తెలంగాణా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా బంగారు బాటను వేస్తూ తొలి బడ్జెట్‌ను పకడ్బందీగా రూపొందించారు.
తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను రాష్ట్ర అసెంబ్లీకి సమర్పించారు. గతేడాది పది నెలల కాలానికి రూ.1,00,637.96 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఈసారి 2015-16 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను రూ.1,15,689.19 కోట్లతో రూపొందించారు. ఇందులో ప్రణాళికేతర వ్యయం రూ.63,306 కోట్లు కాగా, ప్రణాళికా వ్యయం రూ.52,383.19 కోట్లు.
- ప్రస్తుత (2014-15) పది నెలల బడ్జెట్‌లో పొందుపర్చిన పథకాలన్నింటికి కొత్త బడ్జెట్‌లోనూ నిధులు పొందుపర్చారు. ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్న జలాహారం, మిషన్ కాకతీయ, ఆసరా, కళ్యాణ లక్ష్మి, సాగు నీరు లాంటి వాటన్నింటికీ బడ్జెట్‌లో ఎక్కువ నిధులను కేటాయించారు. భూముల అమ్మకం, క్రమబద్ధీకరణపై ఇంతకుముందు అంచనా వేసిన మేర ఆదాయం రాకపోయినా మళ్లీ రూ.13,500 కోట్లను లక్ష్యంగా నిర్దేశించుకోవడం, అప్పులను నిబంధనలకు మించి ఎక్కువగా తేవాలనుకోవడం, వ్యాట్ ద్వారా ఏకంగా రూ.35,463 కోట్లను రాబట్టాలని సంకల్పించడం బడ్జెట్‌కు భారీతనాన్ని తెచ్చిపెట్టాయి.
- '2014-15'లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అంచనాల కంటే బాగా తగ్గాయి. ప్రణాళికా సాయంగా రూ.11,781 కోట్లు రావాల్సి ఉండగా ఫిబ్రవరి వరకు వచ్చింది కేవలం రూ.4,147 కోట్లు. రూ.9,939 కోట్ల ప్రణాళికేతర గ్రాంటులో అందింది రూ.1346 కోట్లు మాత్రమే. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి పన్నుల రాబడుల్లో రాష్ట్రాల వాటా 42 శాతానికి పెరిగినా తెలంగాణకు కేంద్రం ఇచ్చే ప్రణాళిక నిధుల శాతం తగ్గింది. అయినప్పటికీ కొత్త బడ్జెట్‌లో తమ ప్రభుత్వం అధిక మొత్తంలో ప్రణాళిక వ్యయాన్ని ప్రతిపాదిస్తోంది అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
వివిధ రంగాలు - కేటాయింపులు
సంక్షేమ రంగం
- తాజా బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖలకు రూ.11,450 కోట్లను కేటాయించింది. 2014-15 కంటే అన్ని శాఖలకు కేటాయింపులు పెరిగాయి. ఇప్పటివరకు అన్ని శాఖలతో కలిపి ఉన్న దళిత, గిరిజన ఉప ప్రణాళికల నిధులను నేరుగా ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖకు కేటాయిస్తూ ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. ఈ కేటాయింపులను తొలిసారిగా ప్రత్యేకంగా చూపుతూ పుస్తకాలను ముద్రించింది. దళిత ఉప ప్రణాళిక కింద రూ.8089 కోట్లు, గిరిజన ఉపప్రణాళిక కింద రూ.5036 కోట్లు సమకూరనున్నాయి.
- దళిత సంక్షేమశాఖకు తెలంగాణ సర్కారు తాజా బడ్జెట్‌లో రూ.5547 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.2832 కోట్లను విద్యాభివృద్ధికి నిర్దేశించింది. రూ.157 కోట్లను కళ్యాణ లక్ష్మి పథకానికి కేటాయించింది.
- గిరిజనుల కోసం బడ్జెట్‌లో రూ.2878 కోట్లను కేటాయించింది. ఇందులో అధిక శాతం విద్యా పథకాలకే ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి పథకానికి రూ.80 కోట్లను ఇచ్చింది. గిరిజన రిజర్వేషన్లను 12 శాతానికి పెంచేందుకు కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
- బీసీ కార్పొరేషన్‌కు రూ.114 కోట్లు, రాజీవ్ అభ్యుదయ పథకానికి రూ.41 కోట్లు, వసతి గృహాలకు రూ.111 కోట్లు, బీసీ స్టడీ సర్కిళ్లకు రూ.20 కోట్లను కేటాయించింది.
- మైనారిటీ సంక్షేమానికి రూ.1100 కోట్లను కేటాయించింది. ఇందులో వంద కోట్లను షాదీ ముబారక్ యోజనకు నిర్దేశించింది. బహుళ అభివృద్ధి పథకానికి రూ.105 కోట్లను ఇచ్చింది. ముస్లిం రిజర్వేషన్లను 12 శాతం పెంచేందుకు కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
- తెలంగాణలోని ఎస్సీ ప్రజానీకంలో భూమి లేని కుటుంబాలు 67.4%, పశు సంపద లేనివి 82.3% గాను, మరుగుదొడ్లు లేని కుటుంబాలు 70% అని ప్రభుత్వం తేల్చింది.
- తెలంగాణలోని గిరిజన ప్రజానీకంలో భూమిలేని కుటుంబాలు 57.3%, పశుసంపద లేని కుటుంబాలు 65.1%, మరుగుదొడ్లు లేని కుటుంబాలు 83.4% అని ప్రభుత్వం లెక్కలు కట్టింది.
గ్రామీణాభివృద్ధి
- గ్రామీణాభివృద్ధికి రూ.6583 కోట్లు కేటాయించగా ఇందులో కేంద్ర నిధులు రూ.2823 కోట్లు. రాష్ట్ర నిధులు రూ.3601 కోట్లు. ఆర్ఐడీఎఫ్ కింద రూ.127 కోట్లు, విదేశీ రుణంగా రూ.30 కోట్లు ప్రధానంగా ఉంది. ఇందులో ఉపాధి హామీ పథకం కింద రూ.2352 కోట్లు ప్రతిపాదించారు.
- ఇందిర జలప్రభకు రూ.127 కోట్లు, ఆమ్ ఆద్మీ బీమా యోజనకు రూ.20.98 కోట్లు, డ్వాక్రాకు రూ.6.81 కోట్లు, వికలాంగుల పింఛన్లకు రూ.755 కోట్లు, వృద్ధాప్య, వితంతు పింఛన్లకు రూ.2800 కోట్లు, డ్వాక్రా మహిళల బీమాకు రూ.74 కోట్లు, సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ.148 కోట్లు, ఇతర పింఛన్లు రూ.117 కోట్లు, బీడీ కార్మికుల సహాయానికి రూ.188 కోట్లు, వాటర్ షెడ్‌లకు రూ.125 కోట్లు, తెలంగాణ పల్లె ప్రగతికి రూ.30 కోట్లు, జాతీయ జీవనోపాధుల మిషన్‌కు రూ.103 కోట్లు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు రూ.129 కోట్లు కేటాయించింది.
- పంచాయతీరాజ్ శాఖకు ఆర్థిక సంఘం నిధులను రూ.98 కోట్లుగా చూపించింది. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.9 కోట్లు, గ్రామ పంచాయతీల పాలనకు రూ.15 కోట్లు కేటాయించింది.
- రెవెన్యూ శాఖకు కేటాయింపుల్లో భాగంగా సర్వే, భూ సంస్కరణలకు రూ.24.7 కోట్లు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు రూ.13.29 కోట్లు, మీ సేవకు రూ.4 కోట్లు, ఐటీ రంగంలో మౌలిక సదుపాయాలకు రూ.87 కోట్లు, జవహర్ నాలెడ్జ్ సెంటర్లకు రూ.3.76 కోట్లు, కొత్త పర్యటక ప్రాజెక్టులకు రూ.20 కోట్లు కేటాయించింది.
వ్యవసాయ రంగం
- వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు బడ్జెట్ కేటాయింపులు తగ్గాయి. అటవీ శాఖను కూడా కలిపి ప్రభుత్వం రూ.8,432 కోట్లను కేటాయించింది. ఇందులో రైతు రుణ మాఫీకే రూ.4250 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్‌లో ప్రణాళిక పద్దు రూ.2,572.72 కోట్లుగా ఉంది. గత పద్దు కంటే ఇది ఏకంగా రూ.478.60 కోట్లు తక్కువ.
- ప్రత్యేకంగా వ్యవసాయ శాఖకు గత బడ్జెట్లో రూ.1828.87 కోట్లను ప్రణాళిక పద్దు కింద కేటాయించగా, తాజా బడ్జెట్‌లో రూ.1035.55 కోట్లను మాత్రమే ఇచ్చింది. అంటే ఈసారి రూ.793.32 కోట్ల మేర కోత పడింది. కేంద్ర నిధులు తగ్గడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా కోత విధించడంతో వ్యవసాయానికి మొత్తంగా పెద్దయెత్తున కేటాయింపులు తగ్గాయి.
- ఉద్యానవన శాఖకు రూ.559.02 కోట్లు, గ్రీన్‌హౌస్‌కు రూ.250 కోట్లు, మత్స్య శాఖకు రూ.50.57 కోట్లు, మార్కెటింగ్ శాఖకు రూ.402.82 కోట్లు, అటవీ శాఖకు రూ.281 కోట్లు, కోళ్ల పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ కోసం రూ.20 కోట్లు, పాడి రైతులకు ప్రోత్సాహకం కోసం రూ.16.30 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.100 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద గతేడాది రాష్ట్రానికి రూ.765.55 కోట్లు రాగా, ఈసారి రూ.456.95 కోట్లకు తగ్గడం బడ్జెట్‌లో కోతలకు దారితీసింది.
- సూక్ష్మ సేద్యానికి రూ.200 కోట్లు, జాతీయ ఉద్యాన మిషన్‌కు రూ.109.78 కోట్లు, చుక్క నీటితో ఎక్కువ పంట కోసం రూ.108 కోట్లు, సన్న, చిన్నకారు రైతుల పంటల బీమాకి రూ.139 కోట్లు, వడ్డీలేని రుణాలు, పంటల బీమాకు రూ.200 కోట్లు, వ్యవసాయ శాఖ భవన నిర్మాణాలకు రూ.5.19 కోట్లు, పావలా వడ్డీ రుణాలకు రూ.18.05 కోట్లు, వ్యవసాయ విస్తరణ కోసం రూ.28.83 కోట్లు, వ్యవసాయ యంత్రీకరణకు రూ.100 కోట్లు, ఇన్‌పుట్ సబ్సిడీ కోసం రూ.6.88 కోట్లు, రైతులకు విత్తన సరఫరాకు రూ.64.51 కోట్లు, సీడ్ చైన్ బలోపేతానికి రూ.50 కోట్లు, పంట కాలనీలు, భూగర్భ జలాల విశ్లేషణకు రూ.20 కోట్లు, జాతీయ ఆహార భద్రత పథకానికి రూ.123.30 కోట్లు, ఆర్కేవీవై కోసం రూ.196.26 కోట్లు, మొబైల్ వెటర్నరీ క్లినిక్స్ కోసం రూ.2.18 కోట్లు, వైద్య నాథన్ కమిటీ మార్గదర్శకాల అమలుకు రూ.49.77 కోట్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు రూ.4.08 కోట్లు కేటాయించింది.
- తెలంగాణలో వ్యవసాయం తిరోగమనంలో ఉందని సామాజిక - ఆర్థిక దృక్పథం నివేదిక వెల్లడించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా గణనీయంగా తగ్గిపోతోంది. ఈ ఏడాది ఇది మరీ ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. తెలంగాణలో సేవా రంగంలో 2013-14లో 5.3 శాతం వృద్ధి ఉండగా, 2014-15 నాటికి 9.7 శాతానికి పెరిగింది. పారిశ్రామిక రంగంలో వృద్ధి 0.1 శాతం నుంచి 4.1 శాతానికి పెరిగింది. అందుకు భిన్నంగా వ్యవసాయ రంగం అభివృద్ధి పదిశాతం మేర తగ్గిపోయింది. రాష్ట్రంలో 55.49 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. అయినా 2014-15లో జీఎస్‌డీపీలో వ్యవసాయం వాటా 9.3 శాతం మాత్రమే. జీఎస్‌డీపీలో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా గత కొన్నేళ్లుగా తగ్గిపోతూ వస్తుందని, 2014-15లో వ్యవసాయ రంగం వాటాలో మూడో వంతు పశుసంపదదేనని నివేదిక వెల్లడించింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 2013-14లో 107.49 లక్షల టన్నులు కాగా, 2014-15లో ఖరీఫ్‌లో 44.30 లక్షల టన్నులు మాత్రమే.
హరిత హారం కార్యక్రమం
- తెలంగాణలో పచ్చదనం గణనీయంగా పెంచి హరిత తెలంగాణను రూపొందించాలనే లక్ష్యంతో చేపట్టిన హరితహారం కార్యక్రమానికి తాజా బడ్జెట్‌లో రూ.325 కోట్లు కేటాయించారు. తాజా కేటాయింపులతో ఏడాది కాలంలో మొత్తం 41 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లెక్కన మొక్కకు రూ.7.93 ఖర్చు పెట్టబోతున్నారు. వాస్తవానికి హరితహారం కార్యక్రమం కింద మూడేళ్ల కాలంలో 230 కోట్ల మొక్కలు (అసెంబ్లీ నియోజకవర్గానికో 40 లక్షల మొక్కల చొప్పున) నాటాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ఈ లెక్కన ఏడాదికి సుమారు 77 కోట్ల మొక్కలు నాటాల్సి ఉంది. ఇందుకు మొక్కకు రూ.7.93 చొప్పున ఏడాదికి సుమారు రూ.610 కోట్లు అవసరమవుతాయి. అయితే హరితహారం లక్ష్యం ప్రకారం తాజా కేటాయింపులు పరిశీలిస్తే సుమారు 50 శాతం తక్కువగా ఉన్నాయి.
- తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 28,854 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఇది రాష్ట్ర భూభాగంలో 25.11% మాత్రమే. జాతీయ అటవీ విధానం ప్రకారం రాష్ట్ర మొత్తం భూభాగంలో ఉండాల్సిన అటవీ విస్తీర్ణం 33%. ఈ లెక్కల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో 9,068 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉంది.
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
- ప్రభుత్వం బడ్జెట్‌లో ఈ శాఖకు రూ.756 కోట్లను కేటాయించింది. ఇందులో పౌష్టికాహార పథకానికి రూ.412 కోట్లను, ఆరోగ్య లక్ష్మికి రూ.261.54 కోట్లను, మహిళా భద్రతకు రూ.10 కోట్లను నిర్దేశించారు. బాలికా సంరక్షణ పథకానికి రూ.10.41 కోట్లనే ఇచ్చారు.
విద్యారంగం
- గతేడాది ఈ రంగానికి రూ. 10,974.49 కోట్లు కేటాయించగా, ఇప్పుడు రూ.11,241.37 కోట్లు ప్రతిపాదించారు. తాజా పెంపు సుమారు రూ.266 కోట్లు మాత్రమే. రూ.11 వేల కోట్ల పైచిలుకు నిధుల్లోనూ ప్రణాళికేతర వ్యయానికే ఎక్కువ (రూ.9,730 కోట్లు) ఖర్చవుతుంది.
- ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ఆదర్శ పాఠశాలల బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించారు. కానీ ఈ బడ్జెట్‌లో రాష్ట్రంలోని 177 ఆదర్శ పాఠశాలలకు రూ.75 లక్షలే కేటాయించారు. నిజానికి ఈ పాఠశాలల జీతభత్యాలు, నిర్వహణకు రూ.150 కోట్ల పైనే అవసరమనేది పాఠశాల విద్యాశాఖ అంచనా.
- కీలకమైన మధ్యాహ్న భోజన పథకానికి రూ.41 కోట్లే చూపించారు. 9, 10 తరగతులకు కేటాయింపులో రూ.51 కోట్లను కలుపుకున్న మొత్తం 92 కోట్లు దాటలేదు. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి రూ. 100 కోట్లు కేటాయించారు.
- పాఠశాల, మాధ్యమిక విద్యకు రూ.9054.49 కోట్లు, హైస్కూళ్లలో ప్రహరీల నిర్మాణానికి రూ.7.25 కోట్లు, ఆర్ఎంఎస్ఎకు రూ.276.95 కోట్లు, ప్రారంభిక శిక్ష కోష్ పథకాలకు రూ.245.75 కోట్లు, ప్రాథమిక విద్య పటిష్ఠత కోసం సర్వశిక్ష అభియాన్‌కు (ఎస్ఎస్ఏ)కు రూ.311.90 కోట్లు, సాంకేతిక విద్యకు రూ.255.41 కోట్లు, కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు రూ.18.33 కోట్లు, రాష్ట్రంలో కొత్త కళాశాలల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన కోసం రుసా కింద రూ.49.09 కోట్లు, ఇంటర్మీడియట్ విద్యకు రూ.76.56 కోట్లు, సాక్షరభారత్‌కు రూ.30 కోట్లు, ఆర్జేయూకేటీకి రూ.92.33 కోట్లు, కళాశాల విద్యకు రూ.70.35 కోట్లు కేటాయించారు.
- తెలంగాణలో అక్షరాస్యత శాతం 66.40 గా ఉంది. ఈ విషయంలో హైదరాబాద్ ప్రథమ స్థానంలో (83.2%), మహబూబ్‌నగర్ చివరి స్థానంలో (55%) ఉన్నాయి. రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు లేని గ్రామాలు 653 ఉన్నాయి.
గృహ నిర్మాణం
- తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం కోసం తాజా బడ్జెట్‌లో రూ.391.67 కోట్లు కేటాయించారు. ఇందులో సాధారణ పద్దు కింద రూ.184.90 కోట్లు, ఎస్సీ ఉపప్రణాళిక కింద రూ.129.23 కోట్లు, గిరిజన ఉప ప్రణాళిక కింద రూ.77.54 కోట్లు చూపారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఇందిరా ఆవాస్ యోజనకు రూ.372.67 కోట్లు కేటాయించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పట్టణ గృహనిర్మాణ పథకానికి రూ.149.04 కోట్లను ప్రత్యేకించారు. వీటితోపాటు ప్రభుత్వ అధికారులకు నివాసగృహాలు, ఎమ్మెల్యేల వసతి గృహాల్లో బహుళ అంతస్తుల నిర్మాణం, రాజ్‌భవన్‌లో నిర్మాణాలు తదితరాలు కలిపి గృహ నిర్మాణ శాఖకు మొత్తంగా రూ.954.26 కోట్లు కేటాయించారు. గతేడాది నిధులు (రూ.1075.14 కోట్లు) తో పోల్చితే ఈసారి కేటాయింపులు రూ.120.88 కోట్లు తక్కువ.
- రెండు పడక గదుల ఇంటి నిర్మాణానికయ్యే వ్యయం రూ.3.61 - 4.50 లక్షలు. రాష్ట్రంలో ఇల్లులేని పేద కుటుంబాలు 22 లక్షలు. 22 లక్షల ఇళ్ల నిర్మాణ వ్యయం కనీసం రూ.79 వేల కోట్లు.
ఇంధన రంగం
- తెలంగాణలో ప్రస్తుతమున్న 4320 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 2018 నాటికి 23,675 మెగావాట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ బడ్జెట్‌లో ఇంధన రంగానికి రూ.7400 కోట్లు కేటాయించారు. ఇందులో సింహభాగం (రూ.4257 కోట్లు) సబ్సిడీలకే పోయింది. విద్యుత్ ఛార్జీలపై ఈఆర్‌సీకి డిస్కమ్‌లు పంపిన ప్రతిపాదనల ప్రకారం రూ.6500 కోట్లు సబ్సిడీ అవసరమవుతుంది. దీనికితోడు విద్యుత్తు కొనుగోలుకు భారీగా నిధులు అవసరమవుతాయి. ప్రస్తుత పరిస్థితిలో జెన్‌కోకు పెట్టుబడి కింద రూ.వెయ్యి కోట్లను, ప్రణాళికేతర ఖర్చులకు మరో వెయ్యి కోట్లు కేటాయించింది.
- వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలనుకుంటున్న వాటిలో మణుగూరులో 1080 మెగావాట్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏడో దశలో 800 మెగావాట్లు, నల్గొండ జిల్లాలోని దామరచెర్ల వద్ద ఆరువేల మెగావాట్ల ప్రాజెక్టులు ఉన్నాయి.
- తెలంగాణలో సౌర విద్యుత్ ప్రస్తుత స్థాపక సామర్థ్యం 79 మెగావాట్లు. లక్ష్యం వచ్చే అయిదేళ్లలో 5,000 మెగావాట్ల ఉత్పత్తి, తెలంగాణలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపింది.
క్రీడా రంగం
- ఈ బడ్జెట్లో క్రీడలకు రూ.50 కోట్లు కేటాయించారు. అందులో స్టేడియంల నిర్మాణం, మౌలిక వసతుల ఆధునికీకరణకు రూ.20 కోట్లు ఇచ్చారు. క్రీడారంగం నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్)కు రూ.30 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించారు.
పట్టణాభివృద్ధి శాఖ
- ఈ బడ్జెట్‌లో పురపాలకశాఖకు రూ.4,024 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రణాళికేతర వ్యయం కింద రూ.848 కోట్లు, ప్రణాళిక పద్దులో రూ.3,176 కోట్లు ఇచ్చారు. ఈసారి బడ్జెట్‌లో పురపాలకశాఖతో పాటు జీహెచ్ఎంసీకి నిధులు కేటాయించారు. మిగిలిన 67 పురపాలక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా చేసిన కేటాయింపులు రూ.వెయ్యి పది కోట్ల లోపే ఉండగా ఒక్క జీహెచ్ఎంసీకి చేసిన కేటాయింపులు రూ.628 కోట్లుగా ఉండటం గమనార్హం.
- ఈసారి బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం 'స్మార్ట్ సిటీ'ల పేరుతో రూ.182.46 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక కమిషన్ కింద రూ.300 కోట్లు కేటాయించారు. తెలంగాణ పట్టణ సంస్కరణలు, మున్సిపల్ సేవల కింద రూ.125 కోట్లు ఇచ్చారు.
జలమండలి
- హైదరాబాద్ నగరవాసుల దాహార్తిని తీర్చే జలమండలికి ఈ బడ్జెట్‌లో రూ.984.31 కోట్లు మాత్రమే కేటాయించారు. కృష్ణా మూడో దశ ప్రధాన పైప్‌లైన్ నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు రూ.700 కోట్లు, గోదావరి మొదటి దశ పనులను పూర్తి చేసేందుకు రూ.370 కోట్లు కేటాయించారు. నగరంలో మంచినీటి సరఫరాను మెరుగుపరచడానికి రూ.215 కోట్లు, మురికివాడల్లో నీటి సరఫరా మెరుగునకు రూ.31.67 కోట్లు కేటాయించారు.
ఆరోగ్య రంగం
- 2015 - 16 సంవత్సరానికి వైద్య ఆరోగ్యశాఖకు రూ.4931.55 కోట్లు కేటాయించారు. గతేడాది మొత్తం కేటాయింపుల్లో 4.04 శాతం నిధులు ఆరోగ్య రంగానికి కేటాయించగా, ఈసారి 4.26 శాతానికి పెంచారు. ప్రణాళికేతర వ్యయం కింద రూ.2472.54 కోట్లు, ప్రణాళిక నిధుల కింద రూ.2459.01 కోట్లను కేటాయించారు.
- బోధనాసుపత్రులు, వైద్య కళాశాలలకు కలిపి మొత్తం రూ.789.95 కోట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి, వివిధ కార్యక్రమాల అమలు కోసం రూ.120.20 కోట్లు, 24 గంటల ప్రాథమిక కేంద్రాల అభివృద్ధికి కేవలం రూ.10 కోట్లు, పీహెచ్‌సీలను అభివృద్ధిపరచడానికి రూ.6 కోట్లు, జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులను అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లు, 104, 108 సేవలకు మరిన్ని కొత్త వాహనాల కొనుగోలుకు రూ.60 కోట్లు కేటాయించారు. నిమ్స్‌కు రూ.135.97 కోట్లు, ఆరోగ్యశ్రీ ట్రస్టుకు రూ.323.75 కోట్లు కేటాయించారు.
- రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి 988/ 1000 గా ఉంది. ఇది నిజామాబాద్‌లో అత్యధికంగా (1040/ 1000), హైదరాబాద్‌లో అత్యల్పంగా (954/ 1000)ఉంది. రాష్ట్రంలో ఆరేళ్లలోపు బాలికా బాలల నిష్పత్తి 933/ 1000గా ఉంది.
హోం శాఖ
- తెలంగాణ ప్రభుత్వం హోంశాఖకు భారీగా నిధులిచ్చింది. ఈ బడ్జెట్‌లో మొత్తం రూ.4,312.72 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రణాళిక వ్యయం రూ.352.58 కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం రూ.3960.14 కోట్లు.
- పోలీస్‌స్టేషన్లలో రిసెప్షన్ గదుల నిర్మాణానికి రూ.26 కోట్లు, హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆధునికీకరణ పనుల కోసం రూ.150 కోట్లు కేటాయించారు.
రహదారులు
- రాష్ట్రంలోని రహదారులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. 2015 - 16 ఆర్థిక సంవత్సరంలో రహదారులకు రూ.6,070 కోట్లు కేటాయించింది. ఇందులో రహదారులు, భవనాల శాఖ రోడ్లకు రూ.5,019 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖలోని గ్రామీణ రోడ్లకు రూ.1051 కోట్లు కేటాయించింది.
- రాష్ట్రంలో 14,740 కి.మీ. రహదారుల అభివృద్ధి, విస్తరణకు అంచనా వేసిన రూ.10 వేల కోట్లతో తాజా కేటాయింపులు 60 శాతానికి పైగా ఉన్నాయి. దాదాపు 64,044 కి.మీ.లుగా ఉన్న పంచాయతీరాజ్ రోడ్లకు నామమాత్రంగా రూ.1,051 కోట్లే కేటాయించారు.
- తెలంగాణలో జాతీయ రహదారి పొడవు 2592 కి.మీ. ఉంది. జాతీయ రహదారుల సగటు ప్రతి రాష్ట్రంలో ప్రతి 100 కి.మీ.కు 2.82 కి.మీ. ఉండాలి. కాగా తెలంగాణలో ఉన్నది 2.5 కి.మీ. ఇదే ఆంధ్రప్రదేశ్‌లో 2.73 కి.మీగా ఉంది. తెలంగాణలో 21,629 కి.మీ. మేర రోడ్డు సౌకర్యం లేని గ్రామాలున్నాయి.
పారిశ్రామిక రంగం
- కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా బడ్జెట్‌లో రూ.973.74 కోట్ల నిధులను కేటాయించింది. ఇందులో రాయితీలకు పెద్దపీట వేసింది. చేనేత, జౌళి శాఖకు అదనంగా రూ.197.23 కోట్ల నిధులను ఇచ్చింది. దాదాపు 2.60 లక్షల ఎకరాల భూములను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)కి అప్పగించిన ప్రభుత్వం వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఏటా రూ.100 కోట్ల సాయం చేస్తామని ప్రకటించింది.
- తెలంగాణలోని భారీ పరిశ్రమలు 536. వాటిలో పెట్టుబడులు రూ.22,379 కోట్లు. భారీ పరిశ్రమల ద్వారా ఉపాధి పొందేవారు 98,003 మంది. తెలంగాణలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 36,993. వీటిలో పెట్టుబడులు రూ.20,561 కోట్లు. వీటి ద్వారా ఉపాధి పొందేవారు 5,20,996 మంది.
- కొత్త పారిశ్రామిక విధానం ప్రకారం అనుమతుల మంజూరుకు స్పష్టమైన గడువు విధించారు. ఇది మెగా పరిశ్రమలకు 15 రోజులకు, ఇతర పరిశ్రమలకు 30 రోజులుగా ఉంది. అనుమతులు పొందడాన్ని హక్కుగా గుర్తించి, విధానాలన్నింటినీ సులభతరం చేశారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు అనుమతి, స్వీయ ధ్రువీకరణ విధానం (టీఎస్ఐపాస్) రూపొందించారు. గతంలో కనీసం రూ.250 కోట్ల పెట్టుబడి ఉంటే మెగా పరిశ్రమగా గుర్తించేవారు. ఇప్పుడు దాన్ని రూ.200 కోట్లకు తగ్గించారు. ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత పన్నుల్లో (వ్యాట్) రాయితీలు భారీ పరిశ్రమలకు 50%, మధ్యతరహా పరిశ్రమలకు 75%, చిన్నతరహా పరిశ్రమలకు 100% గా ప్రభుత్వం నిర్ణయించింది.
సాగునీటి రంగం
- బడ్జెట్‌లో సాగునీటి రంగానికి గతేడాది కంటే రూ.రెండు వేల కోట్ల మేర అదనంగా కేటాయించారు. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాన్ని కలుపుకొని మొత్తంగా సాగునీటి రంగానికి ఈ బడ్జెట్‌లో రూ.11,733.93 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు. ఇందులో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.9,052 కోట్లు, చిన్న నీటిపారుదలకు రూ.2,232 కోట్లు ప్రతిపాదించారు. దీని కింద గతేడాది మాదిరే మిషన్ కాకతీయకు రూ.2,100 కోట్లను కేటాయించారు. క్యాడ్, వరద కాల్వల నిర్వహణకు రూ.398.98 కోట్లు కేటాయించారు.
ప్రాజెక్టుల వారీగా నిధుల కేటాయింపు (రూ. కోట్లలో) |
ప్రాజెక్టు |
కేటాయింపులు |
ప్రాణహిత |
1515 |
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల |
100 |
జూరాల - పాకాల |
3.63 |
దేవాదుల |
498 |
ఎస్సారెస్సీ-1 |
30 |
ఎస్సారెస్సీ నిర్వహణ |
80 |
కల్వకుర్తి |
225 |
నెట్టెంపాడు |
249 |
భీమా |
160 |
కోయిల్‌సాగర్ |
24 |
ఆర్డీఎస్ |
2.50 |
లెండి |
5 |
నిజాంసాగర్ |
89.50 |
సింగూరు |
17 |
అలీసాగర్ |
2 |
గుత్ప |
1 |
రాజీవ్ దుమ్ముగూడెం |
25 |
ఇందిరాసాగర్ |
10 |
దుమ్ముగూడెం - సాగర్ టేల్‌పాండ్ |
1 |
ఎల్లంపల్లి |
558 |
శ్రీరాంసాగర్ వరద కాల్వ |
747 |
కంతన పల్లి |
125 |
నాగార్జునసాగర్ ఆధునికీకరణ |
196.47 |
ఎస్ఎల్‌బీసీ |
600 |
చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల |
2 |
కడెం |
3 |
నీల్వాయి |
15 |
పెద్ద వాగు |
50 |
పాలెం వాగు |
5 |
సుద్ద వాగు |
40 |
కొమరం భీమ్ ప్రాజెక్టు |
37.50 |
ఘన్‌పూర్ ఆనకట్ట |
34 |
జూరాల |
122 |
సంగం బండ |
3.57 |
జగన్నాథ్‌పూర్ |
23 |
- తెలంగాణలో సాగునీటిపై ఆధారపడ్డ భూములు 70% గా ఉన్నాయి. కాలువలు లేని మండలాలు 295 ఉన్నాయి.
ఆహార భద్రత
- ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్న ఆహార భద్రతా పథకానికి ప్రభుత్వం బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. అర్హత పొందిన బీపీఎల్ కుటుంబాల్లో ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున అందిస్తున్న బియ్యం, సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి అందజేస్తున్న సన్న బియ్యానికీ కలిపి గతంలో ఎన్నడూలేని విధంగా రూ.2,200 కోట్లు కేటాయించింది. దీని ద్వారా సుమారు 2.80 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు, 30 లక్షల మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఇక తెలంగాణ చిహ్నంతో కొత్తగా అందజేసే ఆహార భద్రతా కార్డుల ముద్రణకు సైతం ప్రభుత్వం రూ.10 కోట్లను కేటాయించింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం 2015 - 16 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.2,677.72 కోట్లు కేటాయించింది. బీసీ సంక్షేమ శాఖకు రూ.1367 కోట్లు, ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖకు రూ.646.52 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.425 కోట్లు, ఎస్టీ సంక్షేమ శాఖకు రూ.239.20 కోట్లు కేటాయించారు.
- రాష్ట్రంలో గతేడాది 61,78,495 మంది విద్యార్థులు బడుల్లో చేరగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 60,76,741కు పరిమితమైంది. డ్రాపౌట్స్ బాలికల్లో (36.41%) కంటే బాలురలోనే (38.85%) ఎక్కువగా ఉంది.
ఐటీ శాఖ
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖకు ఈ బడ్జెట్లో కేవలం 134 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రణాళిక వ్యయం రూ.132 కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం రూ.2 కోట్లుగా చూపారు.
యూనివర్సిటీలు
- ఈ బడ్జెట్‌లో యూనివర్సిటీలకు రూ.416.15 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ రూ.291.76 కోట్లతో పోల్చితే ఇది రూ.124.39 కోట్లు అదనం. ఉస్మానియా వర్సిటీకి రూ.238.19 కోట్లు, కాకతీయ వర్సిటీకి రూ.19.15 కోట్లు, శాతవాహన వర్సిటీకి రూ.13.43 కోట్లు కేటాయించారు. ఇక పదో షెడ్యూల్‌లో ఉన్న తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, చిత్తూరులోని ద్రవిడ వర్సిటీ, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలకు రాష్ట్ర వాటా కింద నిధులు కేటాయించారు.
సాంకేతిక విద్య
- ఈ బడ్జెట్‌లో సాంకేతిక విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రణాళికేతర వ్యయం కింద రూ.253.80 కోట్లు, ప్రణాళిక వ్యయం కింద రూ. 255.41 కోట్లు కేటాయించారు.
కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ
- ఈ శాఖకు ప్రభుత్వం 2015 - 16 బడ్జెట్‌లో రూ.450.56 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రణాళికా వ్యయం రూ.70.01 కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం రూ.380.55 కోట్లు. గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి రూ.113.65 కోట్లు అదనంగా దక్కాయి.
గోదావరి పుష్కరాలు
- త్వరలో జరగనున్న గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది జులై 14 నుంచి పన్నెండు రోజులపాటు పుష్కరాలు జరగనున్నాయి.
నేర బాధితుల పథకం
- నేరాల వల్ల నష్టపోయిన బాధితులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు పరిహారం అందించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక పథకానికి బడ్జెట్‌లో రూ.5 కోట్లు కేటాయించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు కేటాయించిన నిధుల్లో ఈ విషయాన్ని పేర్కొంది. హైకోర్టుకు రూ.46.05 కోట్లు, కోర్టు భవనాల నిర్మాణాలకు రూ.27.30 కోట్లు ఇచ్చారు. కేంద్ర సాయంతో అమలు చేసే పథకం కింద కోర్టుల్లో మౌలిక వసతుల కల్పన గ్రామ న్యాయాలయాల నిమిత్తం రూ.18.75 కోట్లు ఇచ్చారు.
ఇతర ముఖ్యాంశాలు
- బడ్జెట్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. కార్యకర్తల నెలసరి వేతనాన్ని రూ.4,200 నుంచి రూ.7 వేలకు, సహాయకుల వేతనాన్ని రూ.2450 నుంచి రూ.4,500కు పెంచారు.
- 'బీడీ కార్మికుల జీవనభృతి' పథకానికి బడ్జెట్‌లో రూ.188 కోట్లను ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఎంపిక చేసిన 1.80 లక్షల మంది మహిళలకు ఈ పథకం కింద మార్చి మొదటి తేదీ నుంచి భృతి పంపిణీ మొదలయింది. దీనికి అవసరమైన నిధులను తాజాగా కేటాయించారు.
- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి ఏర్పాటు చేసిన సంస్థకు 2015 - 16 ఆర్థిక సంవత్సరానికి రూ.50.38 కోట్లు కేటాయించారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం కింద శాసనసభ్యులకిచ్చే నిధుల కేటాయింపుల్లో భాగంగా బడ్జెట్‌లో రూ.240 కోట్లను కేటాయించగా, శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో భవనాలు నిర్మించుకోవడం కోసం రూ.50 కోట్లు కేటాయించారు.
- రంగారెడ్డి - మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులోని ముచ్చర్ల గ్రామం వద్ద 11 వేల ఎకరాల్లో ఔషధనగరి (ఫార్మా సిటీ) ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించారు. వరంగల్ - హైదరాబాద్ పారిశ్రామిక నడవా (కారిడార్), వరంగల్‌లో వస్త్రోత్పత్తి పరిశ్రమ, పలు పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మెదక్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలికి రూ.5 కోట్లను కేటాయించారు.
- మద్యపానం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రచారం చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.4.40 కోట్లు కేటాయించింది.
- అబ్కారీ శాఖకు ప్రణాళికేతర వ్యయం కింద రూ.256.54 కోట్లు, ప్రణాళిక వ్యయం కింద రూ.3.47 కోట్లు కేటాయించారు.
- 2015 - 16లో ఉద్యోగుల జీతభత్యాలకు రూ.22 వేల కోట్లు, పింఛన్లకు రూ.8,235 కోట్లు కేటాయించారు.
- 2015 - 16లో తెలంగాణకు ప్రపంచ బ్యాంకు, జపాన్ బ్యాంకు వంటి విదేశీ సంస్థల నుంచి రూ. 1,032 కోట్ల మేర రుణాలు అందుతాయని సర్కారు అంచనా వేసింది.
- తెలంగాణ సర్కారు తన తొలి వార్షిక బడ్జెట్‌లో రూ.531 కోట్ల మేర రెవెన్యూ మిగులును అంచనా వేసింది. మిగులు ఉన్నందున ఆ మొత్తాన్ని పెట్టుబడి వ్యయం వైపునకు మళ్లించుకోవడానికి ఆస్కారం లభిస్తుంది. 14వ ఆర్థికసంఘం అంచనాల ప్రకారమైతే ఇలాంటి రెవెన్యూ మిగులు ఇక ఏటా పెరుగుతూ 2019 - 20 నాటికి ఏకంగా రూ.8 వేల కోట్లను దాటిపోనుంది. రెవెన్యూ రాబడులకు, రెవెన్యూ వ్యయానికి మధ్య ఉన్న అంతరమే రెవెన్యూ లోటు లేదా రెవెన్యూ మిగులు. తెలంగాణ కొత్త బడ్జెట్‌లో రెవెన్యూ రాబడులు రూ.94,131 కోట్లు ఉండగా, ఖర్చు మాత్రం రూ.93,600 కోట్ల మేర ఉండటంతో రూ.531 కోట్ల మిగులు ఉంది. 14వ ఆర్థిక సంఘం తెలంగాణ మిగులును రూ.818 కోట్లుగా అంచనా వేసింది.
- కొత్త బస్సులు కొనేందుకు ఆర్టీసీకి కేవలం రూ.150 కోట్లు కేటాయించారు. అయితే ఈ మొత్తం కూడా రుణంగా ఇవ్వడం విశేషం.
- ఎర్రగడ్డలో నిర్మించ తలపెట్టిన కొత్త సచివాలయానికి ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది.
- అర్హులైన పేదింటి మహిళలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్ ఇచ్చేందుకు ఉద్దేశించిన 'దీపం' పథకానికి రూ.50 కోట్లను కేటాయించారు.
- పర్యాటకరంగానికి కేవలం రూ.20 కోట్లు కేటాయించారు. తెలంగాణ సాంస్కృతిక కేంద్రానికి మాత్రం రూ.100 కోట్లు ఇచ్చింది.
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారు.
- న్యాయశాఖకు రూ.816 కోట్లను కేటాయించారు. ప్రణాళికేతర వ్యయం కింద రూ.766 కోట్ల 57 లక్షలు, ప్రణాళిక వ్యయం కింద రూ.49 కోట్ల 63 లక్షలను కేటాయించారు.
బడ్జెట్ సమగ్ర స్వరూపం |
బడ్జెట్ మొత్తం
రూ.1,15,689.19 కోట్లు
|
ప్రణాళికేతర వ్యయం |
63,306.00 |
ప్రణాళిక వ్యయం |
52,383.19 |
రెవెన్యూ వసూళ్లు - 94,131.51 |
ఇందులో... |
కేంద్ర పన్నుల వాటా |
12,823.25 |
కేంద్ర పథకాలు, గ్రాంట్లు |
12,400.4 |
రాష్ట్ర పన్ను రాబడి - 46,494.75 |
ఈ పన్నుల్లో... |
అమ్మకపు పన్ను |
35,463.39 |
ఎక్సైజ్ |
3,916.43 |
మోటార్ వాహనాల పన్ను |
2,500.00 |
స్టాంపులు, రిజిస్ట్రేషన్లు |
3,700.00 |
రాష్ట్ర పన్నేతర రాబడి - 22,413.27 |
ఇందులో... |
గనులు, ఖనిజాల ద్వారా |
3,300.00 |
అడవులు |
125.00 |
కాంట్రా వడ్డీలు |
2,696.38 |
భూముల క్రమబద్ధీకరణ, ఇతర వనరుల సమీకరణ |
13,500.00 |
రెవెన్యూ వ్యయం |
93,600.21 |
రెవెన్యూ మిగులు |
531.30 |
మూలధన పెట్టుబడి, రుణాల చెల్లింపులపై మొత్తం వ్యయం |
22,088.98 |
ద్రవ్య లోటు |
16,968.75 |
రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) |
4,86,577.00 |
రూపాయి రాక రూపాయి పోక |
ఆదాయం ఇలా వస్తుంది........ |
రాష్ట్ర పన్నులు, సుంకాలు |
49% (46,494.75) |
కేంద్ర పన్నుల్లో వాటా |
14% (12,823.25) |
ఇతర పన్నేతర ఆదాయం |
34% (32,019.56) |
వడ్డీ వసూళ్లు |
3% (2,793.15) |
ఖర్చు ఇలా జరుగుతుంది......... |
అభివృద్ధి వ్యయం |
74% (69,434.07) |
రుణ సర్వీసులు |
8% (7,958.24) |
పరిపాలనా సర్వీసులు |
6% (5,769.20) |
పన్ను వసూలు చార్జీలు |
1% (863.11) |
ఇతర వ్యయాలు |
10% (9,575.59) |
మిగులు |
1% (531.30) |
ఆధారము: ఈనాడు ప్రతిభ
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/21/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.