సాధారణంగా ప్రత్తి విత్తిన 50-60 రోజుల వరకు రసం పీల్చు పురుగులైన పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ, పిండినల్లి, తామర పురుగులు ఆశిస్తూ ఉండేవి. మారిన సాగు పద్ధతులు, వాతావరణ పరిస్థితుల వలన ఈ రసం పీల్చు పురుగులు దాదాపు పంట చివరి కాలం వరకు ఆశించి నష్ట పరుస్తున్నాయి. పేను బంక పిల్ల, పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగంలోను, కొమ్మల పైనుండి రసం పీలుస్తూ జీవిస్తాయి. ఆకులు దోనెలుగా మారి, మొక్క పెరుగుదల మందగిస్తుంది. ఇవి విసర్జించే తేనె వంటి పదార్ధము వలన ఆకులు, కాండము పై మసి తెగులు వ్యాపిస్తుంది. పచ్చ దోమ పెద్ద దోమ రెక్కలతో, పిల్ల దోమ రెక్కలు లేకుండా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పెద్ద దోమ ముందు రెక్కలపై నల్లటి మచ్చ ఉంటుంది. పిల్ల, పెద్ద పురుగులు అడ్డంగా నడుస్తూ, ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. ఇవి ఆశించిన మొక్కల ఆకుల చివర్లు పసుపు పచ్చగా మారి, క్రమేపీ ఆకు అంతా ఎర్రబడి (హాపర్ బర్న్) చివరగా ఆకులు ముడుచుకొని దోనెల లాగా కనిపిస్తాయి. పచ్చదోమ ఎక్కువగా ఉన్నప్పుడు పైరు పెరుగుదల క్షీణించి మొగ్గలు రాక దిగుబడి తగ్గుతుంది. తెల్లదోమ పిల్ల దోమలు పసుపు ఆకుపచ్చ రంగులో ఉండి కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. గుడ్డు నుండి వెలువడిన పిల్లలు ఈనెల దగ్గరగా స్థిరపడి రసాన్ని పీలుస్తాయి. పెద్ద దోమలు సహజంగా ఎర్ర కళ్ళు, పసుపు పచ్చని శరీరం, తెల్లటి రెక్కలతో ఉంటాయి. ఆకుల ఆడుగు భాగాన గుడ్లు పెడతాయి. పిల్ల పురుగులు ఆకుల అడుగుభాగాన చేరి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకి మారి ఎండిపోయి, మొక్కలు గిడసబారి పోతాయి. ఇవి విసర్జించే తేనె వంటి పదార్ధము వలన బూజు తెగులు వ్యాపిస్తుంది. తామర పురుగు/ ముడత పురుగు పెద్ద పురుగులు చాలా చిన్నగా, సున్నితంగా, పసుపు నుండి గోధుమ రంగులో, చీలిన రెక్కలతో, లేత ఆకులలో ఈ నెల మధ్య దాగిఉంటాయి. ఆడ పురుగులు లేత ఆకుల ఆడుగూ : భాగంలో గుడ్లను పెడతాయి. మూడు వారాలలో జీవిత చక్రం పూర్తిచేస్తాయి. పిల్ల, పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకులను గీకి రసాన్ని పిలుస్తాయి. దీని వలన ఆకులు ముడుచుకొని పెళుసుగా మారతాయి. ఆకుల అడుగు భాగాన ఈనెల వెంబడి వెండిలా మెరిసే చారలు కనబడతాయి. పురుగులు - ఆకలి సహన స్థాయి పేరు ఆకలి సహన స్థాయి పేనుసంక 10-20% పేములంక ఆహరించి మెకులు పచ్చదోమ 2 పచ్చదోమలు / ఆకుకు తెల్లదోమ 6 తెల్లదోమలు పురుగుమొక్క, పల్ల పురుగులు 20/ఆకు మిడతలు 5-10% పంటను ఆహరించి మెకులను గుల్లబరచును జామపురుగు 8-10 పచ్చి పురుగులు/ఆకుకు పిండినల్లి ప్రస్తుతం సాగవుతున్న బి.టి ప్రత్తిని పిండినల్లి ఆశించి నష్టం కలుగచేస్తున్నది. పిండినల్లి తల్లి, పిల్ల పురుగులు కొమ్మలు, కాండం, మొగ్గలు, పువ్వులు, కాయలు నుండి రసాన్ని పీలుస్తాయి. పురుగు ఆశించిన మొక్కలు ఎదగక గిడసబారి పోతాయి. కణుపుల మధ్య దూరం తగ్గి, ఆకులు గుబురుగా కనిపిస్తాయి. పురుగు ఆశించిన మొక్కలు చిన్న చిన్న కాయలను తక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తాయి. కాయలు పక్వానికి రాకుండానే పగిలిపోయి దిగుబడులు తగ్గుతాయి. ఆర్ధిక సహన స్థాయి (ETL) పురుగుల సంఖ్య లేదా పురుగుల వలన కలిగే నష్టం ఏ స్థాయికి చేరితే, దిగుబడి నష్టం ఆర్థికంగా గణనీయంగా ఉంటుందో ఆ స్థాయిని ఆర్థిక సహన స్థాయి అంటారు. రసం పీల్చే పురుగుల యాజమాన్యం విత్తనశుద్ధి: కిలో విత్తనానికి 9.0 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్ లేదా 5.0 గ్రా. థయోమిథాక్సామ్ 70 డబ్ల్యూ. ఎస్ తో విత్తన శుద్ధి చేయాలి. తెల్లదోమ : ఉదృతి ఎక్కువగా ఉంటే పంట పొలాల్లో ఒక ఎకరాకు 6-8 పసుపు రంగు జిగురు అట్టలు పెట్టుకుంటే తెల్లదోమల నిఘాతో పాటు కొంత మేర నియంత్రణ సాధ్యమవు తుంది. పేనుబంక/పచ్చదోమ/తామరపురుగు : ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్. ఎల్-0.4 మి.లీ, ఎసిటామిప్రిడ్ 20 ఎస్.పి 0.2 గ్రా. ధయోమిథాక్సామ్ 25 డబ్ల్యు.జి 0.2 గ్రా. ఎసిఫేట్ 75% ఎస్.పి-1.5 గ్రా. ఫిప్రోనిల్ 5 ఎస్.సి- 2.0మి.లీ ఫ్లోనికామిడ్ 50 డబ్ల్యూ.జి-0.3 గ్రా. డైఫెన్ ధియూరాన్ 50 డబ్ల్యు.పి 1.25గ్రా. లలో ఏదైనా ఒకదానిని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిండినల్లి : ఉదృతిని బట్టి ప్రొఫెనోఫాస్ 50 ఇ.సి. 3 మి.లీ లేదా ఎసిఫేట్ 75% ఎస్.పి 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పైరు తొలి దశలో ఎక్కువ సార్లు పురుగు మందులు పిచికారీ చేయ కూడదు. పంట కాలంలో మొదటి 60 రోజులు నియో నికోటినాయిడ్ మందులైన ఇమిడాక్లోప్రిడ్, ఎసిటామిప్రిడ్ లేదా ధయోమిథాక్సామ్ మందులను పిచికారీ చేయకూడదు. ఒకే పురుగు మందుని కాకుండా పురుగు మందులు మార్చి మార్చి వాడుకోవాలి. ఆధారం: పాడిపంటలు మాసపత్రిక డా.ఎల్.రాజేష్ చౌదరి, శాస్త్రవేత్త ((ప్రత్తి విభాగం) ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, లాం, గుంటూరు.