యుత్‌ను అత్యంత తేలికగా అందరికీ అందుబాటులోకి తేవడానికి అవకాశాలు మెండుగా ఉన్నట్టు పరిశోధనల ద్వారా అర్ధమవుతున్నది.

సౌర విద్యుత్‌ ఉత్పత్తి ఎలా?

రాష్ట్రంలో 2012 సెప్టెంబర్‌ 26న ప్రభుత్వం సౌర విద్యుత్‌ విధానం పేరుతో ఒక విధానాన్ని ప్రకటించింది. ఇంటి కప్పుపైన సౌర విద్యుత్‌ పరికరాలు అమర్చడం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్రక్రియకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ పరిస్థితిలో సౌర శక్తి గురించి ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించవలసి ఉన్నది. సౌర శక్తి అంటే సూర్య కిరణాలనుంచి లభించే శక్తి. విద్యుత్‌కు తీవ్ర కొరత ఏర్పడినందువల్ల, విద్యుత్‌ ఉత్పాదన ఎక్కువ ఖరీదైనందువల్ల ప్రపంచ దేశాలతో పాటు మన దేశంకూడా సౌర శక్తి వినియోగానికి సన్నద్ధమైనాయి. భూమికి సూర్యుడు వేడి, వెలుతురు ఇస్తున్నాడు. జీవరాశికి ఆధారమైనది సూర్యరశ్మి. సూర్యుడి ద్వారా వచ్చే అధిక ఉష్ణ శక్తి ఎంతో శక్తిమంతమైనది, విలువైనది. ప్రస్తుతం సౌర శక్తిని విద్యుత్‌గా, ఉష్ణ శక్తిగా మార్చడానికి వీలు ఏర్పడింది.

సూర్య శక్తిని పెద్ద ట్యాంకులలో ద్రవంలోకి ప్రవహింపచేసి, ఆవిరితో టర్బయిన్‌లు తిప్పే విధానాన్ని కనుగొన్నారు. సముద్రంపై పగలు సూర్యుడు కనుపించినప్పుడు లోపలికి, వెలుపలికి గల ఉష్ణోగ్రత వ్యత్యాసంతో టర్బయిన్లు తిప్పి విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తున్నారు. సూర్యుడి వేడిని నీటిలలో నిల్వ చేసి రాత్రి సమయాల్లో ఆ వేడితో అనేక యంత్రాలను తిప్పే విధానం కనుగొన్నారు. సూర్య శక్తితో నడిపే 10 కిలో వాట్ల విద్యుత్‌శ్ఛక్తి యంత్రంతో పగలు, రాత్రి కూడా 250 మంది నిత్యావసరాలను తీర్చవచ్చు. అంటే ప్రతి గ్రామానికి ఇలాంటి యంత్ర పరికరాన్ని అందజేస్తే దేశం సుభిక్షమవుతుంది. విద్యుత్‌ కొరత ఏర్పడినా, విద్యుత్‌ వినియోగం ఖరీదైనా ఆర్ధికాభివృద్ధికి నష్టం జరగకుండా పలు అవసరాలు తీర్చడానికి అవకాశం కలుగుతుంది. ప్రపంచంలో ఇంధన వనరులు తగ్గిపోతున్నప్పుడు మానవుడు ఈ సహజ వనరుల గురించి పరిశోధనలు మొదటు పెట్టాడు. పెట్రోల్‌, డీజెల్‌, కిరోసిన్‌, బొగ్గు నిల్వలు అంతరించి పోయే ప్రమాదం ఏర్పడింది.

అమెరికా 1978 మే 31న సూర్యదినంగా పాటించింది. అమెరికా శాస్తవ్రేత్త డేవిడ్‌ హౌస్‌, సౌర శక్తిని పరిశోధించి 80 సంవత్సరాల వరకూ అమెరికా అవసరాలన్నింటిని సౌర శక్తి తీరుస్తుందని చెప్పాడు. సౌరశక్తితో వివిధ ప్రాజెక్టులను ఎలా నడపవచ్చునో చూపించాడు. ఎడ్వర్డ్‌ ఫాస్పెరిని అనే శాస్తవ్రేత్త సౌర శక్తితో కారును ఎలా నడపవచ్చునో చూపాడు. 80 కి.మీ. వేగంతో ఆ కారును ప్రయోగించగలిగాడు. సౌరశక్తి ద్వారా వంటగదిని సౌకర్యవంతంగా చేసుకోవచ్చు. సోలార్‌ కుక్కర్‌తో వంట వేగంగా పూర్తి చేయవచ్చు. సౌరశక్తిని ఇప్పటికే వ్యవసాయ రంగంలో, ప్రాజెక్టులలో, శీతలీకరణ యంత్రాలలో మంచి ఫలితాలను ఇచ్చింది. సోలార్‌ హీటర్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. సౌరశక్తి వల్ల ఎటువంటి కాలుష్యం ఉండదు. ప్రజల ఆరోగ్యానికి నష్టం ఉండదు.

