పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ముందస్తు ఆదేశం

ముందస్తు ఆదేశం

ముందస్తు ఆదేశం (Advance Ruling) అంటే అర్థమేమిటి?

సీజీఎస్టీ/ఎస్జీఎస్టీనమూనా చట్టాల్లోని సెక్షన్ 94 ప్రకారం, 'ముందస్తు ఆదేశం' అంటే.. సెక్షన్ 97లో వివరించబడిన అంశాలు, సందేహాలు తదితరాలపై సంబందిత అదికార స్థానం దరఖాస్తుదారుకు అందజేసే లిఖితపూర్వక నిర్ణయమని అర్థం (సెక్షన్ 99).

సెక్షస్ 97లో వివరించిన అంశాలలో ముందస్తు ఆదేశం కోరదగినవి ఏవి? జవాబు: దిగువ పేర్కొన్న అంశాలపై ముందస్తు ఆదేశం కోరవచ్చు:-

 1. చట్టం కింద వస్తువులు లేదా సేవల వర్గీకరణ;
 2. చట్ట నిబంధనల మేరకు జారీ చేయబడి, పన్ను శాతంతో    సంబంధంగల అధికార ప్రకటన అన్వయం;
 3. చట్ట నిబంధనల కింద వస్తువులు లేదా సేవల విలువ నిర్ణయార్థం      అనుసరించాల్సిన సూత్రావళి;
 4. ఉత్పాదక కొనుగోళ్లపై చెల్లించిన లేదా చెల్లించాల్సివచ్చే పన్ను మినహాయింపు (ITC) అంగీకార యోగ్యత;
 5. ఏవైనా వస్తువులు లేదా సేవలపై చట్టం ప్రకారం పన్ను బాధ్యత    నిర్ణయం;
 6. చట్టం కింద దరఖాస్తుదారు నమోదు కావాల్సి ఉన్నప్పుడు;
 7. ఏవైనా వస్తువులు సేవలకు సంబంధించి దరఖాస్తుదారు ప్రత్యేకంగా ఏదైనా చేసినప్పుడు అది సదరు అంశం ప్రకారం వస్తువులు లేదా సేవల సరఫరా కిందకు వచ్చే అవకాశం ఉన్నప్పుడు.

ముందస్తు ఆదేశక యంత్రాంగం కలిగి ఉండటంలోని లక్ష్యమేమిటి?

అటువంటి యంత్రాంగం ఏర్పాటుకుగల విస్తృత లక్ష్యం ఏమిటంటే:-

 1. దరఖాస్తుదారు చేపట్టబోయే ప్రతిపాదిత కార్యకలాపాల సంబంధిత పన్ను బాధ్యతపై ముందస్తు స్పష్టత ఇవ్వడం;
 2. విదేశీ ప్రత్యక పెట్టుబడు (FDI)లను ఆకర్షించడం;
 3. వివాదాలను తగ్గించడం;
 4. పారదర్శక, చౌకైన పద్ధతిలో వేగంగా ఆదేశాలివ్వడం.

జీఎస్టీ కింద ముందస్తు ఆదేశక యంత్రాంగం (AAR) కూర్పు ఎలా ఉంటుంది?

‘ముందస్తు ఆదేశక యంత్రాంగం' (AAR)లో సీజీఎస్టీ, ఎస్జీఎస్టీల నుంచి చెరొక సభ్యుడు ఉండాలి. వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తాయి. వారి నియామకానికి యోగ్యత, అర్హత పరతులు జీఎస్టీ నమూనా చట్ట నిబంధనలలో నిర్దేశించబడ్డాయి (సెక్ష]న్ 95).

ముందస్తు ఆదేశక యంత్రాంగ ఉత్తరాధికార సంస్థ (అప్పిలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్-AAAR) అంటే ఏమిటి... దాని కూర్పు ఎలా ఉంటుంది?

ఏఏఆర్ ఇచ్చే ముందస్తు ఆదేశాలపై దాఖలయ్యే పునర్విచారణ అభ్యర్ధనలను ముందస్తు ఆదేశక యంత్రాంగ ఉత్తరాధికార సంస్థ (AAAR) విచారిస్తుంది. ఇందులో ఇద్దరు సభ్యులుంటారు. వారిలో ఒకరుగా సీజీఎస్టీ చీఫ్ కమిషనర్ను కేంద్ర ఎగుమతి-దిగుమతి సుంకాల బోర్డు (CBEC) నియమిస్తుంది. దరఖాస్తుదారుపై అధికార పరిధిగల ఎస్జీఎస్టీకమిషనర్ మరొక సభ్యుడుగా ఉంటారు (సెక్షన్ 96).

జీఎస్టీ కింద ఏఏఆర్, ఏఏఏఆర్ ల ఏర్పాటు ఏ విధంగా ఉండవచ్చు?

ప్రతి రాష్ట్రానికీ ఒక ఏఏఆర్, ఏఏఏఆర్ యంత్రాంగాల వంతున ఉంటాయి (సెక్షన్ 95, 96).

ముందస్తు ఆదేశాలు ఎవరెవరికి వర్తిస్తాయి?

ఏఏఆర్, ఏఏఏఆర్లు ఇచ్చే ముందస్తు ఆదేశాలు సెక్షన్ 102 ప్రకారం దరఖాస్తుదారు, అతడిపై అధికారపరిధిగల పన్ను అధికారికి మాత్రమే వర్తిస్తాయి. రాష్ట్రంలో దరఖాస్తుదారువంటి ఇతర పన్ను చెల్లించే వ్యక్తులకు వర్తించదన్నది ఇందులోని అంతరార్థం. దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి మాత్రమే సదరు ముందస్తు ఆదేశాలు పరిమితం.

ముందస్తు ఆదేశం వర్తింపునకుగల కాలపరిమితి ఎంత?

ముందస్తు ఆదేశం వర్తింపునకు ఎలాంటి కాలపరిమితిని చట్టం పేర్కొనలేదు. దానికి బదులుగా వాస్తవ ముందస్తు ఆదేశానికి మద్దతునిచ్చే చట్టం, వాస్తవాలు లేదా పరిస్థితులు మారేదాకా అది అమలులో ఉంటుందని సెక్షన్ 102లో నిర్దేశించింది.

ముందస్తు ఆదేశం రద్దుకు అవకాశం ఉందా?

ఉంది... దరఖాస్తుదారు మోసపూరితంగా లేదా వాస్తవాలను దాచిపెట్టడం లేదా వాస్తవాలను వక్రీకరించడంద్వారా ముందస్తు ఆదేశం పొందినట్లు ఏఏఆర్, ఏఏఏఆర్లు కనుగొన్న పక్షంలో సెక్షన్ 103 ప్రకారం 'జారీ చేసిన నాటినుంచే (ab initio void) అది రద్దయినట్లు ప్రకటించే వీలుంది. అటువంటి పరిస్థితులలో ముందస్తు ఆదేశమే జారీకాలేదని భావించి సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ చట్టాల్లోని అన్ని నిబంధనలను దరఖాస్తుదారుకు వర్తింపజేయవచ్చు (అయితే, ఇది ముందస్తు ఆదేశం ఇచ్చిన తేదీనుంచి రద్దయినట్లు ప్రకటిస్తూ ఆదేశం జారీచేసిన తేదీ మధ్య కాలాన్ని మినహాయించాలి). కానీ, దరఖాస్తుదారు వాదనను విన్న తర్వాత మాత్రమే ముందస్తు ఆదేశం రద్దయినట్లు ప్రకటిస్తూ ఉత్తర్వు జారీచేయాల్సి ఉంటుంది.

ముందస్తు ఆదేశం పొందే ప్రక్రియ ఏమిటి?

ముందస్తు ఆదేశం పొందే ప్రక్రియను సెక్షన్ 97, 98 వివరిస్తున్నాయి. ముందస్తు ఆదేశం పొందగోరే దరఖాస్తుదారు నిర్దేశిత ఫారం, పద్ధతులలో ఏఏఆర్ కు దరఖాస్తు చేసుకోవాలని సెక్షన్ 97 పేర్కొంటోంది. దరఖాస్తు చేసుకునే సవివర ప్రక్రియ, ఫారం స్వరూపం జీఎస్టీ నమూనా నిబంధనలలో ఇవ్వబడతాయి. ముందస్తు ఆదేశం కోసం దరఖాస్తు అనంతర ప్రక్రియను సెక్షన్ 98 వివరిస్తుంది. దరఖాస్తుదారు ఎవరి పరిధిలోకి వస్తారో సదరు అధికారికి ఏఏఆర్ దరఖాస్తు నకలును పంపి, సంబంధిత రికార్డుల సమర్పణ కోరాల్సి ఉంటుంది. అవి అందిన తర్వాత వాటితోపాటు అవసరమైతే దరఖాస్తుదారు వివరణను తీసుకుని సదరు దరఖాస్తును ఏఏఆర్ పరిశీలిస్తారు. ఆ తర్వాత ఆమోదం లేదా తిరస్కృతి తెలియజేస్తూ ఆదేశం జారీచేస్తారు.

ముందస్తు ఆదేశం కోసం వచ్చిన దరఖాస్తును తోసిపుచ్చక తప్పని పరిస్థితులేమిటి?

జవాబు: కొన్ని పరిస్థితులలో దరఖాస్తును తప్పనిసరిగా తిరస్కరించాల్సి వస్తుంది. వాటి గురించి సెక్షన్ 98(2)లో పేర్కొన్న వివరణలు కిందివిధంగా ఉంటాయి:-

 1. దరఖాస్తుపై తలెత్తిన సందేహంమీద దరఖాస్తుదారుకు సంబంధించిన కేసు ఏదైనా ఎఫ్ఎఎ, పునర్విచారణ ధర్మాసనం లేదా ఏదైనా కోర్టు విచారణలో ఉన్నపుడు;
 2. దరఖాస్తుపై తలెత్తిన అదేవిధమైన సందేహంమీద దరఖాస్తుదారుకు సంబంధించిన ఏదైనా అంశంమీద ఎఫ్ఎఎ, పునర్విచారణ ధర్మాసనం లేదా ఏదైనా కోర్టు అప్పటికే నిర్ణయం ప్రకటించినప్పుడు;
 3. దరఖాస్తుపై తలెత్తిన అదేవిధమైన సందేహంమీద దరఖాస్తుదారుకు సంబంధించి చట్ట నిబంధనల కింద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు;
 4. దరఖాస్తుపై తలెత్తిన అదేవిధమైన సందేహంమీద దరఖాస్తుదారుకు సంబంధించిన కేసులో న్యాయ నిర్ణయాధికార స్థానం లేదా అంచనాల అధికార స్థానం ఏది వర్తిస్తే అది అప్పటికే నిర్ణయం ప్రకటించి ఉన్నప్పుడు. దరఖాస్తును తిరస్కరిస్తూ జారీచేసే ఉత్తర్వు అందుకు కారణాలేమిటో ‘సుస్పష్ట ‘వివరణతో కూడి ఉండాలి.

దరఖాస్తును అంగీకరించిన తర్వాత ఏఏఆర్ అనుసరించాల్సిన ప్రక్రియ ఏమిటి?

దరఖాస్తును అంగీకరించినట్లయితే అది అందిన నాటినుంచి 90 రోజులలో ఏఏఆర్ తన ఆదేశాలను ప్రకటించాలి. ఆదేశం ఇచ్చేముందు దరఖాస్తును, దానితోపాటు దరఖాస్తుదారు అందజేసిన ఇతర సమాచారాన్ని తాను లేదా సంబంధిత శాఖాపరమైన అధికారి క్షుణ్నంగా పరిశీలించాలి. అలాగే ఆదేశాలిచ్చే ముందు దరఖాస్తుదారు లేదా వారి అధీకృత ప్రతినిధితోపాటు సదరు అధికార పరిధిగల సీజీఎస్టీ/ఎస్జీఎస్టీ అధికారుల వివరణ కూడా ఏఏఆర్ తప్పక తీసుకోవాలి.

ఏఏఆర్లోని సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే ఏమవుతుంది?

ఏఏఆర్లోని సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలుంటే. ఏయే అంశాలపై తాము విభేదిస్తున్నదీ ఏఏఏఆర్ పరిశీలనకు నివేదించాలి. ఏఏఏఆర్ లోని కూడా ఏఏఆర్ నివేదించిన అంశాలపై ఏకాభిప్రాయం సాధించలేకపోతే ఏ అంశంలో సదరు భేదాభిప్రాయం తొలగలేదో దానిపై ఆదేశం ఇచ్చే వీలు లేదు.

ఏఏఆర్ ఆదేశాలపై పునర్విచారణ కోరేందుకుగల నిబంధనలేమిటి?

ఏఏఏఆర్ సమకంలో పునర్విచారణ అభ్యర్ధన దాఖలుకు సంబంధించి జీఎస్టీ నమూనా చట్టంలోని సెక్షన్ 99, 100 వివరిస్తున్నాయి. ఏఏఆర్ పరిశీలన వల్ల బాధితుడైన దరఖాస్తుదారు పునర్విచారణ కోరుతూ ఏఏఏఆర్కు అభ్యర్ధన దాఖలు చేసుకోవచ్చు. అలాగే ఏఏఆర్ పరిశీలన ఫలితాలతో సీజీఎస్టీ/ఎస్జీఎస్టీలలోని సంబంధిత పరిధిగల అధికారి కూడా ఏకీభవించకపోతే ఏఏఏఆర్లో పునర్విచారణ అభ్యర్ధన దాఖలు చేయవచ్చు. సీజీఎస్టీ/ఎస్జీఎస్టీ నిర్దేశిత అధికారి' అంటే ముందస్తు ఆదేశాల దరఖాస్తులకు సంబంధించి సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ పాలన యంత్రాంగం నియమితుడైన అధికారి. సదరు అధికారి సాధారణంగా దరఖాస్తుదారు ఉన్న ప్రదేశపు అధికారి పరిధిగలవారై ఉంటారు. అలాంటి సందర్భాల్లో సంబంధిత అదికారి సీజీఎస్టీ/ఎస్జీఎస్టీ అధికార పరిదిగల వారవుతారు. ఇక ఎలాంటి పునర్విచారణ అభ్యర్థననైనా ముందస్తు ఆదేశం అందిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దాఖలు చేయాలి. అది నిర్దేశిత రూపంలో ఉండటంతోపాటు నిర్దేశిత పద్ధతిలో దాని పరిశీలన సాగాలి. ఈ మేరకు జీఎస్టీ నమూనా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. పునర్విచారణ అభ్యర్ధన దాఖలైన తర్వాత అభ్యర్థనదారుల వాదన విన్న అనంతరం 90 రోజుల్లోగా పునర్విచారణ స్థానం ఆదేశాలు జారీచేయాలి. పునర్విచారణ అభ్యర్థనలోని ఏ అంశంతోనైనా ఏఏఏఆర్లోని సభ్యులు ఏకాభిప్రాయానికి రాలేకపోతే సదరు అభ్యర్ధన కింద దానిపై ఎలాంటి ముందస్తు ఆదేశం ఇవ్వరాదని నిర్ణయించాలి.

ఆదేశాలలో పొరపాట్ల దిద్దుబాటుకు ఏఏఆర్, ఏఏఏఆర్ లు ఉత్తర్వు ఇవ్వవచ్చా?

ఇవ్వవచ్చు. ఆదేశం జారీ అయిన తర్వాత రికార్డుల ప్రకారం అందులో పొరపాట్లు ఏవైనా ఉంటే వాటిని సరిదిద్దడానికి ఆరు నెలల్లోగా ఏఏఆర్, ఏఏఏఆర్ లు ఉత్తర్వులు ఇచ్చేందుకు చట్టంలో ని సెక్షన్ 101 అధికారాలు కల్పించింది. సదరు పొరపాట్లను అధికారులే స్వయంగా గుర్తించి ఉండవచ్చు లేదా దరఖాస్తుదారు లేదా నిర్దేశిత అధికారపరిధిగల సీజీఎస్టీ/ఎస్జీఎస్టీ అదికారి వారి దృష్టికి తెచ్చినది కావచ్చు. అయితే సదరు దిద్దుబాటువల్ల దరఖాస్తుదారు పన్ను బాధ్యత పెరగడం లేదా ఉత్పాదక కొనుగోలు పన్ను మినహాయింపు (ITC) పరిమూణం తగ్గటం వంటి ప్రభావం పడేట్లయితే ఉత్తర్వు జారీకి ముందు దరఖాస్తుదారు వాదన వినడం తప్పనిసరి.

ఆధారం : సెంట్రల్ బోర్డ్ అఫ్ ఎక్సైజ్ మరియు కస్టమ్స్

2.99233716475
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు