శ్రీ గంధము సాగు వివరములు (సాంటాలమ్ ఆల్బమ్) సాధారణ నామము : శ్రీ గంధము శాస్త్రీయ నామము : సాంటాలమ్ ఆల్బమ్ కుటుంబము : సాంటాలేసీ ప్రాంతీయ నామము : చందనము వాణిజ్య నామము : శ్రీ గంధము ఉపయోగపడు భాగములు : చేపదేరిన దుంగలు, వేర్లు పరిచయము శ్రీ గంధము (చందనము) గా నామం కలిగిన ఈ మొక్క సాంటాలేసి కుటుంబానికి చెందినాది. శ్రీ గంధము మొక్క 4మీ. నుండి 9మీ. ఎత్తు పెరిగే సతత హరిత వృక్షం. పండ్లు లోపల గట్టి విత్తనంతో, బయట పలుచని గుజ్జుతో ఉంటాయి.పండిన పండ్లు ఊదా రంగులో ఉంటాయి. లోపల ఒక గింజ ఉంటుంది. వ్యాప్తి భారత దేశంలోని శ్రీ గంధము మొక్క విస్థీర్ణంలో 90% విస్థీర్ణం (8300 కి.మీ.) కర్ణాటక, తమిళనాడు రాష్ట్రములలో విస్తరించి ఉంది. ఈ రాష్ట్రాలలో శ్రీ గంధము యొక్క సహజ పునరుతృత్తి జరుగుతుంది. ఈ మొక్క తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, రాజస్తాన్, బీహార్, మరియు మణిపూర్ రాష్ట్రములలో కూడా దీనిని రైతులు పొలాలలో పెంచుతున్నారు. నేలలు ఎర్రని ఇసుక నేలలలో ఈ చెట్లు బాగా పెరుగుతాయి. దీనికి తేమగల పొడి వాతావరణం కావాలి. వాతావరణం చందనము మొక్క సగటున 600 మి.మీ. నుంచి 1600 మి.మీ. వర్షపాతములో పెరుగుతుంది. పంటకాలం కనీసము 15 నుండి 20 సంవత్సరములు నర్సరీ ఇసుక, ఎర్రమట్టిలను 3:1 నిష్పత్తిలో నీడ్ బెడ్ తయారు చేసి, నిమాటిసైడ్ (ఏరలక్స్ లేదా తిమ్మెట్ 500 గ్రా. 10 మీ.X 1మీ. బెడ్ కు) కలపాలి. పరిపక్వత చెందిన శ్రీ గంధము విత్తనములు సేకరించి, 10మీ.X1మీ. నారుమడికి 2.5 కిలోల విత్తనాన్ని సమానంగా పరచాలి, దానిపై ఎండు గడ్డిని పలచగా పరచాలి. మెలకలు కనిపించగానే గడ్డిని తొలగించాలి. విత్తనాలను 0.05% గిబ్బర్లిక్ ఆసిడ్ లో రాత్రి నానబెట్టినచో మొలకలు అధికముగా వచ్చును. శిలీంద్రాల వల్ల, నిమాటోడ్ వల్ల శ్రీ గంధమునుకు తీవ్రమయిన తెగులు సోకుతుంది. పాలిథీన్ సంచులను, 2:1:1 నిష్పత్తిలో ఇసుక, ఎర్రమట్టి, మాగిన ఎరువులను నింపాలి. నారు మెక్కలు 4 నుండి 6 ఆకుల దశకు చేరుకోగానే పాలిథీన్ సంచులలో నాటుకోవాలి. శ్రీ గంధము బాగా పెరగడానికి కంది మొక్క బాగా దోహదపడుతుంది. శ్రీ గంధము వేర్లకు హాని కలగకుండా నారు మొక్కలను జాగ్రత్తగా నారుమళ్ళ నుండి తీయాలి. వేర్లను తడార నీయరాదు. మొక్కలు నాటిన తరువాత వారము రోజులు నీడలో ఉంచాలి, రోజుకొక సారి నీరు పట్టాలి. కాని అధికంగా ఉండకుండా చూడాలి. కంది మొక్కలు చందనము మొక్కల కంటే ఎక్కువ పెరిగిన, చందనము మొక్కల పెరుగుదలకు హాని కలుగుతుంది. నాట్లకు అవసరమయిన 30 సెం.మీ. ఎత్తుగల మొక్కలు 6-8 నెలల్లో తయారవుతాయి. వీటిని వచ్చే వర్షాకాలంలో పొలములో నాటుకొన వచ్చును. ప్లాంటేషన్ భూమిని ఇరువైపుల లోతుగా దున్నాలి. 4మీ.X4మీ. ఎడంలలో 45 సెం.మీX 45 సెం.మీ.X45 సెం.మీ. గుంతలు తవ్వాలి. గుంతలలో లిండేన్ పౌడరును చల్లవలెను. వర్మికాంపోస్ట్, వేప పిండి, పొడిమట్టిని కలిపి మిశ్రమంగా తయారు చేసి చెట్టునాటి గుంతను పూడ్చాలి. ఎరువులు ఒక చెట్టుకు సంవత్సరానికి 10 నుండి 15 కిలోల పశువుల పేడ 150:100:100 గ్రా. N:P:K 5 సంవత్సరముల వరకు వేసుకోవాలి. రెండు విడతలుగా వేసుకొవాలి. మొదటి విడత జూన్, జులైలలో రెండవ విడత అక్టోబర్, నవంబర్ లలో వేసుకోవాలి. అంతరకృషి చెట్లు నాటిన వెంటనే నీరు పోయాలి. చెట్టు నాటుకున్న తరువాత 10-15 రోజులకొకసారి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీరు ఇవ్వాలి. ఎరువులు వేసే ముందు చెట్టు చుట్టూ కలుపు తీయాలి. తరుచుగా చెట్టు చుట్టూ మట్టిని త్రవ్వుతూ వుండాలి. దిగుబడి 15-20 సంవత్సరముల తరువాత ఒక చెట్టు నుండి 25 కిలోల చేవదీరిన కలప లభించును. గమనిక నేల స్వభావం, వాతావరణ పరిస్తితులు, మార్కేట్ సరళి ఆర్థికాంశాలను ప్రభావితం చేస్తాయి. ఉపయోగములు చేవదీరిన దుంగను మధుమేహ నివారణకు వాడవచ్చును. చందనపు తైలాన్ని గులాబి నీటితో కాని కర్పూరంలో కాని రంగరించి నుదిటికి రాసుకుంటే తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. చర్మ వ్యాధుల నివారణకు ఈ మిశ్రమం వాడవచ్చును. చందనపు పొడిని నీటిలో చక్కెరతో పాటు కలిపి సేవిస్తే నొప్పి తో కూడుకున్న అతి మూత్రవ్యాధి నుండి ఉపశమనము పొందవచ్చును. చందనపు పొడిని కొత్తిమీర ఆకులతో కలిపి బాగా నూరి ఆ ముద్ద యొక్క సువాసనను ఆశ్వాదిస్తే తుమ్ములను తగ్గించవచ్చును. ఆధారం:తెలంగాణ రాష్ట ఔషధ మొక్కల బోర్డు, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా, 6వ అంతస్థు, TSGLI బిల్డింగ్, తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాదు – 500 001. ఫోవ్: +21 40 66364096, 24764096 . website : ww.tsmpb.in , E-mail: tsmapb@gmail.com