తమిళనాడులోని కోయంబతూరుకు చెందిన శ్రీ కె.వివేకానందన్, 8 లక్షల రూపాయల పెట్టుబడితో, ఎండు మిరపకాయలను, ధనియాలను పొడిచేసే 3 హెచ్‌పి పల్వరైజర్ (గ్రైండర్) రూపొందించారు. ''తమ కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవాలని ఆశించే గ్రామీణ మహిళలకు, ఈ పరికరం ఒక చక్కని ఆదాయమార్గం'' అంటారు శ్రీ వివేకానందన్.
ఎండు మిర్చిని, ధనియాలను పొడిచేయడానికి, చాలావరకు, ఎక్కువ పెట్టుబడి , ఎక్కువ కరెంటు అవసరమయ్యే గ్రైండింగ్ యంత్రాలు మాత్రమే ప్రస్తుతం అందుబాటులోవున్నాయి. ఇందువల్ల, ముఖ్యంగా, విద్యుత్ సరఫరా ఎప్పుడు వుంటుందో, ఎప్పుడు వుండదో నమ్మకంలేని గ్రామీణ ప్రాంతాలకు, ఇవి అంతగా ఉపయోగకరం కాకుండాపోతున్నాయి.
ఈ సమస్యలను దృష్టిలోపెట్టుకుని కొత్తయంత్రాన్ని రూపొందించిన శ్రీ వివేకానందన్ , తాను 90 శాతం పరిష్కారాన్ని సాధించాననుకుని, దాదాపు 100 యంత్రాలు తయారు చేశారు. కాని, కేవలం 20 యంత్రాలు మాత్రమే అమ్ముడుపోవడం ఆయనకు ఎంతో ఆశాభంగం కలిగించింది. ఇంతేకాదు, ఈ పిండి మిషన్‌లోని తిరగలిలోకి మిర్చి, ధనియాలు సరిగా వెళ్ళలేకపోతున్నాయని, పొడిచేసేటప్పుడు ఎక్కువగా ధూళి చెలరేగుతున్నదంటూ, కొందరు వాటిని వాపసు తెచ్చారుకూడా. దీంతో ఈ కొత్తయంత్రం పని ముందుకుసాగక, దాదాపు సంవత్సరంపాటు ఆగిపోయింది.
ఈ దశలో, శ్రీ వివేకానందన్ గ్రామీణ పారిశ్రామికవేత్తలకు తోడ్పాటునందించే విల్‌గ్రో అనే సంస్థను గురించి తెలుసుకుని, సలహాకోసం వారివద్దకు వెళ్ళారు. విల్‌గ్రో సిబ్బంది ఈ సమస్య పరిష్కారానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ముందుగా, 1 హెచ్‌పి, సింగిల్‌ఫేజ్ యంత్రాన్ని రూపొందించమని అక్కడివారు శ్రీ వివేకానందన్కు సలహా ఇచ్చి, ఆ యంత్రాన్ని రూపొందించడంలో ఆయనకు సహకరించారు. ఎందుకంటే, వివేకానందన్ మొదట రూపొందించిన 3 హెచ్‌పి యంత్రం వేగంగా తిరగలేకపోతున్నది. (గ్రామీణ ప్రాంతాలలో ఓల్టేజి హెచ్చుతగ్గులు బాగా ఎక్కువగా వుంటాయికాబట్టి, గ్రామీణులు సాధారణంగా 1 హెచ్‌పి, సింగిల్ ఫేజ్ యంత్రాలనే ఎక్కువగా ఇష్టపడతారు).
మిర్చిలో, ధనియాలలో పీచుపదార్ధం ఎక్కువగా వున్నందువల్లనే, అవి పిండిమిషన్లో ముందుకు కదలకుండా అంటుకుపోతున్నాయని వారు తొలుత భావించారు. అయితే, అనేక ప్రయత్నాల తర్వాత, పిండిమిషన్లోని తిరగలి (రోటర్) తగినంత వేగంగా తిరగలేకపోవడమే అందుకు కారణమని వారు గ్రహించి, యంత్రం బరువును, గోడల మందాన్ని, పరిమాణాన్ని, చుట్టుకొలతను తగ్గించి; గ్రామీణ ఉపయోగానికి అనువుగా దానిని మార్చగలిగారు.
యంత్రం తయారీలో ఉపయోగించే పరికరాల సంఖ్యను తగ్గించి, తక్కువ ఖరీదులో నాణ్యమైన పరికరాలను ఎన్నుకుని, ఆ యంత్రం ఖర్చును శ్రీ వివేకానందన్ గణనీయంగా తగ్గించగలిగారు. తిరగలితో సహా ఒక్కొక్క పిండి మిషన్ రూ 11, 500 గా ధర నిర్ణయించారు.
మరింత సమాచారంకోసం :
శ్రీ కె.వివేకానందన్, మెజర్స్ వివేక ఇంజనీరింగ్ వర్క్స్,
న్యూ నంబర్: 116 -118, సాథీ రోడ్,
ఆర్ కె. పురం,గణపతి, కోయంబతూర్ - 641 006
మొబైల్ నంబర్ : 94437 21341 అనే చిరునామాను సంప్రతించవచ్చు.
ఆధారము : ది హిందూ