హోమ్ / శక్తి వనరులు / విధివిధాన మద్దతు / దేశ ఇంధన ఆర్థిక వ్యవస్థ
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

దేశ ఇంధన ఆర్థిక వ్యవస్థ

పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనే అతి ముఖ్యమైన సవాళ్లలో ఇంధన ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ప్రధానమైంది.

పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనే అతి ముఖ్యమైన సవాళ్లలో ఇంధన ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ప్రధానమైంది. దేశీయ ఇంధన వనరులను మెరుగ్గా నిర్వహించుకోవాలి. మన దేశ విదేశాంగ విధానంలో ఇంధన దౌత్యం కీలకాంశం కావాలి. మార్కెట్ ఆర్థిక సంస్కరణలు భారతదేశంలో ప్రవేశించాక, ప్రపంచీకరణ ప్రభావం పెరిగాక రాజకీయ దౌత్యం కంటే ఆర్థికదౌత్యం ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. విదేశాంగ నీతిలో ప్రముఖమవుతోంది. అందుకే గతంలో దేశాధినేతలు విదేశీ ప్రయాణాలు చేసినప్పుడు వారి వెంట వెళ్లే ప్రతినిధివర్గాల్లో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులే ప్రధానంగా ఉండేవారు. ఇటీవల కాలంలో మన దేశాధినేతలు విదేశాలకు వెళ్లినా లేదా విదేశీ నేతలు మనదేశానికి వచ్చినా వ్యాపార, వాణిజ్య ప్రతినిధి వర్గాలు పెద్దసంఖ్యలో వస్తున్నాయి. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్, అంతకుముందు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటనల సందర్భంగా కూడా ఈ ధోరణి స్పష్టంగా కనిపించింది. భవిష్యత్‌లో ఆర్థిక దౌత్యంలో ఇంధన దౌత్యం ప్రత్యేక స్థానాన్ని పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశ ఇంధన దౌత్యానికి ఉన్న అవకాశాలను, సవాళ్లను చర్చిద్దాం.

జాతీయ ప్రయోజనాల్లో కీలకం

మారుతున్న ప్రపంచం పరస్పర ఆధారిత, పరస్పర సంబంధిత, పరస్పర సమీకృత భూగోళం. ఇంధన రంగంలో ఈ పరస్పర ఆధారిత లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజంతో సంబంధాలకు జాతీయ ప్రయోజనాలు గీటురాయిగా మారుతున్నాయి. జాతీయ ప్రయోజనాలను దేశ విదేశాంగ విధానాలు నిర్దేశిస్తున్నాయి. భారతదేశ ప్రయోజనాల్లో ఇంధన భద్రత కీలకమైంది. ఎందుకంటే మనదేశం మొత్తం ముడి చమురు అవసరాల్లో సుమారు 80 శాతం మేరకు దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. అధిక ఇంధన ఆధారిత ఆర్థికాభివృద్ధి నమూనాను అమలు చేయడం వల్ల, అధిక ఇంధన వినిమయ జీవన శైలిని అనుసరించడం వల్ల భారతదేశ ఇంధన అవసరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ఇంధన భద్రతకు విదేశాంగ విధానంలో మరింత కీలకస్థానం లభిస్తోంది.

ప్రణాళికా సంఘం ఇంధన భద్రతకు తీసుకోవాల్సిన అనేక కీలక అంశాలను స్పష్టీకరించింది. పన్నెండో ప్రణాళిక కాలంలో కూడా ఈ వ్యూహాన్నే అనుసరిస్తున్నారు. ఉదాహరణకు, రాబోయే కాలంలో షెల్ గ్యాస్ ఉత్పత్తిపై దృష్టి సారించనున్నారు. అమెరికాలో కూడా షెల్ గ్యాస్ కనుక్కున్నాకే దేశ ఇంధన రంగం అనూహ్యంగా మారింది. అలాగే లోతైన బొగ్గు నిల్వల నుంచి మీథేన్ గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించనున్నారు. సౌర విద్యుత్ లాంటి సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రాధాన్యం, ఇతర దేశాల నుంచి ఇంధన దిగుమతులను సులభతరం చేసేందుకు గ్యాస్ పైప్‌లైన్ల నిర్మాణం, ఇతర దేశాల్లోని చమురు, సహజవాయువు క్షేత్రాల్లో భారతదేశం స్వయంగా, సంయుక్తంగా పెట్టుబడులు పెట్టడం, కనీసం 90 రోజుల వ్యూహాత్మక ఇంధన నిల్వలను ఏర్పాటు చేసుకోవడం మొదలైన అంశాలు ప్రధానమైనవి. పన్నెండో పంచవర్ష ప్రణాళికను ప్రారంభిస్తూ మార్కెట్ ఆధారిత ఇంధన ధరల విధానం కూడా దేశ ఇంధన భద్రతలో కీలకాంశమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

ఇంధన రంగంలో అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించేందుకు, అధిక ఇంధన, అనవసర ఇంధన వినిమయాన్ని అరికట్టేందుకు, సహేతుకమైన, మార్కెట్ ఆధారిత ఇంధన ధరల విధానం కీలకమని ప్రణాళికా సంఘం వాదిస్తోంది. భారతదేశం రెండు దశాబ్దాలుగా అధిక ఆర్థికాభివృద్ధి బాటలో పయనిస్తోంది. అననుకూల వాతావరణ పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక మాంద్యం లాంటి ప్రతికూల ప్రభావాలున్నా భారతదేశం గత ప్రణాళిక కాలంలో సుమారు 8 శాతం వృద్ధిరేటును సాధించింది. పన్నెండో ప్రణాళిక కాలంలో కూడా ఇదే వృద్ధి రేటును నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆర్థికవృద్ధికి, ఇంధన వినిమయానికి కార్యాకారణ సంబంధం ఉంది. అంటే ఆర్థికవృద్ధికి ఇంధన వినిమయం అవసరం. అదేవిధంగా ఆర్థికవృద్ధి జరిగిన కొద్దీ ఇంధన డిమాండ్ పెరుగుతోంది. అధిక ఇంధన అవసరాలను దిగుమతుల ద్వారా తీర్చుకోవడం వల్ల మనదేశం చెల్లించే వార్షిక దిగుమతుల బిల్లులో అన్నింటి కంటే పెద్దది ఇంధన దిగుమతుల బిల్లే. ముఖ్యంగా ప్రస్తుత ఖాతాలో లోటు, వాణిజ్య లోటు పెరుగుతున్న సందర్భంలో ఈ దిగుమతుల బిల్లు ఆందోళనకరం. భారతదేశం 2015 నాటికి 6 శాతం ఆర్థిక వృద్ధిరేటు సాధించినా ఇంధన అవసరాల్లో వృద్ధిరేటు 4 శాతం ఉంటుందని నిపుణుల అంచనా. ప్రపంచంలో ఉండే ఇంధన డిమాండ్‌లో వృద్ధిరేటుతో పోలిస్తే ఇది రెట్టింపు.

ఇతర దేశాలతో పోల్చుకుంటే...

ఇంతకుముందే పేర్కొన్నట్లు భారత్ తన ముడిచమురు అవసరాల్లో అధిక భాగం దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందులోను కేవలం కొన్ని దేశాలపైనే ఆధారపడటం ఇంధన భద్రతకు సవాలుగా పరిణమిస్తోంది. సమాచార సాంకేతిక రంగాన్నే పరిశీలిస్తే.. దేశ సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో అత్యధిక భాగం అమెరికాకు చేరడం వల్ల అమెరికాలో ఆర్థిక తిరోగమన పరిస్థితులు ఏర్పడినప్పుడు దాని ప్రతికూల ప్రభావం భారత సమాచార సాంకేతిక రంగంపై తీవ్రంగా పడింది.

భారత్ తన ముడి చమురు దిగుమతుల్లో మూడింట రెండు వంతులు పశ్చిమాసియా దేశాల నుంచే చేసుకుంటోంది. ముడి చమురు దిగుమతుల కోసం భారత్ ఆధారపడుతున్న ఇతర ముఖ్యదేశాలు: నైజీరియా, లిబియా, సూడాన్ మొదలైనవి. ప్రపంచంలో అభివృద్ధి చెందని, చెందుతున్న దేశాలతో పోలిస్తే భారతదేశ ఇంధన రంగంలో దిగుమతులపై ఆధారపడటం అధికం. ఉదాహరణకు, అమెరికా తన మొత్తం ముడి చమురు అవసరాల్లో సగం మేరకు దిగుమతులపై ఆధారపడుతుంటే చైనా తన అవసరాల్లో మూడోవంతు మాత్రమే దిగుమతిచేసుకుంటోంది. అందుకే భారత్ తన ఇంధన దౌత్యాన్ని, దానికనుగుణంగా విదేశాంగ విధానంలో మార్పులు, చేర్పులను నిరంతరం సమీక్షించుకోవాల్సి ఉంటుంది. భారతదేశ అంతర్జాతీయ ఇంధన సరఫరాలు, ఇంధన దౌత్యం అనేక అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాల ప్రభావానికి లోనవుతూనే ఉంటాయి. ఉదాహరణకు, గల్ఫ్‌లో రాజకీయ, భౌగోళిక మార్పులు, మధ్య ఆసియాలో పైపులైన్ల నిర్మాణంలో రాజకీయాంశాలు, ఆఫ్రికాలోని ఇంధన వనరుల కోసం పెరుగుతున్న పోటీ, చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లోని స్థానిక రాజకీయ, భద్రతాపరమైన పరిస్థితులు మొదలైనవి. ఇంధన అవసరాలంటే కేవలం ఇంధన వనరులే కాదు, ఇంధనరంగంలో సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులో ఉండాలి. అందుకే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇలా అన్నారు: 'ఇంధన భద్రత అంతర్జాతీయ స్వభావాన్ని కలిగి ఉంది. అందుకే ఇంధన వనరులు, టెక్నాలజీ అందుబాటును కాపాడుకునేలా మనదేశం క్రియాశీలక విదేశాంగ విధానాన్ని అనుసరించాలి. విదేశాంగ విధానంలో ఉండే పలు అంశాలు పరస్పరం ప్రభావాన్ని చూపుతూనే ఉంటాయి. ఉదాహరణకు, భారత్, రష్యాల మధ్య మొదటినుంచీ మంచి సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాల సంబంధాల్లో ఇంధనరంగం కూడా ముఖ్య భూమిక పోషిస్తూనే ఉంది. ఇప్పటికీ రెండుదేశాలు ఉమ్మడి చమురు క్షేత్రాల్లో సహకరించుకుంటున్నాయి.

తొలి రోజుల్లో భారతదేశ దేశీయ చమురు రంగాన్ని అభివృద్ధి చేయడంలో నాటి సోవియట్ యూనియన్ ముఖ్యపాత్ర పోషించింది. ఇరాన్, తుర్క్‌మెనిస్థాన్ నుంచి పాకిస్థాన్ మీదుగా నిర్మించతలపెట్టిన పైప్‌లైన్ భారత్, పాక్‌లకు లాభం చేకూర్చేదిగా ఉన్నా రాజకీయ కారణాల వల్ల పాకిస్థాన్ అడ్డుకుంటోంది. అలాగే ఇరాన్‌తో మనదేశానికి చమురు రంగంలోనే కాక ఇతరత్రా కూడా మంచి సంబంధాలున్నాయి. అయినా మారిన విదేశాంగ విధాన ప్రాధాన్యాల రీత్యా భారత్ అంతర్జాతీయ వేదికల్లో అమెరికాకు అనుకూలంగా, ఇరాన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించింది. మరోవైపు పాకిస్థాన్ సహకరించకపోవడంతో అనేక భారత్ - ఇరాన్ ఇంధన సహకార కార్యక్రమాలు అమలుకు నోచుకోలేదు. అయినా ఇరుదేశాల మధ్య కొన్ని అవగాహనలు కుదిరాయి. ఉదాహరణకు, ఇరాన్ భారతదేశానికి 50 లక్షల టన్నుల ఎల్ఎన్‌జీని ఎగుమతి చేసేందుకు అంగీకరించడం, అక్కడి చమురు క్షేత్రాలను మన దేశానికి చెందిన ఓఎన్‌జీసీ విదేశీ లిమిటెడ్‌కు కేటాయించడం, భారత్‌కు చెందిన గెయిల్‌కు ఇరాన్‌లో సీఎన్‌జీ సదుపాయాలను కల్పించడంలో భాగస్వామ్యం ఇవ్వడం మొదలైనవి. ఇంకా అనేక అవకాశాలున్నాయి. ఉదాహరణకు, తుర్క్‌మెనిస్థాన్, అఫ్గనిస్థాన్, పాకిస్థాన్, ఇండియా పైప్‌లైన్ ఏర్పాటు విజయవంతమైతే అది భారతదేశ ఇంధన భద్రతకు ఇతోధికంగా దోహదం చేస్తుంది. ఇరాన్‌కే కాదు భారతదేశానికీ ఆఫ్రికాలో చమురు అవకాశాలున్నాయి. ప్రపంచంలోని మొత్తం చమురు నిక్షేపాల్లో ఏడు శాతం, ప్రపంచ చమురు ఉత్పత్తిలో 11 శాతం ఆఫ్రికాలో ఉందని అంచనా. ఆఫ్రికాలో లభించే ముడిచమురులో గంధకం పాలు తక్కువగా ఉండటం వల్ల అది పర్యావరణపరంగా మరింత అనుకూలమైన ఇంధన వనరు. ఇంధన రంగంలో లాటిన్ అమెరికా దేశాలతో భారత్‌కు ఇప్పటికే సంబంధాలున్నాయి.

దీర్ఘకాలిక వ్యూహం అవసరం

భవిష్యత్‌లో వెనిజులా, మెక్సికో దేశాల్లో ఉత్పత్తి తగ్గితే బ్రెజిల్‌తో సహకారం భారత్‌కు కీలకం కావచ్చు. మయన్మార్, బంగ్లాదేశ్‌లలో సహజ వాయు నిక్షేపాలున్నాయి. భూగర్భ గ్యాస్‌పైపు లైన్ల ద్వారా మయన్మార్ నుంచి కూడా భారత్ ఇంధనాన్ని సరఫరా చేసుకోవచ్చు. ఆ దేశాలకు కూడా భారత్ అతి పెద్ద వినియోగదారుగా ఉంటుంది. కానీ, ఆర్థికేతర కారణాల వల్ల సహజ వాయువు రంగాల్లో సహకరించుకునేందుకు ఈ దేశాలు అంత చొరవ చూపడం లేదు. కొన్ని అంచనాల ప్రకారం సహజ వాయువు నిక్షేపాల్లో మయన్మార్ ప్రపంచంలోనే పదో స్థానంలో ఉంది. అందుకే ఈ దేశంతో ఇంధన రంగంలో సహకారం భారతదేశ దీర్ఘకాల ఇంధన భద్రతకు ఎంతో దోహదం చేస్తుంది. ఈశాన్య భారతదేశం ద్వారా మయన్మార్ నుంచి మన దేశానికి సహజ వాయు సరఫరా మార్గాలను అభివృద్ధి చేయవచ్చు. ఇది రెండు దేశాలకు లాభసాటిగా ఉండటమే కాకుండా భారత ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. ఇప్పటివరకు పశ్చిమాసియా దేశాలపై ఆధారపడుతున్న మనదేశానికి మయన్మార్ దీర్ఘకాల, సుస్థిర సరఫరాదారుగా ఉపయోగపడుతుంది. చమురు నుంచి సహజ వాయువుకు మారడానికి కూడా ఇది ఉపకరిస్తుంది.

ఇంధన భద్రతను భారత విదేశాంగ విధాన దృక్పథంతో చూసినప్పుడు ముఖ్యంగా రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది.. భారత్ విదేశీ చమురు క్షేత్రాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా చమురు, సహజ వాయువు వాటాలను పొందడం. రెండోది.. సుస్థిర, దీర్ఘకాల ఇంధన సరఫరాల కోసం కొన్ని దేశాలపైనే ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడటం. దీంతోపాటు ఇతర దేశాల్లో పునరుత్పత్తి ఇంధన వనరుల రంగంలో పెట్టుబడులు పెట్టడం కూడా ఒక ముఖ్య అంశంగా ఉండాలి.

ముఖ్యాంశాలు

  • ప్రపంచీకరణ ప్రభావంతో ఆర్థిక దౌత్యానికి పెరుగుతోన్న ప్రాధాన్యం.
  • జాతీయ ప్రయోజనాల్లో కీలకమైన అంశంగా మారుతోన్న ఇంధన భద్రత.
  • ఇంధనం కోసం భారత్ దిగుమతులపై అధికంగా ఆధారపడాల్సి రావడం ఆందోళన కలిగించే అంశం.
  • రాజకీయ, భౌగోళిక మార్పులు, పైపు లైన్ల నిర్మాణంలో రాజకీయ అంశాలు, ఇంధన వనరుల కోసం దేశాల మధ్య పోటీని దృష్టిలో ఉంచుకొని ఇంధన దౌత్యాన్ని సమీక్షించుకోవాలి.
  • ఇరాన్ నుంచి పాకిస్థాన్ మీదుగా భారత్‌కు రావాల్సిన పైప్ లైన్ నిర్మాణం రాజకీయ కారణాల వల్ల ఆగిపోయింది.
  • విదేశీ చమురు క్షేత్రాల్లో పెట్టుబడుల ద్వారా ఇంధన భద్రతను పెంపొందించుకోవచ్చు.

ఇంధన భద్రత అంటే...?

ఇంధన భద్రత అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ అంశాలు కూడా సందర్భాన్ని బట్టి, దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే ఇంధన భద్రత అనగానే కొన్ని ప్రాథమిక అంశాలు గుర్తుకు వస్తాయి. అవి: దేశ ఇంధన అవసరాలు ఏ మేరకు పెరుగుతూ ఉంటాయి? ఏ రకమైన ఇంధనాల అవసరం అధికంగా ఉంటుంది? ఎంత మేరకు ఉంటుంది? దేశ ఇంధన వినిమయంలో వివిధ రకాల ఇంధనాల పాత్ర, ఇంధన యాజమాన్యం ఏ విధంగా ఉండాలి? ఇంధన ధరల విధానానికి ఇంధన భద్రతకు సంబంధం ఏమిటి? మొదలైనవి.

మౌలికంగా అర్థం చేసుకోవాలంటే దేశం సుస్థిర ఆర్థికవృద్ధి రేటును సాధించడానికి అవసరమైన ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగేందుకు ఇంధన సరఫరా నిరంతరాయంగా ఉండాలి. అవి దేశీయమైనవి కావచ్చు లేదా అంతర్జాతీయమైనవి కావచ్చు. కానీ, దిగుమతులపై అధికంగా ఆధారపడే మన దేశ విషయంలో నిరంతరాయ ఇంధన సరఫరా అంటే ప్రధానంగా అంతర్జాతీయ దృష్టితోనే చూడాలి. దేశీయ ఇంధన సరఫరాలను మన ప్రభుత్వాలు తమ ఆర్థిక, ద్రవ్య, ఇంధన విధానాల ద్వారా నిర్ధారించగలవు, నిర్దేశించగలవు. కానీ, అంతర్జాతీయ ఇంధన సరఫరాలు పలు సందర్భాల్లో మన దేశ పరిధిలో ఉండవు. ఉదాహరణకు, ప్రపంచంలో ఇంధన ఉత్పత్తిలో ముఖ్య భూమిక పోషిస్తున్న దేశాల్లో అస్థిర, అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పుడు అవి మనదేశానికి ఇంధన సరఫరా చేయడంలో అంతరాయం ఏర్పడుతుంది. అందుకే సురక్షితమైన, సుస్థిరమైన, విశ్వసనీయమైన అంతర్జాతీయ ఇంధన సరఫరా జరిగేలా దేశ ఇంధన దౌత్యం, విదేశాంగ విధానాలను రూపొందించుకోవడం కీలకం.

ఆధారము: ఈనాడు ప్రతిభ.నెట్

3.03267973856
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు