ఎల్ నినో ప్రభావం - ప్రత్తి సాగు - జాగ్రత్తలు జూన్-జులైలో విత్తిన ప్రత్తి పంట ఆగస్టు నాటికి మొక్క దశ నుంచి మొగ్గ, పూత దశకు చేరుకుంటుంది. ఈ దశ పంట భవిష్యత్ దిగుబడిని నిర్ణయించడంలో అత్యంత కీలకమైనది. మొక్క శాకీయ ఎదుగుదల నుంచి పునరుత్పత్తి దశకు మారే సమయం కావడంతో, నీరు, పోషక యాజమాన్యం, చీడపీడల నివారణలో ఏ మాత్రం అజాగ్రత్త వహించినా దిగుబడిపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఈ దశలో మొక్కకు తగినంత తేమ, పోషకాలు అందించడం ద్వారా కాయ, పూత రాలడాన్ని నివారించవచ్చు. ఎల్ నినో ప్రధాన ప్రభావాలు వర్షాభావం లేదా సుదీర్ఘ వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వర్షం కురిసినా అసమానంగా, తక్కువ వ్యవధిలో అధిక తీవ్రతతో కురిసే అవకాశం ఉంటుంది, దీని వలన నేలలో తేమ సరిగా నిలవదు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకావడం వల్ల మొక్కల్లో తేమ నష్టం పెరుగుతుంది. పూత, కాయ ఏర్పడే దశలో తేమలోపం వల్ల పూత, పిందె రాలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వాతావరణ ఒత్తిడి వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. నీటి ఎద్దడి ఎక్కువకాలం కొనసాగితే మొక్క ఎదుగుదల కుంటుపడి, తుది దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నీటి యాజమాన్యం అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ, వీలైతే డ్రిప్ లేదా స్ప్రింక్లర్ పద్ధతిలో నీరు అందించాలి. నేలలో తేమను ఎక్కువకాలం నిల్వ ఉంచేందుకు మల్చింగ్ పద్ధతిని అనుసరించాలి. వర్షాభావ పరిస్థితుల్లో లభ్యమయ్యే నీటిని కీలక దశలైన పూత, కాయ ఏర్పడే సమయంలో జాగ్రత్తగా అందించాలి. వాన నీటిని ఇంకుడు గుంతలు, వంట కుంటల ద్వారా సంరక్షించి అవసరమైనప్పుడు వాడుకోవాలి. పోషక యాజమాన్యం నేల పరీక్ష ఆధారంగా సిఫారసు చేసిన మోతాదులో ఎరువులు వేయాలి. అధిక నత్రజని వాడకాన్ని నివారించాలి. పొటాషియం ఎరువులు మొక్కల్లో నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని పెంచుతాయి కాబట్టి సిఫారసు మేరకు వాడాలి. నూక్ష్మ పోషకాల లోప లక్షణాలు కనిపిస్తే ఆకుల ద్వారా అందించాలి, దీని వల్ల పూత, పిందె నిలకడ మెరుగవుతుంది. పత్తిలో బోరాన్, జింక్ తో పాటు మెగ్నీషియం లోపం కూడా కనిపిస్తుంది. మెగ్నీషియం లోపం నివారణకు మెగ్నీషియం సల్ఫేట్ లీటరు నీటికి 1.5 గ్రాములు కలిపి విత్తిన 45 రోజులు, 60 రోజులకు పిచికారీ చేయాలి. బోరాన్ లోపం నివారణకు బోరాక్స్ లీటరు నీటికి 1.5 గ్రాములు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. జింక్ లోపం నివారణకు జింక్ సల్ఫేట్ లీటరు నీటికి 2 గ్రా. కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. కీటకాల యాజమాన్యం తెల్ల దోమ, పేనుబంక, తామర పురుగులు వంటి రసం పీల్చే పురుగుల వ్యాప్తిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. పసుపు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకుంటే పురుగుల వ్యాప్తిని ముందుగానే గుర్తించవచ్చు. సిఫారసు చేసిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించి, అవసరమైనప్పుడు మాత్రమే రసాయన మందులు వాడాలి. గులాబీ రంగు కాయ తొలిచే పురుగు నివారణకు ఫెరమోన్ ఎర బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. ఆకు మచ్చ తెగులు : ఆకులపై గుండ్రని మచ్చలు ఏర్పడి ఆకులు రాలిపోతాయి. నివారణ: మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎండు తెగులు / వడ తెగులు: మొక్కలు ఆకస్మికంగా వాడి ఎండిపోతాయి. నివారణ: విత్తన శుద్ధి తప్పనిసరి. కార్బండిజిమ్ లేదా సూడోమోనాస్ 10 గ్రా/ కిలో వాడాలి. బ్యాక్టీరియా ముడత : ఆకులపై నల్లని కోణీయ మచ్చలు వస్తాయి. నివారణ: స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 1 గ్రా. + కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇతర జాగ్రత్తలు తెగుళ్లను, వాతావరణ పరిస్థితులను తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. నేల రకాన్ని బట్టి మొక్కల మధ్య ఎక్కువ దూరం ఉంచాలి. అధిక నత్రజని వాడకాన్ని నివారించాలి. పంట పొలంలో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించి, నీరు, పోషకాలకోసం పోటీని తప్పించాలి. అధిక వర్షం కురిసినప్పుడు పొలంలో నీరు నిలవకుండా తగిన నీటి పారుదల ఏర్పాటు చేసుకోవాలి. వాతావరణ, వ్యవసాయ శాఖలు జారీ చేసే ముందస్తు హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. పంటల బీమా పథకంలో నమోదు చేసుకుంటే వాతావరణ ప్రతికూలతల వల్ల కలిగే నష్టాన్ని కొంతమేర భర్తీ చేసుకోవచ్చు. ఆధారం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