పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

నదుల అనుసంధాన పథకం

దేశంలోని 37 నదులను 30 చోట్ల అనుసంధానించడానికి దీన్ని ఉద్దేశించారు.

భారతదేశంలోని గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో వచ్చే పదేళ్లలో నీటియుద్ధాలు చోటుచేసుకోవచ్చునని అమెరికా గూఢచార నివేదిక ఇటీవల ప్రమాద ఘంటికలు మోగించింది. దేశంలో జల సమతుల్యత లోపించిందని, 2050నాటికి అది వివిధ ప్రాంతాల్లో సంక్షోభానికి దారితీయవచ్చునని జాతీయ జలసంఘం 1999లోనే హెచ్చరించింది. ఇలాంటి గడ్డు పరిస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి గట్టి చర్యలు చేపట్టాల్సింది పోయి, గుర్రుకొట్టి నిద్రపోతున్న నేతాగణాన్ని మేల్కొలిపేదెలాగన్నది చిక్కుప్రశ్న. సుప్రీంకోర్టే దానికి సరైన సమాధానం చెప్పింది. వారి కళ్లు తెరిపించే ప్రయత్నం చేసింది. నదుల అనుసంధానానికి సత్వరం పూనుకోవాల్సిందిగా పిలుపిచ్చింది. సంబంధిత దస్త్రాలను కట్టకట్టి బీరువాల్లో కుక్కిన నాయకులు, ఇప్పటికైనా వాటిని కిందికి దించి ఈ కలల పథకాన్ని సాకారం చేసేందుకు నడుం కడతారా?

నిర్దిష్ట నిర్దేశం

భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం ప్రతీక. ఏకత్వంలో భిన్నత్వానికి ఇక్కడి వాతావరణం సూచిక. ఉత్తరాదిలో వరదలు వెల్లువెత్తి వూళ్లకు వూళ్లను ముంచెత్తుతున్న సమయంలోనే దక్షిణ భారతంలో తీవ్ర కరవు కాటకాలు తాండవిస్తుంటాయి. దేశంలోకెల్లా అత్యధిక వర్షపాతం నమోదయ్యే చిరపుంజిలోనే తాగునీటికి కటకట ఏర్పడితే, మరోవైపు రాజస్థాన్‌లోని థార్ ఎడారి అనుకోని వర్షాలతో తడిసి ముద్దవుతుంది. అటు వానల దరువు, ఇటు చినుకే కరవు. రెక్కలు తెగిన బడుగు రైతుకు, డొక్కలు ఎండిన సగటు జీవికి... బతుకే బరువు! ఉత్తరాది నదుల్లో పుష్కలంగా ప్రవహిస్తున్న నీరు పూర్తిగా ఉపయోగపడక వృథాగా సముద్రం పాలవుతుంటే, దక్షిణాదిలో జలవనరులు పలుచోట్ల ఎండిపోతున్న దుస్థితి గుండెలు మెలిపెట్టేదే. మంచి వర్షాలు కురిసినా- సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఈ దురవస్థ ఎల్లకాలం కొనసాగాల్సిందేనా? నీటిజాడ లేక తడారి, ఎడారైపోతున్న ప్రాంతాలకు మిగులు జలాల్ని తరలించి- పత్రహరితమే చిరునామా అని ప్రకటించుకొనే అవకాశమే లేదా? లేకేం, భేషుగ్గా ఉంది. అదే, నదుల అనుసంధానం.

భారతదేశ జనాభా 120 కోట్లు దాటింది. అది 2050 నాటికి 150 నుంచి 180 కోట్లకు చేరగలదని అంచనా. దాంతో, చైనాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశంగా ఇండియా ఆవిర్భవిస్తుంది. అంత భారీ జనసంఖ్యకు తిండిపెట్టడం ఎలాగన్నది అతిపెద్ద సవాలు. ప్రస్తుతం సంప్రదాయ వనరుల ద్వారా గరిష్ఠంగా దాదాపు 14 కోట్ల హెక్టార్లకు సాగునీటి సదుపాయం కల్పిస్తున్నారు. ఈ సామర్థ్యాన్ని కనీసం 16 కోట్ల హెక్టార్లకు పెంచాల్సి ఉంటుంది. ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నప్పటికీ, రైతులు నిరుడు రికార్డు స్థాయిలో 25 కోట్ల టన్నుల మేరకు ఆహార ధాన్యాలు పండించారు. 2050 నాటికి దాన్ని అధమపక్షం 45కోట్ల టన్నులకు పెంచాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రతికూల విధానాలకు తోడు విపరీత వాతావరణ పరిస్థితుల కారణంగా పెద్ద సంఖ్యలో రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారు. ఈ పరిణామం 2050 నాటికి ఎలాంటి దుర్భర దురవస్థకు దారితీస్తుందో అనూహ్యమేమీ కాదు. దాని నివారణకు మనముందు కనబడుతున్న మార్గమే నదుల అనుసంధానం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పు ఎంతో ప్రాధాన్యం సంతరించుకొంది.

నదుల అనుసంధానం విషయంలో సుప్రీంకోర్టు ఈసారి ముక్కుసూటిగా వ్యవహరించింది. తన తీర్పులో ప్రభుత్వానికి నిర్దిష్ట మార్గదర్శకాలు జారీచేసింది. దాని ప్రకారం- నదుల అనుసంధానంపై మంత్రులు, ఇతర ప్రతినిధుల ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ రెండు నెలలకు ఒకసారైనా సమావేశం కావాలి. ఎవరైనా సభ్యులు హాజరు కాకపోయినా సమావేశాన్ని వాయిదా వేయకూడదు. కమిటీ ఏడాదికి రెండుసార్లు తన చర్యల నివేదికను కేంద్ర మంత్రిమండలికి సమర్పించాలి. మంత్రివర్గం తన పరిశీలనకు వచ్చిన అంశంపై సత్వరం, అంటే 30 రోజుల్లోపున దేశానికి హితకరమైన రీతిలో తుది నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్దేశం- ప్రభుత్వం సహా సంబంధిత వర్గాలన్నింటిలో పెద్ద కదలిక తీసుకువచ్చింది.

నదుల అనుసంధానమన్నది ఈనాటి ప్రతిపాదన కాదు. దాదాపు 150 ఏళ్లుగా నలుగుతున్నదే. అంతర్దేశీయ జలరవాణాను పెంపొందించడానికి దక్షిణ భారతదేశంలోని నదులన్నింటినీ అనుసంధానిస్తే బావుంటుందన్నది, మొట్టమొదట పందొమ్మిదో శతాబ్దం చివర్లో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ ఇంజినీర్ సర్ ఆర్థర్ కాటన్‌కు తట్టిన ఆలోచన. రైల్వే వ్యవస్థ సామర్థ్యం బాగా పెంపొందడంతో నాడు జలరవాణాపై అంతగా దృష్టి సారించే అవసరం లేకపోయింది. జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన కెఎల్‌రావు, గంగా-కావేరీ అనుసంధాన ప్రతిపాదనను 1972లో ముందుకు తెచ్చారు. తరవాత, 1977లో కెప్టెన్ దిన్‌షా దస్తూర్ మరో ఆసక్తికర ప్రతిపాదన చేశారు. కాల్వలు తవ్వి, పూలహారం తరహాలో నదులను కలపాలన్నారు. బేసిన్ల మధ్య నదీజలాల బదిలీపై జలవనరుల మంత్రిత్వశాఖ 1980లో జాతీయ దార్శనిక ప్రణాళిక (ఎన్‌పీపీ) రూపొందించింది. దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనాలు జరపడానికి 1982లో జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యుడీఏ) ఏర్పాటు చేశారు. ఆ అధ్యయన నివేదికల సమీక్షకు 1999లో జాతీయ కమిషన్‌ను తెరమీదకు తెచ్చారు. ద్వీపకల్పంలో భారీయెత్తున నదీజలాల బదిలీ చేపట్టాల్సిన అవసరం లేదని, హిమాలయ ప్రాంతంలో నదుల అనుసంధానానికి సంబంధించి మరింత లోతుగా అధ్యయనం జరపాల్సి ఉంటుందని జాతీయ కమిషన్ అభిప్రాయపడింది. దాంతో నదుల అనుసంధాన ప్రతిపాదన తాత్కాలికంగా వెనక్కి వెళ్లిపోయింది.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 2002 ఆగస్టు 14న జాతినుద్దేశించి రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం చేసిన ప్రసంగంతో నదుల అనుసంధానంపై మళ్లీ చలనం మొదలైంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఎప్పుడూ దుర్భర దుర్భిక్షంతో అల్లాడుతుంటే, మరికొన్ని భయంకర వరదలతో భీతిల్లుతున్నాయని, ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రంజీత్‌కుమార్ అనే న్యాయవాది అదే నెలలో ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నదుల అనుసంధానంవల్ల అంతర్రాష్ట్ర నదీజలాల సమస్య పరిష్కారం కావడమే కాకుండా- చవగ్గా, సురక్షితంగా సరకు రవాణాకు అవకాశం ఏర్పడుతుందని, నేలకోత నివారణ, భూగర్భ జలాల పునఃపూరణ, జల, పర్యావరణ వ్యవస్థల మెరుగుదల, పర్యాటక అభివృద్ధి- తద్వారా విదేశ మారకద్రవ్య ఆర్జన, ఉపాధి అవకాశాల పెంపుదల వంటి ప్రయోజనాలు చేకూరతాయని ఆయన కోర్టుకు తెలిపారు. ఆయన వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం, నదుల అనుసంధానం చేపట్టాలని ఉత్తర్వునిచ్చింది. పదేళ్లలో అంటే 2012 నాటికి ఈ పథకాన్ని అమలు చేయాలనీ న్యాయస్థానం ఆనాడు ప్రభుత్వాన్ని కోరింది. (ఇప్పుడు ఈ గడువును 2016 దాకా పెంచారు) హైవేల పథకం ద్వారా అప్పటికే సంచలనం సృష్టించిన నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి, నదుల అనుసంధానంపట్ల విశేష ఆసక్తి కనబరచారు. ఈ పథకం పర్యవేక్షణకు ఆనాటి కేంద్ర విద్యుత్ మంత్రి సురేశ్ ప్రభు సారథ్యంలో ఉన్నతాధికార టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. 2004లో ఎన్‌డీఏ గద్దె దిగి యూపీఏ అధికారంలోకి రావడంతో నదుల అనుసంధానం అటకెక్కింది. ఈ పథకం అమలు సాధ్యం కాదని; పైగా దేశ ప్రజానీకాన్ని, పర్యావరణ, ఆర్థిక వ్యవస్థల్ని ఇది పెను ప్రమాదంలో పడేస్తుందని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ సహాయ మంత్రిగా జైరాంరమేశ్ వాదించారు. ఆ దెబ్బతో, ప్రతిపాదన మూలన పడింది. సుప్రీంకోర్టు తాజా నిర్దేశాలతో, అనుసంధానంపై ఆశలు మరోసారి మొగ్గతొడిగాయి. అవి ఎంతవరకు ఫలిస్తాయన్నదే ఇప్పుడు కీలకం!

నదుల అనుసంధానం నిజంగా బృహత్పథకమే. దేశంలోని 37 నదులను 30 చోట్ల అనుసంధానించడానికి దీన్ని ఉద్దేశించారు. హిమాలయ ప్రాంతంలో 14, ద్వీపకల్ప ప్రాంతంలో 16 అనుసంధానాలుంటాయి. 2002 లెక్కల ప్రకారం రూ.5.6 లక్షల కోట్లు వ్యయమయ్యే ఈ పథకంలో భాగంగా పెద్ద సంఖ్యలో డ్యాములు, వేల కిలోమీటర్ల మేరకు కాల్వలు నిర్మించవలసి ఉంటుంది. ఈ సందర్భంగా భారీగా అటవీ సంపద ధ్వంసమవుతుందంటున్నారు. పెద్దయెత్తున ప్రజానీకాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాసం కల్పించవలసి ఉంటుంది. నదీజలాల పంపిణీపై వివిధ రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఎడతెగని వివాదాలు కొనసాగుతున్నాయి. పొరుగు దేశాల అభ్యంతరాలు విస్మరించలేని పార్శ్వం. పర్యావరణ శాస్త్రజ్ఞుల విమర్శలూ పోటెత్తుతున్నాయి. ఒక గొప్ప లక్ష్యాన్ని చేరుకోదలచినప్పుడు ఇలాంటి అవరోధాలు సహజమే. సామరస్య ధోరణితో ముందుకు సాగితే- వాటిని అధిగమించడం సునాయాసమే. పెరియార్ ప్రాజెక్టు, కర్నూలు-కడప కాలువ, తెలుగుగంగ పథకం, రావి-బియాస్-సట్లెజ్ ఇందిరాగాంధీ కాలువ వంటివి ఈ దిశలో మార్గదర్శకాలు. కెనడా, అమెరికా, మెక్సికో, చైనాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న నదీజల బదిలీ పథకాలూ స్ఫూర్తినిచ్చేవే.

సుజలాం- సుఫలాం

జల సంక్షోభం దేశం నెత్తిమీద కత్తిలా వేలాడుతున్న సమయమిది. ఏటా దాదాపు 68,969 శతకోటి ఘనపుటడుగుల (టీఎంసీ) మేరకు భూ ఉపరితల జలాలు అందుబాటులో ఉంటున్నాయి. అందులో 13 శాతం (8,814 టీఎంసీలు) మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్నాం. మిగతా 87శాతం (సుమారు 60,115 టీఎంసీలు) వృథా అవుతోంది. ఒక్క టీఎంసీ నీటిని సద్వినియోగం చేసుకోగలిగితే, రూ.32.5కోట్ల విలువైన వరి, పప్పుధాన్యాలు పండించవచ్చునని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అంటే, ఏటా దాదాపు రూ.20 లక్షల కోట్ల విలువైన జలాల్ని సముద్రం పాలు చేసుకొంటున్నామన్నమాట. నదుల అనుసంధానం ద్వారా ఈ వృథాకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. 3.4కోట్ల హెక్టార్లను సాగులోకి తేవడమే కాకుండా తాగునీటి సమస్య పరిష్కారానికి, పారిశ్రామిక అవసరాలు తీర్చడానికి, జల విద్యుత్ ఉత్పాదనకూ ఇతోధికంగా దోహదపడే పథకమిది. దీని అమలు సందర్భంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా కాచుకోవాలి. గంగ, బ్రహ్మపుత్ర వంటి నదులు దీర్ఘకాలంలో తమ గమనదిశను మార్చుకొంటున్న విషయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. పకడ్బందీ ప్రణాళికతో ముందడుగు వేసిననాడు ఈ సుజల పథకంతో సుఫలాలు పొందగలమనేది నిస్సందేహం!.

ఆధారము: ఈనాడు

3.08139534884
Sathvika Sep 21, 2019 06:26 PM

Super

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు