బెండ ఉష్ణమండలపు పంట. వేడితో కూడిన వేసవిలో చాలా బాగా కాలంలో కూడా పంట వస్తుంది. అయితే రాత్రిపూట చల్లని వాతావరణముంటే మేలు. మంచును తట్టుకోలేదు. 26-30 డిగ్రీల ఉష్ణోగ్రతలో మొలకెత్తుతుంది. 16 డిగ్రీల కంటే ఉష్ణోగ్రత తగ్గితే విత్తనం మొలకెత్తదు. వేసవిలో సాధారణంగా విత్తన నాణ్యత బాగుంటుంది. అయితే విత్తన పరిమాణం తక్కువ. ఒకవేళ కాయ పక్వానికొచ్చే దశ, ఎండబెట్టే దశలో ముందస్తు వరాలు పడితే నాణ్యత దెబ్బతినే అవకాశముంది. ఎంచుకోవలసిన రకాలు శంఖు రోగాన్ని తట్టుకునే సూటి రకాలను ఎంచుకుని విత్తనోత్పత్తి చేపట్టాలి. పూసా సవాని, పంజాబ్ పద్మిణి, పర్భని క్రాంతి రకాలు విత్తనోత్పత్తికి మేలు. పువ్వుల లక్షణాలు, సంపర్క లక్షణాలు రకాన్ని బట్టి 4 నుండి 8వ ఆకు కాండం మధ్య నుండి పూత మొదలవుతుంది. మొగ్గనుండి పూర్తి పూవుగా మారేందుకు 22-26 రోజులు పడుతుంది. ఉదయం 8-10 గంటల మధ్య పుష్పాలు విచ్చుకుంటాయి. పూత తర్వాత 15-20 నిమిషాల తర్వాత పుప్పొడి రేణువులు విడుదలవుతాయి. పూత తక్కువ కాలమే విచ్చుకుని ఉంటుంది. మధ్యాహ్నానికి పూలు ముడుచుకుంటాయి. కీటకాల వల్ల వివిధ రకాలలో 4-19 శాతం వరకు పరపరాగ సంపర్కం జరుగుతుంది. అందుకే బెండను తరచు పరపరాగ సంపర్కం చెందే పంటగా వర్గీకరిస్తారు. వేర్పాటు దూరం తరచుగా పరపరాగ సంపర్కం చెందే పంట కాబట్టి ఫౌండేషన్ విత్తనోత్పత్తికి 500 మీటర్లు, ధృవీకరణ విత్తనోత్పత్తికి 250 మీటర్ల వేర్పాటు దూరం పాటించాలి. నేలలు మురుగు నీరు పోయే సౌకర్యమున్న సారవంతమైన, కర్బన శాతం ఎక్కువగా ఉన్న ఇసుక నేలల నుండి ఒండ్రు మట్టి నేలల వరకు ఈ పంట సాగుకు అనుకూలమే. కొంత మేరకు పాక్షిక ఆమ్లత్వాన్ని తట్టుకుంటుంది. నేలలో ఉదజని సూచిక 6-7 ఉంటే మంచిది. వితే సమయం వేసవి పంటను ఫిబ్రవరి – మార్చి మధ్యలో, వర్షాధార పంటను జూన్ - జూలైలో విత్తుకోవాలి. విత్తన మోతాదు హెక్టారుకు 8-10 కిలోలు అవసరం. నాటడం నేల, నీటి వసతులను బట్టి సాధారణ మడులలో గానీ, బోదెలలో గానీ విత్తనం నాటుకోవాలి. వరుసల మధ్య 60 సెం.మీ., మొక్కల మధ్య 80 సెం.మీ. దూరంతో నాటాలి. రాత్రంతా విత్తనం నానబెట్టి, రెండు విత్తనాల చొప్పున నాటాలి. నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. 12-15 సెం.మీ. ఎత్తు పెరిగిన తర్వాత ఆరోగ్యవంతమైన మొక్కను ఉంచి రెండో మొక్కను తీసివేయాలి. ఎరువులు నేల తయారీ సమయంలో బాగా చివికిన పశువుల ఎరువును హెక్టారుకు 30 టన్నులు వేయాలి. అలాగే హెక్టారుకు 100 కిలోల నత్రజని, 50 కిలోల చొప్పున భాస్వరం, పొటాష్నిచ్చే ఎరువులను అందించాలి. సగం నత్రజని, మొత్తం భాస్వరం, పొటాష్లను విత్తనం నాటేందుకు ముందే నేలలో కలిపి వేయాలి. 30-35 రోజులు తర్వాత మిగతా సగం నత్రజని పంటకందించాలి. వరాకాలంలో అయితే అధిక నీటిని తీసివేయాలి. కాయ ఏర్పడే దశ, గింజలు అభివృద్ధి చెందే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. కలుపు లేకుండా చూసుకోవాలి. వేసవిలో మద్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితులలోను కలుపు మందులను పిచికారీ చేయరాదు. కల్లీలు ఏరివేయడం కనీసం మూడు క్షేత్ర తనిఖీలు - శాఖీయ దశలో, పూత, పిందె దశలో రెండోసారి, కాయ పక్వానికి వచ్చే దశలో మూడోసారి చేయాలి. కలీలలో ముఖ్యంగా శంఖు రోగం సోకిన మొక్కలు గుర్తించిన వెంటనే వేరుచేసి, పీకి కాల్చివేయాలి. ప్రమాణాల ప్రకారం 6, 7 కణుపుల తర్వాత వచ్చే కాయలు కలీవని గుర్తించి ఏరి వేయాలి. అలాగే అటవీ బెండ రకాలు, 5-6 కంటే ఎక్కువ ఉన్న కాయలు కలీలుగానే పరిగణించాలి. కోత, విత్తనాల సేకరణ విత్తనాల సేకరణకు పూర్తిగా ముదిరి, ఎండిన కాయలను కోసి భద్రపరచాలి. వరాలు లేని సమయంలో మొత్తం కాయలను సేకరించవచ్చు. వరాలుంటే రెండు, మూడు దఫాలుగా సేకరించాలి. కొన్ని రోజులు మాగిన తర్వాత పగలగొట్టి విత్తనాలు సేకరించాలి. ఆ తర్వాత 8-9 శాతం వరకు తేమ వచ్చేలా నీడలో ఎండబెట్టాలి. ఆ తర్వాత శుభ్రపరచి పురుగు ఆశించిన, రంగు మారిన, తాలు విత్తనాలను వేరుచేసి తీసివేయాలి. విత్తన దిగుబడి హెక్టారుకు 10-15 క్వింటాళ్ళు. క్షేత్ర ప్రమాణాలు గరిష్టంగా 0.2 శాతం కలీలు, శంఖు రోగం వచ్చిన మొక్కలు 1శాతం కంటే తక్కువగా ఉండాలి. విత్తన ప్రమాణాలు భౌతిక స్వచ్ఛత (కనీసం) - 99 శాతం వ్యర్థాలు - 1 శాతం ఇతర పంటల విత్తనాలు (గరిష్టం) - 0.05శాతం మొలక శాతం (కనీసం) - 65 శాతం తేమ తేమ శాతం (గరిష్టం) — 10 శాతం తేమ కోల్పోనిసంచులలో - 8 శాతం ఆధారం: పాడిపంటలు మాస పత్రిక