భౌగోళికంగా మన దేశం భూమధ్య రేఖకు దగ్గరలో ఉండడం వల్ల మనకు మరిన్ని అవకాశాలున్నాయి. ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల స్థానంలో సౌరశక్తి విద్యుత్‌ కేంద్రాలు విరివిగా నెలకొల్పవచ్చు.

సౌరశక్తి వినియోగ ప్రాజెక్టుల ఏర్పాటులో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ముందంజలో ఉన్నాయి. గృహ వినియోగ దారులు తమ వాడకం పోను మిగిలిన విద్యుత్‌ను అమ్ముకునేందుకు తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే వీలు కల్పించింది. మన రాష్ట్ర ప్రభుత్వం సౌర విధానాన్ని ప్రకటించిన తర్వాత కొన్ని కంపెనీలు ఉత్సాహంగా సౌర విద్యుత్‌ కేంద్రాలు నెలకొల్పడానికి ముందుకు వచ్చాయి. ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినా, విధానపరమైన అడ్డంకుల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందని ఆయా కంపెనీలు వాపోతున్నాయి. సౌర విద్యుత్‌ ప్లాంట్‌లను నెల కొల్పడానికి ప్రైవేట్‌ ఆపరేటర్లను ప్రోత్సహించే విషయంలో మహారాష్ట్ర విద్యుత్‌ సంస్థ మహజన్‌కో చర్యలు తీసుకుంటున్నది.

సౌర విద్యుత్‌ ప్లాంట్లను నెలకొల్పి పాక్షిక యాజమాన్యం కింద నిర్వహించమని మహాజన్‌కో కోరుతోంది. ఎంపికైన ప్రైవేట్‌ ఆపరేటర్‌ ప్లాంట్‌ను స్వంత ఖర్చుతో నిర్వహిస్తే, మహారాష్ట్ర ప్రభుత్వం ప్లాంట్‌కు కావలసిన భూమిని, విద్యుత్‌ పంపిణీ సదుపాయాలను కల్పిస్తుంది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ప్లాంట్‌ ఆపరేటర్‌ 10 సంవత్సరాలు యజమానిగా కొనసాగుతాడు. అందుకు అయిన మొత్తం ఖర్చును మహాన్‌కో ఆపరేటర్‌కు చెల్లిస్తుంది. ఆసియా అభివృద్ధి బ్యాంకు మహాజన్‌కోకు రుణం మంజూరు చేస్తుంది.

ఇళ్ళ కప్పులపై సౌర విద్యుత్‌ ఉత్పత్తికి చేసే ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, పంజాబ్‌ రాష్ట్రాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇళ్ళ పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తే, ప్రతి గృహ యజమాని ఉత్పత్తిదారుడుగా, వినియోగదారుడిగా కూడా వ్యవహరిస్తాడు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఉచితంగా వినియోగించుకోవడంతో బాటు అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు అమ్ముకోవచ్చు. ఒక ఇంటి కప్పుపై సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటుకు సుమారు రూ.2 లక్షలు ఖర్చు కావచ్చునని అంచనా. 2010లో పంజాబ్‌ ప్రభుత్వం- ఇళ్ళ కప్పులపై సౌర ఫలకాల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ ఆదేశించింది. సోలార్‌ వాటర్‌ హీటర్లను తప్పనిసరి చేస్తూ కేరళ ప్రభుత్వం ఇటీవలే ఆదేశించింది. ఈ ప్రాజెక్టులకు క్షేత్రస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా అందించవలసి ఉంది. లేకుంటే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది.

సౌర శక్తి ఉత్పత్తికి, వినియోగానికి ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. గుజరాత్‌లో పంట కాలువలపై ఏర్పాటు చేసుకుంటున్నారు. హైవేల పైనా ఏర్పాటు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. సోలార్‌ ప్యానెల్స్‌ తయారీకి జర్మనీలోని ప్రాన్స్‌హోపర్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రయత్నాలు చేస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, తాజాగా మాసాబూసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఈ ప్రయత్నాల్లో ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తికి తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాలవైపు ఆలోచించాలి. సాధ్యమైనంతవరకూ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సోలార్‌ ప్రాజెక్టులను నిర్వహించడం మంచిది. ప్రైవేట్‌కు అప్పగిస్తే, కోట్లాది రూపాయలు దోచుకొని ప్రభుత్వానికి ఎక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. కరెంటు కష్టాలనుంచి బయట పడాలంటే, కాలుష్యం వగైరాలు లేకుండా ఉండాలంటే, పరిశ్రమల అభివృద్ధి, ఆర్ధికాభివృద్ధి జరగాలంటే ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్‌ను ప్రోత్సహించాలి.

- దిగుపాటి రాజగోపాల్‌

ఆధారము: సూర్య

3.01169590643
K. SANTHOSH REDDY Apr 01, 2015 01:45 PM

మీ ఇంట్లోను, ఆఫీసులోను, షాపుల్లోనూ వాడే యుపిఎస్ లకు బదులు సోలార్ యుపిఎస్ లు వాడండి కరెంటును పోదుపుచేయ్యండి.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు