অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మానవాభివృద్ధి నివేదిక

మానవాభివృద్ధి నివేదిక

మానవాభివృద్ధి నివేదిక 2013

21వ శతాబ్దంలోని పరిణామాల నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధిక వృద్ధి నమోదైంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ స్థానాన్ని చైనా ఆక్రమించింది. కొన్ని వందల మిలియన్ల మంది ప్రజలను పేదరికం నుంచి విముక్తి చేయడంలో అది విజయం సాధించింది. భారత్ తన భవిష్యత్తును పునర్నిర్మించుకోవడంలో భాగంగా ఉద్యమిత్వ కల్పన, సాంఘిక విధానాలకు ప్రాధాన్యమిచ్చింది. అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచుకోవడం ద్వారా బ్రెజిల్ తన దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో విజయం సాధించింది. ఈ శతాబ్దంలో దక్షిణాది దేశాల ప్రగతిని ‘మానవాభివృద్ధి నివేదిక 2013 (హెచ్‌డీఐ)’ ప్రముఖంగా ప్రస్తావించింది. ఇండోనేషియా, మెక్సికో, దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్, టర్కీ, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచ చిత్రపటంలో ప్రధాన దేశాలుగా నిలిచాయి. ఇటీవలి దశాబ్దాలలో 40 అభివృద్ధి చెందుతున్న దేశాలు మానవాభివృద్ధి విషయంలో ఊహించిన దాని కంటే అధిక వృద్ధి సాధించాయని ఈ నివేదిక వెల్లడించింది. ఆయా దేశాల్లో గత పదేళ్ల కాలంలో ప్రగతి వేగవంతమైంది.

అభివృద్ధి చెందుతున్న దేశాలు చైతన్యంతో కూడిన భారీ ఆర్థిక వ్యవస్థలుగా రూపాంతరం చెందే క్రమంలో మానవాభివృద్ధిలో ప్రగతి కనిపిస్తుందని మానవాభివృద్ధి నివేదిక అభిప్రాయపడింది. గత దశాబ్ద కాలంలో అన్ని దేశాలు విద్య, ఆరోగ్యం, ఆదాయ స్థాయిలను పెంచుకోవడంలో విజయం సాధించాయి. అల్ప మానవాభివృద్ధి దేశాలలో ఈ దశాబ్దకాలంలో అధిక ప్రగతి నమోదైంది. పేద వర్గాల అభ్యున్నతికి అవసరమైన విధానాలు, ప్రజల సామర్థ్యాన్ని పెంపొందించే అంశాలైన విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, ఉపాధి వంటి వాటిపై పెట్టుబడులను పెంచాల్సిన ఆవశ్యకతను నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుత నివేదికతోపాటు గతంలో వెలువడిన నివేదికలు కూడా ఆర్థికాభివృద్ధి కారణంగా మానవాభివృద్ధిలో ప్రగతి సాధ్యపడకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

రైజ్ ఆఫ్ ది సౌత్

పలు అభివృద్ధి చెందుతున్న దేశాలు మంచి వృద్ధిని సాధించాయి. వీటిలో ముఖ్యంగా కొన్ని దేశాల్లో అధిక ప్రగతి నమోదైన స్థితిని ‘రైజ్ ఆఫ్ ది సౌత్ (Rise of The South)’గా నివేదిక అభివర్ణించింది. బ్రెజిల్, చైనా, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, దక్షిణాఫ్రికా, టర్కీ దేశాలు ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి తమ ఆర్థిక వ్యవస్థలను గట్టెక్కించడమే కాకుండా అత్యధిక వృద్ధి రేట్లను సాధించాయి.

గత 150 ఏళ్ల కాలంలో మొదటిసారిగా అభివృద్ధి చెందుతున్న మూడుదేశాల (బ్రెజిల్, చైనా, భారత్) ఉమ్మడి స్థూల దేశీయోత్పత్తి విలువ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన కెనడా, ఫ్రాన్‌‌స, జర్మనీ, ఇటలీ, యూకే, అమెరికాల ఉమ్మడి స్థూల దేశీయోత్పత్తికి సమానంగా నిలిచింది. 1950 లో ప్రపంచ జీడీపీలో బ్రెజిల్, చైనా, భారత్ వాటా 10 శాతం. అదే సమయంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల వాటా 50 శాతం. మానవాభివృద్ధి నివేదిక అంచనాల ప్రకారం ప్రకారం 2050 నాటికి ప్రపంచ జీడీపీలో బ్రెజిల్, చైనా, భారత్‌ల వాటా 40 శాతానికి చేరుకోగలదు.

వృద్ధిని కొనసాగించగలదా?
దక్షిణాది దేశాల్లోని మధ్య తరగతి ప్రజల ఆదాయ స్థాయి, వారి అంచనాల్లో (Expectations) ప్రగతి కనిపించింది. పారిశ్రామిక దేశాల తరహా ఈ దేశాల్లోనూ సాంకేతికపరమైన నవ కల్పనలు, ఉద్యమిత్వ పెరుగుదలకు పునాదులు ఏర్పడ్డాయి. దక్షిణాది దేశాలు ఆర్థికవృద్ధి సాధనలో విజయం సాధించినప్పటికీ.. ఈ వృద్ధి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని నమ్మకంగా చెప్పలేకపోతున్నాం. ఆయా దేశాలు మానవాభివృద్ధిలో సాధించిన ప్రగతిని భవిష్యత్తులో కొనసాగించగలవా? ఈ ప్రగతి ఇతర దేశాలకు ఎలా వ్యాప్తి చెందుతుంది? అనే అంశాలను వివరించే క్రమంలో ఈ నివేదిక నాలుగు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని అభిప్రాయపడింది. ‘‘సమానత్వాన్ని పెంపొందించడం, ప్రజల భాగస్వామ్యాన్ని అధికం చేయడం, పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడం, జనాభాపరమైన మార్పుల నేపథ్యంలో సక్రమమైన యాజమాన్యం వంటి అంశాలు సుస్థిర అభివృద్ధి సాధనకు దోహదపడగలవని నివేదిక పేర్కొంది.

ఆదాయ అసమానతలు తక్కువగా ఉన్న దేశాల్లో.. ఆర్థిక వృద్ధి పేదరికాన్ని తగ్గించడానికి కీలక సాధనంగా ఉపయోగపడుతుందని నివేదిక అభిప్రాయపడింది. విద్య, ఆరోగ్యం, సాంఘిక రక్షణ, న్యాయ సాధికారత (Legal Empowerment) వంటి అంశాలు పేదలు వృద్ధిలో భాగస్వామ్యం కావడానికి దోహదపడతాయి. వివిధ జాతుల మధ్య ఏర్పడుతున్న సాంఘిక వివాదాలను తగ్గిస్తే సమానత్వం సాధ్యపడుతుంది. దక్షిణాదిన పలు దేశాలు త్వరితగతిన వృద్ధి సాధించగలిగాయి. ఆయాదేశాలు అవలంబించిన సాంఘిక, ఆర్థిక విధానాలు పెట్టుబడి, వాణిజ్యం, అభివృద్ధి సహకారం వంటి అంశాలు ఇందుకు కారణమయ్యాయని నివేదిక పేర్కొంది. సౌత్-సౌత్ కో-ఆపరేషన్ (South-South Co-Operation), ఆయా దేశాల అనుభవాలు అభివృద్ధి విధానాల రూపకల్పనకు దోహదపడగలవు.

జనాభాపరమైన మార్పునకు సంబంధించిన యాజమాన్యం (Managing Dernographnic Change):
1970 నుంచి 2011 మధ్య కాలంలో ప్రపంచ జనాభా 3.6 బిలియన్ల నుంచి 7 బిలియన్లకు చేరుకుంది. పెరుగుతున్న జనాభాలో విద్యా ప్రమాణాలు మెరుగైతే జనాభా వృద్ధి రేటులో తగ్గుదల ఏర్పడుతుందని నివేదిక పేర్కొంది. అభివృద్ధి ప్రక్రియ జనాభా పరిమాణం, వయోవర్గ నిర్మాణాలపై ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి ప్రక్రియలో ఆధారపడే జనాభా నిష్పత్తిని ఒక ముఖ్యాంశంగా ప్రస్తుత నివేదిక ప్రస్తావించింది. పటిష్టమైన విధానాలను రూపొందిస్తే పేద దేశాల్లోని మొత్తం జనాభాలో పనిచేసే జనాభా పెరుగుతుంది. ఆ నేపథ్యంలో ఏర్పడే డెమోగ్రాఫిక్ డివిడెండ్ (Demographic Dividend) వల్ల ఆయాదేశాలు లబ్ధి పొందుతాయి. డెమోగ్రాఫిక్ డివిడెంట్‌కు బాలిక విద్య అనేది ముఖ్య సాధనం. దక్షిణాదిన ధనిక ప్రాంతాల్లో మొత్తం జనాభాలో పనిచేసే జనాభా తగ్గుతుంది. భవిష్యత్తులో వృద్ధిపై ఈ అంశం ప్రభావం చూపించే అవకాశాలున్నాయి.

భారత్, కొరియా-విద్యాప్రగతి:
1950వ దశకంలో కొరియాలోని బడిఈడు పిల్లలో (School-age children) అధికశాతం మంది కనీస స్థాయి విద్య (Normal Education) కు కూడా నోచుకోలేదు. తర్వాత కాలంలో విద్యారంగంలో అధిక ప్రగతి నమోదైంది. ప్రస్తుతం ప్రపంచంలో యువ కొరియన్ మహిళలను బెస్ట్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ (Best Educated Women)గా అభివర్ణించవచ్చు. కొరియన్ మహిళలలో సగం మందికిపైగా కాలేజీ విద్యను పూర్తి చేసిన వారే కావడం గమనార్హం. 2010లో కొరియాలోని మొత్తం జనాభాలో 14 ఏళ్లలోపు వారు 16 శాతం కాగా, 2050 నాటికి ఈ జనాభా 13 శాతానికి తగ్గగలదని, ఇదే సమయంలో ఉన్నత విద్యలో నమోదు నిష్పత్తి 26 నుంచి 47 శాతానికి చేరుకుంటుందని అంచనా. విద్యా ప్రమాణాలలో పెరుగుదల కారణంగానే కొరియాలో మానవాభివృద్ధి సాధ్యమైంది. తద్వారా మానవాభివృద్ధి సూచీలో 12వ స్థానం పొందగలిగింది. భారత్‌లో 2000వ సంవత్సరానికి ముందు సగం మందికి పైగా వయోజన జనాభా కనీస స్థాయి విద్య (Formal Education)కు నోచుకోలేదు. వివిధ పాఠశాలల స్థాయిలలో నమోదు నిష్పత్తి పెరుగుదలకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నప్పటికీ కనీస స్థాయి విద్య లేని వయోజన జనాభాలో తగ్గుదల స్వల్పంగానే ఉంది. మహిళలలో విద్య స్థాయి తక్కువగా ఉన్న కారణంగా రాబోయే కాలంలో చైనాను మించిన జనాభా భారత్‌లో ఉంటుందని నివేదిక పేర్కొంది. 2050 నాటికి కూడా విద్యా ప్రమాణాల లభ్యతలో అసమానతలు భారత్‌లో కొనసాగుతాయి. ఉన్నత విద్య విస్తరణ శ్రామిక శక్తిలో విద్యావంతులైన యువత సంఖ్యను పెంచగలదని నివేదిక అభిప్రాయపడింది.

వివిధ సూచీలు- భారత్ ప్రగతి

మానవాభివృద్ధి సూచీ: యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (UNDP)186 దేశాలకు సంబంధించి మానవాభివృద్ధి సూచీని రూపొందించింది. ఇందులో 47 దేశాలను అత్యధిక మానవాభివృద్ధి సాధించిన దేశాలుగా గుర్తించింది. మరో 47 దేశాలకు అధిక మానవాభివృద్ధి జాబితాలో చేర్చింది. మరో 47 దేశాలను మధ్యస్థాయి మానవాభివృద్ధి దేశాలుగాను, మిగిలిన 46 దేశాలను అల్ప మానవాభివృద్ధి దేశాలుగాను నివేదిక పేర్కొంది. మానవాభివృద్ధి సూచీలో నార్వే, ఆస్ట్రేలియా, అమెరికాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్ 136వ స్థానాన్ని, నైజర్ చిట్ట చివరి 186వ స్థానాన్ని పొందాయి. మానవాభివృద్ధి సూచీలో మొదటి స్థానంలో ఉన్న నార్వే మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ) విలువ 0.955. భారత్ విలువ 0.554, నైజర్ విలువ 0.304.

లింగ సంబంధిత అసమానతల సూచీ:
ఈ సూచీలో నెదర్లాండ్‌‌స, స్వీడన్, స్విట్జర్లాండ్‌లు మొదటి మూడు స్థానాల్లో ఉండగా భారత్ 132వ స్థానాన్ని పొందింది. భారత్‌కు సంబంధించి ఈ సూచీ విలువ 0.610. ఈ సూచీలో యెమెన్ చిట్ట చివరిగా 148వ స్థానంలో నిలిచింది. భారత్‌లో స్త్రీ-పురుషుల మధ్య పెరుగుతున్న అసమానతలను ఈ సూచీ స్పష్టం చేసింది. ఈ సూచీని రూపొందించడానికి (1) ప్రతి లక్ష జననాలకు సంబంధించి ప్రసూతి మరణాల రేటు, (2) 15 నుంచి 19 సంవత్సరాల మధ్యలోని ప్రతి 1000 మంది మహిళలకు సంబంధించి సంతాన సాఫల్య రేటు, (3) పార్లమెంట్ సభ్యుల్లో మహిళల శాతం, (4) 2.5 సంవత్సరాలకు పైబడిన పురుషుల, మహిళలలో సెకండరీ విద్యను అభ్యసించిన వారి శాతం, (5) శ్రామిక శక్తి భాగస్వామ్యంలో స్త్రీ-పురుషుల వాటా వంటి అంశాలను సూచికలుగా తీసుకుంటారు.

మల్టీ డైమన్షనల్ పేదరిక సూచీ:
బహుమితీయ పేదరిక సూచీ 2005-06వ సంవత్సరంలో భారత్‌కు సంబంధించి ఈ సూచీ విలువ 0.283. ఈ సూచీని రూపొందించడానికి.. (1) బహుమితీయ పేదరికంలో ఉన్న జనాభా, (2) దారిద్య్ర రేఖ పరిధిలోనికి రావడానికి ఆస్కారం ఉన్న ప్రజల శాతం, (3) తీవ్ర పేదరికంతో బాధ పడుతున్న ప్రజల శాతం, (4) పేదరికానికి దారితీసే విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల లభ్యతలో వ్యత్యాసం (5) ఆదాయ పేదరిక రేఖకు దిగువన ఉన్న ప్రజలలో రోజుకు 1.25 డాలర్ల కొనుగోలు శక్తి లేని వారి శాతం, జాతీయ పేదరిక రేఖ వంటి అంశాలను సూచికలుగా తీసుకుంటారు. ఈ నివేదిక ప్రకారం బహుమితీయ పేదరికంలో ఉన్న జనాభా (తలల లెక్కింపు నిష్పత్తి ఆధారంగా) 53.7 శాతం. దారిద్య్ర రేఖ పరిధిలోకి రావడానికి ఆస్కారం ఉన్న ప్రజల శాతం 16.4 కాగా, తీవ్ర పేదరికంలో ఉన్న జనాభా 28.6 శాతం. దీన్ని జాతీయ పేదరిక రేఖ (National poverty line) 29.8 శాతంగా నివేదిక పేర్కొంది.

లింగ సంబంధిత అసమానతల సూచీ:
ఈ నివేదిక ప్రకారం ప్రసూతి మరణాల రేటు ప్రతి లక్ష జనాభాకు 200 గా నమోదు కాగా, కౌమార దశలోని మహిళల్లో ప్రతి 1000 మందికి సంతాన సాఫల్యాల రేటు 74.7 గాను, పార్లమెంట్ సభ్యులలో మహిళల శాతం 10.9 గాను, మహిళలలో సెకండరీ విద్యనభ్యసించినవారు 26.6 శాతం, పురుషులలో సెకండరీ విద్యనభ్యసించినవారు 50.4 శాతంగా నమోదైంది. మహిళలలో శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 29 శాతంగాను, పురుషులలో శ్రామికశక్తి భాగస్వామ్యం 80.7 శాతంగా ఉంది.

ఈ సూచీలాధారంగా:
ఆయుఃప్రమాణం, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, (Mean Years of Schooling), ఎక్స్‌పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ (Expected Years of Schooling), తలసరి స్థూల జాతీయోత్పత్తి (కొనుగోలు శక్తి సామర్థ్యం) వంటి అంశాలాధారంగా మానవాభివృద్ధి సూచీని రూపొందించారు.

  1. భారత్‌కు సంబంధించి ఆయుః ప్రమాణం 2012లో 65.8 సంవత్సరాలు.
  2. మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ 4.4 సంవత్సరాలు.
  3. ఎక్స్‌పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ (2011లో) 10.7 సంవత్సరాలు.
  4. తలసరి ఆదాయం (కొనుగోలు శక్తి సామర్థ్యం) 3285 డాలర్లుగా నమోదైంది.
  5. అసమానతల మిళితమైన మానవాభివృద్ధి సూచీకి సంబంధించి భారత్ విలువ 0.392 గా నమోదు కాగా, 2012లో అసమానతల కారణంగా మానవాభివృద్ధి సూచీలో నష్టాన్ని 29.3 శాతంగా అంచనా వేశారు. ఈ సూచీ రూపకల్పనకు సూచికలుగా (1) అసమానతల మిళితమైన ఆయుః ప్రమాణ సూచీ (2) అసమానతల మిళితమైన విద్యా సూచీ (3) అసమానతల మిళితమైన ఆదాయసూచీలను తీసుకున్నారు. భారత్‌లో ఆదాయం Co-Efficient 2000-10 మధ్య 33.4 శాతంగా నమోదైంది.

ప్రాథమిక విద్య - సమస్యలు - పరిష్కారాలు

-డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్.

మనదేశంలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం పెరుగుతోంది. తల్లిదండ్రులందరూ పిల్లలను తమ స్థాయికి తగ్గ పాఠశాలలో చేర్పిస్తున్నారు. అయితే ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్య అనేక హంగులతో హంగామా చేస్తోంటే... సర్కారు బడుల్లో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోతోంది. అటు పాలక ప్రభుత్వాలు మాత్రం ప్రాథమిక విద్యకు పెద్దపీట వేస్తున్నామంటూ పలు పథకాల పేరిట కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నా పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోతున్నాయి. కారణం లోపభూయిష్ట విధానాలు, ఆచరణలో ఎడతెగని నిర్లక్ష్యమే. దీన్ని అధిగమించాలంటే సమర్థనీయ సంస్కరణలే శరణ్యమని తెలిపే వ్యాసం ఈ వారం ప్రత్యేకం.

పాఠశాల విద్య- అక్షరాస్యత:
ఇటీవల కాలంలో అన్ని వర్గాల ప్రజలకు విద్యా ప్రమాణాల అందుబాటుకు సంబంధించి ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. పనిచేసే జనాభా మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ (25 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న జనాభా ఎన్నేళ్లు విద్యను పూర్తి చేశారో వాటి సగటునే మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటారు) 2000 సంవత్సరంలో 4.19 సంవత్సరాలు. అదే 2010 సంవత్సరంలో 5.12 సంవత్సరాలకు పెరిగింది. ప్రాథమిక విద్యలో విద్యార్థుల నమోదు (ఎన్‌రోల్‌మెంట్) నిష్పత్తిలోనూ గణనీయమైన పెరుగుదల కనిపించింది. సెకండరీ విద్యలో విద్యార్థుల నమోదు వృద్ధి 1990వ దశకంలో సగటు 4.3 శాతం కాగా 2009-10 నాటికి 6.27 శాతానికి పెరిగింది. యువకులలో అక్షరాస్యత 1983లో 60 శాతం ఉంటే 2009-10లో 91 శాతానికి పెరిగింది. వయోజనుల విషయానికొస్తే 2001లో 64.8 శాతం ఉన్న అక్షరాస్యత 2011 నాటికి 74 శాతానికి పెరిగింది.

ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నా:
జాతీయాభివృద్ధిలో విద్యారంగ ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం 12వ పంచవర్ష ప్రణాళిక (2012-2017)లో విద్యారంగంలో నాణ్యతా ప్రమాణాల పెంపు, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు ఈ రంగంలో సమాన అవకాశాల కల్పనకు ప్రాధాన్యమిచ్చింది. ఈ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వ్యయాన్ని 11వ పంచవర్ష ప్రణాళికలో రూ.12,44,797 కోట్లుగా అంచనా వేశారు.
ఈ మొత్తంలో 35 శాతం ప్రణాళికా వ్యయం కాగా మిగిలిన 65 శాతం ప్రణాళికేతర వ్యయం. విద్యకు సంబంధించి మొత్తం ప్రభుత్వ వ్యయంలో 43 శాతం ప్రాథమిక విద్యపై 25 శాతం సెకండరీ విద్యపై, మిగతా 32 శాతం ఉన్నతవిద్యపై వెచ్చించారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగం పై చేసిన ఖర్చులో ప్రాథమిక విద్యపై 39 శాతం, సెకండరీ విద్యపై 12శాతం, ఉన్నత విద్యపై 50శాతం కేటాయించా యి. ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే.. పాఠశాల విద్య 75శాతం వాటా కలిగి ఉంది. ఇందులో ప్రాథమిక విద్య వాటా 44 శాతం కాగా, సెకండరీ విద్య వాటా 30 శాతం.

పాథమిక విద్యారంగం-సమస్యలు, అనుభవాలు:

  • 11వ పంచవర్ష ప్రణాళికలో అనేక రంగాలలో ఆశించిన మేర విజయాలు సాధించిన భారత ఆర్థిక వ్యవస్థ విద్యారంగంలో మాత్రం పలు సవాళ్లను ఎదుర్కొంది. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలతో పోల్చినపుడు భారత్‌లో మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ (ఎం.వై.ఎస్.) తక్కువ స్థాయిలో ఉంది. పొరుగు దేశమైన చైనా మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్‌లో మన కంటే ఎంతో ముందంజలో ఉంది. ఆ దేశంలో 8.17 సంవత్సరాలు కాగా, బ్రెజిల్‌లో 7.54 సంవత్సరాలు. ఇక మన దేశం విషయానికి వస్తే 5.12 సంవత్సరాలు గానే నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు కన్నా (7.09 సంవత్సరాలు) భారత్‌లో మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ తక్కువే అని చెప్పవచ్చు. ప్రాథమిక విద్య తర్వాత విద్యార్థులలో డ్రాపౌట్ (మధ్యలో చదువును ఆపినవారు) రేటును భారత్‌లో ఎక్కువ గమనించవచ్చు. ప్రాథమిక విద్య, హయ్యర్ సెకండరీ విద్య మధ్య నమోదు నిష్పత్తిలో అంతరం మనదేశంలో చాలా తక్కువ. జాతీయ సగటు కన్నా ఎస్సీలు, ఎస్టీ తెగల విద్యార్థులలో డ్రాపౌట్ రేటు ఎక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు.
  • ప్రాథమిక విద్యలో బడిలో నమోదైన పిల్లల నిష్పత్తిలో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ,విద్యార్థుల హాజరుకు సం బంధించి వివిధ రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు పెరిగాయి. విద్యాపరంగా వెనుకబడిన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లలో విద్యార్థుల హాజరురేటు 60 శాతం కన్నా తక్కువగా నమోదవుతున్నది.
  • ప్రాథమిక విద్యలో గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయ లభ్యతలో పురోగతి కనిపిస్తోంది. సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ), రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ కేటాయింపుల కారణంగా జాతీయస్థాయిలో విద్యార్థి- ఉపాధ్యాయ నిష్పత్తి 27ః1 కు చేరుకుంది. మరోవైపు విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిలో వివిధ రాష్ట్రాలలో వ్యత్యాసాలు పెరిగాయి. సరైన శిక్షణలేని ఉపాధ్యాయుల సంఖ్య బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో 8.1 లక్షలుగా ఉన్నారని అంచనా.
  • ప్రాథమిక విద్యలో విద్యార్థుల అభ్యసన స్థాయి తక్కువగా ఉండటం ప్రస్తుతం ఒక సవాల్‌గా మారింది. అదే తరగతి స్థాయికి సంబంధించి ఇతర దేశాల విద్యార్థుల అభ్యసన స్థాయి కన్నా భారత విద్యార్థుల అభ్యసన స్థాయి తక్కువగా ఉంది. విద్యారంగ పరంగా అన్ని స్థాయిలలో నమోదులో పెరుగుదల, భౌతిక అవస్థాపనా సౌకర్యాలు మెరుగుపడినప్పటికీ, బలహీనమైన సాంప్రదాయ విద్య ద్వారా ఆశించిన ప్రయోజనాలు సమకూరడం లేదు.
  • 11వ పంచవర్ష ప్రణాళికలో ప్రాథమిక విద్యలో డ్రాపౌట్ రేటును 50 నుంచి 20 శాతానికి తగ్గించాలని లక్ష్యం. ఈ విషయంలో కొంతమేర పురోగతి సాధించినప్పటికీ జాతీయ సగటు డ్రాపౌట్ రేటు 42.39 శాతంగా నిలవడం ఆందోళన కలిగించే పరిణామం. ఎస్సీ, ఎస్టీయేతర విద్యార్థులలో డ్రాపౌట్ రేటు 37.22 శాతం కాగా ఎస్సీ విద్యార్థులలో 51.25 శాతం, ఎస్టీ విద్యార్థులలో 57.58 శాతంగా నమోదు కావడాన్ని బట్టి వివిధ సామాజిక వర్గాల విద్యార్థులలో డ్రాపౌట్ రేటు వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు.
  • పదకొండో పంచవర్ష ప్రణాళికలో ప్రాథమిక విద్యా వ్యాప్తికి సర్వశిక్షా అభియాన్ కార్యక్రమం అమలుతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలైన మధ్యాహ్న భోజన పథకం, ఉపాధ్యాయ విద్యా పథకం (టీచర్ ఎడ్యుకేషన్ స్కీమ్), మహిళా సమాఖ్య, మైనారిటీ విద్యాసంస్థలలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి, మదర్సాలలో నాణ్యత గల విద్య అందించడం లాంటి పథకాలను అమలుచేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రాథమిక స్థాయిలో పిల్లల నమోదు (ఎన్‌రోల్‌మెంట్) జరగటం లేదు, విద్యా నాణ్యతలో రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య, వివిధ సామాజిక వర్గాల మధ్య అంతరాలు పెరిగాయి.

ప్రాథమిక విద్య - ఆంధ్రప్రదేశ్:
·  భారత్‌లోని ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు అక్షరాస్యత విషయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి సంతృప్తికరంగా లేదనే చెప్పాలి. గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు, స్త్రీ-పురుష అసమానతలు ఇప్పటికీ ఉన్నాయి. తల్లిదండ్రులలో తక్కువ అక్షరాస్యతా స్థాయి, పేదరికం, అందుబాటు లో లేని పాఠశాలలు, మృగ్యమైన మౌలిక సౌకర్యాల కల్పన పర్యవసానం అక్షరాస్యత విషయంలో ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుకు కారణం. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు కేటాయింపు తక్కువగా ఉంది. 1995 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యలో ఏ విధమైన మార్పునూ పాలక ప్రభుత్వాలు తీసుకురాలేదు. 1996లో ప్రాథమిక విద్యను ఒక కార్యక్రమంగా డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (డిపెప్) ప్రవేశపెట్టడం ద్వారా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. 1996లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేశారు. పాఠశాల వ్యవస్థలో సామాజిక యాజమాన్య ప్రక్రియ ద్వారా ప్రాథమిక విద్యను సార్వత్రికం చేసే క్రతువులో భాగం గా సర్వశిక్షా అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేశారు. బాలికలు, బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లల్లో విద్యావ్యాప్తికి ఈ పథకం చేయూతనిస్తుంది. ఈ కార్యక్రమాన్ని మొదటగా ఉభయగోదావరి జిల్లాలలో ప్రవేశపెట్టి 2002-03 నాటికి ఇతర జిల్లాలకు విస్తరించారు. ప్రాథమిక విద్యా వ్యాప్తికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ (ఓబీబీ), చదువుల పండగ,మళ్లీ బడికి, మధ్యాహ్న భోజన పథ కం లాంటి కార్యక్రమాలను అమలు పరిచింది. 2005లో వి ద్యార్థుల్లో భాషాభివృద్ధి కార్యక్రమం(ఛైల్డ్ లాంగ్వేజ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్-క్లిప్),2009లో ఎల్‌ఈపీ కార్యక్రమాన్ని ప్రాథమిక విద్యా బోధనలో భాగంగా ప్రవేశపెట్టారు.

2010లో ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు స్నేహబాల కార్డులను ప్రవేశపెట్టారు. ఈ కార్డులను ఉపయోగిస్తూ ఉపాధ్యాయులు ఆయా తరగతుల విద్యార్థులకు బోధించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించుకోవడం ద్వారా ప్రాథమిక విద్యలో సంతృప్తికరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. 2011లో ఒకటో తరగతి విద్యార్థులకు ద్వితీయ భాషగా ఆంగ్లంను ప్రవేశపెట్టారు. ఇలా అనేక కార్యక్రమాల అమలు ద్వారా ప్రాథమిక విద్యాభివృద్ధికి సర్కారు సకల చర్యలు చేపట్టింది. అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు నిష్పత్తి తక్కువ గానే ఉంది. మూల్యాంకనా ప్రమాణాలు సక్రమంగా లేకపోవడం, పాఠశాలలోని పిల్లలకు భద్రతా సౌకర్యాల కొరత, ప్రైవేటు విద్యాసంస్థలలో అధిక ఫీజుల వసూలు, పరీక్షా విధానంలో లోపాలు, లింగ వివక్ష, బాలికల విద్య పట్ల అశ్రద్ధ, విద్యారంగంపై ప్రభుత్వ వ్యయం తక్కువగా ఉండటం, విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి సరిగా లేకపోవడం, ఇప్పటికీ వీడని డ్రాపౌట్ రేటు.... ఇలా మన రాష్ట్రంలోని ప్రాథమిక విద్యను పలు సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఇదే తరుణంలో ప్రైవేటు పాఠశాలలు అధికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో విస్తరిస్తున్నాయి.

పాథమిక విద్య పరిఢవిల్లాలంటే:

  • ప్రాథమిక విద్యావ్యవస్థ రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి. అవి
    • రెండు, మూడో తరగతి పూర్తయ్యేలోపు పాఠశాలలో చేరిన విద్యార్థికి ప్రాథమిక అంశాల పట్ల అవగాహన పెంపొందించాలి.
    • మూడు నుంచి ఐదో తరగతి విద్యార్థులలో హయ్యర్ గ్రేడ్ సాధించలేని వారిని గుర్తించి అవసరమైన సామర్థ్యాలను పెంపొందించాలి.
  • ధనిక, పేద వర్గాలు అనే తేడాలేకుండా అందరు చిన్నారులూ ప్రాథమికవిద్యను సర్కారు బడుల్లోనే విధిగా పూర్తి చేయాలి. ఇందుకు గాను 1 నుంచి 7వ తరగతి వరకు ప్రైవేటు విద్యాసంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వమే నిర్వహించేలా బాధ్యత తీసుకోవాలి. దీన్ని కచ్చితంగా అమలు చేస్తే మన ప్రాథమిక విద్య ప్రపంచానికే ఆదర్శవంతమవుతుంది.
  • విద్యా నాణ్యత పెంపొందించే విషయంలో కింది అంశాలపై దృష్టి సారించాలి.
    • పాఠ్య ప్రణాళిక, అభ్యసన లక్ష్యాలు (కరిక్యులమ్, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్)
    • బోధనాభ్యసన పరికరాలు (లెర్నింగ్ మెటీరియల్స్)
    • తరగతి గదులలో ఉపాధ్యాయుని మద్దతు
    • పాఠశాల నాయకత్వం, నిర్వహణ అభివృద్ధి (స్కూల్ లీడర్‌షిప్, మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్)
  • ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠశాలలను ఏర్పాటు చేసే విషయంలో సామాజిక, సాంస్కృతిక అంశాలను పరిగణనలోకి తీసుకోవడం.
  • మహిళా ఉపాధ్యాయులను అధికంగా నియమించడం, పాఠశాలలో విద్యార్థినుల నమోదు నిష్పత్తిని పెంచడం
  • ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే పటిష్టమైన వ్యవస్థాగత ఏర్పాటు అవసరం.

ఆధారము: సాక్షి

మానవాభివృద్ధి నివేదిక 2014

మానవ పురోగతి, సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడం.. ప్రధాన అంశాలుగా ఐక్యరాజ్య సమితికి చెందిన యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ).. మానవాభివృద్ధి నివేదిక-2014 విడుదలైంది. ఇందులోని ముఖ్యాంశాలు...

యూఎన్‌డీపీ మానవాభివృద్ధి నివేదిక-2014 తీవ్ర పేదరికం, కనీస అవసరాలకు కూడా నోచుకోని ప్రజల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను స్పష్టం చేసింది. దీంతో పాటు ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న ఆటంకాల నుంచి బయటపడి, తిరిగి పటిష్టమైన పురోగతి సాధించేందుకు అవసరమైన ప్రతిపాదనలు అందించింది. మొత్తంమీద ఈ నివేదిక బలమైన ఉమ్మడి కృషికి పిలుపునిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సహకారం, అడ్డంకులను అధిగమించడానికి అవసరమైన దృఢ సంకల్పం ఆవశ్యకతను నివేదిక స్పష్టం చేసింది. వివిధ దేశాల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా అమలుచేస్తున్న జాతీయ కార్యక్రమాలకు మద్దతును పెంచడంతో పాటు సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 2015 తర్వాత రూపొందించే అభివృద్ధి అజెండాలో పొందుపరచే విధంగా అంతర్జాతీయ సాంఘిక భద్రత విషయంలో అంతర్జాతీయ సమ్మతి ఆవశ్యకతను కూడా నివేదిక స్పష్టం చేసింది.

పేదరికం-సమస్యలు:

ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది (వీరిలో ఎక్కువ మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన వారు) ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆరోగ్యం, విద్య, కనీస జీవన ప్రమాణాలకు నోచుకోని ప్రజలు 150 కోట్లకు చేరుకున్నారు. దాదాపు 80 కోట్ల మంది పేదరిక రేఖ అంచున ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అనేక ప్రాంతాల్లో అసమానతలు కొంతమేర తగ్గినట్లు తెలిపింది. మరోవైపు విద్యారంగంలో ఇంకా అధిక అసమానతలు ఉన్నట్లు స్పష్టం చేసింది. పాతతరం ప్రజలు నిరక్ష్యరాస్యతతో ఇబ్బందిపడుతుండగా, ప్రాథమిక విద్య నుంచి మాధ్యమిక విద్యను అభ్యసించే క్రమంలో యువత సమస్యలు ఎదుర్కొంటోంది. విద్యారంగంలో దక్షిణాసియా, అరబ్ దేశాలతో పాటు సబ్ సహారా ఆఫ్రికా దేశాల్లో అసమానతలు ఎక్కువగా ఉన్నట్లు మానవాభివృద్ధి నివేదిక వెల్లడించింది. 2014 ముందు వెలువడిన మానవాభివృద్ధి నివేదికల ద్వారా అనేక దేశాల్లో ఎక్కువ మంది ప్రజల్లో మానవాభివృద్ధిలో ప్రగతి కనిపించినట్లు వెల్లడికాగా, ప్రస్తుత నివేదిక మాత్రం ప్రపంచ వ్యాప్తంగా జీవన ప్రమాణం, వ్యక్తిగత భద్రత, పర్యావరణం, ప్రపంచ రాజకీయాల్లో అనిశ్చిత వాతావరణం నెలకొన్నట్లు అభిప్రాయపడింది.

ఆఫ్రికా దేశాలు- మానవాభివృద్ధి:

ఆఫ్రికాలో సంక్షోభాలను నివారిస్తూ సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతున్న ప్రజలకు రక్షణ కల్పించడం అనేది సుస్థిర, సమ్మిళిత వృద్ధికి ముఖ్య సాధనంగా నివేదిక పేర్కొంది. సబ్ సహారా ఆఫ్రికాలోని దేశాలు ప్రజల కనీస అవసరాలపై దృష్టిసారించాలి. 2000-13 మధ్య ఆదాయం, విద్య, ఆరోగ్యం తదితర అంశాల్లో సబ్ సహారా ఆఫ్రికా ప్రగతి సాధించింది. ఈ కాలంలో అధిక ప్రగతికి సంబంధించి సబ్ సహారా ఆఫ్రికా మానవాభివృద్ధి సూచీలో రెండో స్థానం పొందింది. రువాండా, ఇథియోపియా వేగవంతమైన వృద్ధి సాధించగా, తదుపరి స్థానాల్లో అంగోలా, బురిండి, మాలి, మొజాంబిక్, యునెటైడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా, జాంబియా ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజల్లో 58.50 కోట్ల మంది (మొత్తం జనాభాలో 72 శాతం) బహుమితీయ (మల్టీ డైమన్షనల్) పేదరికం లేదా తిరిగి పేదరిక రేఖ దిగువకు చేరడానికి అవకాశం ఉన్నవారుగా పేర్కొంది. వీరికి రాజకీయాల్లో భాగస్వామ్యం కాగల సామర్థ్యం పరిమితంగా ఉండటం వల్ల జీవన ప్రమాణ స్థాయిని మెరుగుపరచుకోలేకపోతున్నారు. ఈ ప్రాంతం ఆరోగ్యానికి సంబంధించి ప్రపంచంలో అధిక అసమానతలున్న ప్రాంతమని నివేదిక స్పష్టం చేసింది. ఆదాయం, విద్య, పునరుత్పాదక ఆరోగ్య సేవల అందుబాటు విషయంలో లింగ సంబంధ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంత దేశాలు చిన్నారులకు తగిన సేవలు, యువతకు ఉపాధి, వృద్ధులకు చేయూత అందించే విధంగా విధానాలు రూపొందించుకోవాలి. ఆర్థిక వ్యవస్థల్లో సంభవించే విపత్తులను నివారిస్తూ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించినప్పుడే పేదరికం తగ్గి పురోగతి సాధ్యమవుతుందని నివేదిక స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలోని దేశాలు అన్ని రకాల సవాళ్లను అధిగమించాలంటే వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థల నుంచి పారిశ్రామిక, సేవల ఆధారిత వ్యవస్థలుగా రూపాంతరం చెందాల్సిన అవసరముంది.

నిర్లక్ష్యం పై పోరాటం

అధిక పేదరికంతో కనీస అవసరాలకు నోచుకోలేని ప్రజలను తీవ్ర నిర్లక్ష్యానికి గురైన వారిగా పేర్కొనవచ్చు. ఈ పరిస్థితిని విధానాలు, సాంఘిక నియమావళిలో మార్పు ద్వారా తగ్గించనట్లయితే మానవాభివృద్ధి కుంటుపడుతుంది. ప్రభుత్వాలు సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాల ప్రజలకు అనుకూలమైన విధానాలను, సంస్థాపర సంస్కరణలను అమలు చేయాలి. ప్రపంచ జనాభాలో 80 శాతం మంది ప్రజలకు సమగ్ర సాంఘిక రక్షణ లేదు. దాదాపు 12 శాతం మంది ప్రజలు దీర్ఘకాలంగా ఆకలితో అలమటిస్తున్నారు. ప్రపంచంలోని మొత్తం శ్రామికుల్లో సగం మందికిపైగా అసంఘటిత రంగంపై ఆధారపడి, ఉపాధిపరంగా అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో పరిమిత సామర్థ్యం కలిగిన ప్రజల్లో జీవన ప్రమాణ స్థాయి కుంటుపడింది. అనేక సాంఘికపరమైన అడ్డంకుల వల్ల వారికి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే సార్వత్రిక ప్రమాణాలు రూపొందించుకోవాలి. ఇవి వివక్ష, అసమానతలను తగ్గించేందుకు ఉపయోగపడతాయని నివేదిక పేర్కొంది.

పురోగతి దిశగా పయనించాలంటే

సమాజంలోని ప్రజల స్వేచ్ఛకు ఆటంకం కలిగించే అన్ని అడ్డంకులను తొలగించినప్పుడే మానవాభివృద్ధి సాధ్యం. ఆయా అడ్డంకులను ఎదుర్కొనే సామర్థ్యం వారిలో పెంపొందించాలి. దీనికి అవసరమైన చర్యలను నివేదిక సూచించింది. పటిష్ట సాంఘిక భద్రతను పెంపొందిస్తే వ్యక్తుల్లో విపత్తులు, అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొని, పురోగతి సాధించే సామర్థ్యం పెరుగుతుంది. కరువు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్వల్పకాల అత్యవసర పరిస్థితిలో భాగంగా సాంఘిక భద్రతా కార్యక్రమాలను అమలు చేసేందుకు పంపిణీ నెట్‌వర్క్, యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలి. సాంఘిక భద్రత.. ఉత్పత్తిలో ఒడిదుడుకులను తగ్గించడంతో పాటు వ్యయార్హ ఆదాయాలలోని ఒడిదుడుకులను తగ్గిస్తుంది.

పజా భాగస్వామ్య పాలన:

ప్రజలు ప్రత్యక్షంగా వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు పాలన మెరుగవుతుంది. ప్రజలతో దగ్గరి సంబంధం ఉన్నప్పుడు ప్రభుత్వం.. ప్రజా సమస్యలపై అవగాహన ఏర్పడి, విధానపరమైన జోక్యానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ప్రభుత్వ వనరులు సమర్ధంగా వినియోగమవుతాయని నివేదిక అభిప్రాయపడింది. స్వేచ్ఛ, భద్రత, తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా వెల్లడించగలిగే పరిస్థితి ఉంటే అభిలషణీయ నిర్ణయాలు తీసుకునే అవకాశం ప్రభుత్వాలకుంటుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు.. వాతావరణంలో మార్పులు, ఆర్థిక సంక్షోభం, సామాజిక అశాంతి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వీటిని అధిగమించాలంటే విధానాల్లో మార్పులతోపాటు విత్త యంత్రాంగం, సంస్థలు తగిన ద్రవ్యత్వాన్ని కలిగి ఉండేలా సిఫార్సులు అవసరం. తద్వారా విత్త వనరుల ప్రవాహంలో ఒడిదుడుకులు తగ్గుతాయి. వ్యవసాయం, సేవల వాణిజ్యానికి సంబంధించిన మార్గదర్శకాల సమీక్ష జరగాలి. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను దేశాలు మెరుగుపరచుకోవాలి. వాతావరణ మార్పులు ప్రపంచ అభివృద్ధి అజెండాకు ముఖ్యమైన సవాలుగా పరిణమించింది. దీనికి సంబంధించి సత్వర చర్యలు అవసరం.

సంపూర్ణ ఉద్యోగిత

50, 60వ దశకంలో స్థూల ఆర్థిక విధానాల లక్ష్యాలకు సంపూర్ణ ఉద్యోగిత కేంద్ర బిందువుగా ఉండేది. 1973, 1979లలో చమురు సంక్షోభం నేపథ్యంలో అవలంబించిన స్థిరీకరణ విధానాల్లో భాగంగా ఇది ప్రాధాన్యం కోల్పోయింది. ప్రస్తుతం తిరిగి దీనికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పురోగతికి మార్గం సుగమం చేయాలని నివేదిక పేర్కొంది. అధిక ఉపాధి కల్పన వల్ల ప్రభుత్వానికి పన్ను రాబడి పెరుగుతుంది. సాంఘిక ప్రయోజనం సాధించే సంపూర్ణ ఉద్యోగితకు ప్రపంచ దేశాలు ప్రాధాన్యమివ్వాలి. దీర్ఘకాల నిరుద్యోగం వల్ల ప్రజల్లో ఆరోగ్య ప్రమాణాలు క్షీణించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు కుంటుపడతాయని నివేదిక పేర్కొంది. ఉపాధి కల్పన ద్వారా సాంఘిక స్థిరత్వం, ఒకే లక్ష్యంతో పనిచేసే సమాజం ఏర్పడుతుంది.

మానవాభివృద్ధి జాబితాలో వివిధ దేశాల స్థానాలు

స్థానం

దేశం

సూచీ విలువ

1

నార్వే

0.944

2

ఆస్ట్రేలియా

0.933

3

స్విట్జర్లాండ్

0.917

4

నెదర్లాండ్స్

0.915

5

యునైటైడ్ స్టేట్స్

0.914

14

యునెటైడ్ కింగ్‌డమ్

0.892

17

జపాన్

0.890

73

శ్రీలంక

0.750

91

చైనా

0.719

135

భారత్

0.586

145

నేపాల్

0.540

146

పాకిస్థాన్

0.537

185

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్

0.341

186

కాంగో రిపబ్లిక్

0.338

187

నైజర్

0.337

మానవాభివృద్ధి నివేదిక- ప్రగతి:

2013 దత్తాంశాల ఆధారంగా రూపొందిన మానవాభివృద్ధి నివేదిక-2014.. 187 దేశాల మానవాభివృద్ధి సూచీని రూపొందించింది. నివేదిక.. దేశాలను అత్యధిక మానవాభివృద్ధి (49 దేశాలు), అధిక మానవాభివృద్ధి (53), మధ్యస్థ మానవాభివృద్ధి (42), అల్ప మానవాభివృద్ధి చెందిన దేశాలు (43)గా వర్గీకరించింది. మానవాభివృద్ధి సూచీలో నార్వే ప్రథమ స్థానం, ఆస్ట్రేలియా ద్వితీయ స్థానం, స్విట్జర్లాండ్ తృతీయ స్థానం పొందాయి. భారత్ 135వ స్థానంలో నిలవగా, చైనా 91వ స్థానంలో, నేపాల్ 145వ స్థానంలో, పాకిస్థాన్ 146వ స్థానంలో నిలిచాయి. నైజర్ చిట్టచివర 187వ స్థానం పొందింది.

భారత్ ప్రగతి:
  • భారత్ మానవాభివృద్ధి సూచీ విలువ 0.586. 187 దేశాల జాబితాలో 135వ స్థానం. గతం కంటే ఒక స్థానం మెరుగుపడింది
  • అసమానతలను సర్దుబాటు చేసిన మానవాభివృద్ధి సూచీ విలువ 0.418. కాగా ఈ సూచీకి సంబంధించిన స్థానం, హెచ్‌డీఐకి సంబంధించిన స్థానంలో తేడా శూన్యం.
  • లింగ సంబంధిత అసమానతల సూచీకి సంబంధించి భారత్ విలువ 0.563. కాగా ఈ సూచీకి సంబంధించిన భారత్ స్థానం 127.
  • లింగ సంబంధిత అభివృద్ధి సూచీకి సంబంధించి భారత్ విలువ 0.828. కాగా ఈ సూచీకి సంబంధించిన భారత్ స్థానం 132.
  • బహుమితీయ పేదరిక సూచీకి సంబంధించి భారత్ విలువ 0.282.
భారత్ వెనుకబాటుకు కారణం

యూఎన్‌డీపీ వివిధ సూచీలు రూపొందించడానికి పరిగణనలోకి తీసుకునే సూచికల్లో (ఐఛీజీఛిౌ్చ్టటట) భారత్ ప్రగతి సంతృప్తికరంగా లేదు. మానవాభివృద్ధి సూచీ రూపొందించడానికి ఉపయోగించే సూచికల ప్రగతిని పరిశీలిస్తే ఆయుర్దాయం 66.4 ఏళ్లు, తలసరి స్థూల జాతీయోత్పత్తి (కొనుగోలు శక్తి సామ్యం ఆధారంగా) 5,150 డాలర్లు. 25 లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారు విద్యను అభ్యసించిన సంవత్సరాల సరాసరి (మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్) 4.4 ఏళ్లుగా నమోదైంది. ప్రపంచంలోని అనేక దేశాలతో పోల్చినప్పుడు ఈ సూచికల ప్రగతి సంతృప్తికరంగా లేదు. లింగ సంబంధిత అసమానతల సూచీకి సంబంధించిన సూచికల ప్రగతిని పరిశీలించినప్పుడు ప్రసూతి మరణాల రేటు ప్రతి లక్ష జననాలకు 200 ఉంది. పార్లమెంటులో మొత్తం సభ్యుల్లో మహిళల వాటా 10.9 శాతంగా ఉంది.

  • లింగ సంబంధిత అభివృద్ధి (జీడీఐ) సూచికలను పరిశీలిస్తే మహిళలలో ఆయుర్దాయం 68.3 ఏళ్లు, పురుషుల్లో ఆయుర్దాయం 64.7 ఏళ్లు, అంచనా వేసిన తలసరి స్థూలజాతీయోత్పత్తి మహిళల్లో రూ.2,277గా, పురుషుల్లో రూ.7,833గా నమోదైంది.

బహుమితీయ పేదరిక సూచీ రూపొందించడానికి వినియోగించిన సూచికల ప్రగతిని పరిశీలిస్తే బహుమితీయ పేదరికానికి దగ్గరగా ఉన్న జనాభా 18.2 శాతం, తీవ్ర పేదరికంలో ఉన్న జనాభా 27.8 శాతం, జాతీయ పేదరిక రేఖ 21.9 శాతంగా నమోదైంది.

ఆధారము: సాక్షి

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate