దుంపల్లో ఔషధం అల్లం అల్లం ఎన్నో సుగుణాల సుగంధ ద్రవ్యం వచ్చని ఆకులతో ఎదిగి కాండం భాగం వాడుకునే ఈ దుంప జాతి మన దేశంలో విస్తృతంగా సాగవుతోంది. తాజా అల్లాన్ని, రసం, పొడి రూపంలో ఎక్కువగా వాడతారు. టీ నుంచి మొదలుపెడితే ఉప్మా పెనరట్టు, ఇలా ఏ వంటా అల్లం వేయనిదే పూర్తికాదు. ఎండబెట్టి శొంఠి గా వాడతారు. మానవ ఆరోగ్యంలో అల్లం పాత్ర అమోఘమైనది. అల్లం వలన కలిగే ప్రయోజనాలు జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది: జీర్ణక్రియకు అవసరమైన రసాలను ప్రేరేపిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది: రక్తనాళాల్లో రక్త ప్రవాహాన్ని పెంచడానికి దోహదపడుతుంది. ఉదయం పూట వికారాలను తగ్గిస్తుంది: కొన్ని రకాల శస్త్ర చికిత్సల వల్ల వచ్చే వికారం, వాంతులను తగ్గించడంలో ఉపయుక్తంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది: అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు: ఇందులో జింజారెల్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మిశ్రమాలు ఉన్నాయి. శరీరంలోని యాంటీ మార్కర్లను సమర్థ వంతంగా తగ్గించవచ్చు. రుతుస్రావ సమస్యలకు దివ్యమైన ఔషధం: రుతుస్రావనొప్పి, వాపునకు కారణమయ్యే ప్రొస్టాగ్లాండిన్ ఉత్పత్తిని తగ్గించేందుకు తోడ్పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, గుండె ఆరోగ్యం మెరుగు దలకు మేలు చేస్తుంది. అంటువ్యాధుల నివారిణి: అల్లంలోని బలమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జలుబు వంటి శ్వాశకోస ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నివారిస్తుంది. బరువు నియంత్రణలో తోడ్పాటు: శరీర బరువు నియంత్రణలో తోడ్పడుతుంది. అల్లం నోటి దుర్వాసన పోగొట్టి దంత క్షయాన్ని నివారిస్తుంది. గర్భిణులకు తరచూ వచ్చే తల తిరగడం, వాంతులు, వికారణ వంటి వాటిని అల్లం నివారిస్తుంది. పొట్టు తీసి మెత్తగా చేసిన అల్లాన్ని తేనె తో కలిపి తీసుకుంటె గొంతు వాపు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు. 100గ్రా. ముడి అల్లంలో పోషక విలువలు నీరు- 78.9గ్రా, కార్బోహైడ్రేట్లు- 17.7గ్రా, ఫైబర్ 2 గ్రా ప్రొటీన్ 1.8 గ్రా, కొవ్వు -0.75గ్రా. కాల్షియం-16 మి.గ్రా మెగ్నీషియం- 43 మి.గ్రా. పొటాషియం- 415 మి.గ్రా, విటమిన్ సి-5మి.గ్రా, శక్తి-80 కిలో కేలరీలు.మన దేశంలో కేరళ, కర్ణాటక, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. మన రాష్ట్రంలో ఉమ్మడి విశాఖ. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో సాగులో ఉంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో నర్సీపట్నం లోకల్ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. మైదాన ప్రాంతాలలో మారన్, వరద, మహిమ, సుప్రభ వంటి రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆధారం: పాడి పంటలు మాసపత్రిక