অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

అందరికీ ఆర్థిక అక్షరజ్ఞానం

అందరికీ ఆర్థిక అక్షరజ్ఞానం

న్యూయార్క్ టైమ్స్ పత్రికలో సుమారుగా రెండేళ్లపాటు ప్రతివారం బెస్ట్ సెల్లర్స్ లిస్ట్ లో నిల్చున్న అరుదైన పుస్తకం రాబర్ట్ కియోసాకి రాసిన “రిచ్ డాడ్ పూర్ డాడ్”. అమెరికాలో తల్లిదండ్రుల ఆలోచనలను తలకిందులు చేసిందా పుస్తకం. డబ్బు విలువ పిల్లలకు తెలియజెప్పాలని తల్లిదండ్రులందరికీ నిఖార్సయిన హెచ్చరికలు అందజేసిన ఆ విలువైన పుస్తకం ఈ వారం పరిచయం చేసుకందాం.

సాధారణంగా తల్లిదండ్రులందరూ తమ పిల్లలను బాగా చదువుకోమని చెప్తారు. మంచి మార్కులు తెచ్చుకోమంటారు. దానివల్లనే మంచి ఉద్యోగం వస్తుందంటారు. ఉద్యోగ జీవితంలో కష్టపడి పనిచేయడం ద్వారా పదోన్నతులు సంపాదించి సుఖంగా బతకొచ్చు అంటారు. కానీ, ఇలా కష్టపడి చదివి, ఉద్యోగం సంపాదించుకుని, పదోన్నతులు పొందిన వాళ్లంతా సుఖమనే భ్రమలో మాత్రమే వున్నారు. నిజానికి వీరెవరూ ఆరు నెలలు ద్యోగం లేకపోతే మనుగడ సాగించలేరు. డబ్బుకు కటకటలాడి ఆత్మహత్య చేసుకోవలసిందే. ఉద్యోగ జీవితంలో నానాగడ్డీ కరిచి అంటే అవినీతి మార్గాలద్వారా డబ్బులు సంపాదించి ఆస్తులు కూడబెదితే తప్ప, ప్రభుత్వం లేదా తమ యాజమాన్యం వేతనంగా ఇచ్చిన డబ్బులద్వారా లక్షాధికారులో, కోటీశ్వరులో అవడమంటే దుర్లభమని అందరికీ తెల్సిందే. ఈ “రిచ్ డాడ్ పూర్ డాడ్” పుస్తకంలో రాబర్ట్ కియోసాకి అందరు తల్లిదండ్రులు తమ పిల్లల చదువులమీద కంటే, వారిని ఆర్థిక అక్షరాస్యులను చేయడంపై దృష్టి సారించమని కోరుతాడు.

పేదవారు, మధ్యతరగతి తల్లిదండ్రులు తాము భోజనం చేస్తున్నపుడు, పిల్లలతో ఆడుకుంటున్నపుడు, ఇతరత్రా ఖాళీ సమయాల్లో డబ్బు గురించి నేర్పించనిది, ధనవంతులు అన్ని సమయ సందర్భాలలోనూ తమ పిల్లలకు నేర్పిస్తారనేది రచయిత అభిప్రాయం. అది నిజం కూడా.

నిజానికి మనలో చాలామంది డబ్బులు సంపాదిస్తున్న యువతరానికి కూడా ‘డబ్బు కదలిక లేదా ప్రవాహం’ గురించిన మర్మాలు చాలావరకు తెలియవంటే అబద్దం కాదు. మన జేబులోకి రూపాయి ఎలా చేరుతుందో, తిరిగి ఎలా పోతుందో తెలుసుకోవడమే ‘నగదు కదలిక సిద్ధాంతం’ (క్యాష్ ఫ్లో థియరీ). ఆదాయ వ్యయ జాబితాకు, ఆస్తుల అప్పుల పట్టీకి తేడా తెలియదు. మనకు కొన్ని అపప్రథలున్నాయి. ఆ అపోహలను తొలగించుకోవడానికైనా ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా అధ్యయనం చెయ్యాలి.

రాబర్ట్ కియోసాకీకి ఇద్దరు నాన్నలు. రెండో అధ్యాయం పూర్తయ్యేసరికి ఈ ఇద్దరి నాన్నల కథ మనకు తెలిసొస్తుంది. ఒక నాన్న పేద నాన్న. రెండోది డబ్బున్న నాన్న. బీదనాన్న యూనివర్శిటీ ప్రొఫెసరు. ధనిక నాన్న యూనివర్శిటీ మెట్లు కూడా ఎక్కలేదు. ఒకసారి ఏదో అవసరముండి డబ్బులడిగితే పేదనాన్న కసురుకుంటాడు. అవసరాలు ముందేచెప్తే తన ఖర్చులు ప్లాన్ చేసుకుని కొడుక్కి డబ్బివ్వగలనంటాడు. డబ్బున్న నాన్న అడిగిననెంటనే అడిగిందానికంటే ఎక్కువ ఇవ్వగలనంటాడు. అదీ తేడా. కాబట్టి తన జీవితంలో డబ్బున్న నాన్న చెప్పిన మాటల్నే పాఠాలుగా స్వీకరించి అమలుపరుస్తాడు. పాతికేళ్లు నిండేసరికి అమెరికాలోనే అతిపెద్ద పెట్టుబడిదారుగా మారుతాడు. ఎంత డబ్బంటే అంత సంపాదించగలుగుతాడు. జీవితంలో తనకు డబ్బున్న నాన్న నేర్పిన ఆరు పాఠాలను ప్రపంచంలోని యువతరానికంతా నేర్పాలనుకుని ఈ పుస్తకం రాశానంటాడు రచయిత.

పేదవారు డబ్బుకోసమే పనిచేస్తారు. కానీ ధనికులు తమకోసం డబ్బు పని చేసేట్టు చేయగలుగుతారు. వాళ్లు డబ్బుకోసం పనిచేయకుండా, నేర్చుకోవడం కోసం పనిచేస్తారు. డబ్బుచేత డబ్బును సృష్టించడమెలానో నేర్చుకుంటారు. ‘ధనవంతులు డబ్బు కోసం పనిచెయ్యరు’ అనే ఈ మొదటి పాఠంలో మరోసారి మన పాఠశాలల పట్ల మనకున్న సమస్త దురభిప్రాయాలను తొలగించడానికి రచయిత ప్రయత్నిస్తారు. ఇదే విషయానికి కొనసాగింపుగా రెండో పాఠం ‘ఆర్థిక అక్షరాస్యత ఎందుకు నేర్పాలి?’ అనే విషయాన్ని తన జీవితానుభవాన్ని పాఠకులకు వివరిస్తూ చెప్తారు. “ధనవంతులు ఆస్తులను కొంటారు. బీదవాళ్లు ఖర్చులు మాత్రం చేస్తారు. మధ్య తరగతి వర్గం అప్పులను కొంటూ, వాటిని ‘ఆస్తులని’ భ్రమిస్తారు” అనే విలువైన మాటలతో రెండోపాఠం ముగిస్తారు. ఈ మాటలు అర్థం కావాలంటే రాబర్ట్ కియోసాకి ఫైనాన్షియల్ ఫిలాసఫీ (ఆర్థిక తత్వం) తెలుసుకోవలసిందే.

వేతనంగా నెలనెలా సంపాదించేది మన ఆదాయం. ఒక మార్గంద్వారా ఆదయం మన జేబులోకి చేరుతుంది. ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, నీటి పన్ను, పాల బిల్లు, మెడికల్ ఖర్చులు, తిండికయ్యే ఖర్చు, బట్టలు ఇతరత్రా మొదలైనవన్నీ వ్యయం జాబితాలోకి వస్తాయి. అనేక మార్గాలద్వారా మన ఆదాయాన్ని ఖర్చు చేస్తున్నాం. నెల మొదటి రోజున వచ్చే ఆదాయాన్ని ముప్పై రోజులపాటు ఖర్చుపెట్టగా మిగిలిన సొమ్మును మన ఆస్తికింద పరిగణిస్తాం. ఇది మొదటి అపప్రథ. భరోసాలేని ఉద్యోగ జీవితాలు ఇప్పుడు మన దేశంలోనూ అనుభవానికొస్తున్నాయి. నెల ఖర్చులు పోను మన జేబులో మిగిలింది మనమింకా ఎన్ని రోజులు బతుకుతామో తెలియజేస్తుందని రచయిత భావం. వ్యయమయ్యే మార్గాలను నియంత్రించడం ద్వారా, అంటే పొదుపుగా జీవించడంద్వారా, మరికొంత డబ్బును మిగుల్చుకోగలుగుతాం. తద్వారా మనం బతకల్సిన రోజులను పొడిగించు కుంటున్నామన్న మాట.

అలా పొదుపుచేసి మిగుల్చుకున్న సొమ్ముతో మనం రకరకాల వస్తువులు కొనుక్కుంటాం. ఉదాహరణకు మన ఉద్యోగ జీవితాన్ని సరళతరం చేసే మోటార్ సైకిల్, ల్యాప్ టాప్, కారు, సుఖంగా వుండడానికి ఇల్లు లేదా ఇంట్లోకి సామానులు టీవీ, ఫ్రిజ్ వగైరా. వీటిని మనం ఆస్తులని నమ్ముతాం. ఇది రెండో అపప్రథ. నిజానికివి ఆస్తులు కావు. బైక్ కొనడం ఒక వ్యయ మార్గమైతే, దాని మెయింటెనెన్స్, పెట్రోలు అదనపు వ్యయ మార్గాలు. మన జేబులోంచి డబ్బులు బయటకు తీయించేదేదైనా అది ఆస్తి కాదు. అప్పుగానే పరిగణించాలని రచయిత వాదన. అంటే ఈ లెక్క ప్రకారం మన జీవితాన్ని ఇన్సూర్ చేస్తూ ప్రతినెలా మనం కట్టే ప్రీమియం కూడా ఆస్తి కాకూడదు. మనంపోతే వచ్చే సొమ్ము మన ఆస్తి కాలేదుకదా! మరి మన ఆస్తులు ఏమిటి? వేతనం కాకుండా మరేదైనా ఇతర మార్గాల ద్వారా ఆదాయం గడిలో చేరేదేదైనా మన ఆస్తి అవుతుంది. మనం కొనే రెండో ఇల్లు అద్దెకిస్తే వచ్చే కిరాయి అదనపు ఆదాయ మార్గం. అంచేత రెండో ఇల్లు మన ఆస్తి. రెండో పాఠం జాగ్రత్తగా చదివిన తెలివైన పాఠకులు గమనించాల్సించేమిటంటే ఆదాయపు గడిలోకి వీలైనన్ని వివిధ మార్గాలద్వారా నిరంతరం ఆదాయాన్ని చేరుస్తూ ఉండాలి. వ్యయాన్ని నియంత్రించాలి. వీలైనన్ని తక్కువ విధాలుగా ఖర్చు చేయాలి. పైగా ఖర్చుచేస్తున్న మొత్తం కొంతకలానికైనా నిరంతర ఆదాయం (రెగ్యులర్ ఇన్ కమ్) ఇచ్చేదిగా వుండాలి. దీనివల్ల అప్పుల జాబితా క్రమక్రమంగా తగ్గిస్తూ ఆస్తుల జాబితాను త్వరత్వరగా పెంచగలుగుతాం.

‘నీ పని నువ్వు చేసుకో’ అని బోధించే మూడో పాఠంలో మెక్ డోనాల్డ్ సంస్థ వ్యవస్థాపకుడు రే క్రాక్ కొంతమంది విద్యార్థులతో మాట్లాదుతూ తాను చేసేది హేంబర్గర్ బిజినెస్ కాదంటూ, రియల్ ఎస్టేట్ వ్యాపారమని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాడు. ఈ ఉదాహరణ చదువుతున్న మనకు రామోజీరావు గుర్తుకొస్తాడు. బయటకు కనిపించేది పత్రికలు, పచ్చళ్లు, చిట్ ఫండ్ వ్యాపారంలా వున్నప్పటికీ అసలు వ్యాపారం మాత్రం పెద్ద ఎత్తున స్థిరాస్తుల సేకరణ అని గమనించాలి. ఈనాడు ఎడిషన్ వెలువడుతున్న ప్రతిచోటా కోట్లాది రూపాయల విలువ చేసే భూములు, భవనాల కొనుగోలును మనం చూడడానికి ఇష్టపడం. ఇదంతా ఒక ఎత్తుకాగా, రెండువేల ఎకరాల స్థలాన్ని రామోజీ ఫిలింసిటీగా నిర్మించడం మరో ఎత్తు. (ఆ భూమిని పొందడానికే చంద్రబాబును గద్దెనెక్కించడం, తదితర విషయాలు ప్రస్తుత చర్చ పరిధిలోకి రాకూడని విషయాలు). శ్రద్ధతో ఎవరి పనులు వాతే నిర్వహించుకోవాలనే ఈ మూడో పాఠంలో ఆస్తి పట్టికలో చేరిన రూపాయిని ఎప్పుడూ బయటకు రానీయకూడదని రాబర్ట్ నీతి చెప్తున్నాడు. ఆస్తి ఖాతాలో జమ అయిన ఆ రూపాయి నిరంతరాయంగా మన ఆదాయానికి చేర్పునిస్తోందన్న మాట. ఇక నాలుగో పాఠంలో అమెరికా దేశంలో పన్నుల వ్యవస్థ స్వరూపాన్ని, పుట్టు పూర్వోత్తరాలను తెలియజెప్తారు. ఇందులోని విషయాలు మన దేశ పౌరులకు అంతగా ఉపయోగపడవు. చట్టాన్ని రాజకీయ నాయకుల చుట్టంగా మార్చేసిన మనదేశంలో జల్లెడకున్న చిల్లుల మాదిరిగా పన్నుపోటు నుండి తప్పించుకోవడానికి ధనికులు అనేకానేక మాయోపాయాలు పన్నుతుంటారు. కానీ ఈ దేశంలో పూర్ డాడీలు మాత్రం ఆదాయపు పన్నులు, సంపద పన్నులు యథాతథంగానే చెల్లిస్తుంటారు.

‘ధనవంతులు డబ్బును సృష్టిస్తారు’ అనే ఐదో పాఠంలో ఆర్థిక బుద్ధిని వికసింపజేయడానికి రచయిత హితవులు చెప్తారు. చివరిదైన ఆరో పాఠం ‘నేర్చుకునేందుకు పని చెయ్యండి – డబ్బుకోసం పని చెయ్యకండి’ లో నేర్చుకోవడం అనే అంశంపై మనకు వివరంగా తెలియపరుస్తారు రచయిత. ఒక పని తొలిసారి మొదలుపెట్టినపుడు అనేక అడ్డంకులు ఎదురవుతాయి. ఇరుగు పొరుగు మాత్రమే కాక స్నేహితులు కూడా నిరుత్సాహపరుస్తారు. మార్కెట్ నూ, క్యాష్ ఫ్లోను సరిగా అవగాహన చేసుకున్న రోజు, తీసుకున్న నిర్ణయాలను అమలుపరిచే ధీరోదాత్తత కావాలి. చురుగ్గా ఆలోచించడమే కాక, అనుకున్న నిర్ణయలను అమలుపరిచే దిశలో అనేక అవాంతరాలు ఎదురవుతాయి. వాటిని అధిగమించడానికి ఎంతో విల్ పవర్ కావాలి. భయం, నిర్లిప్తత, బద్దకం, చెడు అలవాట్లు, దురహంకారం అనే పంచపాతకాలను ఎలా ఎదిరించి నిలువరించవచ్చో ఒక అధ్యాయంలో రచయిత వివరిస్తారు.

కొంతమంది ఓటమికి భయపడి ప్రయత్నాలు చెయ్యరు. అలాంటి వారు ఎన్నడూ గెలుపొందలేరు. డబ్బు సంపాదించడం పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పరిగెత్తడమే అని అంటాడు రాబర్ట్ కియోసాకీ. యువతరం ఎంతత్వరగా ఇ తత్వాన్ని అలవరుచుకుని సంపాదన ప్రయత్నాలు మొదలుపెడతారో అంత త్వరగా ఈ తత్వాన్ని అలవరుచుకుని సంపాదన ప్రయత్నాలు మొదలుపెడతారో అంత త్వరగా ధనవంతులు కాగలుగుతారు. తమ తర్వాతి తరాలను సైతం డబ్బు విలువ తెలుసుకునేవారిగా చేయగలుగుతారు. ఈ పుస్తకం పూర్తిచేసిన నాకు పాతికేళ్ల యువతీయువకులకు ఆర్థిక అక్షరాస్యత కల్పించేెనిమిది గంటల వర్క్ షాపు నిర్వహించడానికి కొత్త ఆలోచనలు అందాయి.

ఆధారము: చదువు.వర్డ్ ప్రెస్.కం© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate