సమాజంలో అత్యంత అణగారిన వర్గాలుగా ఉన్న షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన ప్రజానీకానికి, ఇతర ప్రజానీకానికి మధ్యనున్న అభివృద్ధి అసమానతలను, ఈ వర్గాల ప్రజల్లోనే అంతర్గతంగా ఉన్న అసమానతలను తొలగించాలన్న లక్ష్యంతో రాష్ట్ర శాసనసభ షెడ్యూల్డ్ కులాలు, తెగలకు ఉప ప్రణాళికను ఆమోదించింది. ఈ చట్టంలోని వివరాలను గత వ్యాసంలో చర్చించాం. ఉప ప్రణాళిక నేపథ్యంలో... ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరంగా ఉన్న రక్షణలు, అక్షరాస్యత, జీవనోపాధి, పేదరికం ధోరణులను తెలుసుకుందాం. రాజ్యాంగ రక్షణలు షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన ప్రజలు చారిత్రకంగా అభివృద్ధిలో వెనుకబడి ఉన్నారు. సమాజంలో అణచివేతకు, నిర్లక్ష్యానికి గురయ్యారు. ఈ ప్రజల అభివృద్ధికి ఎన్నో పథకాలు, ప్రణాళికలు అమలు చేసినప్పటికీ అభివృద్ధి అసమానతలను ఇంకా గణనీయంగా తగ్గించాల్సిన పరిస్థితి ఉంది.
భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాలానుగుణంగా గతంతో పోలిస్తే ఈ వర్గాల ప్రజానీకం అభివృద్ధి చెందినా, ప్రధాన జీవన స్రవంతి కంటే ఇంకా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. సమాజంలో వివక్షకు గురవుతున్న ఈ వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలితాలు అందాలని పన్నెండో పంచవర్ష ప్రణాళిక పేర్కొంది. అందుకే వేగవంతమైన, సుస్థిరమైన, మరింత సమ్మిళితమైన అభివృద్ధిని సాధించడమే పన్నెండో ప్రణాళిక ప్రాథమిక లక్ష్యంగా నిర్దేశించారు.
భారత రాజ్యాంగంలోని అనేక అధికరణలు అన్యాయం, అణచివేత నుంచి సమాజానికి రక్షణ కల్పిస్తున్నాయి. ఈ అధికరణలు: 46, 14, 15 (1), 17, 15 (2), 15 (4) (5), 16 (4), 16(4ఎ), 16 (4బి), 335, 243డి, 340టి.
అదేవిధంగా షెడ్యూల్డ్ తెగల రక్షణకు రాజ్యాంగంలో అనేక అధికరణలున్నాయి. ఉదాహరణకు: 15 (4), 16 (4), 46, 243M, 243ZC, 244, 275(1), 334, 335, 338A, 339(1).
వివిధ రాజ్యాంగ అధికరణలతోపాటు పార్లమెంట్ ఈ వర్గాల ప్రజల రక్షణకు అనేక చట్టాలను కూడా చేసింది. ఉదాహరణకు, 1955లో అంటరానితనంపై చట్టం రూపొందించారు. దీన్ని తర్వాతి కాలంలో (1976లో) పౌరహక్కుల రక్షణ చట్టంగా పునఃనామకరణం చేశారు. సామాజిక అణచివేతకు గురవుతున్న ఈ వర్గాల ప్రజలపై జరుగుతున్న అత్యాచారాలను నివారించేందుకు 1989లో షెడ్యూల్డ్ కులాలు, తెగల (అత్యాచారాల నివారణ చట్టం) వచ్చింది.
రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల జనాభా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికీ ఎస్సీ జనాభాలో అధికభాగం గ్రామాల్లోనే నివసిస్తున్నారు. 1991 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఎస్సీ జనాభా 1.06 కోట్లు. మొత్తం జనాభాలో ఇది 15.9 శాతంగా ఉండేది. 2001 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల జనాభా మొత్తం జనాభాలో 16.2 శాతానికి పెరిగింది. 2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తం మీద చూస్తే నెల్లూరు జిల్లాలో ఈ వర్గం జనసాంద్రత అత్యధికం. ఈ జిల్లాలో మొత్తం జనాభాలో 22.5 శాతం ఉన్నారు. తర్వాతి స్థానంలో ప్రకాశం (21 శాతం), చిత్తూరు (18.7) జిల్లాలున్నాయి.
జనాభా లెక్కల వివరాలను పరిశీలిస్తే రాష్ట్రంలో అక్షరాస్యత పెరుగుతోందని అర్థమవుతుంది. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్‌లో 1981లో అక్షరాస్యతా రేటు 29.9 శాతం. 2001లో ఇది 60.5 శాతానికి పెరిగింది. అదేవిధంగా ఎస్సీలలో కూడా అక్షరాస్యత పెరుగుతోంది. రాష్ట్రంలో ఎస్సీ జనాభాలో అక్షరాస్యతా రేటు 1981లో 17.7 శాతం ఉండగా, ఇది 2001లో 53.6 శాతానికి పెరిగింది. అంటే 2001 జనాభా లెక్కల ప్రకారం చూసినా మొత్తం జనాభా అక్షరాస్యతా రేటుతో పోలిస్తే ఎస్సీ ప్రజానీకంలో అక్షరాస్యతా రేటు తక్కువగా ఉంది. మానవాభివృద్ధి, సామాజికాభివృద్ధిలో కీలకాంశంగా ఉన్న అక్షరాస్యతా రేటు విషయంలో ఇతర వర్గాల ప్రజానీకానికి, ఎస్సీలకు మధ్యనున్న తేడాను అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ మహిళల్లో అక్షరాస్యతా రేటులో పెరుగుదల వేగం తక్కువగా ఉంది. ఉదాహరణకు 2001లో మొత్తం మీద చూస్తే మహిళా అక్షరాస్యతా రేటు 50.4 శాతంగా ఉంటే ఎస్సీలలో మహిళా అక్షరాస్యతా రేటు 43.4 శాతంగా ఉంది.
విద్యారంగంలో ప్రమాణాలకు మరో కీలక కొలమానం మధ్యలో బడి మానేసే వారి సంఖ్య. భారత విద్యావిధానంలో చూస్తే, బడిలో చేర్పించే విషయంలో దాదాపు పూర్తి స్థాయిలో విజయం సాధించాం. కానీ మధ్యలో బడి మానేసే వారి సంఖ్యను తగ్గించడంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నాం.
కొంతకాలంగా విద్యారంగ ధోరణులను పరిశీలిస్తే ఎస్సీ బాలబాలికల్లో కూడా మధ్యలో బడి మానేసే వారి శాతం తగ్గుతోంది. కానీ, ఇప్పటికీ ఇది చాలా అధికంగా ఉండటం ఆందోళనకరం. ఉదాహరణకు 2007-08లో ఎస్సీ బాలబాలికల విషయంలో మధ్యలో బడి మానేసే వారి శాతం ఇంకా 69 శాతంగా ఉంది. ఎస్సీ బాలురతో పోలిస్తే బాలికల్లో ఈ శాతం సహజంగానే మరింత ఎక్కువగా ఉంది. అందుకే అంబేద్కర్ పేర్కొన్నట్లు అణగారిన వర్గాలలోని మహిళలు రెండు రకాల వివక్షకు గురవుతారు. కులపరమైన వివక్షతో పాటు లింగ వివక్షకు కూడా బలవుతున్నారు.
మరిన్ని వివరాలకు పట్టిక-1 చూడండి
గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కోసం వ్యవసాయేతర స్వయం ఉపాధిపై ఆధారపడుతున్న వారి శాతం పెరుగుతోంది. మరోవైపు మొత్తం ఎస్సీ జనాభాలో వ్యవసాయం, స్వయం ఉపాధి, వ్యవసాయ కూలీలుగా ఆధారపడి జీవిస్తున్న వారి శాతం తగ్గుతోంది. అయితే ఇప్పటికీ ఎస్సీలలో 63 శాతం ప్రజల జీవనోపాధి వ్యవసాయమే. ఎస్సీ ప్రజానీకం అత్యధికంగా గ్రామాల్లో జీవిస్తున్నారు. వ్యవసాయ కూలీలుగా గడుపుతున్నారు.
మరిన్ని వివరాలకు పట్టిక - 2 చూడండి
ఉప ప్రణాళిక అమలులో భాగంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రణాళికా కేటాయింపులలో జనాభా దామాషా ప్రాతిపదికపై ఎస్సీలకు నిధులను కేటాయిస్తున్నారు. ప్రతీ ప్రభుత్వ శాఖ తమ ప్రణాళికా కేటాయింపులలో ఇలాగే నిధులు కేటాయిస్తే ఇక్కడో సమస్య ఉంది. అత్యధిక ఎస్సీ జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. కానీ, రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్లో ఆ మేరకు వ్యవసాయానికి అంత ప్రాధాన్యం ఉండదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలకు లభిస్తున్న ప్రాధాన్యానికి, ఎస్సీ ప్రజల జీవితాల్లో ఆయా రంగాల ప్రజల జీవనాధారానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది.
ఇటీవల ఆమోదించిన చట్టం అమలులో భాగంగా పథకాలు, కార్యక్రమాలను రచించేటప్పుడు ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. కొంతకాలంగా రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్లో దాదాపు సగం మేరకు జలయజ్ఞానికి కేటాయిస్తున్నారు. అందులో భారీ నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యం ఉంటోంది. కానీ, ఎస్సీల్లో అత్యధికులు భూమిలేని వ్యవసాయ కూలీలు. వీరికి భూమే లేనప్పుడు భారీ ప్రాజెక్టుల వల్ల కలిగే ప్రయోజనం పరిమితంగానే ఉంటుంది. అందుకే నిధులను వెచ్చించేందుకు ప్రణాళికలను రూపొందించేటప్పుడు ఉప ప్రణాళిక అమలు మండలి, నోడల్ ఏజెన్సీలు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
పేదరికాన్ని అంచనా వేసేందుకు ఇటీవల లక్డావాలా కమిటీ, టెండుల్కర్ కమిటీ పద్ధతులు వచ్చాయి. లక్డావాలా కమిటీ అంచనాల ప్రకారం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పేదరికం తగ్గుతూ వస్తోంది. ఉదాహరణకు, గ్రామీణ ప్రాంతంలో 1983లో ఎస్సీలలో పేదరికం 36.7 శాతం ఉండగా, ఇది 2004-05లో 15.5 శాతానికి తగ్గింది. అలాగే పట్టణ ప్రాంతంలో ఇదే కాలంలో ఎస్సీలలో పేదరికం 50.6 శాతం నుంచి 37.4 శాతానికి తగ్గింది. టెండుల్కర్ కమిటీ తాజా అధికారిక అంచనాల ప్రకారం 2009-10లో గ్రామీణ ప్రాంతాలలో ఎస్సీలలో పేదరికం 23.5 శాతం ఉండగా, పట్టణ ప్రాంతంలో 17.4 శాతంగా ఉంది. లక్డావాలా కమిటీ, టెండుల్కర్ కమిటీల ప్రకారం గ్రామీణ, పట్టణ పేదరికం అంచనాల్లో చాలా వ్యత్యాసం ఉంది.
అందుకే ఈ ఉప ప్రణాళిక అమలును సాంకేతిక దృక్పథంతో కాకుండా సామాజిక, ఆర్థిక దృక్పథంతో పరిశీలించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో వస్తున్న వేగవంతమైన మార్పులలో ఎస్సీ ప్రజానీకాన్ని కూడా భాగస్వాములను చేయాల్సిన బాధ్యత సమాజానికి ఉంది. గిరిజనుల విషయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో సేవల రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. జాతీయాదాయంలోనే కాదు, రాష్ట్ర ఆదాయంలో కూడా అధిక భాగం సేవల రంగం నుంచే వస్తోంది. కానీ, ఈ నూతన సంపదలో ఎస్సీ, ఎస్టీ ప్రజానీకానికి సరైన భాగస్వామ్యం లేదు. విజ్ఞాన ఆర్థిక వ్యవస్థలో భాగమైన సమాచార, సాంకేతిక, జీవసాంకేతిక రంగాలు భవిష్యత్తులో సంపదను సృష్టించే కీలక రంగాలు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఈ వర్గాల భాగస్వామ్యంపై అత్యంత శ్రద్ధ అవసరం. అందుకే చట్టం చేయడంతో సరిపోదు. ఆ చట్టం అమలులో నవీనత్వం, సృజనాత్మకత కీలకమవుతాయి.
ఆధారము: ఈనాడు ప్రతిభ.నెట్
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
భారత ప్రజారాజ్యపు 40వ సంవత్సరములో భారతదేశ పార్లమెం...