హోమ్ / శక్తి వనరులు / పర్యావరణం / ఆర్థికాభివృద్ధి, వాతావరణ మార్పులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆర్థికాభివృద్ధి, వాతావరణ మార్పులు

భారతదేశంలో ఆర్థికాభివృద్ధికి వాతావరణ మార్పులకు మధ్య పెరుగుతున్న సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో మంచి పురోగతిని చూస్తున్నాం. తొలిసారిగా ఆర్థిక సర్వేలో వాతావరణ మార్పు, సుస్థిర అభివృద్ధిపై ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చారు.

ఆర్థికాభివృద్ధి, వాతావరణ మార్పులు

భారతదేశంలో ఆర్థికాభివృద్ధికి వాతావరణ మార్పులకు మధ్య పెరుగుతున్న సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో మంచి పురోగతిని చూస్తున్నాం. తొలిసారిగా ఆర్థిక సర్వేలో వాతావరణ మార్పు, సుస్థిర అభివృద్ధిపై ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చారు. ఆర్థికాభివృద్ధి ఫలితంగా భూమి, నీరు, గాలి, అడవులు మొదలైన సహజ వనరులతోపాటు వృక్ష, జంతు సంబంధ ఆవాసాలపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు భూ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వాతావరణ పరిస్థితుల్లో ప్రతికూల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అతివృష్టి, అనావృష్టి గతం కంటే మరింత ఎక్కువగా సంభవిస్తున్నాయి. అందుకే ఇటీవల జరిగిన రియో సదస్సు కూడా ఈ అంశాలకు ప్రాధాన్యమిచ్చింది. పన్నెండో పంచవర్ష ప్రణాళికలోనూ సమ్మిళిత, సుస్థిర అభివృద్ధిని; తక్కువ కర్బన సాంద్రత ఉన్న వృద్ధిని సాధించడమే లక్ష్యంగా ఎంచుకున్నారు.

అయిదు సవాళ్లు

గత రెండు దశాబ్దాల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధిని సాధించింది. కానీ, ఈ వృద్ధి మానవాభివృద్ధిలోనూ, పర్యావరణ సంబంధ కొలమానాల్లోనూ ప్రతిబింబించడం లేదు. ఇదే సమయంలో భారతదేశం పర్యావరణ అనుకూలమైన సుస్థిర అభివృద్ధి విషయంలో విశేష విజయాలను సాధించింది. అయితే పర్యావరణ సంబంధ సవాళ్లు కూడా తీవ్ర రూపం దాలుస్తున్నాయి. భారతదేశం 1991లో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించిన తర్వాత వేగవంతమైన వృద్ధిరేటు దిశగా పయనిస్తోంది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సంబంధ అంశాలపై ఆసక్తి పెరిగింది. 1992లో రియో ధరిత్రీ సదస్సు జరిగింది.

భారతదేశం ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లను 2009లో కేంద్ర పర్యావరణ, అడవుల మంత్రిత్వశాఖ ప్రధానంగా అయిదు రంగాలుగా వర్గీకరించింది. ఇవి వాతావరణ మార్పు, ఆహార భద్రత, నీటి రంగంలో భద్రత, ఇంధన భద్రత, పట్టణ/ నగరీకరణ యాజమాన్యం.

ఇంధన ప్రభావం

ఆర్థికాభివృద్ధి పెరగడంతో ఇంధన డిమాండ్ అధికమైంది. ఇంధన వినియోగం పెరగడం కూడా వాతావరణ మార్పులపై ప్రతికూల ప్రభావాన్నే చూపుతుంది. ఇంధన వినిమయాన్ని చూస్తే దేశ ఆర్థికాభివృద్ధికి వాతావరణ మార్పులకు మధ్యనున్న సంబంధం అర్థమవుతుంది. ప్రణాళికా సంఘం లెక్కల ప్రకారం భారతదేశంలో తలసరి ఇంధన వినిమయం 439 కిలోల చమురుకు సమానం. ప్రపంచంలో ఇంధన వినిమయం 1688 కిలోలుగా ఉంది. దేశంలో ఇంధనపరమైన పేదరికం కూడా పెరుగుతోంది. విద్యుచ్ఛక్తి కొరత, తలసరి విద్యుత్ వినిమయం తక్కువగా ఉండటం, దేశంలోని అధిక జనాభా ఇప్పటికీ సాంప్రదాయ ఇంధన వనరులపైనే ఆధారపడటం ఇంధన పేదరికానికి కొలమానం. 2004-05 జాతీయ నమూనా సర్వే ప్రకారం దేశంలోని 45 శాతం గ్రామీణ గృహాలకు కిరోసిన్ లేదా కొవ్వొత్తులపై ఆధారం. 84 శాతం గృహాలు వంట అవసరాలకు వంట చెరకు, పిడకలు, వ్యవసాయ వ్యర్థ పదార్థాల లాంటి ఇంధన వనరులను ఉపయోగిస్తున్నాయి. ఆర్థికాభివృద్ధి ఫలితాలు ప్రజలకు అందుతున్నకొద్దీ ఇంధన పేదరికం తగ్గుతుంది. తలసరి ఇంధన వినిమయం పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి వల్ల అనివార్యంగా ఏర్పడుతున్న పరిణామాలతో పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

నగరీకరణ - సవాళ్లు

పట్టణీకరణ, నగరీకరణ వేగంగా జరగడం వల్ల పర్యావరణానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వీటిలో సురక్షిత మంచి నీటి కొరత, పారిశుద్ధ్య సేవలు అందుబాటులో ఉండకపోవడం ముఖ్యమైనవి. వ్యర్థ పదార్థాల నిర్వహణ తీవ్రమైన పర్యావరణ సమస్యగా పరిణమిస్తోంది. రవాణా అవసరాలు పెరగడం, అందులోను ప్రజా రవాణా సదుపాయాలు సరిగా లేకపోవడం కూడా పర్యావరణ సవాళ్లను పెంచుతున్నాయి. పట్ణణీకరణ, నగరీకరణ ప్రక్రియలు గాలి, నీరు లాంటి వనరుల నాణ్యతను కూడా దెబ్బతీస్తున్నాయి.

ప్రగతి సంకేతాలు

ఈ సవాళ్ల నేపథ్యంలోనూ భారతదేశం పర్యావరణపరంగా గమనార్హమైన, సుస్థిర ప్రగతి సాధించిందనడానికి ఉదాహరణలున్నాయి. సుస్థిరాభివృద్ధికి ఒక ప్రామాణికమైన అడవుల సాంద్రత పెరుగుతోంది. భూమి వినియోగంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నా, దేశంలో అడవులు విస్తీర్ణం పెరుగుతోంది. ఉపగ్రహాలు అందిస్తున్న సమాచారం ప్రకారం 1990 నుంచి 2010 మధ్యకాలంలో భారతదేశం అడవుల నరికివేతను నియంత్రించడమే కాకుండా, విస్తీర్ణాన్ని కూడా పెంచుకోగలిగింది. గత రెండు దశాబ్దాలుగా అడవుల విస్తీర్ణం పెరిగిన అతికొద్ది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. అయితే 2011లో అడవుల విస్తీర్ణం కాస్త తగ్గినట్లు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి.

రాజ్యాంగ ప్రాతిపదిక

భారతదేశ విధాన రూపకల్పనలో కూడా పర్యావరణం, సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యం పెరిగింది. 1985 నుంచి కేంద్రంలో ప్రత్యేకంగా పర్యావరణం, అడవులు అనే ఒక మంత్రిత్వశాఖ పనిచేస్తోంది. సుస్థిరాభివృద్ధికి అవసరమైన చట్టాల రూపకల్పనకు రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తిస్తోంది. జీవించే హక్కు అంటే పరిశుభ్రమైన, సురక్షిత వాతావరణాన్ని పొందడాన్ని కూడా హక్కుగా అన్వయించాలని న్యాయవ్యవస్థ వ్యాఖ్యానించింది.

2006 నాటి జాతీయ పర్యావరణ విధానం అభివృద్ధి కార్యకలాపాలన్నింటిలో పర్యావరణపరమైన అంశాలను సమీకృతం చేయాలని పేర్కొంటోంది. పట్ణణీకరణ, నగరీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి తయారీ రంగంపై దృష్టి కేంద్రీకరించాలి. అదేవిధంగా ఇంధన వినిమయం పెరిగేందుకు అవకాశమున్న సందర్భంలో అన్ని అభివృద్ధి కార్యకలాపాల్లో పర్యావరణ సంబంధ అంశాలను సమన్వయం చేయడం ఆహ్వానించదగిన పరిణామం.

హరిత అభివృద్ధి

కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ 2010లో జాతీయ హరిత అకౌంటింగ్ వ్యవస్థ మిషన్‌ను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు ప్రారంభించింది. జాతీయాదాయాన్ని సృష్టించడంలో సహజ వనరులు ఎలా హరించుకుపోతున్నాయో లెక్కించడం, అభివృద్ధి క్రమంలో జరిగే పర్యావరణ నష్టాన్ని అంచనా వేయడం ఈ వ్యవస్థ లక్ష్యాలు. 1997 నుంచి కేంద్ర గణాంకాల సంస్థ సమగ్ర పర్యావరణ గణాంకాలను ప్రకటిస్తోంది. ప్రామాణిక జాతీయ గణాంకాల్లో సహజ వనరులు హరించుకుపోవడాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని హరిత స్థూల దేశీయోత్పత్తిని రూపొందించే కృషి జరుగుతోంది. రానున్న అయిదేళ్లలో ఈ అంచనాలు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. అభివృద్ధి ప్రక్రియలో సుస్థిర భావనను సమీకృతం చేయడానికి హరిత అభివృద్ధి దృక్పథం ఉపకరిస్తుంది. సహజ వనరులు దెబ్బతినడం పేద వర్గాలకు మరింత నష్టాన్ని కలిగించే అంశం. ఎందుకంటే పేదలు సహజ, పర్యావరణ వనరులపై ఎక్కువగా ఆధారపడతారు. అందువల్ల పర్యావరణానుకూల, సుస్థిర అభివృద్ధికి సమ్మిళిత అభివృద్ధికి మధ్యనున్న సంబంధాన్ని ఇది తెలియజేస్తుంది. హరిత, సమ్మిళిత అభివృద్ధుల మధ్య సరైన సంబంధం ఉండాలంటే పర్యావరణ, సహజ వనరుల వినిమయం పేద వర్గాల ఉన్నతికి దోహదం చేయాలి. పెరుగుతున్న ఇంధన వినిమయం ప్రపంచంలో సంపన్న దేశాల కంటే పేద దేశాల్లో, దేశంలో సంపన్న వర్గాల కంటే పేద వర్గాల్లో అధికంగా ఉంటే హరితాభివృద్ధి సమ్మిళిత అభివృద్ధిగా ఉంటుంది.

మానవుల కార్యకలాపాలు వాతావరణంలో అనేక మార్పులకు కారణమై, దాని ధర్మాలను మార్చేస్తున్నాయి. ప్రస్తుతం సమృద్ధిగా అందుబాటులో ఉన్న శాస్త్రీయ ప్రాతిపదిక సమాచారమే ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. కాలానుగుణంగా ప్రకృతిలో వచ్చే మార్పులే కాకుండా, మానవ కార్యకలాపాలతోనూ వాతావరణంలో అనేక ప్రతికూల మార్పులు ఏర్పడటాన్ని వాతావరణ మార్పుగా ఐక్యరాజ్య సమితి నిర్వచించింది. వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలు తీవ్రంగా ఉంటున్నాయి. ఈ మార్పులు తిరిగి వెనక్కి తేలేనివి. ఇవి అంతర్జాతీయంగా ప్రభావాన్ని చూపుతాయి. ప్రస్తుత తరం పైనే కాకుండా భవిష్యత్ తరాలపై కూడా దుష్ప్రభావాన్ని చూపుతాయి. అందుకే విధానపరమైన చర్యల ద్వారా ఈ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.

ఈ విధానాలు కేవలం జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచ దేశాలమధ్య సమన్వయంతో జరగాలి తక్కువ ఆదాయాలున్న, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సుస్థిరాభివృద్ధి కష్టతరమైన అంశం. వివిధ లక్ష్యాల మధ్య సమన్వయం సాధించడం పెద్ద సవాలు. ఒక దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఆర్థికాభివృద్ధి తప్పనిసరి. ఆర్థికాభివృద్ధి సాధించే క్రమంలో పర్యావరణానికి అనివార్యంగా నష్టాలు కలగకుండా చర్యలు తీసుకోవాలి. ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించి, సుస్థిరమైన పర్యావరణ అనుకూల అభివృద్ధి కోసం అనేక విధానపరమైన చర్యలు చేపట్టాలి.

వ్యవసాయ రంగం నుంచి వినిమయ రంగం వరకూ, ఇంధన రంగం నుంచి శాస్త్ర సాంకేతిక రంగాల వరకూ ఈ విధానాలుండాలి. దేశంలో సుమారు 80 శాతం నీటి వినియోగం వ్యవసాయరంగంలోనే జరుగుతోంది. తక్కువ నీటిని ఉపయోగించే వ్యవసాయ ప్రక్రియలను అందుబాటులోకి తేవడం ద్వారా సుస్థిరాభివృద్ధికి దోహదం చేయవచ్చు. అదేవిధంగా సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలంటే అవి ఇతర ఇంధన వనరుల ధరలకే అందుబాటులో ఉండేలా సాంకేతిక రంగంలో చర్యలు చేపట్టాలి.

సుస్థిరాభివృద్ధి కోసం ఒకే సమయంలో మూడు అంశాలను సాధించాలి. అవి: సామాజిక న్యాయం, ప్రజల జీవన ప్రమాణాలను పెంచేవిధంగా ఆర్థిక అభివృద్ధి; భూమి, గాలి, నీరు, అడవులు, ఇంధనం లాంటి వాటిని వీలైనంత తక్కువ వినియోగించడం; భవిష్యత్ తరాల ప్రయోజనాలను కాపాడటం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ మూడు అంశాల సమ్మేళనంతో సుస్థిరాభివృద్ధిని సాధించాలంటే ప్రత్యామ్నాయాలు తక్కువగా ఉంటాయి. ఇంధన వినిమయంలో సామర్థ్యాన్ని పెంచాలి. ఇంధన ధరలు, రాయితీలు, సుంకాల్లో సమగ్ర మార్పులు తీసుకురావాలి. విద్యుత్ వనరుల్లో సమతౌల్యం సాధించాలి. సౌర విద్యుత్, పవన విద్యుత్ మొదలైన కాలుష్య రహిత ఇంధన వనరులపై దృష్టి కేంద్రీకరించడం; నీటి వినియోగాన్ని పరిమితం చేసేవిధంగా వ్యవసాయ అభివృద్ధిని సాధించడం; ప్రజా రవాణా, తక్కువ తలసరి ఇంధన వినిమయమున్న రవాణా సాధనాలకు ప్రోత్సాహమివ్వడం; అడవుల నరికివేతను నియంత్రించడం; అడవుల సాంద్రతను పెంచడం; తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలకు మరింత రక్షణ కల్పించడం; పర్యావరణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని సాధించడం; సుస్థిరాభివృద్ధికి అవసరమైన నిధులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం లాంటి అనేక ప్రత్యామ్నాయాలు సుస్థిర, పర్యావరణ అనుకూల అభివృద్ధి సాధనకు కీలకం.

ఆధారము: ఈనాడు ప్రతిభ

3.03333333333
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు