ఉద్యాన పంటలు పండ్ల తోటలు: అరటి తోటలలో కలుపు లేకుండా జాగ్రత్తపడాలి. తల్లి మొక్క చుట్టూ ఉన్న పిలకలను ఎప్పటికప్పుడు కోసేయాలి. ఆకుమచ్చ తెగులు గమనించినట్లయితే ప్రొపికోనజోల్ 0.1 శాతం లేదా టెబుకొనజోల్ + ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ 1.4 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి రెండు మూడుసార్లు 25 రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి. జామ ఎండుతెగులు ఆశించిన చెట్లకు 1 గ్రా. కార్బండిజమ్ లేదా 3 గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటరు నీటికి కలిపిన మందు ద్రావణాన్ని చెట్టు మొదలు చుట్టూ పాడులో పోయాలి. నులి పురుగు నివారణకు పశువుల ఎరువుతోపాటు ఒక్కొక్క మొక్కకు 250 గ్రా. వేపపిండి + 25 గ్రా. పానిలోమైసిన్ లిలేనినన్ శిలీంద్రము లేదా 20-30గ్రా ఫ్యురియన్ సల్ఫేట్ గుళికలు ప్రతి మొక్కకు వేసుకోవచ్చును. సపోటా అవసరాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి. పూత మొదలయ్యేటప్పుడు మొగ్గ తొలుచు పురుగు నివారణకు వేపగింజల కషాయం 5% లేదా వేపనూనె(0.15%) 5 మి.లీ./లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీచేయాలి. దానిమ్మ తోటల్లో అంతరకృషి చేసి, చెట్ల పాడుల్లో త్రవ్వకం చేసి కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి. బొప్పాయి సుక్ష్మధాతులోప నివారణకు 2.5 గ్రా. జింక్ సల్ఫేట్ 1 గ్రా. బోరాక్స్ లీటరు నీటికి కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. పండు ఈగ నివారణకు మిథైల్ యూజినాల్ ఎరలను ఎకరానికి 4-5 చొప్పున అమర్చాలి. కూరగాయ పంటలు క్యాబేజీ, కాలిఫ్లవర్ (మధ్యకాలిక రకాల) నారును పోసుకొనే సమయం. క్యాప్సికం పాలిహౌస్ లో సాగుకు నారును నాటుకోవాలి. వంగ, బెండ పంటలలో మొవ్వు మరియు కాయతొలుచు పురుగు నివారణకు తలవాలిన కొమ్మలను త్రుంచి, పుచ్చు కాయలను ఏరి నాశనం చేయాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 4 గ్రా. 10 లీటర్ల నీటిలో కలిపి రెండుసార్లు 10 రోజుల వ్యవధితో కాయలు కోసిన తర్వాత పిచికారీ చేయాలి. ఉల్లి బోదెలు 30 సెం.మీ. ఎడంలో చేసి బోదెకు రెండువైపులా 10 సెం.మీ. ఎడంలో నాటుకోవాలి. నారును 20 మి.లీ. మలాథియాన్ + 10 గ్రా. కార్బండిజమ్ 10 లీ. నీటిలో కలిపిన ద్రావణంలో 20 నిమిషాలు ముంచి నాటితే చీడపీడల బాధ తగ్గుతుంది. ఆగష్టు నెలలో మొదటి 15 రోజుల్లో నాటుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. ఆధారం: వ్యవసాయ శాఖ రైతు సలహా కేంద్రం, ఉద్యాన విశ్వ విద్యాలయం, వెంకటరామన్న గూడెం, పశ్చిమ గోదావరి.