ఎర్ర చందనము సాగు వివరములు (టీరోకార్బన్ సాంటాలినస్) సాధారణ నామము : రక్త చందనము శాస్త్రీయ నామము : టీరోకార్పస్ సాంటాలినస్ కుటుంబము : ఫాబేసి ప్రాంతీయ నామము : ఎర్ర చందనము వాణిజ్య నామము : ఎర్ర చందనము ఉపయోగపడు భాగములు : చేవ దేరిన దుంగ పరిచయము ఎర్ర చందనము లేదా రక్త చందనముగా నామం కలిగిన ఈ మొక్క ఫాబేనీ కుటుంబానికి చెందినది. ఈ మొక్క ఆకులు రాల్చు అడవులకు సంభందించిన మధ్య తరగతి ఎత్తు వరకు పెరుగు వృక్షము. ఇది 10 మీ. ఎత్తు పెరుగుతుంది కైవారము(చుట్టుకొలత), 0.9 మీ. నుండి 1.5 మీ. వరకు అనుకూల వరిస్థితులలో పొందుతుంది. దీని యొక్క బెరుడు(బార్క్) నలుపు-గోధుమ వర్ణము కలిగి మొసలి చర్మము మాదిరిగా యుండును. లోపలి బెరుడు ఎర్రటి రంగు “సంటోలిన్ డై” ని ఇచ్చును. ఎర్ర చందనము యొక్క పువ్వులు పసుపు వర్ణము కలిగి యుండును. ఇది ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు పూయును, ఎరుపు-గోధుమ రంగు కలిసిన కాయలు 1 సెం.మీ. – 1.5 సెం.మీ. పొడవు కలిగి యుండును. వ్యాప్తి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములొని తూర్పు కనుమలలో ఈ మొక్క సహజముగా పెరిగి అత్యధిక నాణ్యత కలిగి యుండును. తెలంగాణా మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా దీనిని రైతు పొలాలలో పెంచుతున్నారు. నేలలు ఎర్ర చందనము నీరు నిలవని మొరము నేలలలో మంచిగా పెరుగును. వాతావరణం ఎర్ర చందనము పెరుగుదలకు సగటున 800 మి.మీ. నుండి 1000 మి.మీ. వర్షపాతము అవసరము. పంటకాలం కనీసము 15 నుండి 20 సంవత్సరములు నర్సరీ పరిపక్వత చెందిన ఎర్ర చందనము విత్తనములు సేకరించి మార్చి, ఏప్రిల్ లేదా మే నెలలలో నర్సరీ మడులలో విత్తుకోవాలి. నారుమడులను ఎండు గడ్డితో పలుచగా కప్పుకోవాలి. విత్తనములు 10-15 రోజులలో మొలకెత్తును. 10మీ.X1మీ. నారుమడిని 10-12 కిలోల విత్తనము అవసరమవుతుంది. సంవత్సరము తరువాత స్టంప్స్ తయారుచేసి ఫిబ్రవరి, మార్చి నోలలలో పాలిథీన్ సంచులలో నాటుకొనవచ్చును. ప్లాంటేషన్ భూమిని ఇరువైపుల లోతుగా దున్నాలి. 4మీ.X4మీ. ఎడంలలో 45 సెం.మీX 45 సెం.మీ.X45 సెం.మీ. గుంతలు తవ్వాలి. గుంతలలో లిండేన్ పౌడరును చల్లవలెను. వర్మికాంపోస్ట్, వేప పిండి, పొడిమట్టిని కలిపి మిశ్రమంగా తయారు చేసి చెట్టునాటి గుంతను పూడ్చాలి. ఎరువులు ఒక చెట్టుకు సంవత్సరానికి 10 నుండి 15 కిలోల పశువుల పేడ 150:100:100 గ్రా. N:P:K 5 సంవత్సరములుగా వేసుకోవాలి. రెండు విడతలుగా వేసుకొవాలి. మొదటి విడత జూన్, జులైలలో రెండవ విడత అక్టోబర్, నవంబర్ లలో వేసుకోవాలి. అంతర కృషి చెట్లు నాటిన వెంటనే నీరు పోయాలి. చెట్టు నాటుకున్న తరువాత 10-15 రోజులకొకసారి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీరు ఇవ్వాలి. ఎరువులు వేసే ముందు చెట్టు చుట్టూ కలుపు తీయాలి. తరుచుగా చెట్టు చుట్టూ మట్టిని త్రవ్వుతూ వుండాలి. సస్యరక్షణ ఆకులను తినివేసే బొంతపురుగు సాధారణంగా కనిపించును, 0.2% మోనోక్రోటోఫోస్ ఒక వారము అంతరముతో రెండుసార్లు చల్లుకోవాలి. దిగుబడి 15-20 సంవత్సరముల తరువాత ఒక చెట్టు నుండి 250 కిలోల కలప లభించును. గమనిక నేల స్వభావం, వాతావరణ పరిస్తితులు, మార్కేట్ సరళి ఆర్థికాంశాలను ప్రభావితం చేస్తాయి. ఉపయోగములు చేవదీరిన దుంగలు మధుమేహ, ఉదరములో పుండ్లు, చర్మవ్యాధులు ప్రేగులలోని క్రిములను హరించడానికి, బల ఔషధిగా, తాపనివారణ కారిగా ఉపయోగపడుతుంది. కాయలు ఉపయోగించి చేసిన కాషాయము తీవ్రముయిన రక్త విరోచనాలను అరికట్టడానికి ఉపయోగిస్తారు. దుంగులు నుండి తీసిన నూనె సుగంధ పదార్థాలలో ఉపయోగించ బడుతున్నది. ఆధారం: తెలంగాణ రాష్ట ఔషధ మొక్కల బోర్డు, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా, 6వ అంతస్థు, TSGLI బిల్డింగ్, తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాదు – 500 001. ఫోవ్: +21 40 66364096, 24764096 , website : http://tsmpb.in/index/ , E-mail: tsmapb@gmail.com