অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గ్రామీణ పేదరికం

గ్రామీణ పేదరికం

గ్రామీణాభివృద్ధి విధానాలు

పథకాలు

ప్రధాన మంత్రి గ్రామీణాభివృధి కార్యకర్తల పథకం (పిఎమ్ఆర్‌డిఎఫ్)

భారత నిర్మాణ్ వాలంటీర్‌లు

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

2014 - 15 కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి కేటాయింపులు

 • గ్రామీణాభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.80,093.33 కోట్లు కేటాయించారు. 2013-14 సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం ఇది రూ.59,355.05 కోట్లుగా ఉంది.
 • గ్రామీణాభివృద్ధికి మోడీ సర్కారు పెద్దపీట వేసింది. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని సకల సదుపాయాల మెరుగుకు భారీగా నిధులు వెచ్చించనున్నట్లు ప్రకటించింది.
 • మంచినీరు, రోడ్లు, వాటర్‌షెడ్లు, ఇళ్ల నిర్మాణం... ఇలా అనేక రకాల పథకాలకు భారీగా నిధులు కేటాయించింది.
 • గుజరాత్‌లో విజయవంతమైనట్లుగా దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా గ్రామాల్లో పట్టణ సదుపాయాల కల్పన కోసం 'శ్యాంప్రసాద్ ముఖర్జీ' పేరిట కొత్త పథకాన్ని ప్రకటించింది.
 • గ్రామాల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం కోసం 'డిజిటల్ ఇండియా'; వచ్చే అయిదేళ్లలో దేశంలో నివాస ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా తీర్చిదిద్దే 'స్వచ్ఛ భారత్' లాంటి పథకాల ప్రకటనతో పాటు యూపీఏ కలల పథకమైన గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.33,364 కోట్లు కేటాయించింది. గతేడాది మన్మోహన్ ప్రభుత్వ హయాంలో కూడా ఇంతే మొత్తం కేటాయించడం గమనార్హం.
 • గతంలో ఎన్‌డీయే హయాంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రకటించిన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)కి రూ.14,389 కోట్లు కేటాయించారు.
 • స్వయం సహాయక మహిళలకు 4 శాతం వడ్డీకి రుణాలు అందజేసే 'ఆజీవిక' పథకాన్ని మరో 100 జిల్లాలకు విస్తరిస్తారు. ప్రస్తుతం సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే మహిళలకు 7 శాతానికి బదులు 4 శాతం మాత్రమే వడ్డీని వసూలు చేసే ఈ పథకం ప్రస్తుతం 150 జిల్లాల్లో అమలవుతోంది.
 • గ్రామీణ ప్రాంతాల్లో గృహనిర్మాణం కోసం సహాయపడే గ్రామీణ గృహ నిధి (రూరల్ హౌసింగ్ ఫండ్ - ఆర్‌హెచ్ఎఫ్)ను పటిష్టపరచడం కోసం జాతీయ గృహ నిర్మాణ బ్యాంక్ ఏర్పాటు లేదా ఎరువులు, పురుగు మందులతో నీరు కలుషితమయ్యే ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాలు, జలశుద్ధి కేంద్రాల ఏర్పాటు.
 • 'నీరాంచల్' వాటర్‌షెడ్ల పథకానికి రూ.2,142 కోట్లు, జాతీయ గృహనిర్మాణ బ్యాంక్‌కు రూ.8,000 కోట్లు, రహదారుల మెరుగుకు రూ.14,389 కోట్లు, మంచినీటి సరఫరా పథకాలకు రూ.3,600 కోట్లు కేటాయించారు.

ఆధారము: అద్య స్టడీ బ్లాగ్

ఋణాల సేకరణకు అనేక సంస్ధలు

1. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI)

సిడ్బి (SIDBI) 1990వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. లఘు పరిశ్రమలకు, అవసరమయ్యే ఆర్ధిక మరియు ఆర్ధికేతర సదుపాయాలను అందించటానికి ఇది ముందుకొస్తుంది. లఘు పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేయబడిన వస్తువులను మార్కెటింగ్ చేయడం, చిన్న పట్టణాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు అవకాశం ఉన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది. ఆ విధంగా గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతవాసులు పెద్ద పట్టణాలకు వలసరవటాన్ని నిరోధిస్తుంది. ప్రస్తుతం ఉన్న యూనిట్ ఆధునీకరణ, టెక్నాలజీ మెరుగుదల "సిడ్బి" ప్రధానంగా చేపడుతుంది. అనేక బ్యాంకుల ద్వారా చిన్నతరహా, గ్రామీణ పరిశ్రమలకు ఋణాలను అందిస్తుంది.

మరిన్ని వివరాలకు: SBI, 203, బాబూఖాన్ ఎస్టేట్స్, సెకండ్ ఫ్లోర్, బషీర్‌బాగ్, హైదరాబాద్ - 500 001.

2. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI)

1964వ సంవత్సరంలో ఐడిబిఐ ఏర్పాటు చేయబడి పారిశ్రామిక సంస్ధలకు నిధుల సమీకరణలో తోడ్పడుతోంది. అభివృద్ధి బ్యాంకింగ్‌లో సర్వొన్నత సంస్ధగా పని చేయడం కోసం, ఇతర అభివృద్ధి బ్యాంకులతో నిత్య సంబంధాలు నెలకోనుపుకొని తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఇతర అభివృద్ధి బ్యాంకులకు ' ఐడిబిఐ ' రీ ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తుంది. రాష్ట్ర ఆర్ధిక సంస్ధలకు కూడా ఈ సదుపాయాన్ని ఇస్తుంది. వివిధ పారిశ్రామిక యూనిట్లకు అభివృద్ధి బ్యాంకులు, రాష్ట్ర ఆర్ధిక సంస్ధలకు ఇచ్చిన ఋణాలకు ఈ ' రీఫైనాన్స్ ' సౌకర్యం ఉంటుంది. ఐ.ఎఫ్.సి.ఐ., ఐ.సి.ఐ.సి.ఐ., ఎస్.ఎఫ్.సి.లు జారీ చేసే షేర్లు, బాండ్లను ఇది కొనుగోలు చేస్తుంది. ఈ కార్యకలాపాలే కాక పారిశ్రామిక సంస్ధలకు నేరుగా ఋణసౌకర్యం కల్పిస్తుంది. 'ఐ.డి.బి.ఐ' చేసే మొత్తం ఆర్ధిక సహాయంలో నేరుగా అందచేసేది మూడో వంతు ఉంటుంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, లఘు పరిశ్రమలకు సహయం, ప్రాజెక్టుల మదింపు, పారిశ్రామికుల నైపుణ్యాల అభివృద్ధి వంటి కార్యకలాపాలకు శిక్షణ సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది.

3. ఇండస్ట్రియల్ క్రెడిట్ & ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ICICI)

అఖిల భారత స్ధాయిలో పరిశ్రమల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి దీన్ని 1995 లో స్ధాపించారు. ఇతర ఆర్ధిక సంస్ధలు నిర్లక్ష్యం చేసే అండ్ రైటింగ్ సదుపాయాలను 'ఐ.సి.ఐ.సి.ఐ.' కల్పిస్తుంది. కొత్త పరిశ్రమల స్ధాపనకు, అభివృద్ధి చెందని వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాతిపదికగా ఏర్పడే గ్రామీణ పరిశ్రమలకు ప్రభుత్వ మార్గదర్శకంగా పనిచేస్తుంది. ఎగుమతులకు పనికివచ్చే వస్తువుల తయారీకి ప్రాధాన్యత ఇస్తుంది. ఋణాలకు హామీగా నిలుస్తుంది. కన్సల్టెన్సీ సేవలను అందిస్తూ, యాజమాన్య, సాంకేతిక అవసరాలను తీరుస్తుంది. రసాయనాలు, పెట్రోకెమికల్స్ భారీ ఇంజనీరింగ్, లోహ ఉత్పత్తుల రంగానికి బాగా తోడ్పడుతుంది.

4. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (IFCI)

1948వ సంవత్సరంలో ఏర్పాటైన ఐఎఫ్‌సిఐ కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు, పాత ప్రాజెక్టుల విస్తరణకు, ఆధునీకరణకు అవసరమైన మధ్యకాలిక, దీర్ఘకాలిక ఋణాలను సమకూర్చుతుంది. యంత్రాల కొనుగోలుకు, ముడిపదార్ధాల కొరకు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు, కో - ఆపరేటివ్ సొసైటీలకు ఆర్ధిక వనరులను అందిస్తుంది. సహకారరంగం తీసుకునే ఋణాలు ప్రభుత్వరంగ సంస్ధలకు ఉపయోగపడతాయి. 25 సంవత్సరాల లోపుగా చెల్లించే ఋణాలను భారతీయ కరెన్సీలోనూ, విదేశీ కరెన్సీలోనూ 'ఐఎఫ్‌సిఐ' మంజూరు చేస్తుంది. పారిశ్రామిక యూనిట్లు ఓపెన్ మార్కెట్‌లో ప్రకటించిన ఋణాలకు ఈ సంస్ధ గ్యారంటీ ఇస్తుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న ఋణాలకు హామీ ఇస్తుంది. 'ఐఎఫ్‌సిఐ'లో 'ఐడిబిఐ' కి, వాణిజ్య బ్యాంకులకు, 'ఎల్ఐసి'కి, సహకార బ్యాంకులకు వాటాలుంటాయి.

5. జాతీయ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు

దేశం మొత్తంలో జాతీయ బ్యాంకులు 20 ఉన్నాయి. 14 బ్యాంకులను 1969లోనూ, 6 బ్యాంకులను, 1980లోనూ జాతీయం చేశారు. జాతీయ విధానాలు, ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని ఆర్ధికాభివృద్ధికి అవసరమయ్యే నిధుల సమీకరణకు ఈ చర్య తీసుకోవడం జరిగింది. బ్యాంకింగ్ సర్వీసులను విస్తృతం చేయడం, పొదుపు ద్వారా అధికంగా నిధులు సమీకరించడం, బలహీనవర్గాలకు వసతి సౌకర్యాలు కల్పించడం తద్వారా ప్రాంతీయ అసమానతలు తొలగించడం జాతీయ బ్యాంకుల లక్ష్యాలు. అలాగే చిన్న, సన్నకారు రైతాంగానికి, కుటీర పరిశ్రమలకు, లఘు, చిన్నతరహా పరిశ్రమలకు కావలసిన నిధులను సమకూర్చడం, ఋణాలు మంజూరు చేయడం, అనేక పధకాలను అమలు చేయడం ద్వారా పారిశ్రామిక రంగాన్ని పటిష్టపర్చడం వంటివి చేస్తుంటాయి.

అయితే ఇన్ని జాతీయ బ్యాంకులు ఉన్నా, గ్రామీణ ప్రజల పరపతి అవసరాలు తీరటం లేదనే ఉద్దేశంతో 1975 అక్టోబర్ రెండున ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను నెలకొల్పారు. 1976 "రీజనల్ రూరల్ బ్యాంక్ యాక్ట్" కు అనుగుణంగా గ్రామీణ బ్యాంకులను నిర్వహిస్తున్నారు. వ్యవసాయం, వ్యవసాయాధార రంగాలు, చిన్నతరహా పరిశ్రమలు, వాణిజ్యం, వ్యవసాయేతర రంగాలకు ఇవి ఋణాలిస్తాయి. ఇతర బ్యాంకుల మాదిరిగానే ఈ బ్యాంకులు కూడా తన మొత్తం ఋణసామర్ధ్య విలువలో 40 శాతాన్ని ప్రాధాన్యత రంగానికి కేటాయించాలి. ఈ ప్రాధాన్యతా రంగంలో 25 శాతం బలహీనవర్గాలకు నిర్దేసిస్తాయి. ఇవీ జాతీయ, గ్రామీణ బ్యాంకులు చేసే పనులు.

6. ఇండస్ట్రియల్ రీ - కన్‌స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IRBI)

1971వ సంవత్సరంలో భారత ప్రభుత్వం "ఇండస్ట్రియల్ రీ-కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా"ని ఏర్పాటు చేసింది. ఖాయిలాపడిన పరిశ్రమలకు షాయం అందించడం, అవసరమైన సాంకేతిక, యాజమాన్య నైపుణ్యాలను అందించడం 'ఐఆర్‌సిఐ' లక్ష్యాలు. దీనిని 1985వ సంవత్సరంలో 'ఐఆర్‌బి ఐ' "ఇండస్ట్రియల్ రీ-కన్‌స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా"గా మార్చారు. ఈ బ్యాంకు ఆర్ధిక సహాయం అందించేటప్పుడు ఆదునీకరణకు, ఉత్పాదక శక్తిని పెంచటానికి, టెక్నాలజీని మెరుగుపరచడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆ విధంగా ఖాయిలాపడిన యూనిట్లు మనుగడ సాగేలా చేస్తుంది.

7. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన మైనారిటీ వర్గాలకు ఋణ సహాయాన్ని అందించేందుకు ఏర్పాటు చేయబడిందే 'రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్' చిన్న చిన్న వ్యాపారాలకు అవసరమయ్యే చిన్న మొత్తాలను ఋణాలుగా అందిస్తుంది. 10 నుంచి 15 వేల వరకూ మంజూరు చేయబడే వాటిలో పాన్‌షాపులు, కూరగాయలు, పూలు - పండ్లు, ఒడ్డీ కొట్లు వంటివి ఉంటాయి. ఇవికాక స్పేర్‌పార్టులు, టైర్ వర్క్స్, ఇంజనీరింగ్ వర్క్స్, బేకరి, మెడికల్ షాప్స్ వంటి వాటికి రూ. 1 లక్ష వరకూ ఋణం లభిస్తుంది. అయితే ఈ సంస్థ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే దరఖాస్తు చేసుకోవాలి.

8. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

ఈ కార్పొరేషన్ ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ సంబంధిత ఉత్పత్తులకు ఎక్కువ ఋణాలను మంజూరు చేస్తుంది. ఈ సంస్ధ ఎలక్ట్రానిక్ ప్రోడక్టులు అయినటువంటి ఫ్యాన్ రెగ్యులేటర్ ఉత్పత్తి చేయడం, ఎలక్ట్రానిక్ ఫ్లాష్‌గన్స్, ఎలక్ట్రానిక్ గ్యాస్ లైటర్స్ వంటి వాటి ఉత్పత్తి, సరఫరాలో అత్యధిక ప్రోత్సాహాన్నిచ్చి, ఋణాలను అందిస్తుంది. హార్డువేర్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీని అభివృద్ధిపరచేందుకుగానూ అనేక కార్యక్రమాలను చేపట్టి విస్తృతమైన వివరాలను అందిస్తుంది.

9.ఆంధ్రప్రదేశ్ ఖాదీ & విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్

కుటీర పరిశ్రమగా చిన్న పెట్టుబడితో స్ధాపించి ఎక్కువ లాభాలు ఆర్జించే వెలుగుబాటను చూపిస్తున్నది - ఆంధ్రప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు. ఖాదీ పరిశ్రమలు ఫ్యాక్టరీల చట్టం నుండి మినహాయించబడ్డాయి. అతి తక్కువ స్వల్ప వడ్డీలకు గ్రామీణ ప్రాంతాల్లోని చేతిపనుల వారికి ఆర్ధిక సహాయం అందిస్తోంది. రూ. 1 లక్ష రూపాయల వరకూ సంబంధిత జిల్లాలోనే విడుదల చేస్తారు. లక్ష రూపాయలకు మించిన ఋణాలను హైదారాబాద్‌లో మంజూరు చేస్తారు. ఉత్పత్తికి, మార్కెటింగ్‌కు, పరిశ్రమ స్ధాయి ప్రకారం ఋణం మంజూరు చేస్తారు. అతి తక్కువ పెట్టుబడి రూ. 1,000 నుండి మొదలుపెట్టి 60 లక్షల వరకూ ఆపి 3 కోట్ల వరకూ కూడా పరిశ్రమను స్ధాపించవచ్చు, అభివృద్ధి చేయవచ్చును. ప్రాజెక్టును అనుసరించి కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్, గ్రాంటు, వడ్డీ, సబ్సిడీ, ఋణం మంజూరు ఉంటాయి.

ప్రాధాన్యత కలిగిన ఖాదీ పరిశ్రమల జాబితా:

ఖనిజ (ధాతు) సంబంధిత పరిశ్రమలైన కుమ్మరి, సున్నపు వస్తువుల పరిశ్రమ, రాతి పలుకలు - బలపములు చెయ్యుట, రాళ్ళు - గవ్వలుతో వస్తువులు చేయుట, గాజుల తయారీ, రాతితో వాడుక వస్తువులు చేయడం, అటవీ సంబంధితమైన జిగురు తయారీ, లక్క, అగరుబత్తీలు, పేము - వెదురు పని, వ్యవసాయాధారమైన తాటిబెల్లం, చెరకు, బెల్లం, ఖండసారి చక్కెర తారీ, తేనె, నారలు తీయుట, రెల్లుగడ్డి చాపలు, చర్మ సంబంధమైనవి, మైనపు వస్తువులు, కర్పూరం తయారీ, బొట్టు, గోరింటాకు పొడి, సబ్బులు, వడ్రంగం వస్తువులు చేయుట, అలంకారపు దుస్తులు, పాలు - పెరుగు - వెన్న పరిశ్రమలు మొదలైనవి ముఖ్యమైన అంశాలు.

మరిన్ని వివరాలకు: జిల్లా ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ. (లేదా) ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ, హుమాయూన్ నగర్, హైదరాబాద్ - 28.

10. స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ (SDI)

లఘు పరిశ్రమలకు, చిన్నతరహా పరిశ్రమలకు సహాయం చేసేందుకు గాను, ప్రతీ రాష్ట్రంలోనూ నెలకొల్పబడింది.

ఇవి చేసే పనులు:

 1. చిన్న తరహా పరిశ్రమలుగా గుర్తించి రిజిస్ట్రేషన్ చేయడం.
 2. కేంద్రం నుంచి కూడా సహాయం పొందే అవకాశాలు కల్పించడం.
 3. 'ఎన్.ఎస్.ఐ.సి.' నుండి యంత్రాలను హైర్‌పర్చేజ్ మీద కొనుగోలు చేయుటకు ఆర్ధిక సహాయం పొందడం.
 4. వడ్డీ రాయితీలు, సబ్సిడీలు, ట్రాన్స్‌పోర్డ్ రాయితీలు, ఆక్ట్రాయ్ పన్ను మినహాయింపులు, సేల్స్‌టాక్స్, కరెంట్, వాటర్ ఫెసిలిటీస్ వంటి వాటికి సహాయం.
 5. వివిధ సంస్ధల నుండి నిధుల సమీకరణకు ఏర్పాట్లు.
 6. భూమి లేదా భవనం ఏర్పరుచుకోవటానికి సలహా - సహాయాలు.
 7. ఉత్పత్తుల నాణ్యత పెంపుదల, మార్కెటింగ్ సౌకర్యాలు అభివృద్ధి చేయడం.
 8. ఇవీ స్టేట్ డైరెక్ట్రేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ చేసే పనులు.

11. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్

లఘు పరిశ్రమలను, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలను విస్తృత పరిచేందుకు, సేవారంగాలను మెరుగుపరిచేందుకు, ఆర్ధిక ఋణాలను మజూరు చేసే సంస్ధగా 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక సంస్ధ ఉద్భవించింది. భారతదేశ పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెప్పుకోతగ్గ స్ధానాన్ని సంపాదించి పెట్టడంలో, రాష్ట్ర ఆర్ధిక సంస్ధ కీలకపాత్ర పోషిస్తుంది. భూమి, భవనాలు, యంత్రాల వంటి స్ధిరాసులను సమకూర్చుకోవడానికి రాష్ట్ర ఆర్ధిక సంస్ధ ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది. రూ.10 వేల నుండి రూ. 150 లక్షల వరకూ ఒక్కో యూనిట్‌కు టెర్మ్‌లోన్‌గా కార్పొరేషన్ నుండి లభించే అవకాశాలు చాలా ఉన్నాయి. అదీగాక సులభమైన వాయిదాల్లో ఋణం తీర్చవచ్చు. గత నలభై సంవత్సరాలకు పైగా కొన్ని వేల, లక్షల పరిశ్రమలకు ఋణాలను అందించింది. 5 జోనల్ ఆఫీసులను, 25 బ్రాంచి ఆఫీసులతోను మరియు 2 ఫీల్డు ఆఫీసులను కలిగి ఉండి, రాష్ట్రంలోని మూలమూలలకూ ప్రయాణిస్తూ పారిశ్రామికుడి ఇంటి తలుపు తట్టి మరీ ఆర్ధిక సహాయం చేస్తోంది.

ఋణ మంజూరు అధికారాలు:

బ్రాంచి ఆఫీసులు: రూ. 10 లక్షల వరకూ మంజూరు చేయవచ్చు.

జోనల్ ఆఫీసులు: రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య మంజూరు చేయవచ్చు.

హెడ్ అఫీసు: రూ. 20 లక్షలకు మించిన ఋణాలను మంజూరు చేయవచ్చు.

అర్హత: స్వంత యాజమాన్యం, పార్టనర్ షిప్, ఉమ్మడి హిందూ కుంటుంబం, రిజిష్టర్డ్ కో-ఆపరేటివ్ సొసైటీ (లేదా) పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఏవైనా సరే రాష్ట్ర ఆర్ధిక సంస్ధ నుండి ఋణాలు పొందవచ్చును.

ఎలాంటి ప్రాజెక్టులకు ఆర్ధిక సహయం లభిస్తుంది?

 1. వివిధ ఉత్పత్తుల తయారీ, నిలువ ఉంచడం ప్రాసెస్ చేయడం.
 2. ఖనిజాలు, ఖనిజాల వెలికితీత, అభివృద్ధిపర్చుట.
 3. హోటళ్ళు, రెస్టారెంట్లు.
 4. ప్రయాణీకులను గానీ, ఉత్పత్తులను గానీ రోడ్డు ద్వారా / జలమార్గాల ద్వారా / వాయు మార్గాల ద్వారా లేదా రోప్‌వే లేదా లిప్ట్ లేదా రవణా చేయడం.
 5. విద్యుత్‌ను కానీ / మరే విధమైన శక్తిని కానీ ఉత్పత్తి చేయటం, పంపిణీ చేయడం.
 6. యంత్రాలుకానీ, వాహనాలు కానీ, మరేవైనా రకానికి చెందిన మోటార్‌బోట్స్, వెసల్స్, ట్రైలర్స్, ట్రాక్టర్స్ వంటి వాటి నిర్వహణ, రిపేర్, టెస్టింగ్ మరియు సర్వీసింగ్.
 7. యంత్రాల సహాయంతోనైనా లేక విద్యుత్ సహాయంతోనైనా ఏవైనా వస్తువుల ప్యాకింగ్, రిపేరింగ్, అసెంబ్లింగ్.
 8. పారిశ్రామిక ప్రాంతాలను, పారిశ్రామిక ఎస్టేట్‌లను అభివృద్ధిపరచుట.
 9. మత్స్య పరిశ్రమ, దానికి అవసరమయ్యే తీరప్రాంత సౌకర్యాలను కలుగజేయుట.
 10. వే-బ్రిడ్జి సౌకర్యం కల్పించుట.
 11. పరిశ్రమల కవసరమయ్యే ఇంజనీరింగ్, టెక్నికల్, పైనాన్షియల్, మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ లేదా ఇతర సేవలను సమకూర్చుట.
 12. పాలిష్ చేయడం, ఫినిషింగ్, ఆయిలింగ్, వాషింగ్, పరిశుభ్రపర్చడం లేదా వస్తువు ఉపయోగాన్ని బట్టి అమ్మకం, రవాణా, డెలివరీ సౌకర్యాలు కల్పించడం.
 13. వైద్య, ఆరోగ్య సంబంధ సేవలను అందించడం.
 14. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్, శాటిలైట్ లింకేజ్, ఆడియో వీడియో కేబుల్ కమ్యూనికేషన్స్ సమకూర్చడం.
 15. ఏదైనా పారిశ్రామిక వస్తువు లేదా అంశంపై రీసెర్చ్, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుట.
 16. టూరిజంకు సంబంధించే ఎమ్యూజ్‌మెంట్ పార్కులు, సెంటర్లు, రెస్టారెంట్లు, రవాణా సౌకర్యాలు, టూరిస్ట్ సర్వీస్ ఏజన్సీలు, ప్రయాణీకులకు గైడెన్సు, కౌన్సిలింగ్ అభివృద్ధిపరుచుట.
 17. రోడ్ల మరమ్మత్తు, అభివృద్ధి, నిర్మాణం.
 18. రోడ్లు, బోర్‌వెల్ రిగ్గులు వేయటం.
 19. అర్హులైన ప్రొఫెషనల్స్‌చే ఎకౌంటెన్సీ, మెడిసిన్, ఆర్క్టెక్చర్, ఇంజనీరింగ్ ఎంటర్‌ప్రైజ్‌లను మొదలు పెట్టించడం.
 20. ఫ్లోరీ కల్చర్.
 21. టిష్యూకల్చర్, ఫిష్ కల్చర్, పౌల్ట్రీ, హేచ్చరీలు.
 22. హోటల్ పరిశ్రమలో భాగంగా కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణం.

పైన పేర్కొన్న జాబితాలో వాటికి దేనికైనా 'ఎస్.ఎఫ్.సి.' నుండి ఋణ సహాయం పొందవచ్చు.

 1. జనరల్ లోన్స్: లఘు, చిన్న తరహా మరియు మధ్యతరహా పరిశ్రమలను నెలకొల్పడానికి, ప్రెవేటు మరియు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు, యాజమాన్యం, భాగస్వామ్యదారులకూ ఈ జనరల్ లోన్ స్కీమ్‌లో ఋణం అందుతుంది. కొత్త పరిశ్రమలకు స్ధిరాస్తులను కూర్చడం కొరకు అప్పటికే స్ధాపించబడిన పరిశ్రమల విస్తరణకు, టెక్నాలజీ మెరుగుదలకు లోన్ మంజూరు అవుతుంది. ప్రాజెక్టు ఖరీదు రూ. 5 కోట్లు మించరాదు.
 2. ఎక్విప్‌మెంట్ రీఫైన్స్ సౌకర్యం: బాగా నడుస్తున్న చిన్న, మధ్య తరహ పరిశ్రమలకు ఈ స్కీము వర్తిస్తుంది. ప్లాంటుకు అవసరమయ్యే నిర్దిష్ట యంత్రాలు సమకూర్చడానికి, ఆధునీకరణ, విస్తరణ, రిప్లేస్‌మెంట్‌కు సహాయం లభిస్తుంది. యూనిట్లు అంతకుముందు కనీసం 4 సంవత్సరాల నుండి పనిచేస్తూ, తరువాత రెండేళ్ళకు లాభాలను అర్జించాల్సి ఉంటుంది. ప్రాజెక్టు ఖరీదు రూ. 5 కోట్లు రూపాయలు మించరాదు.
 3. ఆధునీకరణ స్కీం: ప్రస్తుతానికి నడుస్తున్న లఘు, గ్రామీణ, చిన్నతరహా మధ్యతరహా పరిశ్రమలు గత 5 సంవత్సరాల నుండీ పనిచేస్తుంది. ప్లాంటు, యంత్రాల ఆధునీకరణకు ఈ స్కీమ్‌ను ఉపయోగించి ఉండాలి. కేవలం ఊరకే యంత్రాలను మార్చడం వంటివి అనుమతింపబడవు. ప్రాజెక్టు ఖరీదు రూ. 5 కోట్లు దాటరాదు.

యూనిట్‌ను అప్‌గ్రేడ్ చేయుటకు, కాలుష్య నివారణకు, ఎనర్జీ సేవింగ్, టెక్నాలజీ మెరుగుదలకు, ఈ పధకం నుండి ఋణం పొందవచ్చు.

 1. హోటళ్ళు / రెస్టారెంట్లకు ఋణ సహాయం: నాన్‌స్టార్ హోటళ్ళు, సింగిల్, డబుల్‌స్టార్ హోటళ్ళు, రెస్టారెంట్లను ఆధునిక వసతులతో నిర్వహించుటకు, 10 రూమ్‌లు, డార్మెటరీ కలిగిన లాడ్జిలను నిర్మించుటకు, టూరిజం డిపార్ట్‌మెంటు ఆమోదం ఉండాలి. స్ధలం, భవనం, మెషినరీ, ఫర్నిచర్, ఫిక్చర్, కట్లెరీ మరియు క్రోకరీ, కిచెన్ సామాగ్రిని ఏర్పాటు చేసుకోవటానికి ఆర్ధిక సహాయం అందుతుంది.
 2. టూరిజం శాఖకు చెందిన సౌకర్యాల కలపనకు: టూరిజం అభివృద్ధి సంస్ధల నుండి ఆమోదం పొందిన ఎమ్యూజ్‌మెంట్ పార్కుల అభివృద్ధికి, సాంస్కృతిక కేంద్రాలు, రెస్టారెంట్లు, ట్రావెలింగ్ సదుపాయాలు కలుగ చేయటానికి ఈ స్కీము క్రింద నిధులు మంజూరు అవుతాయి.
 3. నర్సింగ్ హోంలు, హాస్పిటల్స్‌కు సహాయం: నడుస్తున్న నర్సింగ్ హౌస్ ఆధునీకరణకు, క్రొత్తవి ఏర్పాటు చేయడానికి, భూమి, భవనం, మెడికల్ సామాగ్రి, అంబులెన్స్, ఎయిర్ కండిషనర్లు సమకూర్చుకొనుటకు ఋణం లభిస్తుంది. ఫుల్‌టైం చేసే యం.డి. / యం.ఎస్. డిగ్రీ కలిగిన డాక్టరు హాస్పటల్‌లో ఉండాలి. ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతి నర్సింగ్ హోంలకు అనుమతి లేదు.
 4. రవాణా లోన్లుకు పధకం: మంచి నాణ్యతా ప్రమాణాలు గల కమర్షియల్ వెహికల్స్ పొందుటకు, ఆయిల్ ట్యాంకర్లు, ట్రక్కు ట్రెయిలర్లు వంటివి, 6 సీటర్ డీజిల్ ఆటోరిక్షాలు, లైట్ కమర్షియల్ వెహికల్స్ ఏర్పాటు చేసుకోవటానికి ఈ పధకం క్రింద ఆర్ధిక సహాయం లభిస్తుంది.
 5. పారిశ్రామిక వాడల ఏర్పాటుకు: ఔత్సాహికులైన పారిశ్రామిక వేత్తలు కాంటిగ్యువస్ ల్యాండ్‌ను పారిశ్రామికవాడగా ఏర్పాటు చేయుటకు ఈ పధకం ఉపయోగపడుతుంది. భూమి కనీసం 10 ఎకరాలు ఉండాలి. ఇండస్ట్రీయల్ షెడ్ల నిర్మాణాన్ని కూడా పేర్కొనాలి.
  భూమి కొనుగోలుకు, అప్రోచ్ రోడ్లు, డ్రైనేజీ, నీటి సదుపాయం, విద్యుత్, పవర్ డిస్ట్రిబ్యూషన్ లైన్లు అభివృద్ధి చేయుటకు ఋణం అందుతుంది.
 6. కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి: జంట నగరాల్లో గానీ, జిల్లా హెడ్ క్వార్టర్స్ లేదా మరేవైనా కమర్షియల్ సెంటర్లు, ముఖ్యమైన పట్టణాలు, మండల హెడ్‌క్వార్టర్లలో ఏ పారిశ్రామికవేత్త అయినా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టవచ్చు. వీటి తగిన ఋణాన్ని రాష్ట్ర ఆర్ధిక సంస్ధ ద్వారా పొందవచ్చును.
 7. మహిళా ఉద్యమ నిధి పధకం: స్త్రీ కోసం ప్రత్యేకంగా అందించే ఈ పధకాన్ని మహిళలకు స్వయం ఉపాధికై ప్రవేశపెట్టారు. పారిశ్రామికవేత్త 51% వాటా పెట్టాలి. ఆధునీకరణ, టెక్నాలజీ అభివృద్ధికి ఋణం మంజూరు అవుతుంది. ప్రాజెక్టు ఖరీదు రూ. 10 లక్షలకు మించరాదు. "సిడ్బి" సీడ్ క్యాపిటల్‌గా ప్రాజెక్టు ఖరీదులో 25% మంజూరు చేస్తుంది. దీనికి 1% సర్వీస్ ఛార్జ్ ఉంటుంది.
 8. ఎలక్ట్రోమెడికల్ ఎక్విప్‌మెంట్ ఏర్పాటుకు: అర్హత కలిగిన మెడికల్ ప్రాక్టీషనర్లకు, ఆయుర్వేద డాక్టర్లకు వారి వృత్తి సంబంధంగా ఉపయోగించు కొనుటకు కావలసిన ఎలక్ట్రోమెడికల్ వస్తువులను ఏర్పాటు చేసుకొనుటకు పరికరాల ఖరీదు రూ. 60 లక్షల వరకూ ఉంటే "సిడ్బి" నుండి రీఫైనాన్స్ ఉంటుంది. రు.60 లక్షలకు మించి ఉంటే రీఫైనాన్స్ "ఐడిబి ఐ" నుండి లభిస్తుంది.
 9. నేషనల్ ఈక్విటీ ఫండ్ స్కీం: ప్రాజెక్టు ఖరీదు రూ. 10 లక్షలకు మించరాదు. ప్రమోటర్ వాటాగా ప్రాజెక్టు విలువలో 10 శాతం ఉంటుంది. 1 శాతం సర్వీస్‌ఛార్జీతో ప్రాజెక్టువిలువలో 25% సాధారణ లోనుమంజూరు అవుతుంది. స్మాల్ స్కేల్ యూనిట్లకు అవసరమయ్యే స్ధిరాస్ధులకు కూర్చు కోవడానికి ఆధునీకరణకు, టెక్నాలజీ అభివృద్ధికి, ఈ లోను ఉపయోగపడుతుంది.

సెంఫెక్స్ (SEMFEX) స్కీం (లేక) మాజీసైనికుల సహాయార్ధపధకం:

మాజీసైనికులు, వారి వితంతువులు మరియు శారీరక పటుత్వం కోల్పోయిన సైనికులు దీనికి అర్హులు. ప్రాజెక్టు మొత్తం 15 లక్షలు దాటకూడదు. ప్రాజెక్టు ఖరీదులో పది శాతం ప్రమోటర్ పెట్టాల్సి ఉంటుంది. ప్రాజెక్టు మొత్తంలో 15 శాతం, 1 శాతం సర్వీస్ ఛార్జీతో మారటోరియం పీఐయడ్‌లో సీడ్ కేపిటల్‌గా లభిస్తుంది.
పరిశ్రమలు, హోటల్స్, టూరిజం కార్యకలాపాలు మొదలైన వాటికి సీడ్ క్యాపిట్ లభిస్తుంది. ట్రాన్స్‌పోర్టు వాహనాలకు సీడ్ క్యాపిట్ లభించదు.

షార్ట్‌టెర్మ్ లోన్లు: కార్పొరేషన్ వారి టరంలోన్ రూ. 5 లక్షలకు తక్కువ కాకుండా ఇంతకు ముందు వినియోగించుకొని లోన్ ఎక్కౌంట్లకు క్లోజ్ చేసిన యూనిట్లకు మరియు మూడు సంవత్సరాలను పూర్తిచేసి, లాభాల బాటలో ప్రయాణిస్తూ, ఆర్ధిక సంస్ధలకు ఖచ్చితంగా వాయిదాలు చెల్లించనటువంటి సంస్ధ లేదా ప్రాజెక్టులకు షార్ట్‌టెర్మ్ లోన్ మంజూరు అవుతుంది. అయితే రెగ్యులర్‌గా రీపేమెంట్ చేస్తున్నా, రాష్ట్ర ఆర్ధిక సంస్ధ నుండి రీషెడ్యూల్ మెంట్ సౌకర్యం ఒక్కసారికి మించి ఎక్కువ పొంది ఉండకూడదు. లోన్ సదుపాయం రూ. 5 లక్షల నుండి రూ. 50 లక్షల వరకూ ఉంటుంది. లోన్ రీపేమెంట్ పిరియడ్ 11 మాసాలు, 150 శాతం కొల్లేటరల్ సెక్యూరిటీ ఉండాలి.

రాష్ట్ర ఆర్ధిక సంస్ధ లోన్ కొరకు ఎలా దరఖాస్తు చేయాలి?

అన్ని లోన్లకు సంబంధించిన అప్లికేషన్ ఫారాలను ఆయా ప్రాంతాల బ్రాంచ్ ఆఫీసుల్లో పొందవచ్చు. అప్లీకేషన్ ఫారంతో పాటు ఈ దిగువ నిచ్చిన వివరాలు పొందుపరచాలి.

 1. ఎ.పి.ఐ.ఐ.సి.(ఆఫీఈఛ్) నుండి భూమి కొనుగోలు లేదా ఎగ్రిమెంట్ పత్రాల కాపీ.
 2. భూమి కనుక లీజ్ హోల్ అయితే ఒక కాపీ రిజిష్టర్ చేసిన లీజ్ డీడ్. ఇది 10 సంవత్సరాలకు ఉండాలి.
 3. క్షణమైన బిల్డింగ్ ప్లాన్, సైట్ ప్లాన్, సివిల్ వర్క్‌ల అంచనాలు.
 4. యంత్రాల సప్లయి, ఖరీదు, కొటేషన్.
 5. ఇంపోర్టెడ్ యంత్రాలకు, ఇంపోర్టెడ్ లైసెన్సు.
 6. ప్రతీ యంత్రానికి కావలసిన ఎలక్ట్రిక్ పవర్ మరియు విధ్యుత్ సౌకర్యాల వివరాలు
 7. నీరు, ఇంధనం మొదలైన వారి అవసరం, ఖరీదుల వివరాలు.
 8. మెషినరీ లేదా ప్లాంటు కెపాసిటీ.
 9. ముడి పదార్ధాల రిక్వైర్‌మెంట్, లభ్యతా వివరాలు.
 10. టెక్నికల్, నాన్‌టెక్నికల్ పనివారు, వారి జీతభత్యాల వివరాలు.
 11. ఉత్పత్తి వివరాలు, నిర్వహణ ఆదాయ వ్యయాలు.
 12. ఎస్.ఎస్.ఐ. రిజిస్ట్రేషన్ లేదా ఇండస్ట్రియల్ లైసెన్స్ కాపీ.
 13. ప్రాజెక్టు రిపోర్ట్, అమలు చేస్తున్న తీరుతెన్నులు.
 14. మార్కెట్, డిమాండు మొదలైన వివరాలు.

ఆధారము: తెలుగుదనం

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి ప్రణాళిక (బి.ఆర్.జి.ఎఫ్.)

బి.ఆర్.జి.ఎఫ్ సంక్షిప్తంగా

 • కొన్నికొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల యొక్క ఫలితాలను గుర్తించబడిన కార్యక్రమాలను మెరుగుపరుచుటకు చేయుతనిస్తూ ప్రోత్సహించడమే లక్ష్యంగా పనిచేయడం.
 • దేశంలోని 250 జిల్లాలు ఎంపిక చేయబడ్డాయి.
 • తెలంగాణలో 9 జిల్లాలు ఎంపిక చేయబడ్డాయి.
 • పంచాయతి మరియు పురపాలక పరిపాలనలో బలాన్ని మరియు నైపుణ్యతలను పెంపొందించవచ్చును.
 • నిర్దిష్టమైన భాగస్వామ్య ప్రణాళికల రూపకల్పనకు సహకరించును.
 • ప్రణాళికల అమలుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానము, పర్యవేక్షణలను సమకూర్చును.
 • 11వ పంచవర్ష ప్రణాళిక ద్వారా ప్రారంభించబడినది.
 • ఈ నిధులను ప్రణాళికకు, సాంకేతికత మరియు నైపుణ్యములను పెంచడానికి ఉపయోగించెదరు. పేదరిక నిర్మూలన కై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం

బి.ఆర్.జి.ఎఫ్ లక్ష్యాలు

 • ప్రాంతీయ వనరులు మరియు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల మధ్య వారధినేర్పరచుట.
 • పంచాయతి మరియు పురపాలక పరిపాలనలకు అవసరమగు నైపుణ్యము, నిర్దిష్టమైన ప్రణాళికారచన, నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలుపరచడం, పర్యవేక్షనలకు బలాన్నిస్తూ ప్రాంతీయ అవసరాలను తీర్చడము కొరకు పని చేయును.
 • ప్రాంతీయ సంస్థల ప్రణాళికారచన, అమలు మరియు పర్యవేక్షణలకు అవసరమగు నైపుణ్యములను సమకూర్చును.
 • పంచాయతీలకు కేటాయించిన క్లిష్టమైన విధులను పూర్తిచేయడానికి అవసరమైన సామర్ధ్యమును మెరుగుపరుస్తూ భాగస్వామ్య నష్టాలను ఎదుర్కొనే సామర్థ్యములను పెంపొందించును

బి.ఆర్.జి.ఎఫ్. కింద అనుమతించని పనులు

 • ప్రింటర్స్, జిరాక్స్ మిషన్, హైమాస్ / వీధి దీపాలు కొనుగోలుచేయటం
 • నివాస గృహాలు, యం.ఆర్.ఓ. కార్యాలయ ప్రహారిగోడ నిర్మాణాలు
 • వివాహవేదికలు, కమ్యునిటీ హాల్స్ నిర్మాణాలు
 • వాహనాల అద్దె చెల్లింపులు
 • క్రొత్తగా గొట్టపు బావులు వేయడం
 • కంప్యూటర్ల కొనుగోలు మరియు రిపైర్లు
 • ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఉన్ననిధులను వేరే వాటికి మళ్ళించడం
 • విద్యుత్ పరికరాలు మరియు పరిసర పరిశుబ్రతకు సంభందించిన వస్తువులను కొనడం
 • ఎలక్షన్స్ కొరకు అవసరమైన ఖర్చులు
 • కాంట్రాక్టర్స్కు ముందుగా రుసుము చెల్లించడం
 • నిధులను బీఆర్జీఎఫ్ కింద అనుమతించని పనులకు మళ్ళించడం
 • బీఆర్జీఎఫ్ మార్గదర్శకాలు అనుసరించని ఏ ఇతర పనులకు

ఆధారము: పోర్టల్ విషయ రచన భాగస్వామ్యులు

సన్సద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన పథకం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన వినూత్న పథకాల్లో సన్సద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన ఒకటి. పల్లెల సర్వతోముఖ వికాసానికి దోహదం చేసే ఈ పథకం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికింద ప్రతి పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గ పరిధిలోని కనీసం ఒక గ్రామాన్ని 2016 నాటికి ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయాలి. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం ముగిసేసరికి - అంటే 2019 నాటికి మరో రెండు గ్రామాలను అభివృద్ధి పరచాలి. ఆ లెక్కన ప్రతి ఎంపీ తలా మూడు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి. పార్లమెంటు ఉభయసభల్లోని 793 మంది సభ్యులూ కలిసి దాదాపు 2,400 ఆదర్శ గ్రామాలను అభివృద్ధి చేయాలన్న మాట. ఆదర్శ గ్రామాలు మనకు బొత్తిగా కొత్త కావు. గతంలోనూ అనేక స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు)- నిరుపేద గ్రామాలను వికాస పథంలోకి తీసుకువచ్చాయి. అద్గావ్‌, దేవ్‌ పింపల్‌ గావ్‌, రాలేగాం సిద్ధి, హివారె బజార్‌(మహారాష్ట్ర), శాంతిపుర (కర్ణాటక) వీటిలో కొన్ని. సమగ్ర భాగస్వామ్య వాటర్‌షెడ్‌ అభివృద్ధి పథకం కింద కలబురగి (గుల్బర్గా-కర్ణాటక), సుఖోమజ్రి (హర్యానా), అంకాపూర్‌ (తెలంగాణ) వంటి గ్రామాలూ స్ఫూర్తిదాయకంగా అభివృద్ధి చెందాయి. వాటర్‌షెడ్‌ అభివృద్ధి ప్రాజెక్టుల కింద ఈ గ్రామాల్లో బయోగ్యాస్‌ ప్లాంట్ల వంటి పునరుత్పాదక ఇంధన సౌకర్యాలనూ ఎన్జీవోలు ఏర్పాటు చేశాయి. ఈ ప్రజా కేంద్రిత పథకాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడమే కాదు, భూగర్భ జలమట్టాలను పెంచి, పొరుగు గ్రామాలకూ లబ్ధి చేకూర్చాయి.

సన్సద్‌ ఆదర్శ గ్రామ యోజన పథకం మార్గదర్శకాలు

సన్సద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజన పథకాన్నే పార్లమెంటు (చట్టసభల) ఆదర్శ గ్రామ యోజన పథకం అని కూడా అంటారు. ఈ పథకం యొక్క మార్గదర్శకాలు ఈ క్రింద జతచేయబడిన పి.డి.ఎఫ్. లో అందుబాటులో ఉంటాయి.

పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

సమష్టి కృషితోనే అభివృద్ధి

సృజనాత్మకత, నవీకరణలు అభివృద్ధి ప్రక్రియను కొత్త అంచెలకు తీసుకెళతాయని చాటే ఉదాహరణలు మరికొన్ని ఉన్నాయి. ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని పాలమౌ జిల్లాలో చక్రీయ వికాస్‌ ప్రణాళిక కింద రైతులు తమ భూములను సమీకరించి సమష్టి వ్యవసాయ అభివృద్ధి క్షేత్రాలుగా మార్చుకొని ఘన విజయాలు సాధించారు. ఇలాంటి మరో పథకం- వాడి నమూనా! ఇందులో గ్రామాన్ని కాకుండా కుటుంబాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. తొమ్మిది రాష్ట్రాల్లో 1,60,000మంది రైతులు 65,000హెక్టార్లలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆయా భూముల్లో సేద్యం, ఉద్యాన పంటలు, అడవుల పెంపకం చేపడుతున్నారు. ఈ 'నాబార్డ్‌' ప్రాయోజిత కార్యక్రమం స్థానిక ప్రజల చురుకైన భాగస్వామ్యంవల్ల విజయవంతమైంది.

తెలంగాణలోని వరంగల్‌కు 20కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగదేవిపల్లి గ్రామం గురించి పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మాధ్యమాలు విస్తృతంగా ప్రచారం చేశాయి. బాల వికాస సామాజిక సేవాసంఘం అనే స్వచ్ఛంద సంస్థ స్థానిక ప్రజలతో కలిసి గంగదేవిపల్లి ప్రయోగాన్ని విజయవంతం చేసింది. 13వేల జనాభాగల ఈ గ్రామం సంపూర్ణ అక్షరాస్యత సాధించింది. ఇతర మానవాభివృద్ధి సూచీల్లో ఎంతో ముందడుగు వేసింది. గ్రామంలోని మొత్తం 24కమిటీలు అక్షరాస్యత, ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్య కల్పనతోపాటు కేబుల్‌ టెలివిజన్‌ ప్రసారాలనూ నిర్వహిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ కమిటీలు గంగదేవిపల్లిని ఆదర్శ గ్రామంగా మార్చుకున్నాయి. కమిటీ సభ్యులు ఇతర ప్రాంతాల్లో సభలు, గోష్టులకు వెళ్లి తమ అనుభవాలు వివరిస్తూ, మార్గదర్శకంగా నిలుస్తున్నారు. ఈ గ్రామం తెలుగు, ఆంగ్ల భాషల్లో సొంత 'వెబ్‌సైట్‌'నూ నిర్వహిస్తోంది. ఆదర్శ గ్రామంగా గంగదేవిపల్లి ఎదగడానికి 15ఏళ్లు పట్టింది. స్థానికులు తమకు తాము ప్రగతి చోదకులుగా మారి అభివృద్ధిని సాధించడమనేది నెమ్మదిగా సాగే ప్రక్రియ. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలి. 2014 సెప్టెంబరులో కేంద్రప్రభుత్వం ఎంపిక చేసిన మూడు స్ఫూర్తిదాయక గ్రామాల్లో గంగదేవిపల్లి ఒకటి. మిగతా రెండూ- పున్సారి(గుజరాత్‌), హివారి బజార్‌(మహారాష్ట్ర). ఈ గ్రామాలపై ప్రభుత్వం డాక్యుమెంటరీలు నిర్మించింది. 2014 అక్టోబర్‌ 11న ప్రధాని మోదీ సన్సద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన పథకాన్ని ప్రారంభించిన సందర్భంలో వాటిని ప్రదర్శించారు. 'ఆదర్శ' అనే పదం నైతికంగా ఎంతో బరువైంది. ఆ పదం వినగానే ప్రజల్లో గొప్ప ఆశలు రేగుతాయి. వారి ఆశలు నెరవేర్చే విధంగా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ఈ పథకం కోసం గ్రామాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. సన్సద్‌ ఆదర్శ గ్రామ యోజన అమలులో అన్ని దశల్లోనూ స్థానికులు చురుగ్గా పాలుపంచుకోవాలి. సమష్ఠి కార్యాచరణలో పాల్గొన్న అనుభవం, స్థానిక వైరుధ్యాలను పరిష్కరించుకున్న చరిత్ర ఉన్న గ్రామాలను సన్సద్‌ పథకంలో మమేకం చేయాలి. రాజకీయ, కుల, మత భేదాలతో చీలిపోయిన గ్రామాల్లో ఆశించిన ఫలితాలు రావు. తన ప్రసంగంలో మోదీ అనేక లక్ష్యాలు పేర్కొన్నారు. వాటిని నెరవేర్చడం నిజంగా సవాలే.

ఈ పథకం లో పేర్కొన్న కీలకాంశాలు ఇవి-

 • సన్సద్‌ ఆదర్శ గ్రామ పథకం పరిపూర్ణ దృక్పథంతో అమలై, పల్లెలను రూపాంతరం చెందించాలి.
 • ప్రజల అవసరాలు, డిమాండ్లను తీర్చే విధంగా ఎంపీలు దీన్ని అమలు చేయాలి.
 • పథకం కింద ఎంపికైన గ్రామాల ప్రజలతో ఎంపీలు సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవాలి. వారితో కలిసి మెలిసి ఉంటూ సామరస్య వాతావరణం పెంపొందించాలి.
 • ఎంపీలు అధికార దర్పం ప్రదర్శించకుండా గ్రామీణులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలి.
 • మార్పు ప్రేరేపకులుగా నిలవాలి. పథకాన్ని సృజనాత్మకంగా అమలు చేయాలి.
 • ఉదాత్త ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి తోడ్పడే మార్గదర్శక సూత్రాలు రూపొందించి అమలు చేయాలి.

సన్సద్‌ గ్రామ పథకం - ఆనవాయితీ ప్రభుత్వ పథకాల వంటిది కాదని; చురుకైన ప్రజాభాగస్వామ్యం, స్వచ్ఛంద సేవలతో నడిచే ఉదాత్త పథకమని మోదీ వివరించారు. పథక లక్ష్యాలకు అనుగుణంగా రూపొందే గ్రామాలు పొరుగు పల్లెలకు స్ఫూర్తినిచ్చి, అన్నింటినీ అభివృద్ధి మార్గం పట్టిస్తాయి. ఈ పథకానికి ఇంతటి ప్రభావశీలత ఉంది కనుక పార్లమెంటు సభ్యులు యథాలాపంగా ఆదర్శ గ్రామాలను ఎంపిక చేయకూడదు. స్థానికుల అవసరాలు, స్పందనాశీలత, ప్రాంతీయ సమీకరణలు, గతంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తీరు- వంటి వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆదర్శ గ్రామాల ఎంపిక జరగాలి. స్థానిక ఎమ్మెల్యేలు, పంచాయతీరాజ్‌ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని వెళ్లడం చాలా ముఖ్యం.

ఉమ్మడి లక్ష్యం కావాలి!

ఆదర్శ గ్రామంలో సమర్థ భూ, జల నిర్వహణ; సురక్షిత తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆరోగ్య సేవలు, ఆస్పత్రి, విద్య, జీవనోపాధి వంటి సౌకర్యాలు అనివార్యంగా ఉండాలి. ప్రధానమంత్రి ఆశిస్తున్నట్లు ప్రతి ఎంపీ 2016నాటికి ఒక ఆదర్శ గ్రామాన్ని, 2019నాటికి మరో రెండింటినీ అభివృద్ధి చేయడం నిజంగా ఒక సవాలే. ప్రజలు తమ ఇష్టప్రకారమే భాగస్వామ్యం తీసుకుంటారు తప్ప, ప్రభుత్వ గడువు లోగా పనులు పూర్తిచేయాలని హడావుడి పడరు. ప్రజలు స్వచ్ఛందంగా పాలుపంచుకోని పథకాలు, వాటికింద వెచ్చించిన నిధులు వృథా అయిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పటికే విజయవంతమైన గంగదేవిపల్లి వంటి ఆదర్శ గ్రామాలు పల్లెవాసులను పెద్దయెత్తున పాలుపంచుకునేలా చేయగలవు. ఆదర్శ గ్రామ పథకాన్ని అమలు చేసే బాధ్యత పార్లమెంటు సభ్యులమీదే ఉంది. ఈ బృహత్తర పథకాన్ని అయిదేళ్లలో విజయవంతం చేయడం అంత తేలిక కాదు. ఈ సవాలును అధిగమించడానికి గ్రామీణ సమాజాలను, చురుగ్గా పనిచేస్తున్న స్వయం సహాయక బృందాలను, స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని పోవాలి. సామాజిక న్యాయ సాధన, అసమానతల నిర్మూలన, కౌలుదారుల హక్కుల రక్షణ, అందరి శ్రేయం కోసం ఉమ్మడిగా పనిచేయడం వంటి విశాల లక్ష్యాల సాధన దిశగా ఆదర్శ గ్రామాలు రూపుదిద్దుకోవాలి.

- డాక్టర్‌ టి.సంపత్‌ కుమార్‌

ఆధారము: ఈనాడు ప్రతిభ.నెట్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate