పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పసిడి నగదీకరణ పథకం

పసిడి నగదీకరణ పథకం

మనదేశంలో ఇళ్లల్లో ఖాళీగా ఉండిపోయిన రూ.లక్షల కోట్ల విలువైన బంగారాన్ని బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తీసుకొచ్చే పసిడి నగదీకరణ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. బంగారం దిగుమతులకు అడ్డుకట్ట వేసే కాగితం బాండ్లను విడుదల చేశారు. తొలిసారిగా భారతీయ బంగారు నాణేన్నీ, బులియన్‌ను ఆవిష్కరించారు. దీనిపై ఒకవైపు జాతీయ చిహ్నమైన అశోకచక్రం, మరోవైపు మహాత్మాగాంధీ చిత్రం చెక్కారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ పథకాలు బంగారానికి మరిన్ని వన్నెలద్దడం అనేదానికొక ఉదాహరణగా అభివర్ణించారు. పథకాల్ని ప్రజలు ఉపయోగించుకుని, జాతి నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. 20 వేల టన్నుల బంగారాన్ని గృహాలు, వివిధ సంస్థల్లో ఖాళీగా ఉంచడంలో అర్థం లేదనీ, కొన్ని ప్రయత్నాలు, సరైన విధానాలతో భారత్‌పై పేదదేశమనే ముద్రను తొలగించవచ్చన్నారు. అశోకచక్రంతో కూడిన భారతీయ బంగారు నాణేన్ని విడుదల చేయడం దేశానికి గర్వకారణమనీ, ఇకపై ప్రజలు విదేశాల్లో తయారైన బంగారం కడ్డీలు, నాణేలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. నాణేలు రూపొందించే ప్రక్రియ భారత్‌లో తయారీ కార్యక్రమానికీ వూతమిస్తుందని పేర్కొన్నారు. భారత్‌లోని పొదుపు సంప్రదాయం, బంగారం ద్వారా మహిళలు సాధికారత పొందే సంస్కృతిని గుర్తుచేసుకుంటూ.. ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ కూడా అర్థశాస్త్రానికీ, గృహశాస్త్రానికీ మధ్య తేడాను గుర్తిస్తారంటూ చతురోక్తి విసిరారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. బంగారం దిగుమతుల్ని తగ్గించాల్సిన అవసరం ఉందనీ, బాండు పథకం భౌతిక బంగారానికి డిమాండును తగ్గిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. బంగారాన్ని ఇళ్లలో ఖాళీగా ఉంచుకోవడం వల్ల వ్యక్తిగత పొదుపుగా ఉపయోగపడుతుందేమోగానీ, దేశ అభివృద్ధికి తోడ్పడదని పేర్కొన్నారు. ఈ మూడు పథకాల నుంచి ప్రజలు ప్రయోజనాలు పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

పథకాల తీరిదీ..

  • ప్రారంభంలో బంగారం నాణేలు 5, 10 గ్రాముల్లో అందుబాటులోకి వస్తాయి. 125 ఎంఎంటీసీ కేంద్రాల ద్వారా 20 గ్రాముల బంగారం కూడా అందుబాటులోకి తీసుకొస్తారు.
  • పసిడి నగదీకరణ పథకం(జీఎంఎస్‌), 2015 కింద బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టే డిపాజిట్‌దారులకు 2.5 శాతం వార్షిక వడ్డీ దక్కుతుంది.
  • భౌతికంగా బంగారం కొనడాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ప్రారంభించిన అధికార పసిడి బాండ్ల పథకంలో 2.75 శాతం వార్షిక వడ్డీ ఇస్తారు.
  • కొనుగోలుదారులు శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌)ను, వినియోగదారుల సమాచారం తెలిపే కేవైసీ పత్రాల్ని అందజేయాల్సి ఉంటుంది.
  • పసిడి నగదీకరణ పథకం కింద ఆర్జనకు క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను, సంపదపన్ను, ఆదాయపన్నుల నుంచి మినహాయింపు లభిస్తుంది. నిర్దేశిత బ్యాంకులు బంగారం డిపాజిట్లను స్వల్పకాలిక (1-3 సంవత్సరాలు), మధ్యకాలిక (5-7 సంవత్సరాలు), దీర్ఘకాలిక (12-15 సంవత్సరాలు) పథకాల కింద స్వీకరిస్తాయి.
  • ప్రపంచంలో భారత్‌ అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా నిలుస్తోంది. భారత్‌ ఏటా వెయ్యి టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఫలితంగా విదేశీ మారకద్రవ్యం ఖర్చయిపోతూ, ద్రవ్యలోటు ఒత్తిడి పెరిగిపోతోంది. మనదేశంలో రూ.52 లక్షల కోట్ల విలువైన 20 వేల టన్నుల బంగారం గృహాలు, ఆలయాల్లో ఉండిపోయినట్లు అంచనా.
2.95402298851
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు