অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

భూమి - భూమి పరిరక్షణ

భూమి - భూమి పరిరక్షణ

నేలమ్మా...నీకు వందనాలమ్మా...

నేలమ్మా...నీకు వందనాలమ్మా...
(ఏప్రిల్‌ 22 - ధరిత్రీ దినోత్సవం)

సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి భూమి పరిరక్షణపై ఎంతమందికి అవగాహన ఉంది అంటే సమాధానం శూన్యం. పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా పర్వాలేదు కనీసం హాని కలిగించకుండా ఉంటే చాలు. ఇందుకోసం అవగాహన అవసరం. అటు పర్యావరణం, వాతావరణంతో పాటు ఇటు జీవన శైలిలోనూ మార్పులతో భూ పరిరక్షణపై అవగాహన కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు అవసరమవుతున్నాయి. ఈ క్రమంలోంచి వచ్చిందే ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’. ప్రపంచవ్యాప్తంగా 175 కంటే ఎక్కువ దేశాల్లో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సూర్య’ ప్రత్యేక కథనం...

అనగనగా ఈ విశ్వంలో భూమి అనేది ఒకటుండేది. అది తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టు కూడా తిరుగుతుండేది. అయితే ఆ భూమి మీద ఉండే మనుషులకు కొంచెం తిక్కుండేది... దానికి లెక్క ఏమాత్రం లేకుండేది. వాళ్ళు వాళ్ళల్లోనే తన్నుకోవడాలు, నాగరికత, టెక్నాలజీ అంటూ, ప్యాషన్లు, పిండాకూడు అంటూ వింతవే శాలెయ్యడం, వింత పోకడకలకు పోవడం, అణుయుద్దా లు, అంతర్యుద్దాలు అన్నీ కలిపి అందరూ కలగలసి భూమి మీద ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని, సహజవనరులను కొల్లగొట్టి, ఎక్కడో ఉన్న అడవుల్లో జీవిస్తున్న జంతువులను కూడా అంతం చేసి, కొండలని పిండి చేసి భూమిని, అక్కడి ఓనాటి సశ్యశ్యామలాన్ని, ప్రకృతిని, నీరుని, గాలిని, నిప్పును, మట్టిని, ఆకాశంలోని వనరులని కలుషితం చేసి భూమిని అంతం చేశారు.ఇదీ భూమి గురించి మరికొన్ని ఏళ్ళల్లో గ్రహాంతరవాసులు చెప్పుకునే కథ. ఇది కల్పిత కథే అయినా... ప్రస్తుతం మనిషి చేస్తున్న ఆకృత్యాలు ఇలాగే కొనసాగితే... ఈ కథ నిజమైనా ఆశ్చర్యపోనక్కరలేదు.

మన భవిష్యత్‌ మనచేతిలోనే...

విశ్వంలో మానవజాతిలాంటి జీవులు కలిగి వున్న ఒకే ఒక గ్రహం ధరిత్రి. దీనిపై జీవావిర్భావం దాదాపు 350 కోట్ల ఏళ్ల క్రితం జరిగింది. ధరిత్రి ఇప్పటిస్థితికిి చేరడానికి దాదాపు 460 కోట్ల సంవత్సరాల కాలం పట్టింది. విశ్వంలో మనలాంటి జీవాలు గల ఇతర గ్రహం మరేదైనా ఉందా అనే దిశలో పరిశోధనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఇంతవరకూ ఆధారాలు దొరకలేదు. ఇప్పటి ధరిత్రిని అస్థిరపరిచే ఎన్నో చర్యలు కొనసాగుతున్నాయి. ధరిత్రిలో ని అన్ని జీవాలను పలుమార్లు పూర్తిగా నాశనం చేయగల అణుబాంబులు అమెరికా, రష్యా వంటి పలుదేశాల దగ్గరు న్నాయి. వీటిని సమకూర్చుకోడానికి మరికొన్ని దేశాలు తీవ్ర కృషి చేస్తున్నాయి.

అమెరికా, దాని మిత్రదేశాలు తా ము శత్రువులుగా భావించిన ఇతర దేశాలపై ఈ బాంబుల్ని ఉపయోగించడానికి వెనుకాడబోమని బెదిరిస్తున్నాయి కూడా. ప్రకృతివనరులను కొల్లగొట్టేందుకు ఏవో సాకుల తో యుద్ధాలు, ఆక్రమణలు, అక్రమాలు జరుగుతున్నాయి. పర్యావరణానికి ఇవి కలిగిస్తున్న హాని అసలు అధ్యయనా నికే నోచుకోవడం లేదు. ఇది చాలదన్నట్లు మానవుడు తన అవసరాలకూ, స్వార్థం కోసం వినియోగిస్తున్న ఎన్నో సాంకేతికాలు వాతావరణాన్ని వేడెక్కిస్తూ, భూగోళాన్ని అస్థిరపరిచేవిగా ఉన్నాయి. ఇదే జరిగితే మరే ఇతర గ్రహానికో పోయి, మనల్ని మనం రక్షించుకునే స్థితి కూడా లేదు. ఇతర గ్రహాల్లో కనీసం మామూలు జీవాలుండగల వన్న ఆధారాలూ లభించడం లేదు. అందువల్ల, మన పృథ్విని మనకోసం, మన భవిష్యత్తరాల కోసం సుస్థిరంగా కొనసాగేలా కాపాడుకోవాలి.

దరిత్రీ దినోత్సవం...

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 22న ‘ధరిత్రి దినోత్సవం’ జరుపుకుంటున్నారు. భూమి... పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే దీని ముఖ్యోద్దే శం. మొదట ఐరాస 1969, మార్చిలో జాన్‌మెక్కల్‌తో ప్రారంభించింది. ఆ తర్వాత అమెరికా రాజకీయవేత్త గేలార్డ్‌ నెల్సన్‌ ప్రారంభించారు. 1962లో సెనెటర్‌ నెల్సన్‌కి వచ్చి న ఆలోచనకు ప్రతిరూపమే ఈ ధరిత్రీ దినోత్సవం. తన చుట్టూ ఉన్న వాతావరణం కలుషితమవడం గమనించి అందరికీ ధరిత్రి సంరక్షణ పట్ల అవగాహన కలిగించేందు కు నెల్సన్‌ ఒక నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవు గా ప్రెసిడెంట్‌ కెన్నెడిని కలసి తన ఆలోచనను వివరించా రు, దీని ప్రకారం ప్రెసిడెంట్‌ కెన్నెడి అందరికీ ధరిత్రి సంర క్షణ పట్ల అవగాహన కలిగించేందుకు దేశమంతటా పర్య టించాల్సి ఉంటుంది. ఈ ఆలోచన నచ్చి కెన్నెడి పర్యటిం చేందుకు ఒప్పుకున్నారు.

కాని ప్రెసిడెంట్‌ కెన్నెడి పర్యటన సఫలీకృతం కాలేదు. ఎవ్వరూ ఈ సమస్య గూర్చి అంతగా పట్టించుకోలేదు. 1969లో సెనెటర్‌ నెల్సన్‌కి మరొక ఆలోచన వచ్చింది. మన వాతావరణంలో జరిగే మార్పులనూ వివరిస్తూ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మన వంతు ఏమి చెయ్యాలో అందరికీ తెలియ చెప్పడానికి ఒక రోజంటూ ఉంటే బాగుంటుందని అనుకున్నారు. వెంటనే తన ఆలోచనకు రూపకల్పన చేస్తూ తన మిత్రులకు మరియు ఒక వార్తాపత్రిక ద్వారా ప్రజలకూ ఈ ధరిత్రీ దినోత్సవం గూర్చి వివరించారు. 1970 ఏప్రిల్‌ 22న మొదటి ధరిత్రీ దినోత్స వం జరిగింది. ఆరోజు ఆ దేశంలోని ప్రజలంతా ధరిత్రిని రక్షించుకునేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రమా ణాలు చేసారు. ఇలా తొలుత అమెరికాలో ప్రారంభమైన ఈ ఉత్సవం ఆ తర్వాత ప్రపంచవ్యాపితమైంది. ప్రజలలో మరింత అవగాహన కలిగించేందుకు ‘ఎర్త్‌ డే నెట్‌వర్క్‌’ ఏర్పడింది. ధరిత్రిని రక్షించుకునేందుకు ఏం చేయాలి? నానాటికి కాలుష్యకోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న భూగో ళాన్ని ఎలా సంరక్షించుకోవాలి? తదితర విషయాలను ఈ నెట్‌వెర్క్‌ ప్రపంచం ముందుంచింది. దీంతో ప్రపంచంలో ధరిత్రి సంరక్షణ పట్ల అవగాహన మాత్రం కలిగింది. ఆ తర్వా త 1970 ఏప్రిల్‌ 22న అమెరికా తమ దేశంలో మొదటిసారి జరుపుకుంది. ఇక అప్పటి నుండి ఆ తేదీ ఖరారైంది.

భూమి బాగుంటేనే భవిష్యత్తు...

నేల తల్లి బాగుంటేనే... ఆ తల్లి బిడ్డలమైన మనం బాగుం టాం. అటువంటి తల్లి ఆరోగ్యాన్నే హరించే పనులు మనం చేస్తుంటే? ఇంకేముంది...భవిష్యత్తు అంధకారమే! ఈ హె చ్చరికనే ధరిత్రి దినోత్సవం (ఏప్రిల్‌ 22) మరోసారి గుర్తు చేస్తోంది. అనాలోచిత మానవ చర్యల వల్ల కలుగుతు న్న ప్రకృతి విధ్వంసాన్ని నిలువరించాలన్న బృహత్తర లక్ష్యంతో ధరిత్రి దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రకృతి నియమా లకు విరుద్ధంగా మనిషి చేస్తున్న పనుల వల్ల భూ గోళం అ మితంగా వేడెక్కిపోతోంది. శిలాజ ఇంధనాలను విచ్చలవి డిగా వాడడం వల్ల వాయుకాలుష్యంపెచ్చుమీరు తోంది. పట్టణాలు, నగరాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోంది. వ్యవసాయంలో ర సాయనాలు విచ్చలవిడిగా వాడుతూ పదికాలాల పాటు పది లంగా చూసుకోవాల్సిన భూమిని నిస్సారంగా మార్చుతున్నాం.

రసాయనిక ఎరువులతో పెనుప్రమాదం...

నేల అంటే నిర్జీవ పదార్థం కాదు. లక్షలాది సూక్ష్మజీవులు, పోషకాలతో కూడి ఉండేదే సుసంపన్నమైన నేల. దురదృష్టవశాత్తూ, వ్యవసాయం కోసం విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలు భూమిని నిస్సారంగా, నిర్జీవంగా మార్చేస్తున్నాయి. జీవం కోల్పోయిన నేలలో దిగుబడులూ నాసిగానే ఉంటాయి. దీర్ఘకాలంలో దిగుబడులు మరీ తగ్గిపోయి ఆహార సంక్షోభాలకు దారితీసే ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఆలివర్‌ డి షుట్టర్‌ గుర్తించారు. పర్యావరణ అనుకూల వ్యవసాయ విధానాల వైపు మళ్లడం తప్ప మరో మార్గం లేదని నివేదించారు. వ్యవసాయంలో రసాయనాలు వాడే విధానాలను ప్రపంచవ్యాప్తం చేయడంలో కీలకపాత్ర వహించింది అమెరికా. ధరిత్రి దినోత్సవం పేరిట పర్యావరణ పరిరక్షణ ఉద్యమం కూడా అమెరికాలోనే ప్రారంభం కావడం విశేషం. 41 ఏళ్ల క్రితం ఏప్రిల్‌ 22న గేలార్డ్‌ నెల్సన్‌ నేతృత్వంలో కాలుష్యకారక విధానాలకు నిరసనగా జనం ఉవ్వెత్తున ఉద్యమించారు. అప్పటి నుంచీ సుస్థిర అభివృద్ధి కోసం ధరిత్రి దినోత్సవం జరుపుకుం టున్నాం. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల పర్యావరణ అనుకూల చర్యలను చేపట్టాలన్నది ఈ ఏడాది ధరిత్రి దినోత్సవ నెట్‌వర్క్‌ లక్ష్యంగా ప్రకటించింది.

మనమేం చేద్దామంటే...

ఈ ఏడాది ‘ద ఫేస్‌ ఆఫ్‌ క్లైమేట్‌ ఛేంజ్‌’ అనే థీమ్‌తో ఎర్త్‌ డే జరగనుంది. ఈ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ధరిత్రీ పర్యావరణ పరిరక్షణకు మీవంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారా? అయితే, పెద్దపెద్ద నిర్ణయాలు ఏమీ తీసుకోనక్కరలేదు. మన రోజువారీ అలవాట్లు, కార్యక్రమాల్లో కొన్నింటిని మార్పు చేసుకుంటే చాలు. అవి తెలుసుకోండి.

 1. బయటికెళ్ళేందుకు కారును కాకుండా నడిచి వెళ్ళడం లేదా బైక్‌ రైడింగ్‌ను ఎంచుకోండి.
 2. పలుమార్లు కారులో ప్రయాణించకుండా ఇతరులతో కలిసి పనులు పంచుకోండి.
 3. మాంసాహారానికి దూరంగా ఉండండి. తద్వారా కార్బన్‌ ఉద్గారాల ప్రభావాన్ని తగ్గించండి.
 4. పర్యావరణ సానుకూల ఉత్పత్తులను ఉపయోగిం చండి. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించండి.
 5. పునర్వినియోగానికి ఉపయోగపడే వాటర్‌ బాటిల్స్‌, బ్యాగ్‌లనే ఉపయోగించండి.
 6. అవసరం లేనప్పుడు విద్యుత్‌ బల్బులను ఉపయోగించద్దు.
 7. బిల్లులను తీసుకోవడం, కట్టడం ఆన్‌లైన్‌లోనే చేయండి.
 8. స్థానిక మార్కెట్‌లోనే షాపింగ్‌ చేయండి, స్థానికంగా దొరికే ఆహారాన్నే వినియోగించండి.
 9. సాధ్యమైనంత వరకూ రీసైక్లింగ్‌కు అవకాశం ఉండే వస్తువులనే ఉపయోగించండి.
 10. డిస్పోజబుల్‌ ప్యాకేజీలకు దూరంగా ఉండండి.

మన ఇంట్లో, చుట్టుపక్కల పరిసరాల్లో భూగోళ పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడం ద్వారా మానవాళి పురోగమన చర్యలకు తోడ్పడండి. ధరిత్రి పరిరక్షణకు స్ఫూర్తిని పెంచుకోండి.

గ్రీన్‌హౌజ్‌ వాయువులే ప్రధాన శతృవు...

ప్రకృతి వనరులు, ఇంధనోత్పత్తి, వినియోగ నిర్ణయాల మీద పృథ్వి భవిష్యత్తు ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఇదే సమయంలో 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరనుందని అంచనా. వీరి అభివృద్ధి అవసరాలను తీర్చడానికి ఇప్పటికన్నా ప్రకృతి వనరులను ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది. ఇంధనాన్నీ అధికంగా ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఇప్పటివరకూ జరిగిన అభివృద్ధితోనే గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదల పెరుగుతూ, భూగోళ వాతావరణం వేడెక్కుతోంది.

పృథ్వి సుస్థిరభవిష్యత్తు కోసం గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను పరిమితం చేస్తూ, భూగోళ వాతావరణ క్షీణతను అరికట్టేందుకు ఇంతవరకూ చేపట్టిన కార్యక్రమాలు ఆశించినమేర ఫలితాల్ని ఇవ్వలేదు.

మరి ఈ పెరుగుతున్న జనాభా అవసరాల్ని తీరుస్తూ, భూగోళ సుస్థిరతను ఎలా కాపాడుకోవాలి? అనేది నేడు మనముందున్న ప్రధాన సవాలు. దీనికోసం హరిత సాంకేతికాలను, అభివృద్ధిని సాధించాలని ఓ బృహత్‌ ప్రణాళికను ఐక్యరాజ్యసమితి 2011లో ‘ప్రపంచ ఆర్థిక, సామాజిక సర్వే’ నివేదిక రూపంలో మన ముందుంచింది. సుస్థిర పర్యావరణాభివృద్ధికి దోహదపడేలా, పర్యావరణానికి ఇప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చేలా పునరుద్ధరణ కార్యక్రమాలను చేపడుతూ ఇప్పటి, భవిష్యత్తు అవసరాలను తీర్చాలని ఈ నివేదిక సూచిస్తుంది. దీనికోసం ఎప్పటిలాగా కాక, నూతనత్వంతో కూడి న సాంకేతికాలతో అభివృద్ధిని సాధించాలని సూచించింది.

ఆహారోత్పత్తి... సాంకేతికాలు...

భూగోళం నుండి విడుదలయ్యే మొత్తం గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో దాదాపు 14 శాతం ఆధునిక వ్యవ సాయం వల్ల విడుదలవుతున్నాయి. ఎన్నో విస్తార ప్రాంతా ల్లో భూ వినియోగం, నీటి యాజమాన్యం హరిత ఆర్థికాభి వృద్ధికి దోహదపడేవిగా లేవు. అడవుల నరికివేతవల్ల దాదా పు మరో 17 శాతం గ్రీన్‌హౌస్‌ వాయువులు విడుదలవు తు న్నాయి. సుస్థిర వ్యవసాయోత్పత్తికి, అడవుల యాజమా న్యానికి, నేలకోత నివారణకు నీటి కాలుష్య నియంత్రణకు హరిత సాంకేతికాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. మెట్ట ప్రాంతాల్లో, పరీవాహక ఆధారాభివృద్ధి (భూసార పరిరక్షణ, నీటి సంరక్షణ), నీటి వినియోగాన్ని తగ్గిస్తూ, ఉత్పాదకతను పెంచుతూ సేద్య విస్తీర్ణాన్ని తగ్గించే శ్రీవరి సేద్యం, సాగునీటి సామర్థ్యాన్ని పెంచే సాంకేతికాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎక్కువగా ఉపయోగించాలి.

పెట్టుబడులు...

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొత్త హరిత సాంకేతికాల అమలుకు పెద్ద ఎత్తున పెట్టుబడులను అందించాలని ఐరాస 2011 సర్వే సూచిస్తుంది. దీనికోసం ప్రపంచ స్థూల ఉత్పత్తిలో దాదాపు మూడు శాతం (2010లో 1.90 లక్షల కోట్ల డాలర్లు) అవసరమని ఈ సర్వే అంచనా వేసింది. పేదరికాన్ని అధిగమించడానికి, నేల, నీటి వనరుల క్షీణతను నిలువరించడానికి, ఆహారోత్పత్తిని పెంచుతూ ఆకలిని నిర్మూలించడానికి; వాతావరణమార్పుల్ని నిలువరించడాని కి, రాగల ప్రకృతి వైపరీత్యాలను నివారించడానికి ఈ నిధు లు అవసరం. ఈ నిధుల్లో కనీసం సగం అభివృద్ధి చెందిన దేశాలు స్థానిక వనరుల నుండే సేకరించాలని ఈ నివేదిక సూచించింది. ఎన్నో అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ పొదుపు మొత్తాలను, ఇతర ఆదాయాల్ని స్థానికంగా కాకుం డా అంతర్జాతీయ నిధుల రూపంలో ఉంచుతున్నాయి. ఐచ్ఛికంగా వీటిని ఆయా దేశాల్లోనే ఉంచితే హరిత ఆర్థికాభివృద్ధికి తోడ్పడగలవని ఈ సర్వే సూచిస్తుంది.

కోపెన్‌హాగన్‌ ఒప్పందంలో 2010-12 మధ్యకాలంలో వార్షికంగా మూడు వేల కోట్ల డాలర్లను, ఆ తర్వాత 2020 వరకూ 10 వేల కోట్ల డాలర్లను పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ లక్ష్యం కోసం అందించాలనే నిర్ణయం సరైన దని సర్వే తెలిపింది. కానీ, ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కు, వాతావరణ మార్పుల నియంత్రణకు ఏర్పర్చిన ట్రస్టు నిధుల నుండి ఏడాదికి కేవలం రెండువేల కోట్ల డాలర్లు అందాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో హరితాభి వృద్ధికి వార్షికంగా లక్ష డాలర్లు అవసరమవుతుందని సర్వే అంచనా. దీనిలో ఎక్కువ భాగం అంతర్గతంగానే ఆయా దేశాలు సేకరించాల్సి ఉన్నప్పటికీ, ఆరంభంలో హరిత సాంకేతికాల మార్పును వేగం చేసేందుకు విదేశీ సహాయం తోడ్పడుతుందని సర్వే సూచించింది.

తిరోగమనంలో భారత్‌...

హరిత ఆర్థికాభివృద్ధికి తిరోగమన దిశలో దేశాభివృద్ధి కొన సాగుతుంది. భూగోళం వేడెక్కడాన్ని, వాతావరణ మార్పుల గురించి మాట్లాడుతున్నాం కానీ, వీటిని నిలువరించేందుకు పై పై చర్యలకే పరిమితమవుతున్నాం. అంతు లేని విని యోగ సంస్కృతి ప్రోత్సహించబడుతోంది. అంతర్జాతీయ ఉత్పత్తిలో భాగస్వామ్యం వలన రవాణా అవసరాలు పెరిగి, ఇంధన వాడకం పెరుగుతుంది. ప్రజా రవాణా రోడ్డు సౌకర్యాలను తగ్గిస్తూ, వ్యక్తిగత, ప్రయివేటు వాహనాల వినియోగాన్ని పెంచే అభివృద్ధి వ్యూహాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది. దీనివల్ల ఇంధన వాడకం పెరుగుతుంది. పునరుత్పత్తి కాగల ఇంధనం, ఉచితంగా, అపరిమితంగా లభించే సౌరశక్తి ఆధారిత ఇంధనం కాకుండా అతి ఖర్చు, రిస్క్‌తో కూడిన అణువిద్యుత్‌ కేంద్రాల నిర్మాణం పెద్దఎత్తున చేపడుతుంది. ఇదే సమయంలో అవసరానికి మించి పెద్ద ఎత్తున బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టబడుతుంది. ఇవేవీ హరిత సాంకేతికాలు కావు, హరితార్థికాభివృద్ధికి తోడ్పడేవీ కావు.

సుస్థిర వ్యవసాయోత్పత్తికి దోహదపడే సాంకేతికాలు (సమగ్ర పోషక యాజమాన్యం, సస్యరక్షణ, కలుపు నియంత్రణ) అందుబాటులో ఉన్నప్పటికీ, వీటిని పక్కన పెట్టి, భారీ యంత్రాలు, అధిక రసాయనాల వినియోగంతో కూడిన వ్యవసాయరంగ కార్పొరేటీకరణను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.

ఏం చేయాలి?

 • తరిగిపోయే వనరులకు బదులు, తరగని, పునర్వినియో గించుకోగల వనరుల ఆధారంగా జరిగే అభివృద్దే సుస్థిరా భివృద్ధి. ఇదే ధరిత్రికి సుస్థిర భవిష్యత్తును చేకూరుస్తుంది.
 • ఆర్థికాభివృద్ధి, సామాజిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణ హరితార్థికాభివృద్ధికి, సుస్థిర భవిష్యత్తుకు మూలాధారం.
 • భూమి, నీరు వంటి మౌలిక వనరులను గరిష్ట సామ ర్థ్యంతో వినియోగించాలి. ఇప్పటి సామర్థ్యాన్ని పెంచాలి.
 • చౌకైన, సమర్ధవంతమైన విద్యుత్‌. దూరదృష్టితో తరగని, పునర్వినియోగించు కోగల వనరుల వినియో గాన్ని ప్రోత్సహించేలా ధరలను నిర్ణయించాలి.
 • గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను కనీసస్థాయికి తగ్గించగల సాంకేతికాల వినియోగం.
 • అడువుల సంరక్షణ, పునర్‌ పెంపకం, సుస్థిర యాజమాన్య పద్ధతులు, జీవవైవిధ్య సంరక్షణ.
 • సమర్థవంతమైన ప్రజారవాణా వ్యవస్థ ఏర్పాటు, వ్యక్తిగత రవాణాను నిరుత్సాహపరిచే విధానం.
 • భాగస్వామ్యంగల గ్రామీణ ఇంధనం, సాగునీటి యాజమాన్యం, గ్రామీణాభివృద్ధి.

ధరిత్రీ వారం...

భూగోళంపై మన ప్రభావాన్ని తెలియజేయడం, అవగా హన కల్పించడమే లక్ష్యంగా ధరిత్రీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే... కొన్ని దేశాల్లో ‘ధరిత్రివారం’ ను కూడా నిర్వహిస్తున్నారు. భూమితో మానవాళికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ పలు కార్యక్రమాలు, ప్రచా రంతో ‘ధరిత్రీ వారం’ని జరుపుతున్నారు. ధరిత్రీ దినోత్స వ వేడుకలు, పర్యావరణ అవగాహనా కార్యక్రమాల ద్వా రా పర్యావరణం మెరుగుదలకు కృషి చేస్తున్నారు. వ్యక్తి నుంచి అంతర్జాతీయ కార్పొరేషన్ల వరకూ అందరూ పర్యావరణ విద్య, పర్యావరణ విధానాలు, ప్రచారంపై దృష్టి సారించేందుకు అవకాశం ఏర్పడుతోంది.

దుష్ర్పభావాల్ని ఎదుర్కోవాలంటే...

 • వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను ఎదుర్కోడానికి 8 అంశాలపై ప్రత్యేక జాతీయ మిషన్లను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి...
 • జాతీయ సౌరశక్తి మిషన్‌: 20 వేల మెగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి ఉద్దేశించింది. 2010-12లో వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం.
 • జాతీయ ఇంధన సామర్థ్యాన్ని పెంచే మిషన్‌: ఇది ప్రత్యేక వ్యవస్థాగత ఏర్పాట్ల కోసం ఉద్దేశించింది.
 • జాతీయ సుస్థిర నివాసాల మిషన్‌: సుస్థిర రవాణా, ఇంధన సామర్థ్యంగల ఇళ్ల నిర్మాణం, పట్టణ ప్రాంతాల్లో సుస్థిర వ్యర్థ పదార్థాల యాజమాన్యాల కోసం ఇది పనిచేస్తుంది.
 • జాతీయ నీటి మిషన్‌: నీటి వనరుల సమన్వయ వినియోగ సామర్థ్యాన్ని కనీసం 20 శాతం పెంచే లక్ష్యంతో ఇది పనిచేస్తుంది.
 • జాతీయ హిమాలయ జీవావరణ సుస్థిర మిషన్‌: హిమాలయ మంచు కరగడంపై వాతావరణ పర్యావరణ పరిస్థితుల్ని అంచనా వేసేందుకు ఇది ఉద్దేశించింది.
 • జాతీయ హరిత భారత మిషన్‌: అదనంగా 10 మిలియన్‌ హెక్టార్ల నిరుపయోగ భూముల్ని, సామూహిక భూముల్ని, క్షీణించిన అటవీభూముల్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఇది ఏర్పాటైంది.
 • జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్‌: వాతావరణమార్పుల్ని తట్టుకుని, ఉత్పాదకతను పెంచేందుకు తోడ్పడే సాంకేతికాల అభివృద్ధికి ఉద్దేశించినది. మొత్తం మీద వివిధ వ్యవసాయ, వాతావరణ మండలాల్లో మౌలిక వనరులైన నీరు, భూమి తదితరాల వినియోగాన్ని మెరుగుపరిచి, జన్యు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వరదల్ని, ఇతర ప్రకృతి వైపరీత్యాల్ని, చీడ, పీడల్ని తట్టుకునేవిధంగా కొత్తరకాల్ని రూపొందించ డానికి దీని పరిశోధనలు ఉద్దేశించబడ్డాయి.
 • జాతీయ వ్యూహాత్మక వాతావరణమార్పుల విజ్ఞాన మిషన్‌: వాతావరణ మార్పుల వల్ల వస్తున్న సవాళ్లను గుర్తించి, సంబంధిత విజ్ఞానాన్ని, స్పందించాల్సిన అవసరాన్ని వ్యాప్తి చేసేందుకు ఉద్దేశించింది.
 • అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం కలిగించేలా కార్బన్‌ విడుదలను తగ్గించేందుకు అవసరమైన ఓ నిపుణుల గ్రూపు కూడా ఏర్పాటైంది.

నష్టపరుస్తున్న శక్తులు..

 • కార్పొరేట్‌ శక్తుల అమిత లాభాపేక్ష.
 • సంపదను పోగుచేసుకోవాలనే సంస్కృతి - దీనికి మద్దతిస్తున్న కార్పొరేట్‌శక్తులు.
 • హద్దూ అదుపూ లేని వినియోగ సంస్కృతి.
 • ధనికుల జీవనశైలి.
 • ప్రకృతి వనరులను కొల్లగొట్టే రాజకీయాలు, ఆక్రమణలు, అక్రమాలు.
 • పర్యావరణాన్ని నష్టపర్చగల శాస్త్ర, సాంకేతికాల ఎంపిక.

ఆధారము: సూర్య© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate