పత్తి పంటను ఆశించే గులాబి రంగు పురుగు సమగ్ర సస్య రక్షణ తెల్ల బంగారంగా పిలువబడే పత్తి ప్రపంచ ఆర్థిక కార్యాకలాపాల్లో ప్రధానమైన వాణిజ్యపంట. ప్రతి సంవత్సరం పత్తి పంటపై అనేక రకాల చీడపీడల వలన దిగుబడులు తగ్గుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా గులాబిరంగు పురుగు ఉధృతి, పంట నష్టం రోజు రొజుకూ పెరుగుతోంది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు. గులాబీ రంగు పురుగు తాకిడి పంట కాలంలో తగ్గించడానికి పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. పురుగు ఉధృతి ఎక్కువ అవ్వడానికి కారణాలు పురుగు కాయ లోపల ఉండి తినే స్వభావం. పువ్వులు, కాయల్లోని విత్తనాల్లో బిటి టాక్సిన్ వ్యక్తీకరణ తక్కువగా ఉండటం. దీర్ఘ కాలిక సంకర జాతి రకాలను ఎంపిక చేసుకోవటం వలన పురుగుకు నిరంతర ఆశ్రయం దొరుకుతుంది. వివిధ సమయాల్లో పుష్పించే హైబ్రిడ్లను విత్తుకోవటం. పత్తిని జిన్నింగ్ మిల్లులు, మార్కెట్ యార్డ్ వద్ద ఎక్కువ కాలం నిలువ చేయటం వల్ల తరువాత పంట కాలం లో దీని ఉధృతి ఎక్కువ అవుతుంది. పంటకాలన్ని నవంబర్ మాసం తరువాత కూడా పొడిగించటం పూత సమయం నుండి నివారణ చర్యలు ఆచరించకపోవడం. పంట కాలంలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు తొలి దశలో పురుగు ఉధృతిని తగ్గించటానికి ముడుచుకుయిన పువ్వులను, ఎండిపోయిన పువ్వులను ఎరివేసి నాశనంచేయాలి. అంటే పంట 45 రోజుల నుండి మొదలుకుని దాదాపు 70రోజుల వరకు గుడ్డి పూలను గమనించి ఏరి నాశనం చేసినట్టైతే తర్వాత దశల్లో పురుగు తాకిడిని తగ్గించుకోవచ్చు పూత దశ నుండి గులాబీ రంగు పురుగు గుడ్డును నశింపచేయడానికి, గుడ్డు పరాన్నజీవి అయిన ట్రైకోగ్రామా టాఇదియా బాక్ట్రియే ఎకరానికి 4 కార్డులు 15 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. పత్తి ఆకుల అడుగుభాగాన ట్రైకోకార్టును జత పరచాలి. గులాబీ రంగు పురుగు గుడ్డు లోపల ట్రైకోగ్రామా పరాన్నజీవి వివిధ దశలు పూర్తి చేసుకుని బయటకు వస్తుంది. ప్రతి పంట గూడ, పూత దశలో గులాబి రంగు పురుగు లార్వాలను జాగ్రత్తగా పరిశీలించాలి. 10% గుడ్డి పువ్వులు కనిపించిన వెంటనే మొదటి దశల్లో వాడేందుకు సూచించిన వేప నూనే లేదా పిచికారీ మందులను స్ప్రే చేసుకోవాలి. కాయ ఏర్పడే దశలో 10% పురుగు ఆశించిన కాయలను, తొందరగా పక్వానికి వచ్చిన కాయలను గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. రైతులు దీనిని గుర్తించడానికి 20 పత్తి కాయలను అక్కడక్కడ తెంపి కాయలను పగులగోట్టి చూడాలి. 20 కాయలలో 2 కాయలు తెలుపు లేదా గులాబి రంగు లార్వాలు లేదా బయటకు వెళ్ళే రంధ్రాలు కలిగి ఉంటే ఆర్థిక నష్టపరిమితి స్తాయి దాటిందని గుర్తించాలి. గులాబి రంగు కాయతొలిచే పురుగు లింగాకర్షణ ఎరలను బుట్టలలో అమర్చి ఎకరానికి 4 చొప్పున పొలాలలో అమర్చుకుంటే పురుగుల ఉనికి, ఉధృతి అంచనా వేయవచ్చు. పత్తి విత్తిన 45 రోజులకు బుట్టలను పెట్టుకొని రెక్కల పురుగుల ఉధృతిని గమనించుకోవాలి. ఎకరాకు 8-10 లింగాకర్షణ బుట్టలు పెట్టుకుంటే పురుగు ఉధృతిని నియంత్రిచవచ్చు. ఒక్క బుట్టలో ఒక రాత్రికి 8 పురుగులు వరుసగా మూడు రాత్రులు లేదా మూడు రోజులలో 24 పురుగులు లేదా ఎక్కువ పురుగులు పడినప్పుడు ఆర్థిక నష్టపరిమితిగా భావించి సస్యరక్షణ చర్యాలు చేపట్టాలి. పురుగు నష్టపరిమితి స్థాయి దాటిన వెంటనే 5% వేప గింజల ద్రావణాన్ని (అంటే 10కిలోల వేప గింజల పొడిని 200 లీటర్ల నీటిలో 24 గంటలు నానబెట్టి వడబోసిన ద్రావణం) లేదా 5 మి.లీ. వేప నూనె (1500 పిపియం) ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీనిని పత్తి విత్తిన 60 రోజుల వరకు పిచికారీ చేసుకోవచ్చు. పూత దశలో ఎక్కువకాలం చర్య కలిగిన మందులైనటువంటి క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా క్వినాలఫాస్ 2 మి.లీ. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా. లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లేదాఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రా. చొప్పున లీటరు నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. పంట చివరి దశలో అవసరం అనుకుంటే (తెల్ల దోమ ఉధృతి లేనప్పుడు మాత్రమే) సింథటిక్ పైరిత్రైడ్ మందులు సైపెర్మేత్రిన్ 25 % ఇ.సి. 1 మి.లీ లేదా లార్డ్ సాయాలోత్రిన్ 5 % ఇ.సి. 1 మి.లీ. 1 లీటరు నీటికి కలుపుకొని వాడుకోవాలి. పత్తి తీత సమయంలో గులాబి రంగు పురుగు ఆశించని పత్తిని, పురుగు ఆశించిన పత్తిని విడిగా ఉంచాలి. పురుగు ఆశించిన పత్తిని నాశనం చేయాలి. ఎకరానికి 20 లింగాకర్షక బుట్టలను సమీపంలో ఉన్న జిన్నింగు మిల్లులు, మార్కెట్ యార్డ్ లో పెట్టి రెక్కల పురుగులను సాముహికంగా ఆకర్షించాలి. ఆకర్షింపబడిన రెక్కల పురుగులు అన్నింటిని నాశనం చేయాలి. లింగాకర్షక బుట్టలను వానాకాలంలో, యాసంగిలో రెండు సీజన్లలో పత్తి పంటలేని కాలంలో కూడా అమర్చాలి. జిన్నింగ్ మిల్లులందు లింగాకర్షణ బుట్టలను పంట కాలంలో, పంట లేని సమయంలో తప్పకుండా అమర్చి పురుగుల ఉధృతిని తగ్గించుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే క్లోరంత్రనిలిప్రోల్ 9.3 % +లన్దసైహలోత్రిన్ 4.6 % ఏ 0.5 మి.లీ. లేదా స్పైనోటోరాం 0.9 మి.లీ. లీటరు నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. నీటి వసతి ఉన్నప్పటికీ పత్తిని 6 నెలలకు పొడిగించకుండా తీసివేసి తమ ప్రాంతానికి అనువైన ఆరుతడి పంటలను వేసుకోవడంవలన పంట మార్పిడి జరగడమే కాకుండా పత్తి లో వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ వస్తుంది. ఈ విధంగా పత్తిలో గులాబీ రంగు కాయ తొలిచే పురుగు నివారణకు యాజమాన్య పద్ధతులను పాటించటం ద్వారా పురుగు ఉధృతిని సకాలంలో తగ్గించుకోవచ్చు. ఎ. రమాదేవి, కె.రాజశేఖర్, జి. సంతోష్ కుమార్, డి. శ్వేత, ఎ, సరిత, సిహెచ్. పల్లవి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధారం: పాడి పంటలు