బచ్చలిని ఇండియన్ స్పినాచ్ లేదా మలబార్ స్పినాచ్ అని పిలుస్తారు. ఈ పంట భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో సాగవుతోంది. బచ్చలికూర సాధారణంగా తీగలాగా పెరిగే బహువార్షిక పంట. దీన్ని ఏకవార్షిక పంటగాకూడా పండిస్తారు. దీనిదీని కాండం మోత్తగా ఉండి లోత ఆకులు కలిగి ఉంటుంది. దీని లేత కొమ్మలు, ఆకులు కాడలతో సహా కూరగాయగా వాడతారు. ఉపయోగాలు బచ్చలికూర అధిక మోతాదులో కాల్సియం, పొటాషియం, మెగ్నిషియం, ఇనుమును సరఫరా చేస్తుంది. అంతేకాకుండా విటమిన్ ఎ, విటమిన్ సి లను కలిగి ఉంటుంది. లేత కాడలలో కూడా విటమిన్ - ఎ ఎక్కువగా ఉంటుంది. బచ్చలి ఆకులలో (బాసిల్లరుబ్ర) ఉండే బీటాకెరాటిన్ కంటి చూపును మెరుగు పరుస్తుంది. బచ్చలిలోని ఆక్సాలిక్ ఆసిడ్స్ మిగతా ఆకుకూరల కంటే తక్కువ మోతాదులో ఉండడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కిడ్నీలకు ఎలాంటి హాని కలగదు. ఊపిరి తిత్తులకు బచ్చలి ఎంతో మేలు చేస్తుంది. అంతే కాకుండా వృద్దాప్య ప్రక్రియను తగ్గిస్తుంది. ఆకులలోని జిగట పదార్థం మల మద్దకపు నివారణలో తోడ్పడుతుంది సాఫోనిన్ అనే పదార్థం బచ్చలిలో ఉండడం వలన క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఆకులు, కాండం నుండి తీసిన రసం తరచుగా వచ్చే తలనొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బచ్చలి పండ్ల నుండి తీసిన రసం ఎరుపు రంగులో ఉండడం వలన ఆహార పదార్ధాలలో రంగు చేర్చడానికి, వస్రాలకు అద్దకాలుగా ఉపయోగిస్తారు. బచ్చలి కూర శరీరంలోని చెడు కొవ్వును తగ్గించి కాండం మంచి కొవ్వును పెంచుతుంది. పోషక విలువలు పోషకాలు విలువలు శక్తి 16 కిలో క్యాలరీ పిండి పదార్థం 3.40 గ్రా. ప్రోటీన్ 1.80 గ్రా. కొవ్వు 0.30 గ్రా. కొలెస్ట్రాల్ 0 మి.గ్రా. ఫాలేట్స్ 140 మైగ్రో గ్రా. విటమిన్ - ఎ 400 మైక్రో గ్రా. విటమిన్ – సి 102 మి.గ్రా. కాల్షియం 109 మి.గ్రా. ఐరన్ (ఇనుము) 1.2 మి.గ్రా. మెగ్నీషియం 65 మి.గ్రా. పొటాషియం 510 మి.గ్రా. జింక్ 0.43 మి.గ్రా. వాతావరణం బచ్చలిని సాగు చేయడానికి తేమతో కూడిన వేడి వాతావరణం అనుకూలం. నీడ పాక్షికంగా ఉండే ప్రాంతాల్లో బచ్చలి పెద్ద సైజు ఆకులను ఇస్తుంది. తక్కువ ఉష్ణోగ్రత గల ప్రాంతాల్లో మొక్క పెరుగుదల తగ్గి ఆకుల సైజు తగ్గిపోతుంది. ఎక్కువ ఉష్ణోగ్రత గల ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 25-32 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటే బాగా పెరుగుతుంది. నేలలు బచ్చలి కూరను అన్ని రకాల నేలల్లో సాగుచేయవచ్చు. కానీ అధిక దిగుబడి కోసం ఇసుకతో కూడిన గరప నేలలు చాలా అనుకూలమైనవి. అధిక సేంద్రియ ఎరువులు కలిగి ఉండి, ఉదజని సూచిక 5.5-6.5 ఉన్న నేలలు అనుకూలం. బచ్చలి ఉదజని సూచిక 8.0 వరకు ఉన్న నేలను కూడా తట్టుకొని పెరుగుతుంది. రకాలు బాసిల్ల ఆల్ప గుండ్రటి ఆకులను కలిగి ఉండి, కాండం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. బాసిల్లరుబ్ర (ఎర్ర బచ్చలి) ఆకులు అండాకారంలోను, కాండం ఎరుపు రంగులో ఉంటుంది. బాసిల్ల ఆల్బతో పోల్చినప్పుడు బాసిల్లరుబ్ర అధిక పోషకాలు కలిగి ఉంది. పంట కాలం బచ్చలికూరను సంవత్సరం పొడవునా సాగుచేసుకోవచ్చు. కానీ వర్షాకాలంలో జూన్ నుండి జూలై వరకు, వేసవి కాలంలో జనవరి ఫిబ్రవరి వరకు నాటుకోవచ్చు. విత్తనమోతాదు బచ్చలిని గింజలు, వేరు లేదా కాండం ముక్కల ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. ఎకరాకు 5.0-6.4 కిలోల విత్తనం, ముక్కలయితే 11,100- 22,000 వరకు కావాల్సి ఉంటుంది. నేల తయారీ భూమిని 3-4 సార్లు దున్ని చదును చేయాలి. ఎకరా భూమికి 10 టన్నుల పశువుల ఎరువును చివరి దుక్మిలో వేసి దున్నాలి. ఎకరాకు 200 కిలోల వేప పిండిని పశువుల ఎరువుతో పాటు వేయాలి. వితే విధానం విత్తనాలను నారుమడులలో పెంచిన తర్వాత కూడా ప్రధాన పొలంలో నాటవచ్చు. ఈ విధానంలో ఎకరాకు 1.5 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ విధంగా పెంచిన నారును 2-3 ఆకుల దశలో ఉన్నప్పుడు పొలంలో నాటుకోవాలి. కాండం ముక్కలయితే 20–25 సెం.మీ. పొడవు 3-4 కణుపులు కలిగిన కాండవు ముక్కలను ఉపయోగించుకోవాలి. విత్తే దూరం నేలమీద పాకిస్తే – 60 x 60 సెం.మీ. పందిరిపై అయితే – 60 x 30 సెం.మీ. ఎరువులు నేల సారాన్ని బట్టి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. 8-10 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్మిలో వేయాలి. ఎకరా భూమికి 24 కిలోల నత్రజని,24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్లనిచ్చే ఎరువులు సరిపోతాయి. సగం నత్రజని, పూర్తి భాస్వరం, పొటాష్ ఆఖరి దుక్కిలో వేయాలి. మిగిలిన సగం నత్రజనిని నాటిన 30 రోజులకు వేయాలి. విత్తిన 15-20 రోజుల తర్వాత 2 శాతం యూరియా (లీటరు నీటికి 20 గ్రా) + 50 పి.పి.ఎం (లీటరు నీటికి 50 మి.గ్రా.) జిబ్బరిల్లిక్ ఆసిడ్ కలిపిన ద్రావణం పిచికారీ చేస్తే అధిక లాభాలు పొందవచ్చు. నీటి యాజమాన్యం విత్తనం నాటినప్పుడు నేలలో తగినంత తేమ ఉండేటట్లు నీటిని ఇవ్వాలి. భూమిలో తేమను బట్టి శీతాకాలంలో 7-10 రోజులకొకసారి, వేసవిలో 5-6 రోజులకొకసారి, వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీరు ఇవ్వాలి. నీరు తక్కువైతే తీగలు సన్నగా గిడసబారి పోతాయి. ఆకులు చిన్నవిగా వస్తాయి. ఎక్కువ రోజులు నేలలో తేమ లేకుండా ఉంటే మొక్కలు త్వరగా వాడిపోయి చనిపోతాయి. కనుక అవసరమైనంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. కలుపు నివారణ, అంతర కృషి కలుపు నివారణకు ఎకరాకు పెండిమిథాలిన్ 1 లీ. 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 48 గంటలలోపు లేదా తడినేలపై పిచికారీ చేయాలి. బచ్చలి విత్తనాలు త్వరగా మొలకెత్తవు కనుక తొలిదశలో కలుపు నివారణ చాలా అవసరం. ఎవ్పటికప్పుడు కలుపు తీసి నేలగుల్లబారేటట్లు చేయాలి. బహువార్షిక పంటగా సాగుచేయాలి. అనుకున్నప్పుడు తీగ ఏపుగా పెరిగి మంచి దిగుబడి పొందడానికి తీగలను బ్రెల్లిస్ పద్ధతిలో పెంచాలి. సస్యరక్షణ పురుగులు ఆకుతినే పురుగు : చిన్న పెద్ద పరుగులు ఆకులను కొరికి వేయడం వలన ఆకులు పనికిరాకుండా పోవడమే కాక, మార్కెట్లో సరైన రేటురాదు. వీటి నివారణకు మలాథియాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిచికారీ చేసిన తర్వాత కనీసం పది రోజుల వ్యవధి ఇచ్చి ఆకులు కోయాలి. తెగులు ఆకుమచ్చ తెగులు : తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకుల మీద మచ్చలు ఏర్పడి మచ్చలన్నీ కలిసిపోతాయి. ఆకులు మాడిపోయి రాలిపోతాయి. దీని నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కుళ్ళ తెగులు : 3 గ్రా. కాప్లాన్ లేదా ధైరాంను కిలో విత్తనానికి పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి. నేలను గుల్లబారేటటు చేయాలి. పాదుల మొదట్లో కాపర్ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి ముంపుగా తడపాలి. కోత కాండం ముక్కలతో ప్రవర్ధనం చేసిన మొక్కలు 6 వారాలకు కోతకు వస్తాయి. గింజలు నుండి వచ్చిన మొక్కకి 8-10 వారాలలో కోతకు సిద్ధమవుతాయి. మొక్క మొత్తాన్ని ఒకేసారి కోయవచ్చు. లేక అనేకసార్లు కోయవచ్చు. అనేకసార్లు కోయడానికి మొక్క 15-25 సెం.మీ. పొడవు ఉన్నప్పుడు కాండం మొదలు వరకు కోయాలి. దిగుబడి ఎకరాకు 6-8 టన్నులు. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక