శ్రేష్టమైన పత్తికి మేలైన మార్గం మన దేశంలో అత్యధికంగా సాగు చేస్తున్న వాణిజ్య పంటల్లో పత్తి పంట కూడా ఒకటి. పత్తిని తెల్లబంగారం. అంటూ రైతులు మురిపెంగా పిలుచుకుంటారు. అందుకే ఎన్ని కష్టనష్టాలు వచ్చినా, మార్కెట్ అటుపోట్లు ఎదురైనా మెట్ట రైతులకు ఖరీఫ్ సాగు అనగానే గుర్తొచ్చే పంట పత్తి. అంతరపంటలు / పంటలసరళి సుస్థిర పంట సాగుకు మరియు దిగుబడికి అంతరపంటల సాగును తప్పక చేపట్టాలి. పత్తిలో అంతర పంటలుగా సాళ్ళ మధ్య దూరాన్ని బట్టి 2 లేదా 3 వరసలు పెసర, బొబ్బర్లు, మినుము, సోయాచిక్కుడు మొదలగు పంటలను సాగు చేసుకోవచ్చు. అంతర పంటల నుంచి దిగుబడి తీసుకున్న తరువాత మిగిలిన అంతర పంటల మోళ్ళను /అవశేషాలను భూమిలో కలియ దున్నుకోవడం ద్వారా ప్రధాన పంటకు అవసరమైన సేంద్రియ ఎరువును పొందవచ్చు. అంతర పంటల సాగుతో ప్రధాన పంటకు మేలుచేసే మిత్ర పురుగుల సంఖ్య పెరగడమే కాకుండా, వాతావరణఒడిదుడుకుల నుండి కూడా కొంత రక్షణ లభిస్తుంది. పత్తిలో కంది పంటను కూడా నాలుగు, ఆరు, ఎనిమిది వరుసల పత్తికి ఒక వరస చొప్పున సాగు చేసుకున్నా బాగుంటుంది. సమగ్ర ఎరువుల యాజమాన్యం పత్తి సాగు చేసే భూములలో ప్రతీ సంవత్సరం ఎకరాకు 4 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రియ ఎరువును దుక్కిలో కలియ దున్నాలి. సాధారణ /సూటి రకాలకు ఎకరాకు 36 కిలోల నత్రజని, 18 కిలోల భాస్వరం, 18 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి. హైబ్రిడ్ రకాలకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ నిచ్చు ఎరువులను ఎకరాకు వేయాలి. సిఫారసు చేసిన భాస్వరం మొత్తాన్ని, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ( సూట్ రకాలకు 100 కిలోలు, హైబ్రిడ్ రకాలకు 150 కిలోలు) ఎకరానికి విత్తే ముందు ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి లేదా విత్తిన 15 రోజులలోపు కూడా వేసుకోవచ్చు. సాధారణ రకాలకైతే సిఫారసు చేసిన నత్రజని, పొటాష్లను మూడు సమ భాగాలుగా చేసి విత్తిన 30, 60, 90 రోజులకు మొక్కల మొదళ్ళలో 7-10 సెం.మీ. దూరంలో పాదులు తీసివేయాలి. బిటి హైబ్రిడ్ లకు సిఫారసు చేసిన నత్రజని మరియు పొటాష్లను నాలుగు సమభాగాలుగా చేసి విత్తిన 20, 40, 60, 80 రోజులకు మొక్కల మొదళ్ళలో 7-10 సెం.మీ. దూరంలో పాదులు తీసి వేయాలి. ఎక్కువ కాలం పత్తి సాగు చేస్తున్న భూముల్లో, ప్రత్యేకంగా వేరు తెగుళ్ళు ఆశించే భూములలో మాత్రం పంట మార్పిడి తో పాటు, ఎకరాకు 200 కిలోల వేప పిండిని 2-3 సంవత్సరాలు వేయాలి. సమగ్ర కలుపు యాజమాన్యం పత్తిలో మొదటి దశలో (అనగా విత్తిన నెలలోపు) వచ్చు కలుపు నివారణకు పత్తిని విత్తే 3-5 రోజుల ముందు ప్లూక్లోరాలిన్ 45% మందును ఎకరాకు 1 లీటరు చొప్పున. చివరి దుక్కిలో పిచికారీ చేసి భూమిలో కలియ దున్నాలి లేదా విత్తనం వేసిన 24-48 గంటలలోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును ఎకరాకు 1.2 లీ. 200 లీటర్ల నీటికి (లీటరు నీటికి 6 మి.లీ.) చొప్పున కలిపి చేతి పంపుతో చేనంతా సమంగా తడిచేటట్టు పిచికారీ చేయాలి. భూమిలో సరియైన పదును / తేమ ఉన్నప్పుడే పిచికారీ చేసిన గడ్డి మందు చాలా సమర్థ వంతంగా పనిచేసి, కలుపును నివారిస్తుంది. పత్తి మొలకెత్తిన నెలరోజులకు వచ్చు లేత గడ్డి మరియు వెడల్పాకు కలుపు నివారణకు క్విజలాఫావ్ ఇథైల్ 400 మి.లీ. లేదా ప్రొఫాక్విజఫావ్ 250 మి.లీ., పైరిథయోబాక్ సోడియం 250 మి.లీ., 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వారం, కలుపు మందులతో పాటుగా పత్తిలో సమయాను కూలంగా, ప్రతి పది రోజుల కొకసారి గొర్రు, గుంటకలతో 60-70 రోజుల వరకు పలు దఫాలుగా అంతర కృషి చేసినట్లయితే కలుపు నివారణతో పాటు, పైరు పెరుగుదల బాగా ఉండి, భూమిలో ఎక్కువ తేమ నిల్వఉండి, తద్వారా అధిక దిగుబడులు పొందడానికి దోహదం చేస్తుంది. వర్షాలు ఎక్కువగా ఉండి, అంతర కృషి ద్వారా కలుపు నివారణ వీలు కాని పరిస్థితులలో పారాక్వాట్ 5 మి.లీ. మరియు 10 గ్రా. యూరియాతో లీటరు నీటికి కలిపి పత్తి మొక్కల పై పడకుండా, పరుసల మధ్య కలుపు మీద మాత్రమే పడేట ట్లుగా పిచికారీ చేస్తే, కలుపు నివారణ బాగా జరుగుతుంది. ఆధారం: పాడి పంటలు మాస పత్రిక డా.సి.హెచ్. నాగజ్యోతి శాస్త్రవేత్త (అగ్రానమి) ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం, లాం, గుంటూరు