పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వస్తుసేవల సరఫరా ప్రదేశం

వస్తుసేవల సరఫరా ప్రదేశం

జీఎస్టీ కింద వస్తుసేవల సరఫరా ప్రదేశం అవసరమేమిటి?

సరఫరా అయ్యే వస్తువులకు వినియోగస్థానమైన గమ్యంలో లేదా వినియోగ ప్రదేశంలో పన్ను విధింపును సమర్థంగా అమలు చేయడమే జీఎస్టీ ప్రాథమిక సూత్రం. అందువల్ల సరఫరా నిబంధన సదరు స్థానాన్ని అంటే పన్ను రాబడి చేరాల్సిన పన్ను విధింపు పరిధి స్థానాన్ని నిర్ణయిస్తుంది. సదరు లావాదేవీ అదే రాష్ట్రంలోనిదా లేక అంతర్రాష్ట్ర పరిధికి చెందినదా అన్న అంశాన్ని సరఫరా ప్రదేశం నిర్ణయిస్తుంది. మొత్తంమీద సరఫరాలు సంబంధిత రాష్ట్రంలో ఉమ్మడిగా ఎస్జీఎస్టీ, సీజీఎస్టీల కిందకు వస్తాయా లేక అంతర్రాష్ట్ర సరఫరాగా ఐజీఎస్టీ కిందకు వస్తాయా అన్నది నిర్ణయించేందుకు వస్తుసేవల సరఫరా ప్రదేశం నిర్ధారణ అవసరం.

వస్తువులు, సేవల విషయంలో సరఫరా నిబంధనలు భిన్నంగా ఎందుకుంటాయి?

వస్తువుల స్వరూపం సాకారం (కంటికి కనిపించేది) కనుక వినియోగ గమ్యం నిర్ధారణలో ఎటువంటి సమస్య ఉండదు. అయితే సేవలు నిరాకారం (కంటికి కనిపించనిది) కాబట్టి సరఫరా గమ్య నిర్ధారణలో ప్రధానంగా కింది అంశాల వల్ల సమస్యలు ఎదురవుతాయి:-

 • సేవా ప్రదాన (అందించే) పద్ధతిని సులభంగా మార్చవచ్చు. ఉదాహరణకు టెలిఫోన్ సేవలను ముందుగా చెల్లింపు/తర్వాత చెల్లింపు వంటి విధానాలకు పరస్పరం మార్చుకోవచ్చు. బిల్లు విధించాల్సిన చిరునామా మార్చవచ్చు. బిల్లు విధించేవారి చిరునామా మారవచ్చు. సాఫ్ట్ వేర్ మరమ్మతు లేదా నిర్వహణ పద్ధతి   ఆన్ సైట్ (ప్రదేశం) నుంచి ఆన్ లైన్ (ఇంటర్నెట్)కు మారవచ్చు. బ్యాంకుల సేవల కోసం లోగడ ఖాతాదారులు బ్యాంకుకు వెళ్లాల్సి రాగా, నేడు ఎక్కడినుంచయినా ఖాతాదారు సేవలు పొందే విధానం  అమలులోకి వచ్చింది;
 • అందించే సేవ, సేవా ప్రదాత (Service provider) సేవా గ్రహీత (Service receiver)ల ప్రదేశ నిర్ధారణ సాధ్యం కాకపోవచ్చు లేదా   కదలికలేవీ కనిపించవుగనుక జాడ కనుగొనడం దాదాపు  అసాధ్యమైనందువల్ల గోప్యత పాటించడం కూడా చాలా సులువు;
 • సేవలందించేందుకు సేవా ప్రదాతకు నిర్దిష్ట ప్రాంతం తప్పనిసరి కాదు. అలాగే సేవాగ్రహీత కూడా ఎక్కడున్నా సేవలు పొందగలిగే వీలుంది. బిల్లు విధించే చిరునామాను తెల్లవారేలోగా మార్చగల వీలుంది;
 • కొన్ని సందర్భాల్లో ప్రధాన మూలం ఒకటికి మించిన ప్రదేశాలకు  విస్తరించవచ్చు. ఉదాహరణకు రైలు మార్గం, జాతీయ రహదారి లేదా  నదిపై వంతెన నిర్మాణం వంటివి ఒక రాష్ట్రంలో మొదలై మరో రాష్ట్రంలో ముగియవచ్చు. అదేవిధంగా ఒక సినిమా పంపిణీ, ప్రదర్శనలపై ముద్రాపక హక్కు (Copy right)ను ఒకేఒక లావాదేవీతో సంక్రమింపజేయవచ్చు. లేదా ఒక వాణిజ్య ప్రకటన లేదా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఒకే సమయంలో ప్రసారం చేయవచ్చు. ఒక విమాన సంస్థ దేశంలోని ఏ రెండు ప్రాంతాలమధ్యనైనా ప్రయాణానికి వాడుకునేలా సుమారు పది పత్రాలతో టికెట్లు (Seasonal tickets) జారీచేయవచ్చు. ఢిల్లీ మెట్రో జారీచేసిన కార్డును ఆ సంస్థకు తెలియకుండా ఒక వ్యక్తి ఢిల్లీ లేదా నోయిడా లేదా ఫరీదాబాద్ లో వినియోగించవచ్చు. కార్డు జారీ సమయంలో చెల్లింపు సందర్భంగా ప్రదేశాలు, ప్రయాణాలను ఢిల్లీ మెట్రో కనుగొనలేదు గనుక ఇవన్నీ సాధ్యమే;
 • సేవలన్నీ నిరంతర పరిణామానికి గురయ్యేవేగనుక కొత్త సవాళ్లను విసురుతుంటాయి. ఉదాహరణకు 15-2O ఏళ్ల కిందట ఇంటికే నేరుగా (DTH) టీవీ ప్రసారాల గురించి ఎవరూ ఊహించి ఉండరు. ఇంటినుంచే సకల సమాచారం, బ్యాంకు వ్యవహారాలు, టికెట్ల జారీ, అంతర్జాలం(ఇంటర్నెట్),సంచార టెలిఫోన్ (మొబైల్) వగైరా కూడా ఇలాంటివే;

ఒక లావాదేవీలో సరఫరా ప్రదేశం నిర్ధారణకు ఉపయోగించే ప్రత్యామ్నాయ, సంభావ్య అంశాలేవి?

జవాబు: సేవలతో ముడిపడిన వివిధ అంశాలను సరఫరా ప్రదేశ నిర్ధారణకు ప్రత్యామ్నాయం మార్గంగా వినియోగించవచ్చు. ఇతర మార్గాలతో పోలిస్తే సరఫరా ప్రదేశ నిర్ధారణలో ఈ మార్గాలు మరింత మెరుగైన ఫలితాన్నిస్తాయి. అవేమిటంటే:-

 • సేవా ప్రదాత ఉన్న ప్రాంతం;
 • సేవాగ్రహీత ఉన్న ప్రాంతం;
 • సదరు కార్యాచరణ ప్రదేశం/పని సాగే ప్రదేశం;
 • సేవా వినియోగ ప్రాంతం;
 • వాస్తవ లబ్ది పొందే వ్యక్తి లేదా చేరుతున్న ప్రదేశం

వ్యాపార సంస్థల (నమోదిత వ్యక్తుల) మధ్య (B2B); వ్యాపారం-వినియోగదారు (B2C) మధ్య లావాదేవీలలో సరఫరా ప్రదేశం నిర్ధారణకు వేర్వేరు నిబంధనల అవసరం ఏమిటి?

వ్యాపార సంస్థల మధ్య లావాదేవీలలో గ్రహీత తాను చెల్లించిన పన్నులను జమ కింద పరిగణిస్తాడు కాబట్టి ఆ లావాదేవీలు సర్వసాధారణం. వ్యాపారాల మధ్య సరఫరాల్లో వసూలు చేసిన వస్తుసేవల పన్ను ప్రభుత్వానికి ఒక బాధ్యతను, గ్రహీతకు ఒక సొత్తును సృష్టిస్తుంది. సదరు సరఫరాల వల్ల భవిష్యత్తు పన్నుల చెల్లింపు సమయంలో ఉత్పాదక పన్ను మినహాయింపునకు గ్రహీత అర్జుడవుతాడు. ఇటువంటి లబ్ది పొందే వీలున్నందున వ్యాపార సంస్థల మధ్య లావాదేవీలలో దాదాపు అన్ని సందర్భాల్లోనూ గ్రహీత ఉన్న ప్రదేశం కీలకమవుతుంది. గ్రహీత సాధారణంగా సదరు వస్తువులను లేదా వాటికి విలువ జోడించిన ఉత్పత్తులను వినియోగదారుకు సరఫరా చేస్తాడు. బి2బి లావాదేవీ తదుపరి బి2సి లావాదేవీగా మారినప్పుడు మాత్రమే సరఫరా అన్నది వినియోగంగా మారినట్లు లెక్క. ఇక భి2సి లావాదేవీల్లో సరఫరా అన్నది అంతిమంగా వినియోగంగా మారి చెల్లించిన వాస్తవ పన్నులు ప్రభుత్వానికి దఖలుపడతాయి.

వస్తువులు తొలగించిన సందర్భాల్లో సరఫరా ప్రదేశం ఏదవుతుంది?

గ్రహీతకు అందజేయడం కోసం ఎక్కడైతే వస్తువుల కదలిక ఆగిపోతుందో అదే సరఫరా ప్రదేశం అవుతుంది (సెక్షన్ 5 (2) ఐజీఎస్టీ చట్టం).

మూడో వ్యక్తి సూచనల మేరకు సరఫరాదారు వస్తువులను మరొక వ్యక్తికి అందజేస్తే సరఫరా ప్రదేశం ఏదవుతుంది?

మూడో వ్యక్తినే ఆ వస్తువుల గ్రహీతగా భావించి అవి చేరిన ప్రదేశాన్నే సదరు వ్యక్తి ప్రధాన వ్యాపార స్థానంగా పరిగణిస్తారు. (సెకన్ 5 (2ఎ), ఐజీఎస్టీ చట్టం).

నౌక, విమానం, రైలు, లేదా మోటారు వాహనం వంటి రవాణా సాధనాల ద్వారా సరఫరా చేసినప్పుడు సరఫరా ప్రదేశం ఏదవుతుంది?

వస్తువుల విషయంలో వాటిని ఎక్కించిన ప్రాంతాన్నే సరఫరా ప్రదేశంగా పరిగణిస్తారు (సెక్షన్ 5 (5), ఐజీఎస్టీ చట్టం). అయితే, సేవల విషయంలో రవాణాలో భాగంగా తొలుత బయల్దేరే (departure) ప్రాంతమే సరఫరా ప్రదేశం అవుతుంది (సెకన్ 6 (11), ఐజీఎస్టీ చట్టం).

వ్యాపార సంస్థల మధ్య (B2B) సేవల సరఫరాలో సరఫరా ప్రదేశంపై సాధారణ సంభావ్యత ఏది?

ఐజీఎస్టీ చట్టంలో వినియోగించిన పదాలు నమోదిత పన్ను చెల్లింపుదారులు, నమోదుకాని పన్ను చెల్లింపుదారులు. నమోదిత వ్యక్తికి సరఫరా చేసినప్పుడు అతడున్న ప్రాంతమే సరఫరా ప్రదేశం. గ్రహీత కూడా నమోదితుడే కనుక అతడి చిరునామా ఎల్లప్పుడూ అక్కడే ఉంటుంది కాబట్టి దాన్నే ప్రత్యామ్నాయ సరఫరా ప్రదేశంగా పరిగణించవచ్చు.

నమోదుకాని గ్రహీతల మధ్య సరఫరాలో సరఫరా ప్రదేశంపై సాధారణ సంభావ్యత ఏది?

నమోదుకాని గ్రహీతల విషయంలో సాధారంగా గ్రహీత ఉన్నదే సరఫరా ప్రదేశం అవుతుంది. అయితే, అనేక సందర్భాల్లో గ్రహీత చిరునామా లభ్యం కాదు. అటువంటి కేసులలో సేవల సరఫరాదారు ఉన్న ప్రాంతమే ప్రత్యామ్నాయ సరఫరా ప్రదేశం అవుతుంది.

స్థిరాస్తి విషయంలో సరఫరా ప్రదేశంపై అది ఉన్న ప్రాంతమే... మరి ఢిల్లీ-ముంబై మధ్య వివిధ రాష్ట్రాలగుండా రహదారి నిర్మిస్తే సరఫరా ప్రదేశంగా దేన్ని గుర్తించాలి?

ఒకటికన్నా ఎక్కువ రాష్ట్రాల్లో రహదారి వంటి స్థిరాస్తి ఉన్నట్లయితే ఏయే రాష్ట్ర పరిధిలో ఉన్న రహదారి భాగం ప్రకారం దాన్నే సరఫరా ప్రదేశంగా గుర్తించి ఆ మేరకు సేవల విలువను ప్రత్యేకంగా నిర్ధారించి వసూలు చేయాలి. ఈ సందర్భంగా కాంట్రాక్టు షరతుల ప్రకారం లేదా అది లేకపోతే ఒప్పందం ప్రకారం లేదా ఇతర ఏర్పాటు ఆధారంగా అవేవీ లేకపోతే ఈ అంశంపై నిర్దేశించిన అంశాల మేరకు సహేతుక ప్రాతిపదికన నిర్ధారించాలి (ఐజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 6 (5)కు వివరణ నిబంధన).

వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే ఓ కార్యక్రమం (ఐపీఎల్ క్రికెట్ సిరీస్ వంటిది) విషయంలో సరఫరా ప్రదేశం ఏది?

సేవా గ్రహీత నమోదైన వ్యక్తి లేదా సంస్థ అయితే సేవల సరఫరా ప్రదేశం సదరు సంస్థ లేదా వ్యక్తి ఉన్న ప్రాంతమే సరఫరా ప్రదేశం అవుతుంది. అయితే, గ్రహీత నమోదుకాని వ్యక్తి లేదా సంస్థ అయినప్పుడు సదరు కార్యక్రమం లేదా వేడుక నిర్వహించే ప్రాంతమే సరఫరా ప్రదేశం అవుతుంది. క్రికెట్ను వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తారుగనుక, సేవలకు నిర్దేశిత ఏకీకృత మొత్తం చెల్లిస్తారు కాబట్టి ఆయా రాష్ట్రాల్లో విలువను నిష్పత్తి ప్రకారం నిర్దేశించి లెక్కించాలి (ఐజీఎస్టీ చట్టంలో ) సెక్షన్ 6(8)కి వివరణ నిబంధన).

కొరియర్ సేవలద్వారా వస్తువులు రవాణా చేస్తే సరఫరా ప్రదేశం ఏది?

గ్రహీత నమోదిత వ్యక్తి అయితే, అతడున్న ప్రాంతమే సరఫరా ప్రదేశం. అయితే, నమోదిత వ్యక్తి కానప్పుడు రవాణా కోసం వస్తువులు అప్పగించిన ప్రాంతమే సరఫరా ప్రదేశం అవుతుంది.

ఒక వ్యక్తి ముంబై నుంచి ఢిల్లీ, తిరిగి ముంబై మధ్య ప్రయాణిస్తే సరఫరా ప్రదేశం ఏదవుతుంది?

సదరు వ్యక్తి నమోదితుడైతే గ్రహీత ఉన్న ప్రాంతమే సరఫరా ప్రదేశం అవుతుంది. నమోదితుడు కాని పక్షంలో ముంబై-ఢిల్లీ ప్రయాణంలో బయల్దేరిన ప్రాంతంగా ముంబైని, ఢిల్లీ నుంచి తిరిగి పయనమైనప్పుడు తాజా ప్రయాణంగా పరిగణించి ఢిల్లీని సరఫరా ప్రదేశాలుగా పరిగణించాలి (ఐజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 6(11)కి వివరణ నిబంధన).

ఒక వ్యక్తి దేశంలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు ఎయిరిండియా సంస్థ టికెట్/పాస్ ఇస్తే సరఫరా ప్రదేశం ఏదవుతుంది?

ఈ ఉదంతంలో భవిష్యత్ ప్రయాణానికి టికెట్/పాస్ జారీ చేస్తున్నందున ఆ సమయంలో ప్రయాణారంభ ప్రదేశం తెలియదు. కాబట్టి ప్రయాణారంభ ప్రాంతం సరఫరా ప్రదేశం కాబోదు. ఇటువంటి సందర్భాల్లో దానికి అనువైన నిబంధనను వర్తింపజేయాలి (సెక్షన్ 6 (10) (బి), ఐజీఎస్టీ చట్టంలోని వెసులుబాట్లను చూడవచ్చు).

మొబైల్ ఫోస్ కనెక్షస్ కు సరఫరా ప్రదేశం ఏది? సరఫరాదారు ఉన్న ప్రాంతాన్ని పరిగణించవచ్చా?

మొబైల్ ఫోన్ సేవల కంపెనీలు వివిధ రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నందున, ఆ సేవల్లో అధికశాతం అంతర్రాష్ట్ర పరిధిలో ఉన్నందువల్ల వారున్న ప్రాంతాన్ని సరఫరా ప్రదేశంగా గుర్తించజాలం. అలా చేస్తే వినియోగ సూత్రభంగమై రాబడి మొత్తం సరఫరాదారులున్న కొన్ని రాష్ట్రాలకు వెళ్లిపోతుంది. కాబట్టి సదరు కనెక్షన్ ముందుగా చెల్లింపు (prepaid)/తర్వాత చెల్లింపు (postpaid) విభాగాల్లో దేనికిందకు వస్తుందో చూడాలి. పోస్ట్ పెయిడ్ కనెక్షన్ అయితే సేవాగ్రహీత చిరునామాగల బిల్లింగ్ ప్రాంతం సరఫరా ప్రదేశం అవుతుంది. ప్రీపెయిడ్ కనెక్షన్ అయితే దీనికి చెల్లింపు ఎక్కడ జరుగుతుందో లేదా సదరు కార్డులు/వోచర్ల విక్రయ ప్రాంతాన్ని సరఫరా ప్రదేశంగా గుర్తించాలి. అయితే, ఇంటర్నెట్ లేదా ఆన్ లైన్ చెల్లింపు చేస్తే సేవా గ్రహీత ఉన్న ప్రాంతాన్నే సరఫరా ప్రదేశంగా పరిగణించాలి.

గోవాలోని ఒక వ్యక్తి ఢిల్లీలోగల దళారి (బ్రోకర్)ద్వారా ఎస్ఎస్ఈ (ముంబై)లో షేర్లు కొన్నట్లయితే సరఫరా ప్రదేశం ఏది?

సేవాప్రదాత (దళారి) రికార్డులలో నమోదైన మేరకు సేవాగ్రహీత ఉన్న ప్రాంతమే పరిగణలోకి వస్తుంది కాబట్టి సరఫరా ప్రదేశం గోవా అవుతుంది.

ఒక వ్యక్తి ముంబై నుంచి కుల్లూ-మనాలి వెళ్లి మనాలిలోగల ఐసీఐసీఐ బ్యాంకు సేవలు పొందితే సరఫరా ప్రదేశం ఏది?

సదరు సేవ ఆ వ్యక్తి ఖాతాకు ముడిపడినది కాకపోతే సేవాప్రదాత ఉన్న మనాలి సరఫరా ప్రదేశం అవుతుంది. అదే అతడికి ఖాతాతో ముడిపడినదైతే సేవాప్రదాత (బ్యాంకు) రికార్డుల ప్రకారం అతడి చిరునామాగల ముంబై సరఫరా ప్రదేశమవుతుంది.

గుర్గాప్ లోని ఒక వ్యక్తి ఎయిరిండియా విమానంలో ముంబై నుంచి ఢిల్లీ వెళ్లాడు. అతడు తన ప్రయాణ బీమాను ముంబైనుంచి పొందుతాడు. అప్పుడు సరఫరా ప్రదేశం ఏది?

సదరు సేవలందించిన సరఫరాదారు బీమా కంపెనీ రికార్డులలోనిసేవాగ్రహీత చిరునామాగల ప్రాంతమే సరఫరా ప్రదేశం కాబట్టి గుర్గావ్ నే పరిగణనలోకి తీసుకోవాలి (సెక్షన్ 6 (14) ఐజీఎస్టీ చట్టంలోని వెసులుబాట్లను చూడవచ్చు).

ఆధారం : సెంట్రల్ బోర్డ్ అఫ్ ఎక్సైజ్ మరియు కస్టమ్స్

3.00220426157
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు