ఆరోగ్యానికి, ఆదాయానికి మునగ మునగ కాయలతో పాటు ఆకులు వైద్యపరంగా విస్తృతం గా ఉపయోగిస్తున్నారు. కాల్షియం, ఐరన్, మెగ్నిషియం వంటి పోషకాలు, విటమిన్ ఎ,బి,సి., మునగ కాయలు, ఆకులలో ఎక్కువగా ఉంటాయి. మునగ కాయలకంటే ఆకులలో ఎక్కువగా పోషక పదార్థాలు ఉంటాయని నిరూపించబడింది. మునగ కాయలలో 2.5% మాంసకృత్తులు, 0.1% కొవ్వు పదార్ధాలు. 3.7% పిండి పదార్థాలు ఉంటాయి. వాతావరణం : 20-25° సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు మునగ సాగుకు అనుకూలం. 40° కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల్లో పూత రాలిపోతుంది. మంచును, అధిక చలిని తట్టుకోలేదు నేలలు : మునగ సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలం. అయితే అధిక సేంద్రియ పదార్థం కలిగిన నేలలు మిక్కిలి శ్రేష్టం. నేల ఉదజని సూచిక 6.0-7:5 మధ్యన ఉంటే మంచిది విత్తేకాలం, నాటడం : నాటిన 5-6 నెలలకు పూతకు వస్తుంది. వార్షికంగా మునగ ఎప్పుడు నాటినప్పటికి, వేసవి ప్రారంభం లోనే పూతకు వస్తుంది బాగా నిలబడి ఎక్కువ కాపునిస్తుంది. దక్షిణ భారతదేశంలో నవంబర్లో నాటడం మంచిది విత్తనాలు నేరుగా నాటుకోవచ్చు. హెక్టారుకు 25 గ్రా. విత్తనం నాటుకోవాలి. నాటిన 10-15 రోజులకు మొలక వస్తుంది 626 గ్రా. విత్తనానికి 100గ్రా. అజోస్పైరిల్లం పట్టించాలి. 2.5 మీ × 2.5 మీ. దూరంలో, హెక్టారుకు 1600 మొక్కలు చొప్పున వేయాలి. సంచులలో పెంచిన మొక్కలను (60-90 సెం.మీ. ఎత్తు ) కొమ్మలను కూడా నాటవచ్చు. రకాలు రాష్ట్రంలో దేశవాళీ రకాలతో పాటు జాఫ్నా, పి. కె.ఎం 1 అధిక దిగుబడినిచ్చే రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. పి. కె. ఎం 1 : ఏకవార్షిక రకం. మొక్క 4-6 మీ. ఎత్తు వరకు పెరిగి, విత్తిన 160-170 రోజులలో పూతకు వస్తుంది. కాయ 65-70 సెం.మీ. పొడవుతో సుమారు 150 గ్రా. బరువుంటుంది. కాయలో గుజ్జు 70 శాతం ఉంటుంది. ఒక్కో మొక్కకు 200-225 కాయలు చొప్పున హెక్టారుకు సగటున 52 టన్నుల దిగుబడి వస్తుంది. కార్శి తోటను మూడు సంవత్సరాలు వరకు పెంచవచ్చు. పి.కె. ఎం– 2 : ఏకవార్షిక రకం. మొక్క 4-6 మీ. ఎత్తు వరకు పెరిగి విత్తిన 180 రోజులలో పూతకు వస్తుంది. కాయ పాడవు 120 సెం.మీ. కాయ బరువు 280 గ్రా. కాయలలో గుజ్జు 70 శాతం ఉంటుంది. గింజలు తక్కువగా ఉంటాయి. నేల తయారీ: నేలను 4-5 సార్లు బాగా దుక్కి వచ్చే వరకు దున్నాలి. బహువార్షిక రకాలను 5x5 మీ. దూరం. ఏకవార్షిక రకాలయితే 2.5×2.5 మీ. దూరం ఉండేటట్లు నాటుకోవాలి. గుంతలు 45x45x45 సెం. మీ. పరిమాణంలో తీసి ప్రతి గుంతకు 10 కిలోల పశువుల ఎరువు, 250 గ్రా. వేపపిండి. సూపర్ ఎరువులు : గింజలు విత్తిన 3 నెలలకు, ఒక్కొక్క గుంతకు 100 గ్రా. యూరియా 50 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పాటాష్ వేసి నీరు పెట్టాలి. మొక్కలకు నాటిన ఆరు నెలలకు ఒకసారి. 9 నెలలకు ఒకసారి 100 గ్రా యూరియా 500గ్రా. మ్యూరేట్ ఆఫ్ పాటాష్ వేసి నీరు పెట్టాలి. కొమ్మ కత్తిరింపులు : మొక్కలు నాటిన రెండు నెలలకు 75 సెం.మీ. ఎత్తులో కొన మొగ్గ తుంచాలి. కాయలు పూర్తిగా కోయటం పూర్తయిన తర్వాత 10 మీటర్లు ఎత్తు వరకు ఉంచి మిగిలిన భాగం కత్తిరించాలి. నీటి యాజమాన్యం : విత్తనాలు మొలకెత్తే వరకు ప్రతి 3 రోజలకు నీటి తడి ఇవ్వాలి. తర్వాత 10-15 రోజులకు ఒకసారి నీటితడి ఇవ్వాలి. అంతర పంటలు : కొబ్బరిలో అంతర పంటగా మునగ వేసుకోవచ్చు. మునగలో బెండ, అలసంద, మిరప, ఉల్లి. గోరు చిక్కుడు, కరివేపాకు వేసుకోవచ్చు. మొక్కజొన్న, పొద్దు తిరుగుడు వ్యవసాయ పంటలను కూడా అంతర పంటలుగా వేసుకోవచ్చు. దిగుబడి బహువార్షిక రకాలు నాటిన 8-9 నెలలకు కాపుకు వస్తాయి. మొదటి పంట మార్చి జాన్ నెలలో, రెండవ పంట సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వస్తుంది. ప్రతి సంవత్సరానికి ఒక్కో మొక్క నుంచి 500-600 కాయల వరకు దిగుబడి వస్తుంది. ఏకవార్షిక మునగ రకాలు గింజలు విత్తిన 6 నెలలకే కాపుకొస్తాయి. రకాన్ని బట్టి ప్రతి మొక్క మొదటి సంవత్సరం 150-200 కాయలు, రెండవ సంవత్సరం 250-400 కాయల దిగుబడి వస్తుంది. రకాన్ని బట్టి ప్రతి మొక్కకు మొదటి సంవత్సరం 150-200 కాయలు, రెండవ సంవత్సరం 250-400 కాయల దిగుబడి వస్తుంది. కాయలు కోసిన తర్వాత, ఒక మీటరు ఎత్తులో కొమ్మలను కత్తిరించి కార్శి పంటలు తీసుకోవచ్చు. అధిక సాంద్రత పద్ధతిలో (60 × 30 సెం. మీ లేదా 90% 20 సెం.మీ ఎడంలో నాటుకుని 50 సెం.మీ ఎత్తు పెరిగిన తర్వాత 15-20 సెం.మీ కాండం ఉంచి కత్తిరించాలి. హెక్టారుకు 43-52 టన్నుల ఆకు దిగుబడి వస్తుంది. ఎగుమతికి అవకాశం ప్రపంచ గిరాకీ ఎగుమతి మొత్తంతో 90% వాటా మనదేశం కలిగి ఉంది.మునగ సాగు 80 దేశాల్లో ఉన్నప్పటికీ సాగు విస్తీర్ణంలో, ఉత్పత్తిలో మనదేశం అగ్రస్థానం లో ఉంది.ఇటీవలి కాలంలో పొడి బాగా ప్రాచుర్యం పొంది ఎగుమతికి మంచి అవకాశం ఉంది. లాభాలు మునగాకు ఆహారంలో ఒక భాగంగా తీసుకోవడం వల్ల గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనత తగ్గి, ఆరోగ్యవంతమైన శిశువులు జన్మించటానికీ, పాలు అధికంగా రావడానికి దోహదపడుతుంది.మునగ అనేక రకాల వ్యాధులను నయం చేసే (దాదాపు 300 రకాలు) గుణాలు కలిగి ఉండటం వల్ల బహుళ ప్రయోజనాలు గల వృక్షంగా అభివర్ణిస్తారు. పొడి తయారీ మునగ ఆకులను చెట్టుకు 15-50 సెం.మీ ఎత్తులో కత్తిరించి ఆకులను సేకరించాలి. బలహీనమైన బ్లీచ్ ద్రావణంలో ఆకులను శుభ్రపరచాలి. నీడలో ఆరబెట్టాలి. (4-6 రోజులు) ఎండబెడితే 10 కిలోల ఆకులకు 1 కిలో ఎండిన ఆకు పొడిని పొందవచ్చు. తేమ శాతం ఎక్కువగా ఉంటే బూడిద తెగులు ఆశించే అవకాశమున్నందున, ఓవెన్లలో 50° వద్ద ఉంచి, తేమను తగ్గించాలి. చేతులతో నలిపి అరబెట్టి ఆకులను పొడి చేయవచ్చు. (లేదా) జల్లెడ ఉపయోగించి మిగిలిన కాండం, ముక్కలను తొలగించాలి. గాలి చొరబడని ప్రదేశాల్లో, వెలుతురు వేడి ఉండే ప్రదేశాలలో పొడిని డబ్బాలలో నిల్వచేయాలి. పోషక శక్తి కలిగిన మునగ సాగు లాభదాయకం ఆధారం: పాడిపంటలు డా. ఎస్.రవీంద్రబాబు, సీనియర్ శాస్త్రవేత్త ఉద్యాన పరిశోధనా స్థానం, దర్శి.