పత్తిలో రసం పీల్చే పురుగులు సకాలంలో గుర్తింపు, సమగ్ర నివారణతో అధిక దిగుబడి పత్తి తెలంగాణలో ప్రధాన వాణిజ్య పంట. అయితే పంట ఎదుగుదల నుంచి కాయ దశ వరకు రసం పీల్చే పురుగులు ఆశించి దిగుబడి, దూది నాణ్యతను గణనీయంగా తగ్గిస్తాయి. బెట్ట వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలు, తేమలో మార్పులు, మబ్బులతో కూడిన పరిస్థితుల్లో ఈ పురుగుల ఉధృతి వేగంగా పెరుగుతుంది. అందువల్ల రైతులు పొలాన్ని తరచూ పరిశీలించి, పురుగులను ప్రారంభ దశలోనే గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడి, మెరుగైన నాణ్యత, అధిక ఆదాయం పొందవచ్చు. పత్తిలో ముఖ్యమైన రసం పీల్చే పురుగులు పచ్చ దోమ, పేను బంక, తామర పురుగులు, తెల్ల దోమ, పిండి నల్లి, ఎర్రనల్లి పచ్చ దోమ ఉధృతికి అనుకూల పరిస్థితులు ఎక్కువ వర్షపాతం, మబ్బులతో కూడిన వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రతలు.గుర్తించే లక్షణాలు : ఆకుల అడుగు భాగంలో రసం పీలుస్తాయి. ఆకులు దోనెలా ముడుచుకుంటాయి. ఆకుల అంచులు ఎర్రబడి క్రమంగా ఎండిపోతాయి. మొక్క పెరుగుదల తగ్గుతుంది. నివారణ : 60 రోజుల దశలో ఇమిడాక్లోప్రిడ్ లేదా ఫ్లోనికామిడ్ను నీటితో 1:20 నిష్పత్తిలో కలిపి కాండానికి పూయాలి. తొలి దశలో 5% వేప గింజల కషాయం లేదా వేప నూనె (1500 పి.పి.ఎం) 5మి.లీ / లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఫ్లోనికామిడ్ 0.3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ. లేదా డైఫెన్థయూరాన్ 1.25 గ్రా. లేదా సల్ఫాక్సాఫ్లోర్ 0.75 మి.లీ./లీటరు నీటికి కలిపి, ఒకే మందును వరుసగా వాడకుండా మారుస్తూ పిచికారీ చేయాలి. పేను బంక ఉధృతికి అనుకూల పరిస్థితులు బెట్ట వాతావరణం, చలి కాలం, వర్షాలకు మధ్య వచ్చే పొడి రోజులు.గుర్తించే లక్షణాలు: లేత కొమ్మలు, ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. ఆకులు ముడుచుకుని మొక్క ఎదుగుదల తగ్గుతుంది. జిగురు పదార్థం వల్ల నల్ల బూజు ఏర్పడుతుంది. నివారణ : తొలి దశలో 5% వేప గింజల కషాయం లేదా వేప నూనె (1500 పి.పి.ఎం) 5మి.లీ. / లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ. లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రా. లేదా సలాఫాక్సాఫ్లోర్ 0.75 మి.లీ. / లీటరు నీటికి కలిపి మారుస్తూ పిచికారీ చేయాలి. తామర పురుగులు ఉధృతికి అనుకూల పరిస్థితులు అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం.గుర్తించే లక్షణాలు: ఆకులను గీకి రసాన్ని పీలుస్తాయి. ఆకులు ముడుచుకుని పెళుసుగా మారుతాయి. టొబాకో స్ట్రిక్ వైరస్ వ్యాప్తికి కారణమవుతాయి. నివారణ: తొలి దశలో 5% వేప గింజల కషాయం లేదా వేప నూనె (1500 పి.పి. ఎం.) 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎకరానికి 10 నీలి రంగు జిగురు అట్టలు ఏర్పాటు. చేయాలి. అవసరాన్ని బట్టి ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ. లేదా డైఫెన్థయూరాన్ 1.25 గ్రా. లేదా స్పైనెటోరం 0.9 మి.లీ. లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రా. లీటరు నీటికి కలిపి మారుస్తూ పిచికారీ చేయాలి. తెల్ల దోమ ఉధృతికి అనుకూల పరిస్థితులు పిందె. కాయ దశలో ఎక్కువగా ఆశిస్తుంది.గుర్తించే లక్షణాలు: ఆకుల అడుగు భాగంలో రసం పీలుస్తుంది. ఆకులు పచ్చదనం కోల్పోయి రాలిపోతాయి. నల్ల బూజు ఏర్పడి దూది నాణ్యత తగ్గుతుంది. నివారణ : తొలి దశలో 5% వేప గింజల కషాయం లేదా వేప నూనె (1500 పి.పి.ఎం.) 5మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రారంభ దశలో సింథటిక్ పైరిథ్రాయిడ్, ఆర్గానోఫాస్పేట్ మందులను విచ్చలవిడిగా వాడకూడదు. అవసరాన్ని బట్టి ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ. లేదా డైఫెన్థయూరాన్ 1.25 గ్రా. లేదా స్పైరోమెసిఫెన్ 1 మి.లీ. లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రా. లేదా సలాఫాక్సాఫ్లోర్ 0.75 మి.లీ./లీటరు నీటికి కలిపి మారుస్తూ పిచికారీ చేయాలి. పిండి నల్లి ఉధృతికి అనుకూల పరిస్థితులు అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులు.గుర్తించే లక్షణాలు: తెల్లని మైనపు పూతతో కనిపిస్తుంది. మొక్కలపై జిగురు పదార్ధం ఏర్పడి నల్ల బూజు వస్తుంది. నివారణ : తొలి దశలో 5% వేప గింజల కషాయం లేదా వేప నూనె (1500 పి.పి.ఎం.) 5 మి.లీ. / లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎకరానికి 10 పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయాలి. అవసరాన్ని బట్టి ప్రొఫెనోఫాస్ 3 మి.లీ. లేదా ఎసిఫేట్ 2 గ్రా. + స్టిక్కర్ (సోండోవిట్) 1 మి.లీ. లీటరు నీటికి కలిపి మొక్క పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. ఎర్రనల్లి ఉధృతికి అనుకూల పరిస్థితులు బెట్ట పరిస్థితులు, పిందె, కాయ దశ.గుర్తించే లక్షణాలు : ఆకుల అడుగు భాగంలో సాలీడు గూడు లాంటి అల్లిక కనిపిస్తుంది. ఆకులపై పసుపు మచ్చలు ఏర్పడి తరువాత ఎర్రగా మారి ఎండిపోతాయి. నివారణ: తొలి దశలో సింథటిక్ పైరిథ్రాయిడ్, నియోనికోటినాయిడ్ మందులను విచ్చలవిడిగా వాడకూడదు. అవసరాన్ని బట్టి నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా స్పైరోమెసిఫెన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రైతులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు నత్రజని ఎరువులను సిఫార్సు మోతాదులో మాత్రమే వాడాలి. పంట ప్రారంభ దశలో కాండానికి మందు పూసే విధానాన్ని పాటించాలి. వేప ఆధారిత జీవరసాయనాలను మొదటి ఎంపికగా ఉపయోగించాలి. కలుపు మొక్కలను తొలగించి పొలాన్ని శుభ్రంగా ఉంచాలి. ఒకే గ్రూపు పురుగు మందులను పదేపదే వాడకుండా మారుస్తూ ఉపయోగించాలి. వారానికి కనీసం ఒకసారి పొలాన్ని పరిశీలించి పురుగు ఉధృతిని అంచనా వేసి అవసరమైనప్పుడు మాత్రమే మందులు పిచికారీ చేయాలి. పత్తిలో సమగ్ర చీడపీడల యాజమాన్యం పద్ధతులు పత్తిలో చీడపీడల ఉధృతిని తగ్గించేందుకు సమగ్ర చీడపీడల యాజమాన్య పద్ధతులను అనుసరించడం అవసరం. ప్రతి రెండు వరుసల పత్తి మధ్య అలసంద, పెసర, మినుము, సోయాచిక్కుడు, గోరుచిక్కుడు లేదా కొర్ర వంటి అంతర పంటలు సాగు చేయడం వల్ల చీడపీడల ఉధృతి తగ్గుతుంది. ఎకరాకు 20 ఆముదం మొక్కలను, 100 బంతి మొక్కలను ఎర పంటలుగా నాటడం ద్వారా పొగాకు లద్దెపురుగు, శనగ పచ్చ పురుగులను ఆకర్షించి ప్రధాన పంటను రక్షించవచ్చు. పొలం చుట్టూ నాలుగు వరుసల జొన్న లేదా మొక్కజొన్నను కంచె పంటగా సాగు చేయాలి. పంట 90-100 రోజుల దశలో తలతుంచడం ద్వారా కొత్త పూత, చీడపీడల ఉధృతిని తగ్గించవచ్చు. ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు, 10-12 పసుపు జిగురు అట్టలు, 15–20 పంగ కర్రలు ఏర్పాటు చేసి సహజ శత్రువులను ప్రోత్సహించాలి. మూడవ దశ దాటిన పురుగులను చేతితో ఏరి నాశనం చేయడం, విత్తన శుద్ధి చేయడం, పంట 20, 40, 60 రోజుల దశల్లో కాండానికి సిఫార్సు చేసిన మందును పూయడం వంటి చర్యలు ప్రారంభ దశలో రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నియంత్రిస్తాయి. అవసరమైనప్పుడు మాత్రమే ఆర్థిక నష్టం స్థాయిని దృష్టిలో ఉంచుకొని సిఫార్సు చేసిన పురుగు మందులను మారుస్తూ వినియోగించడం ద్వారా పత్తి పంటలో చీడపీడలను సమర్థవంతంగా అదుపులో ఉంచి అధిక దిగుబడి సాధించవచ్చు. పురుగులను సకాలంలో గుర్తించడం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించడం, అవసరమైనప్పుడు మాత్రమే సరైన పురుగు మందులను మారుస్తూ వినియోగించడం ద్వారా పత్తి పంటను రసం పీల్చే పురుగుల నుంచి సమర్థవంతంగా కాపాడి, అధిక దిగుబడి, మెరుగైన దూది నాణ్యత, అధిక నికర ఆదాయం పొందవచ్చు. ఆధారం: వ్యవసాయ పాడిపంటలు కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా