పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

నవ ఇంధన శకం

ఇంధన రంగంలో పెను విప్లవం! ఆర్థికవృద్ధికి గొప్ప చోదక శక్తి అయిన ఇంధన వనరులు అంతరించిపోతున్నాయనుకుంటున్న దశలో భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కొత్త శకం.

ఇంధన రంగంలో పెను విప్లవం! ఆర్థికవృద్ధికి గొప్ప చోదక శక్తి అయిన ఇంధన వనరులు అంతరించిపోతున్నాయనుకుంటున్న దశలో భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కొత్త శకం! భూగర్భంలో పొరలు పొరలుగా పేరుకుని ఉన్న శిలాఫలకాల్లో నిక్షిప్తమైన అపార సహజవాయువు నిల్వలు భారత్‌ సహా పలు దేశాల ఆర్థికముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. ఇంధనం కోసం దిగుమతులపై ఆధార పడే చాలా దేశాలు స్వావలంబన సాధించే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా ఇంధనం ధరలు గణనీయంగా తగ్గుతాయి. అమెరికాలో పదేళ్లుగా శిలావాయువు (షేల్‌గ్యాస్‌) ఉత్పత్తిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఈ అభిప్రాయానికి వస్తున్నారు. దీనిని శిలావాయువు విప్లవంగా వారు అభివర్ణిస్తున్నారు. కఠిన శిలలకు పై భాగంలో ఉండే సంప్రదాయ సహజవాయువు నిల్వలకు భిన్నంగా మడ్డి వంటి అవక్షేపాలతో ఏర్పడే శిలల్లో నిక్షిప్తమై ఉన్న సహజవాయువును శిలావాయువు అంటారు.

ఇంధనరంగంలో అమెరికా ప్రస్తుతం అత్యంత కీలక దశలో ఉంది. ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో ఆ దేశం ఈ రంగంలో స్వావలంబన సాధించనుంది. అక్కడ వచ్చిన శిలావాయు విప్లవం అమెరికాకు మాత్రమే కాకుండా మిగతా దేశాలకూ మేలు చేస్తుందనేది నిపుణుల విశ్లేషణ. శిలావాయువు కూడా సహజవాయువే. అయితే ఇది సంప్రదాయేతరమైనది. వెలికితీతలో భిన్నమైనది. ఇది అగ్రరాజ్యానికే పరిమితమైన వనరు కాదు. పలు దేశాల్లో ఈ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. మన రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి పరీవాహకప్రాంతాల్లోనూ ఈ నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు దేశంలోని కాంబే (గుజరాత్‌), గొండ్వానా (మధ్యభారత్‌), కావేరి (తమిళనాడు), అస్సాం-అరకన్‌ పరీవాహక ప్రాంతాలలోనూ నిక్షేపాలు ఉన్నట్లు బయటపడింది. అమెరికాకు చెందిన ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఈఐఏ) మనదేశంలోని శిలావాయువు నిక్షేపాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని విశ్లేషించింది. తదుపరి అధ్యయనం కోసం భారత పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ, అమెరికాకు చెందిన జియోలాజికల్‌ సర్వే ( యుఎస్‌జీఎస్‌) సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు ఏడాదిన్నరగా ఈ సంస్థ జరుపుతున్న పరిశీలనలోనూ మనవద్ద నిక్షేపాలు నిర్ధారణ అవుతున్నాయి.

చమురు, సంప్రదాయ సహజవాయువు రంగంలో మాదిరిగానే శిలా వాయువు రంగంలోనూ ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పిస్తూ జాతీయ వెలికితీత విధానాన్ని వెలువరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆ తర్వాత బ్లాకులవారీగా ప్రాంతాలను వేలం వేస్తుంది. మనదేశంలోని ప్రఖ్యాతసంస్థలు శిలావాయువు రంగంలోకి ప్రవేశించేందుకు అవసరమైన సన్నాహాలలో ఇప్పటికే నిమగ్నమై ఉన్నాయి. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలో సమృద్ధిగా నిల్వలు ఉన్నాయనే అంచనాలతో కొన్ని సంస్థలు ఆ ప్రాంతంలో జరగనున్న వెలికితీతలో పాత్ర పోషించేందుకు ప్రాథమిక సన్నాహాలను ఇప్పటికే ప్రారంభించినట్లు సమాచారం. అంతేకాదు మన దేశీయ సంస్థలు అమెరికాలో శిలావాయువు వెలికి తీస్తున్న అక్కడి కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసి భాగస్వాములుగా చేరుతుండటం గమనార్హం. శిలావాయువు అభివృద్ధి ప్రభావంతో ఇప్పటికే అమెరికాలో సహజవాయువు ధరలు తగ్గాయి. ఈ విషయంలో తొలిదశలో అమెరికాకు అందిన ప్రయోజనం ఇది అని, భవిష్యత్తులో ఇతర ఇంధనాల ధరలపైనా దీని ప్రభావం ఉంటుందని నిపుణుల అంచనా. అమెరికాలో ఆర్థిక పునరుజ్జీవానికి కీలక చోదకశక్తిగా భావిస్తున్న శిలావాయువు ఇంధనం.. రాబోయే రోజుల్లో భారత్‌కు, ప్రపంచానికి ఎలాంటి మేలు చేయనుందో వేచి చూడాలి.

రాష్ట్రంలో విద్యుత్తు కోతే ఉండదు

  • రాష్ట్రంలో విద్యుత్తు అవసరం 13,400 మెగావాట్లు. సరఫరా 10,925 మెగావాట్లు మాత్రమే. లోటు 2,475 మెగావాట్లు.
  • రాష్ట్రప్రభుత్వంతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న సహజవాయువు ఆధార ప్రాజెక్టుల సామర్థ్యం 2,770 మెగావాట్లు. కేంద్రం సహజవాయువు సరఫరా చేయకపోవడం వల్ల సుమారు 300 మెగావాట్లే ఉత్పత్తి అవుతోంది. ఈ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో వాయువును సరఫరా చేస్తే 80% సామర్థ్యంతో పనిచేసినా 2,216మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.
  • నిర్మాణం దాదాపు పూర్తయిన దశలో దాదాపు 4,500 మెగావాట్ల ప్లాంట్లు ఉన్నాయి. సహజవాయువు కొరతను దృష్టిలోపెట్టుకుని వాటి పనులను ఆయా కంపెనీలు నిలిపివేశాయి. వీటిన్నిటికి సహజవాయువును ఇవ్వగలిగితే మన రాష్ట్ర అవసరాలు తీర్చుకోవడంతోపాటు ఇతర రాష్ట్రాలకూ సరఫరా చేయవచ్చు.

ఇంధనాల ధరలు తగ్గుతాయి: టి.ఎల్‌. శంకర్‌

శిలావాయువు రంగం అభివృద్ధివల్ల అంతిమంగా ఇంధనాల ధరలు తగ్గే అవకాశం ఉందని ఇంధన రంగ నిపుణుడు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, పద్మభూషణ్‌ టి.ఎల్‌.శంకర్‌ తెలిపారు. సహజవాయువు వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం 2003లో వేసిన నిపుణుల కమిటీకి ఆయన ఛైర్మన్‌గా వ్యవహరించారు. శిలావాయువుపై ఈనాడుకు ఆయన చెప్పిన విషయాలు ఇవి

  • అమెరికాలో ఇటీవలి కాలంలో సహజవాయువు ధర తగ్గి ఎంఎంబీటీయూకు 3.3 డాలర్ల స్థాయిలో ఉంది. ఆ దేశంలో శిలావాయువు రంగం అభివృద్ధి చెందడం ఒక ప్రధాన కారణం.
  • అమెరికా ప్రస్తుతం చమురు తదితర ఇంధనాలను ఒకవైపు దిగుమతి చేసుకుంటూనే మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఎగుమతులనూ బాగా చేస్తోంది. దీన్ని బట్టి అది ఇప్పటికే ఇంధన రంగంలో స్వావలంబన సాధించినట్లు భావిం చాలి.
  • టెక్సాస్‌ వంటి చోట్ల నివాసప్రాంతాలకు బాగా దగ్గరగానూ అమెరికా శిలావాయువు వెలికితీస్తోంది. మనదేశం ఇక్కడి నుంచి నిపుణులను అలాంటి చోట్లకు పంపి అధ్యయనం చేయించాలి.

ఆధారము: తెలుగు మీడియా స్టూడెంట్.కామ్

2.96308724832
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు