హోమ్ / శక్తి వనరులు / విధివిధాన మద్దతు / ఇంధన మార్కెట్లా, ఇంధన పాలనా?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఇంధన మార్కెట్లా, ఇంధన పాలనా?

ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న మరిన్ని తక్షణ సంక్షోభాలన్నీ కలగలిసి ప్రభుత్వాలు, ప్రజల దృష్టిని అతి ముఖ్యమైన ఇంధన సవాళ్ల నుంచి మళ్లిస్తున్నాయి.

అంతర్జాతీయ ఇంధన సంస్థ వార్షిక నివేదిక 'వరల్డ్‌ ఎనర్జీ ఔట్‌లుక్‌'ను ప్రచురిస్తుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ను తగ్గించే క్రమంలో మనం సరైన దారిలో అసలేమాత్రం లేమని అది మరోసారి నిర్ధారించనుంది. ఇంధనోత్పత్తి విషయంలో ప్రస్తుత ధోరణినే మనం కొనసాగించే పనైతే భూమి సగటు ఉష్ణోగ్రత 1990తో పోలిస్తే 2100 నాటికి ఏకంగా 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మేరకు పెరుగుతుంది. అదే జరిగితే భూగోళానికి, మానవ జీవితానికి కావాల్సిన సానుకూల పరిస్థితులకు ఇక పూడ్చలేని, కోలుకోలేని నష్టం జరుగుతుంది.

ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న మరిన్ని తక్షణ సంక్షోభాలన్నీ కలగలిసి ప్రభుత్వాలు, ప్రజల దృష్టిని అతి ముఖ్యమైన ఇంధన సవాళ్ల నుంచి మళ్లిస్తున్నాయి. అమెరికాలో జాతీయ స్థాయిలో చాలాకాలంగా ఇంధన సవాళ్లపై అసలు చర్చే జరగడం లేదు. యూరోపియన్‌ యూనియన్‌ కూడా ఆర్థిక సునామీలో చిక్కుతానేమోననే భయంతో వణికిపోతోంది  ఇక వర్ధమాన దేశాలు కోట్లాది మంది తమ పౌరులను పేదరికపు కోరల నుంచి ఇవతలికి లాగేందుకు వీలుగా శరవేగపు ఆర్థిక వృద్ధిరేటును ఎలాగైనా కొనసాగించే తాపత్రయంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్‌ చివర్లో దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగే యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) తర్వాతి సమావేశాన్ని ఇంకా ఎవరూ పట్టించుకోవడమే లేదు.

కానీ ఇంధన మావన జాతి అవసరాల్లో మౌలికమైనది. ప్రతికూల ప్రభావాల భయం వల్ల మాత్రమే కాదు  ఆర్థిక రంగాలకు దాని అనివార్య అవసరాల వల్ల కూడా. పాశ్చాత్య దేశాలు తమ జీడీపీల్లో 8 నుంచి 10 శాతం దాకా ఇంధన అవసరాలపై వెచ్చిస్తున్నాయి. ఇక వర్ధమాన దేశాలైతే అంతకు రెండు నుంచి మూడు రెట్ల దాకా వెచ్చిస్తున్నాయి. ఈ కారణంగానే ఇంధన అవసరాలను పాలించే విధానాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది.

పర్యావరణపరంగా ప్రతికూలాంశాలు, అనియంత్రిత ఇంధన మార్కెట్లు దీని నియంత్రణకు ఏ మాత్రమూ లాభించలేవు. ఎందుకంటే పర్యావరణ ఖర్చులను భరించడం అప్పుడు అసాధ్యమవుతుంది. అత్యంత కలుషితపూరితమైన ఇంధన వనరులు తమ ప్రతికూలతలకు పరిహారంగా 70 శాతం దాకా పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఇటీవలి గణాంకాలు తేల్చాయి.

స్వేచ్ఛాయుత మార్కెట్లు సరిగా పని చేయకపోవడానికి ఈ రంగంలో గణనీయంగా సమాచారం లేకపోవడం మరో ముఖ్య కారణం. తరచూ సహజ వాయువు వంటి ఇంధన వనరులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం సాంకేతికంగా చాలా కష్టతరమైన విషయంగా మారుతుంటుంది. పైగా ప్రభుత్వాలు తమ సహజ వనరులను వ్యూహాత్మక ప్రాముఖ్యమున్నవిగా పరిగణిస్తాయి. దాంతో వాటికి సంబంధించిన సమాచారాన్ని బయటికి అసలే విడుదల చేయవు. అంతిమంగా ఇంధనానికి సంబంధించిన కాలావధులు చాలా పొడవుగా ఉంటాయి: పర్యావరణ నష్టాలు పూర్తిగా బహిర్గతమయ్యేందుకు శతాబ్దాలు పడుతుంది. వాటిపై పెట్టిన పెట్టుబడులు తిరిగి వచ్చేందుకు కూడా కనీసం దశాబ్దాలకు తక్కువ పట్టదు. అలా ఇంధనాన్ని పరస్పర సహకారం, నియంత్రణలతో వ్యవస్థ ద్వారా నిర్వహించడం అనివార్యం.

అయితే ఇది చాలా సంక్లిష్టంగా మారుతుంది. ఇంధన వనరుల నిర్వహణకు సాంకేతిక, రాజకీయ, ఆర్థిక కోణాలను ఏకకాలంలో దృష్టిలో పెట్టుకుని ఆలోచించాల్సి ఉంటుంది. ఇంధన వెలికితీత, ఉత్పత్తి కోసం పలు నైపుణ్యాలు, సాంకేతికతలు -ఇయోలిక్‌ (పవన), ఫొటోవోల్టాటిక్‌, అణు, బొగ్గు వంటివి -ఆవసరమవుతాయి. రాజకీయ రంగంలోనూ అంతే. పారిశ్రామిక, ఆర్థిక రంగాలు వ్యవస్థీకృతంగానే అయినా, విభజితమై ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో అంతర్గత సహకారం మరింత అదనపు భారంగా పరిణమిస్తుంది.

ఈ బహుళధ్రువ పరిస్థితులను ఎదుర్కోవడంలో మన అసమర్థతను ఇంధన రంగం బహిర్గతం చేస్తోంది. ఇంధన విధానం జాతీయ స్థాయికి సంబంధించిన అంశం. కానీ ఈ రంగపు ప్రభావాలు అంతర్జాతీయ స్థాయిలో పడతాయి. రేడియోధార్మిక లీకేజీ, సముద్రాంతర్గత చమురు బావికి రంధ్రం, వీటన్నింటినీ మించి కర్బన ఉద్గారాలు చేకూర్చగల నష్టం, వాటి ముప కేవలం ఒక్క దేశానికే పరిమితం కావు. మరోవైపు, ఇంధన లాభాలు కొందరికి మాత్రమే లబ్ధి చేకూరుస్తాయి. వారు వినియోగదారులు, ఉత్పత్తిదారులు, విక్రేతల్లో ఎవరైనా కావచ్చు. ఈ అసమతుల్యత వారికి స్పష్టమైన అవకాశాన్ని కలగజేస్తుంది. వారు లాభపడతారు. అందుకు ఇతరులంతా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

పైగా, ప్రపంచ స్థాయి నిర్వహణ నియంత్రణ మరో కారణంగా కూడా తప్పనిసరి. ఎందుకంటే ఇంధన సరఫరా, డిమాండ్‌ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా సరైన నిష్పత్తిలో లేనే లేవు. కొన్ని దేశాల్లో మాత్రమే ఈ ఇంధన సమతుల్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా అతి ప్రధాన ఇంధన వనరైన చమురే ఇందుకు నిదర్శనం. మధ్యప్రాచ్యంలో ఏకంగా 266 శాతం వాణిజ్య మిగులు ఇంధనముంటే  అమెరికాలో ఏకంగా 65 శాతం లోటుంది! ఈ భౌగోళిక అసమతుల్యతను ఎదుర్కోవాలంటే సజావైన వర్తక వ్యవస్థ తప్పనిసరి. దాంతోపాటే స్పష్టమైన నియంత్రణలు, సునిర్మితమైన ప్రపంచ మార్కెట్‌ కూడా! కానీ నేడు ఒపెక్‌ దేశాల ద్వైపాక్షిక ఒప్పందాలు, తదితర కారణాల పుణ్యమా అని ఈ అతి భిన్నమైన పర్యావరణ అవసరాల రీత్యా పరస్పర విరుద్ధమైన సబ్సిడీల సహజీవనం తప్పనిసరిగా మారింది.

ఫలితంగా మన ప్రపంచ ఇంధన పరిస్థితి దారుణంగా అసమంజసంగా ఉంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ కూడా దీన్ని అంగీకరిస్తోంది. కేవలం ఓసీసీడీ దేశాలు మాత్రమే (చైనా మినహా) అతి పెద్ద ఇంధన వినియోగదారులు. ఇంధన సేవలు, ఉత్పత్తులకు నిష్పాక్షిక మార్కెట్‌ నిబంధనలను వర్తింపజేయాలని ఇంటర్‌ గవర్నమెంటల్‌ ఎనర్జీ చార్టర్‌ ఒప్పందం స్పష్టంగా పేర్కొంటోంది. కానీ ప్రపంచంలో రెండో అతి పెద్ద ఇంధన వినియోగదారు అయిన అమెరికాయే దానిపై సంతకం చేయలేదు! ఇక ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఇంధన ఉత్పత్తిదారు అయిన రష్యా కూడా దానికి అంగీకరించలేదు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాలు ఇంధనానికి బయటికి చూసేందుకు మాత్రమే వర్తిస్తాయి. ఎందుకంటే ఇంధనాన్ని నశించిపోగల సహజ వనరుగా పరిగణిస్తారు. ఆ కారణంగానే పలు కేసుల్లో దానికి నియమ నిబంధనల నుంచి మినహాయింపును ఇచ్చారు.

పైగా, పాశ్చాత్యేతర దేశాలు, చైనా, భారత్‌ వంటి పెద్ద వినియోగదారులతో సహా, అతి పెద్ద ఉత్పత్తిదారులు (గల్ఫ్‌ దేశాలు, రష్యా) ప్రస్తుత అంతర్జాతీయ వ్యవస్థీకృత పద్ధతిని పెద్దగా విశ్వసించవు. ఎందుకంటే దాన్ని నిర్మించింది ప్రధానంగా పాశ్చాత్య దేశాలే. నేటి వాతావరణ మార్పుల ప్రమాదానికి ప్రధానంగా పాశ్చాత్యదేశాలే కారణమన్న వర్తమాన దేశాల వాదన కూడా నిజమే. పారిశ్రామిక విప్లవం నుంచి మొదలుకుని ఇటీవలి కాలం దాకా పాశ్చాత్యదేశాల అభివృద్ధి ఎలాంటి పర్యావరణ నియంత్రణలూ లేకుండానే సాగుతూ వచ్చింది. ఆ నష్టాన్ని పూడ్చేందుకు ఇప్పుడు సర్దుబాటు వ్యయాలను తామెందుకు భరించాలని వర్ధమాన దేశాలు ప్రశ్నిస్తున్నాయి. అందుకవి సిద్ధంగా లేవు కూడా. అలాగే, ఉత్పాదక దేశాలు కూడా తమకున్న అతి పరిమితుల అధికార అవకాశాల్లో ఒకదాన్ని వదులుకునేందుకు అస్సలు సిద్ధంగా లేవు.

దీనికి పరిష్కార మార్గాల్లో కొత్త వ్యవస్థను విధిగా చేర్చాల్సిందే. బహుశా ఆరంభంగా ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ కాలుష్యాన్ని వెదజల్లే దేశాలు జీ-20 ద్వారా, లేదా అలాంటి మరో వ్యవస్థ ద్వారా ఇంధన కోసం సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. తర్వాత అన్ని దేశాలనూ కలుపుకునేలా సంప్రదింపులు మొదలు కావాలి. వాటన్నింటినీ యూఎన్‌ఎఫ్‌సీసీసీ పరిధిలోకి తేవడం వంటి చర్యలు చేపట్టాలి.

సంప్రదింపుల దృష్టంతా సమగ్రంగా ఉండి తీరాలి. అప్పుడే ఉద్గార పరిమితులు, పర్యావరణానికి తక్కువ హానికరమైన ఇంధన వనరులకు ఆర్థిక, సాంకేతిక మద్దతు వంటివి అందులో చేరేందుకు వీలవుతుంది. ఉద్గారాలను పరిమితం చేయడం చమురు ఎగుమతి దేశాలపై, చమురు వినియోగదారులైన వర్ధమాన దేశాలపై అసమతుల్యంగా ఖర్చులను రుద్దడం కాకూడదు. ఎందుకంటే ఆ దేశాల్లోని పరిజ్ఞానం ఇంకా అంత అత్యాధునికమైనది కాదు.

డర్బన్‌లో జరగబోయే యూఎన్‌ఎఫ్‌సీసీసీ భేటీలో సంపన్న, వర్ధమాన దేశాలన్నీ.. తమ వద్ద ఇంధన వనరులున్నాయా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా చేతులు కలపాలి. ప్రస్తుతం ప్రపంచాన్ని ఆందోళన పరుస్తున్న ఇతర సంక్షోభాలు, సమస్యలన్నీ పరిష్కారం కాగానే వాటన్నింటినీ మించిన ఈ ఇంధన సమస్యను ఎవరమూ నిర్లక్ష్యం చేయబోమని ప్రతినబూనాలి.

ఆధారము: ది సండే ఇండియన్.కామ్

2.98596491228
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు