অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మహిళలకు ఋణాలు అందించే సంస్ధలు - అభివృద్ధి పథకాలు

మహిళలకు ఋణాలు అందించే సంస్ధలు - అభివృద్ధి పథకాలు

అన్ని రంగాలలోను స్త్రీలు ముందంజ వేస్తున్న రోజులివి. ఒకప్పుడయితే స్త్రీలకు వంటిల్లే చాలుననుకునేవారు. వారిని చదవనిచ్చి, ఆలోచించగలిగేలా చేస్తే పురుషులతో సమానంగా అభివృద్ధిపథం వైపు పయనించగలరని గుర్తించారు. స్త్రీ, పురుష అసమానతలను పక్కనపెట్టి వారిని ప్రొత్సహిస్తే రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించగల నేర్పరితనం వారిలో ఉంది. అందుకే పట్టణ ప్రాంత మహిళలకే కాకుండా, చదువురాని గ్రామీణ స్త్రీలు సైతం కుటీర పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమల ద్వారా స్వావలంబన సాధిస్తారని వారికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నాయి.

జాతీయబ్యాంకులు, గ్రామీణ సహకార బ్యాంకులు, స్టేట్ పైనాన్స్ కార్పొరేషన్, రాష్ట్ర మహిళా కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి ఆర్ధిక సంస్ధలు ఋణాలు మంజూరు చేస్తున్నాయి. అలాగే ' నాబార్డ్ ' స్త్రీల కొరకే అనేక పథకాలు, వర్క్‌షాపులు, శిక్షణా తరగతులు నిర్వహిస్తొంది. స్వయం సహాయక బృందాలు, డ్వాక్రా, ఐ.ఆర్.డి.పి వంటి పథకాల ద్వారా స్వయం ఉపాధి కల్పించుకుంటూ, తమ ప్రాజెక్టు ద్వారా మరెంతోమందికి మార్గదర్శకులవుతున్నారు మహిళలు. ఆ వివరాలిలా ఉన్నాయి.

మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర ఆర్ధిక సంస్థ పథకం

వ్యాపార దృష్టి, పరిశ్రమల స్ధాపనలో చురుకుగా పాల్గొనే ఉత్సాహం ఉన్న స్త్రీలకు ఋణాలను అందించేదీ ఈ మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల పథకం. దీని వలన మహిళలు తమకు తామే ఒక స్వయం ఉపాధిని కల్పించుకోవడమే కాక, మిగిలిన వారికి కూడా ఒక ఆసరా ఇవ్వగలిగినవారవుతారు. మూలధనంలో 51 శాతం పెట్టుబడి పెట్టగలిగిన మహిళలు తమ పరిశ్రమపై పూర్తి నిర్వహణాధికారాన్ని పొంది ఉంటారు. ఈ నిధులతో భూమి, భవనం, మెషినరీ లాంటి స్ధిరాస్ధులను ఏర్పర్చుకొనేందుకు వీలుంటుంది. రెండు సంవత్సరాల కాల పరిమితిలో తిరిగి చెల్లింపులు మొదలవుతాయి. అంటే రెండు సంవత్సరాల అనంతరం ఋణం చెల్లించాల్సి ఉంటుంది. ఏ తేదీన ఋణాలు మంజూరు కాబడ్డాయో ఆ తేదీ నుండి రెండేళ్ళ తరువాత ఈ చెల్లింపులు ప్రారంభమవుతాయి.

ఈ పథకంలో ఆర్ధిక సహాయం 4(నాలుగు) లక్షలకు మించకుండా ఇవ్వబడుతుంది. ఏ ప్రాంతంలో పరిశ్రమను నెలకొల్పినా, వ్యవస్ధాపకురాలి కనీస పెట్టుబడి, పరిశ్రమకయ్యే మొత్తం వ్యయంలో 15 శాతం ఉండాలి. ఈ పథకంలో ఋణ సహాయం 3 భాగాలు, పారిశ్రామికవేత్త వాటా ఒక భాగం (3:1) గా ఉంటాయి. ఈ పథకం క్రింద మంజూరు చేయబడిన పూచీకత్తుగా ' ఉచిత కమతం ' (ఫ్రీ హోల్డ్ ఇంట్రెస్ట్) లేదా ' కౌలు కమతం ' (లీజ్ హోల్డ్ ఇంట్రెస్ట్), భూమి, భవనం, యంత్రాంగం, యంత్రాలు తదితర పరికరాలు, భవిష్యత్తులో కుదుర్చుకోబోయే సిధిరాస్తుల దస్తావేజులు, తాకట్టు పెట్టాలి. 5 లక్షల లోపు ఋణాలకు మూడో వ్యక్తి పూచీకత్తు అక్కరలేదు. కానీ 5 లక్షల లోపు ఋణాలకు మూడో వ్యక్తి పూచీకత్తు అక్కరలేదు. కానీ 5 లక్షల పైబడే ఋణాలకు మాత్రం ఆర్ధిక సంస్ధకు తృప్తిచెందేలా కనీసం ఇద్దరు వ్యక్తులు హామీ ఇవ్వాల్సి ఉంటుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్త్రీశక్తి పథకము

పరిశ్రమల స్ధాపనలోనూ, నిర్వహణలోనూ స్త్రీలకు మెరుగైన వసతులు కల్పించడానికి, వారి సేవలు పొందడానికి వీలుగా, వారికి స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమమేస్త్రీ శక్తి పథకము.వారి అభిరుచి, అనుభవం ఉన్న ప్రాజెక్టులను ఎంచుకుని, దానిలో అభివృద్ధి సాధించేందుకు మరియు అవసరమైన శిక్షణ పొందేందుకు అవకాశాన్ని ఇచ్చేదీ ఈ పథకం. ఈ పథకంలో మహిళలు ఆర్ధిక సహాయం పొందడానికి ఆయా ప్రాజెక్టులపై యాజమాన్యపు హక్కులు కలిగి ఉండాలి. కనీసం 51 శాతం ఈక్విటి ఉన్న మహిళలే దాన్ని నిర్వహిస్తుండాలి. దీని వలన ఉపాధి పొందేవారు కూడా కనీసం 50 శాతం స్త్రీలే కావాలి. ఈ పథకంలో లఘు పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలు, అంతేకాకుండా వ్యవసాయాధార కార్యకలాపాలు, చిన్న చిన్న వ్యాపార సంస్ధలకు సహాయం లభిస్తుంది. తమ తమ పరిశ్రమను అనుసరించి ఆయా రంగాల వారు ఋణాన్ని పొందవచ్చును.

ఎ. లఘు పరిశ్రమలు:

  1. లిబరలైజ్డ్ స్కీం: కొన్ని పరికరాల రిపేరింగ్, కొన్ని వస్తువుల ఉత్పత్తి, ప్రాసెసింగ్ వంటి ప్రాజెక్టుల్లో 35 లక్షల రూపాయలకు మించకుండా మూల ధనంతో వ్యక్తులుగానీ, బృందాలుగానీ ఏర్పాటు చేసే వాటికి ఈ పథకం వర్తిస్తుంది. అదే అనుబంధ యూనిట్లకయితే ఇది రు.45 లక్షల వరకూ ఉండవచ్చును. ప్లాంటు, యంత్రాలు, పరిశ్రమ భవనం, నిర్వహణా వ్యయం వంటి వాటికి అవసరాన్ని బట్టి సహాయం ఉంటుంది. అప్పటికే పనిచేస్తున్న ప్రాజెక్టులకు ఆధునీకరించడానికి, పునర్నిర్మించడానికి, విస్తరించి అభివృద్ధి చేయడానికి కూడా ఈ సహాయం పొందవచ్చు.
    రు. 25,000 లోపు ఋణం అయితే మార్జిన్‌మనీ అవసరం ఉండదు. అయితే రు. 25 వేల నుండి రు. 5లక్షల వరకూ పెట్టే ప్రాజెక్టు అయితే, ప్రాజెక్టు ఖరీదులో 15% మారిజిన్‌మనీ ఉంటుంది. అదే రు. 5లక్షలకు మించిన ఋణాల్లో ఇది 20% ఉంటుంది. ఈ పథకం క్రింద స్త్రీలకు సులువుగా అయ్యే అప్పడాలు, వడియాలు ఊరగాయలు తయారీ, చేనేత, హస్తకళలు, వస్త్రాల తయారీ, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ శిక్షణ మొదలైనవి ఎన్నో ప్రాజెక్టులను చేపట్టవచ్చు.
  2. ఈక్విటీ ఫండ్ స్కీం: పరిశ్రమ స్ధాపనలో ఉత్సాహం, అనుభవం తెలివితేటలు ఉన్నా కూడా, సరైన ఆర్ధిక పరిస్ధితులు లేక కనీసం మార్జిన్ మనీని కూడా సమకూర్చలేని వారి కొరకు ఈ పథకం ఏర్పరచబడింది. ప్రాజెక్టును మొట్ట మొదటిసారిగా ప్రారంభిస్తూ తగిన బాధ్యత వహించగల మహిళలకు దీని ద్వారా ఆర్ధిక సహాయం లభిస్తుంది. ఈ పథకం క్రింద రూ.1 లక్ష వరకు ఋణం అందుతుంది. ఋణం తీసుకున్న తరువాత, మొదటి 5 నుండి 7 ఏళ్ళ కాలం మోరటోరియంగా పరిగణిస్తారు. తరువాత ఈక్విటీమోరటోరియంగా పరిగణిస్తారు. తరువాత ఈక్విటీ ఫండ్‌ను 5 - 7 సంవత్సరాల కాలవ్యవధిలో తీర్చవచ్చు. దీనికున్న ప్రత్యేకత ఏమిటంటే ఈ ఋణ సహాయానికి వడ్డీ ఉండదు.
  3. ఎంటర్ ప్రెన్యూర్ స్కీం: ఈ పథకంలో రూ.10 లక్షలకు మించని ప్రాజెక్టులకు, యంత్రాలు, ప్లాంటు వంటివాటి కొరకు నిర్వహణ వ్యయంకు (వర్కింగ్ క్యాపిటల్‌కు) ఋణ సహాయం లభిస్తుంది. బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్ లేదా టెక్నికల్ డిగ్రీలు కలిగిన వ్యక్తులు, డిప్లామా హోల్డర్స్, తదితరులు వ్యక్తిగతంగా కానీ, కొందరు కలిసి బృందంగా ఏర్పడికానీ ఎంటర్‌ప్రెన్యూర్ స్కీమ్‌ క్రింద ఋణ సహాయం అందుకోవచ్చు. తమ తమ రంగాల్లో తగిన అనుభవం, నైపుణ్యం ఉంటే మరింత మంచిది.

బి. గ్రామీణ పరిశ్రమలకు పథకం:

నేత వృత్తుల వారు, వెదురుతో వస్తువులు, బొమ్మలు మొదలగునవి చేసే వారు, కుండలు తయారీ మొదలైన వృత్తి పనివారలకు, నైపుణ్యం గలవారికి ఈ ఋణం లభిస్తుంది. ఈ పథకం గ్రామీణ పరిశ్రమలకు ప్రత్యేకం కనుక 50 వేల జనాభా మించని చిన్న గ్రామాలలో మాత్రమే ప్రాజెక్టును చేపట్టాలి. అభ్యర్ధులు పరిసరాల్లో లభించే స్ధానిక వనరులచే ముడిసరుకుగా ఉపయోగించి వస్తు ఉత్పత్తిని చేపట్టాలి. ఈ యూనిట్లకు నిర్వహణ వ్యయం, టరంలోన్ రెండూ కలిపి రు. 25 వేల సుమారు ఋణమంజూరు అవుతుంది. దీనిలో కూడా మార్జిన్‌మనీ పెట్టుకోవలసిన అవసరం ఉండదు. చిన్న చిన్న వాయిదాల్లో పదేళ్ళ కాల పరిమితిలో చెల్లించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోనే బాగా వెనుకబడిన ప్రాంతవాసులకు 10 శాతం వడ్డీ, ఇతర ప్రాంతాల వారికి 12 శాతం వడ్డీ ఉంటుంది.

సి. చిన్న చిన్న వ్యాపారస్ధులకు ఋణ సహాయం:

  1. వ్యాపార సంస్ధలకు ఋణ సౌకర్యం: ఈ పథకం క్రింద చైల్డ్‌కేర్ సెంటర్‌లు, పప్పు రుబ్బే మిల్లు (వెట్ గ్రైండింగ్ మిషన్), చిన్నచిన్న తినుబండారాల షాపు, టైలరింగ్ ద్వారా గౌన్లు, పెట్టీకోట్స్ ఎక్కువ సంఖ్యలో కుట్టి సరఫరా చేయడం, లాండ్రీ షాపు, సంచార లైబ్రరీలు, చాపలు అల్లడం, బేకరీ నిర్వహించడం వంటి వ్యాపారాలు చిన్నచిన్నవి పెట్టుకోవచ్చు. వీటిల్లో వాడే పరికరాల ఖరీదు రు.2 లక్షలకు మించకుండా ఉంటే, ఋణసహాయం లభిస్తుంది. వర్కింగ్ క్యాపిటల్ రు. లక్ష వరకూ మరియు టరంలోన్‌గా రూ.15 లక్షల వరకూ లభిస్తుంది.
  2. ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు: వాహనాలను అద్దెకు తిప్పే వారికి ఈ ఋణం లభిస్తుంది. సదరు కిరాయికి తిప్పే బృందానికి 6 వాహనాలకన్నా ఎక్కువ ఉండరాదు. వాహనాలు నడిపేందుకు పర్మిట్ మరియు వేరీడ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. లేదంటే ఋణం మంజూరు కాదు. ఈ పథకంలో అందే ఆర్ధిక సహాయంతో 6 కన్నా తక్కువ వాహనాలు ఉన్నవారు వాహనాలు కొనుగోలు చేయవచ్చు. కానీ 6 కన్నా మించరాదు.
  3. వృత్తి సేవలు, స్వయం ఉపాధి సౌకర్యం: రిజిష్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు దంతవైద్యులు, ఆర్కిటెక్చర్ డిజైనర్లు, లాయర్లు, ఇంజనీర్లు వంటి వ్యక్తులకు లేదా బృందాలకు వారి వృత్తి సేవలు మెరుగుపచుకోవటానికి ఈ ఋణం అందిస్తారు. ఇవేకాకుండా టైప్ ఇనిస్టిట్యూట్‌లు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు, ఫోటొగ్రాఫర్లు, కళాకారులు, ఇంటీరియర్ డెకరేటర్లు, డాన్స్ స్కూల్ నడిపేవారు ఈ ఋణానికి అర్హులే దీనిలో 2 లక్షల వరకూ ఋణం లభిస్తుంది. 1లక్ష కేపిటల్ ఖర్చులకే సరిపెట్టాలి.

మహిళా చైతన్యానికి నాబార్డు పథకాలూ - ఋణాలూ

పట్టణాలు మాత్రమే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంటే పల్లెల్లో ఏమీలేక, గ్రామీణులు పట్టణాలకు వలసలు మొదలుపెట్టారు. దానితో గ్రామీణులకు, అందునా స్త్రీలకు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, లఘు, చిన్న తరహా పరిశ్రమలు స్ధాపించడానికి, స్వయం సమృద్ధి సాధించడానికి ప్రత్యేకంగా ' నాబార్డు ' ఋణాలను అందిస్తుంది. వ్యవసాయం, వ్యవసాయాధార పరిశ్రమల స్ధాపనకు ఋణాలు, పథకాలు అమలు చేయడం, గ్రామీణాభివృద్ధి ' నాబార్డ్ ' ధ్యేయాలుగా ముందుకు సాగుతోంది.

ఎ) అర్విండ్ (అసిస్టెన్స్ టు రూరల్ ఉమెన్ ఇన్ నాన్ - ఫాం డెవలప్‌మెంట్): వరకూ కలసి ఒక బృందంగా ఏర్పడాలి. ఆ బృందంగా ఏర్పడాలి. ఆ బృందం ఆరు మాసాలుగా కలిసి పని చేయాలి. బృందంలోని సభ్యురాళ్ళందరూ తమకు తాముగా పొదుపు పాటిస్తూ కొంత మొత్తాన్ని కూడబెట్టి దాన్ని ఋణాలకు ఉపయోగిస్తూ, అభివృద్ధి చేయాలి. ఆదాయం - వ్యయం ఎప్పటికప్పుడు లెక్కలు చూసుకోవాలి. తగినంత సొమ్ము కూడబెట్టాకా, ఏదైనా పథకం ఎంచుకుని గ్రామీణ బ్యాంకులు లేదా వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకుల ద్వారా ఋణాలు పొందవచ్చును. తమంతట తామే సాయం చేసుకోవడం అనే మౌలిక సూత్రం దీనిలో ఇమిడి ఉంది.

బి. రివాల్వింగ్ ఫండ్ సౌకర్యం: నాబార్డ్ ఈ మధ్యలో ' అసాధారణ పరిస్ధితుల్లో ' రివాల్వింగ్ ఫండ్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. ఈ సొమ్ము రూ. 10 లక్షలకు మించి ఉండదు. ఎంజీవోలకు బ్యాంకుల నుండి ఋణ సౌకర్యం లభించకపోతే ' నాబార్డు ' నుండి పొందవచ్చు. ఇలాంటి ఋణాలపై 9 శాతం సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. 3 నుండి 10 సంవత్సరాలలోపు ఆ ఋణాలను చెల్లించాలి.

డ్వాక్రా (గ్రామీణ ప్రాంత మహిళా, శిశు అభివృద్ధి)

ఇది ఐ.ఆర్.డి.పి. పథకంలోని భాగము. దీన్ని 1982లో ప్రారంభించారు. మహిళలను బృందాలుగా ఏర్పరచి, వారికి కొవ్వొత్తుల తయారీ, అగ్గిపుల్లల తయారీ, టైలరింగ్, కుట్లు - అల్లికలు మొదలైన కుటీర పరిశ్రమలకు అవసరమయ్యే శిక్షణను కూడా ఇప్పిస్తారు. ఈ పథకం క్రింద పనిచేసే మహిళల పిల్లల రక్షణకు శిశు సంక్షేమ కేంద్రాలు, బాల్వాడీలను ఏర్పరుస్తారు. ఆరు నెలల ట్రైనింగ్‌లో రెండు వందల రూపాయల స్టైఫండ్ ఇస్తారు. ప్రాజెక్టులు రూ.10లక్షలు మించరాదు. ఈ పథకానికి సంబంధిన నిధులను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నేరుగా జిల్లా కలెక్టర్లకు విడుదల చేస్తుంది.

స్టేట్‌ఫైనాన్స్ కార్పొరేషన్ - మహిళా ఉద్యమ నిధి

లఘు పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమలు స్ధాపించడానికిగానూ, ఈ మహిళా ఉద్యమ నిధి ప్రత్యేక స్కీమ్‌ ప్రారంభించబడింది. దీనికి అవసరమైన ఋణాన్ని రాష్ట్ర ఆర్ధిక సంస్ధ విడుదల చేస్తుంది. స్త్రీలు మూలధనంలో 51% పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పథకంలో కొత్త ప్రాజెక్టుల్లో వస్తువుల తయారీ, భద్రపరచడం మరియు ప్రాసెసింగ్ చేయడం వంటివి చేసుకోవచ్చు. అప్పటికే స్ధాపించబడి ఉన్న లఘు పరిశ్రమలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకు, సర్వీస్ ఎంటర్‌ప్రైజెస్‌కు వాటిని ఆధునీకరించడం, వాటి పరిధిని విస్తృతపరచడం, యంత్ర సామగ్రిని, క్రొత్త టెక్నాలజీని పెంచడం వంటి వాటికి ఈ ' మహిళా ఉద్యమ నిధి ' నిధులను కూర్చుతుంది. దీనిలో ప్రాజెక్టు ఖరీదు (పది) 10 లక్షలకు మించరాదు.

సీడ్ కేపిటల్‌గా ప్రాజెక్టు ఖరీదులో 25 శాతాన్ని "సిడ్బి" అందిస్తుంది. 1 శాతం సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తుంది. పారిశ్రామికవేత్త ప్రాజెక్టు ఖరీదులో 10 శాతం పెట్టుబడి పెట్టాలి. సేవా రంగాలైనటువంటి హాస్పిటల్స్, నర్సింగ్ హోంలు, హోటల్స్ మొదలైనవి ఈ పథకం ద్వారా చేపట్టవచ్చు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల ద్వారా మార్జిన్‌మనీ సౌకర్యాన్ని పొందిన ప్రాజెక్టులకు "మహిళా ఉద్యమనిధి" నుండి ఋణం లభించదు.

ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్

మహిళాభ్యుదయాన్ని ఆకాంక్ష్మించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి స్త్రీల కోసం ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్ధాపించింది. అన్ని రంగాలలోనూ స్త్రీలు ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఉత్సాహవంతులైన స్త్రీ పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేయడానికిగానూ, వారి మెరుగైన సేవలను వినియోగించుకోవడానికి గాను ప్రభుత్వం ధృడ సంకల్పంతో ఉంది. స్త్రీలకు ప్రత్యేకించిన ప్రాజెక్టులను అందిస్తూ వారికి సహకరిస్తున్నారు.

ఈ రాష్ట్ర మహిళా ఆర్ధిక సంస్ధ 25 వేల రూపాయల వరకూ మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది. సులభతరమైన పూలమొక్కల పెంపకం, పండ్లు - కాయగూరల మార్కెటింగ్, విత్తనాలు, నారు మొక్కలు, అంటు మొక్కలు సరఫరా, కేటరింగ్, అప్పడాలు, వడియాలు, అటుకుల తయారీ, అగర్ బత్తీల తయారీ, పీచు ఉత్పత్తులు, కోళ్ళ పెంపకం, గొర్రెల, మేకల పెంపకం, పాలు - పెరుగు (డైరీ) ఉత్పత్తి చేయడం వంటి ప్రాజెక్టులు ఎంచుకోవచ్చు.

మరిన్ని వివరాలకు సంప్రదించండి:
ఆంధ్రప్రదేశ్ ఉమెన్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్,
8-3-22, వెంగళరావు నగర్,
హైదరాబాద్-500 890.

ఆధారము: తెలుగు దనం

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate