অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆర్థిక అక్షరాస్యత ఎంతో అవసరం!

ఆర్థిక అక్షరాస్యత ఎంతో అవసరం!

బ్యాంకింగ్ రంగ సేవల్లో ఇటీవల కాలంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ చూసినా ఎటీఎంలు, ప్రజల చేతుల్లో క్రిడెట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్... ఇలా ఎనె్నన్నో అనూహ్యమైన సౌకర్యాలు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. అవునా?

అందరికీ అందుబాటులో వచ్చాయా? మామూలుగా చూస్తే అందుబాటులోకి వచ్చినట్లే కనిపిస్తుంది కానీ వాస్తవం వేరుగా ఉంది.

భారతదేశంలో 41 శాతం మంది వయోజనులకు బ్యాంకుల సేవలు అందుబాటులో లేవు. 39 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారికి, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న 60శాతం మందికి బ్యాంకుల సేవలు అందటం లేదు. అమర్యాదపూర్వకంగా, బాధ్యతా రాహిత్యంతో అధికారులు ప్రవర్తించటం ఒక సమస్య కాగా, రుణాల బకాయిలను వసూలు చేసేందుకు గూండాలను నియమించటం, రుణాలు, క్రెడిట్ కార్డుల కాంట్రాక్ట్ నిబంధనల్లో అనుచిత విధానాలను అనుసరించటం వంటి కారణాలవల్ల ప్రజలు ఈ సేవలను పొందేందుకే భయపడుతున్నారు.

ఇటీవల ఒకానొక గుంటూరు జిల్లాలోని బ్యాంకు అధికారులు రుణాలు తిరిగి చెల్లించలేదంటూ రైతుల ఫోటోలను బ్యాంకులో నోటీసు బోర్డుల మీద ప్రదర్శించటం వివాదస్పదం కావటం ఇందుకు ఒక ఉదాహరణ. ఇక మరోపక్క పొదుపు ఖాతాను ప్రారంభించేందుకు బ్యాంకులు విధించే నియమనిబంధనలు, వాళ్ళు అడిగే ధృవీకరణ పత్రాలూ ఇవ్వలేక సామాన్య రైతులు, కూలీలు, చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకు బ్రతికేవాళ్ళూ బ్యాంకులో ఖాతాను ప్రారంభించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఇలా ఉండగా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుపోయే సంస్థలు మాత్రం బ్యాంకులలో ఏ ఇబ్బందీ లేకుండా అన్నిరకాల ఖాతాలను ప్రారంభించటం మనం చూస్తూనే ఉన్నాం.

స్థిరమైన, భద్రమైన, సముచితమైన ఆర్థిక సేవలు వినియోగదారులకు అందవలసిన అవసరం ఉంది. మన జనాభాలో అత్యధికులు తక్కువ ఆదాయం కలిగి ఉన్న కుటుంబాలకు చెందినవారేననేది ఎవరూ కాదనలేని వాస్తవం. వీరంతా ఆర్థిక సేవల నుంచి మినహాయింపబడిన వారు. అంటే బ్యాంకులు, ఇతర ఆర్థిక సేవా సంస్థలకు సంబంధించిన ఆర్థిక సేవలను అందుబాటు ధరలో పొందలేని వారు వీళ్ళు. రైతు కుటుంబాల్లో 50 శాతానికి రుణ సదుపాయం అందుబాటులో లేదు. దీంతో వీరంతా కూడా వడ్డీ వ్యాపారుల ధన దాహానికి బలవుతున్నారు. బయట అప్పు తీసుకొన్న పేదలు అనవసర వ్యధలకు గురవుతున్నారు. వేధింపులకు గురవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడటమే శరణ్యమని మరి కొందరు భావిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఆర్థిక సేవలు అందుబాటులో లేనందువల్ల గ్రామీణ ప్రజలకు అప్పు పొందేందుకు ప్రధానమైన వనరుగా వడ్డీ వ్యాపారులు మారుతున్నారని డాక్టర్ సి. రంగరాజన్ కమిటీ నివేదిక వెల్లడించింది.

బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక సేవలను అందించేందుకు గ్రామీణ సహకార బ్యాంకులు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ, పారిశ్రామిక సంస్థలకు సాయం అందిస్తున్నాయి. కానీ ఈ సహకార బ్యాంకులపై రాజకీయ నాయకుల ఆధిపత్యం పెరిగిన తర్వాత, ఎన్నో గ్రామీణ బ్యాంకులు విఫలమయ్యాయి. బ్యాంకుల రుణ సదుపాయాలన్నీ కూడా పెద్దపెద్ద సంస్థలకు మళ్లాయి. దురదృష్టవశాత్తు, దేశంలో చట్టాలు కూడా ధనవంతులకే అనుకూలంగా ఉన్నాయి. దిగువ, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వ్యధలకు గురవుతున్నారు. క్రెడిట్ కార్డుల గురించి ఫిర్యాదులు లేని రోజు లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు.

2009లో బ్యాంకులకు వ్యతిరేకంగా వినియోగదారులు చేసే ఫిర్యాదుల సంఖ్య 44 శాతం పెరిగిందని రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. వీటిలో సింహభాగం క్రెడిట్ కార్డుల ఫిర్యాదులే ఆక్రమిస్తున్నాయి. అలాగే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలలో డిపాజిట్ చేసిన మొత్తాలను పూర్తిగా కోల్పోయి రోడ్డున కుటుంబాలు కూడా ఎన్నో ఉంటున్నాయి. చిట్‌ఫండ్ కంపెనీలు కూడా చందాదారులకు తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తున్న సంఘటనలు అనేకం. రిజిస్టర్ కాని సంస్థలు ఎన్నో గణనీయ మొత్తాలను సేకరించి మాయమై పోవటం మనం చూస్తూనే ఉన్నాం. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ప్రైవేట్ బ్యాంకులు మూతపడటం చూస్తూనే ఉన్నాం.

క్రెడిట్ కార్డులు ఇటీవల కాలంలో ప్రాచుర్యాన్ని పొందినప్పటికీ, అత్యధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయనీ, వసూళ్ళ కోసం వేధిస్తున్నాయనీ, ఎన్నో ఫిర్యాదులు దాఖలవుతున్నాయి. రిజర్వ్ బ్యాంకు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ, వసూళ్ళ కోసం వేధిస్తూనే ఉన్నాయి. అప్పుపైన వస్తువును కొనేముందు దానిని తీర్చగల తాహతు, స్థాయి మనకు ఉందో లేదో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. వాహనాలను రుణంతో తీసుకొని రెండు మూడు సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా వాయిదాలు కట్టి, ఆపై కట్టలేక వాహనాన్నీ, అప్పటిదాకా కట్టిన డబ్బునూ కొందరు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు మన కుటుంబంలో చోటుచేసుకోకూడదంటే, ఆర్థిక అక్షరాస్యతను మనం కలిగిఉండాలి. ఆర్థిక సంస్థలు అందించే సేవల గురించి ముందుగానే తెలుసుకొని ఉండాలి. అందుకు సంబంధించిన చట్టాల గురించిన అవగాహన కూడా అవసరం.

ఆధారము: అర్ కైవేస్.ఆంధ్ర భూమి.నెట్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate